విక్రమ్ భయపడుతూనే "మీరొక్కసారి చూస్తే..."
ఇంతసేపటికి కోపంగా తలెత్తాడు డాక్టర్ మాధవయ్య.
"ఏమిటి నీ ఉద్దేశం? ఇంతోటి నీ పేపర్ లో ఏముందో తెలుసుకోవటానికి నాకు గంటలు గంటలు కావాలా? మెతుకు పట్టి చూస్తే తెలీదూ?"
ఈ సామెత విక్రమ్ కు తెలీదు. "నా పేపర్లో మెతుకుల లాంటివి ఏమీ లేవండి." వినయంగా అన్నాడు.
మాధవయ్యగారికి పట్టరాని కోపం వచ్చింది. "ఇడియట్, మాట్లాడటం కూడా రాదు. చెప్పులు కుట్టే చేతుల్తో ఆపరేషన్లు చేసి జనాభా సమస్యను తగ్గించటానికి వస్తారు మీరంతా యూనివర్శిటీకి- గెటవుట్. జాగ్రత్తగా రాసి తీసుకురా. ఇప్పుడు నువ్వు పేపర్ పబ్లిష్ చెయ్యకపోతే వైద్య ప్రపంచానికి లోటేమీ లేదు."
టేబిల్ మీద విక్రమ్ సబ్మిట్ చేసిన పేపర్ని చింపి ముక్కలు చేశాడు డాక్టర్ మాధవయ్య. గభాలున ఆ ముక్కల్ని జాగ్రత్తగా పోగుచేసుకున్నాడు విక్రమ్. అతనికి తన గుండెనే ఎవరో ముక్కలు చేసినట్లు అనిపించింది. చిరిగినా పేపర్ ముక్కల్ని జాగ్రత్తగా పట్టుకుని బయటకు వచ్చేశాడు.
బావురుమని ఏడిస్తే బాగుంటుందనిపించింది. కానీ ఏడుపు రావటం లేదు. నిజమే, రీసెర్చ్ లో చేరి ఒక నెల మాత్రమే అయింది. కానీ అంతకు ముందు ఎన్నో రోజులుగా తన ప్రయోగాలు యూనివర్శిటీ లాబ్ లో చేస్తూనే ఉన్నాడు. ఆ సంగతి మాధవయ్య గారికి తెలుసు. అది కాదు కారణం. ఆయన పూర్తిగా ఏకాగ్రతలో ఉన్నాడు. తన రాక ఆయన ఏకాగ్రతను భగ్నం చేసింది. అందుకే వల్లమాలిన కోపం వచ్చింది. ఇప్పుడు శాంతింప చెయ్యటం తన తరం కాదు. తపస్సు భంగమయిన ఋషిలా ఉన్నాడు.
తలదించుకుని బయటకు వచ్చేశాడు. చింపిన తన పేపరు ముక్కల్ని బ్యాగ్ లో వేసుకున్నాడు. ఇంటికి వచ్చేశాడు. ఇంటికి తాళం ఉంది. తల్లి ఎక్కడకు వెళ్ళిందో! ఆ చిన్న గది ముందు కొద్దిపాటి స్థలమయినా నిలబడేటందుకు లేదు. రోడ్డు మీదకు వచ్చి ఫుట్ పాత్ మీద నిలబడ్డాడు. అటు ఇటు తిరిగే బస్ లు, కార్లు అన్నీ తన తల మీద నుంచే పరుగులు తీస్తున్నట్లుగా ఉంది. ఎంతసేపయిందో? కొన్ని జన్మల వ్యథ అనుభవించినట్లుగా ఉంది. తల్లి వచ్చింది. తగినంత కారణం లేకుండా తన కొడుకు ఇంత త్వరగా రాడని తెలుసు. "ఇంత త్వరగా ఎందుకు వచ్చావ్?" అని అడగలేదు. కాఫీ చేసి ఇచ్చింది. ఆ కాఫీ పల్చగా ఉంది. పాలు తక్కువ. పంచదార నీళ్ళు తాగినట్లుగా ఉంది. విక్రమ్ కి అవి ఏవీ తెలియటం లేదు. ఏదో వేడిగా తాగుతున్న అనుభూతి... "పడుకో బాబు" అంది తల్లి. పక్క మీద దుప్పటి సరిచేసింది.
విక్రమ్ వెంటనే వెళ్ళి పడుకున్నాడు. నిద్ర పట్టేసింది. ఏవో మాటలతో మెలకువ వచ్చింది.
"ఈ పూట వంటకి రాలేదేమని అమ్మగారు అడిగి రమ్మన్నారు."
"అబ్బాయికి కాస్త భారంగా ఉంది. రేపు వస్తాను."
"రేపు తప్పకుండా రమ్మన్నారు. ఎవరో చుట్టాలు వస్తారట. మన ఇబ్బందులు వాళ్ళకి అర్ధం కావు కదా!"
"సరేలే! వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. వస్తానని చెప్పు."
తల్లి ఎవరింట్లోనో వంట చేస్తోందన్న మాట. తనకు తెలియదు. పాపం. ఆవిడ కష్టాలు తనెప్పుడు గమనించాడు? ఏనాటికయినా, ఆవిడ రుణం తీర్చుకోగలడా?
ఉన్నది ఒకే గది. తన మాటలు కొడుకు వింటాడేమోనని ఆ తల్లి భయపడుతూనే ఉంది. అందుకే కొంత ఆలస్యంగా లేచాడు. చన్నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు.
తల్లికి ఏమీ అర్ధం కాకపోయినా, తన రీసెర్చ్ సంగతి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. అది మనసులో ఆలోచనా తరంగాలను వాగ్రూపాన పెట్టడం లాంటిది. దీనినే "థింకింగ్ ఎలౌడ్" అని అంటారు.
"మా ప్రొఫెసర్ నా కాగితాలను చింపేశారు." పక్కమీద తన చుట్టూ పరచుకున్న కాగితాలను చూపిస్తూ అన్నాడు విక్రమ్.
అతని తల్లి వసుంధర నిజంగా వసుంధరే! ప్రకృతిలాగే అన్నింటిని అందుకుంటుంది.
ఉపశమనం కలిగించటానికి ప్రయత్నిస్తుంది. ఆవిడ దగ్గర ప్రశ్నలు, తర్కాలు ఉండవు. ఓదార్పు మాత్రమే ఉంటుంది.
"పోనీలే బాబు, పేపర్ చింపెయ్యగలడు కానీ నీ తలలో తెలివి తుడిచెయ్య లేడుగా!"
ఆవిడకు చేతనయిన మాటల్లో ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ మామూలు మాటలతోనే కొత్త శక్తి వచ్చినట్లయింది విక్రమ్ కి. మాటర్ అంతా తన కంప్యూటర్ లో ఉంది. సొంతంగా లాప్ టాప్ కొనుక్కునే స్థోమత లేదు. యూనివర్శిటీలోని కంప్యూటర్ నే వాడుతున్నాడు. వేళ కాని వేళలో యూనివర్శిటీకి వెళ్ళి తన మెటీరియల్ డౌన్ లోడ్ చేసుకుని తెచ్చుకున్నాడు. తన పేపర్స్ తన దగ్గరుంటే కొత్త శక్తి వచ్చినట్లయింది. దానిని నీట్ గా టైప్ చేసి ఒక ప్రఖ్యాత మెడికల్ సైన్స్ పత్రికకు పోస్ట్ చేశాడు. ఆ పత్రికలో ప్రఖ్యాత డాక్టర్ల వ్యాసాలు మాత్రమే వస్తాయి. తనది ప్రచురింపక పోవచ్చును. అయినా దానికే పంపాడు.
* * *
ఆ మరునాటికి డా||మాధవయ్య గారి కోపం తగ్గింది. కానీ తనంత తాను ఏదో తప్పు చేసినట్లు విక్రమ్ ని పిలిచి సాదరంగా మాట్లాడటం అతనికి సాధ్యం కాని పని.
అందుచేత విక్రమ్ తన పేపర్ తో మళ్ళీ తన దగ్గరకు వస్తాడని, అప్పుడు క్షమిస్తున్నట్లు మాట్లాడి ఆ పేపర్ తిరిగి రాసి తీసుకురమ్మని చెప్పి అవసరమయితే చిన్న చిన్న కరెక్షన్స్ చేసి గైడ్ గా తన పేరు చేర్చి పబ్లిష్ చెయ్యమని అనుమతి ఇయ్యొచ్చు. విక్రమ్ తెలివైన వాడు. బహుశ ఏదో కొత్త పాయింట్స్ తోనే పేపర్ పబ్లిష్ చెయ్యగలడు. రెండు రోజుల క్రిందట ఆశించిన రిజల్ట్ రావటం లేదని చిరాగ్గా ఉన్నాడు. పాపం! ఎంత బాధ పడ్డాడో! గుండె ఆపరేషన్ కి సంబంధించి ఆ మధ్య తనకు పంపిన పేపర్ విక్రమ్ కి చూపించాలి..
రెండు రోజులు గడిచినా విక్రమ్ తన దగ్గరకు రాకపోయే సరికి, మాధవయ్యగారికి పోయిన కోపం మళ్ళీ వచ్చింది.
"రాస్కెల్! ఎంత పొగరు! నలుగురూ తెలివయినవాడు అనగానే పొగరు తలకెక్కింది. అదే దిగుతుంది" అనుకున్నాడు కోపంగా..
