Previous Page Next Page 
వారధి పేజి 5


    కొన్ని వార్తలు పల్లెలో ఎంతకాలమైనా  సమసిపోవు. ఏదో సందర్భంలో వాటిని కెలుకుతూ  చర్చిస్తుంటేకాని కడుపు నిండనివాళ్ళు  కొందరుంటారు. ఆ కోవకి చెందినవాడే  గంగులు.



                           *    *    *



    శివయ్య తండ్రిపేరు రత్తయ్య. శివయ్య  ఆరేళ్ళవాడుగా ఉండగానే తల్లి పోయింది. ముసలి ముత్యాలమ్మ ఒక కంట కోడలి చావుకి ఏడుస్తూ, ఓచేత కొడుక్కీ, మనమడికీ ఇంత ఉడకేసి  పెడుతూండేది. ముత్యాలమ్మ బ్రతికి ఉన్నంతకాలం  కొడుకుని తిరిగి పెళ్ళి చేసుకోమని  పోరుతూండేది. రత్తయ్యకి చచ్చిపోయిన  భార్యమీద  ముంచుకుపోయే  అభిమానం  లేకపోయినా  ఏ కారణం వల్లనో తిరిగి పెళ్ళి చేసుకొనేందుకు  మాత్రం మనసు సమాధానపడేది  కాదు.

    "చస్తే నీళ్ళు పొయ్యడానికి కొడుకున్నాడు. నీ వింత ఉడకేసి పడేస్తున్నావు. మళ్ళా ఎవత్తెకోపుస్తెకట్టి  తేకపోతేనేం?" అనేవాడు తల్లితో.

    శివయ్యకి  పదేళ్ళు నిండేసరికి  ఒక రాత్రికి రాత్రి కలరా వచ్చి కన్నుమూసింది. ముసలి ముత్యాలమ్మ. ఆది మొదలు తండ్రీ, కొడుకూ ఒకరికి ఒకరు అనుకొనేటట్లు  ఇంటిపనులు, పొలం పనులు చూసుకొంటూ  కాలం గడిపేరు.

    ముత్యాలమ్మ  చచ్చిపోయాక రత్తయ్యకి పెళ్ళిచేసే బాధ్యత గ్రామపెద్దలు  అందుకొన్నారు. ఎవరు ఏమి చెప్పినా "ఇంకా నాకు పెళ్ళేమిటి? మా శివన్నకే  ఒక మంచి పిల్లని  చూసి  ముడిపెట్టేస్తే సరి" అనేవాడు రత్తయ్య, నవ్వుతూ.

    శివయ్యకి  పదిహేడేళ్ళు వచ్చిన దగ్గిర నుండి సంబంధాలు చూడడం మొదలు పెట్టేడు రత్తయ్య. "ఏమిరా శివా! ఈ పిల్ల బాగుందిరా, ఆ పిల్ల నీకు నచ్చుతుందిరా" అంటూ  కొడుకుని రోజూ  ప్రశ్నిస్తూండేవాడు. "నీకు నచ్చితే నాకు నచ్చినట్లే. స్థిరం చేసుకురా" అనేవాడు శివయ్య.

    శివయ్యకి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి రత్తయ్య ఏభై యోపదిలో పడ్డాడు. పదేళ్ళుగా ఉడికీ ఉడకని మెతుకులు కతికిన జిహ్వ కమ్మగా  ఆడదాని చేతివంట తినాలని కోరుకొంది. ఆ సంవత్సరం ఎలాగైనా శివయ్యకి పెళ్ళిచేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలనుకొన్నాడు రత్తయ్య.

    పక్క ఊర్లో  ఏదో సంబంధం ఉందంటే  చూడబోయిన రత్తయ్య వారందాకా తిరిగి రాకపోవడం ఆ గ్రామంలో ఒక వార్త అయింది.

    "ఏటయిందో  పోయి చూసి రాకూడదా శివయ్యా?" అన్నారు కొందరు.

    "చూసింది  కేముంది? చిన్నావాడు కాడు కదా  దారితప్పిందికి! ఏదో పనిమీద ఆగిపోయి ఉంటాడు" అన్నాడు శివయ్య.

    ఊరికి దూరంగా ఉన్న పొలంలో శివయ్య అరక తోలుతూంటే చిన్నిగాడి కొడుకు బసవయ్య పరుగుతో వచ్చి "మీ అయ్య వచ్చేడు" అన్న వార్త అందించేడు. అటు తరవాత చెప్పబోయే  మాటకోసం  ఆత్రంగా ఎదురుచూసేడు శివయ్య. తండ్రి వారం రోజులపాటు  ఆ గ్రామంలో ఆగిపోయేడంటే  అన్నీ పూర్తిగా నిశ్చయించుకొని, ముహూర్తంకూడా  పెట్టించే వచ్చి ఉండాలి. ఎవరి పిల్లో? ఎలా ఉంటుందో?

    కోడలు ఎరుపైతే కులమల్లా ఎరుపు అంటారు. తండ్రి కర్రి అమ్మాయిని తన కెంతమాత్రం నిశ్చయించుకురాడు. ముందటేడు  కరణంగారి  ఇంటికివచ్చిన చుట్టాలమ్మాయిలా  ఎర్రగా, బుర్రగా... 'ఇంకేమిటిరా సంగతులు' అని అడిగేందుకు సిగ్గుపడ్డాడు  శివయ్య.

    బసవయ్య ఆ కాస్తమాటా  అందించి, ఉలుకూ పలుకూ  లేకుండా శివయ్య ముఖం చూస్తూ  నిలబడి పోయేడు.

    "ఏంటిరా  దయ్యం  పట్టినవాడిలా  అలా మిడిగుడ్లు  వేసుకొంటూ నన్ను చూస్తున్నావు?" శివయ్య కసురుకొన్నాడు.

    "మరి మీ అయ్య...."    

    "అవును. మా అయ్య వచ్చేడు. వచ్చి ఏంటన్నాడు? ఏమయింది? ఏ మాటా చెప్పకుండా ముంగిలా కూర్చున్నావేం?"

    "మీ అయ్య ఓ పిల్లని  ఎంట పెట్టుకొచ్చినాడు. మనువాడి తీసుకొచ్చివాండట."

    "ఎధవా, తాగి మాట్లాడుతున్నావా?"

    "లేదు. సత్తె  పమాణంగా." బసవయ్య  ఒట్టువేసుకొన్నాడు. "గ్రామంలో అంతా ఇదే మాట ఇంతగా అనుకుంటున్నారు. 'ఆడేదో రాజు నాగ కొడుక్కి  పెళ్ళి సెయ్యబోయి తనే తగులుకొన్నాడు' అంటున్నాడు కరణమయ్య."

    శివయ్యకి ఇంక విన బుద్ధి కాలేదు. "సరే నువ్వు వెళ్ళిపో. ఈ పని పూర్తి చేసుకొని నేను వస్తాను" అన్నాడు.

    'నిజంగా తండ్రి  పెళ్ళి  చేసుకొన్నాడా? వారం  రోజులపాటు ఆ గ్రామంలో వుండిపోయేందుకు ఇదే కారణమా? అమ్మ చచ్చిపోయి ఇంతకాలం అయ్యేక కోడలు ఇంటికి రానున్న ఈ సమయంలో ఇప్పుడు తను పెళ్ళిచేసుకోవడం ఏంబాగుంటుందన్న  ఆలోచనైనా లేకపోయిందా? కొడుక్కి పిల్లని వెతకబోయి  తనే సంసార జంజాటంలో  తగులుకొంటే  గ్రామంలో నలుగురూ నవ్వుతారనే  సిగ్గయినా లేకపోయిందా? ఛీ....ఛీ.... ఈమాట విన్నాక తనకే సిగ్గుగా వుంది. 'వీడి అయ్య ఇలా' అని  నలుగురూ  గుసగుసలాడుకొంటూంటే  ఎలా తలెత్తుకు తిరగడం?'

    దారిపొడుగునా  శివయ్య  ఆలోచిస్తూనే వున్నాడు. ఊరిలో  కాలు బెట్టగానే దారిన పోతున్నవాళ్ళూ, ఇళ్ళగడపల్లో  కూర్చున్నవాళ్ళూ  శివయ్యని జాలిగా చూడడం మొదలుపెట్టేరు. ఆ చూపులు చూస్తుంటే  శివయ్య ఒంటికి ఉప్పు, కారం రాసుకున్నట్లు  మండసాగింది. 'ఛీ....కాకిమూక! ఏది వచ్చినా వీళ్ళకే కావాలి!' అని విసుక్కొన్నాడు.

    ఇంటిగుమ్మంలో తండ్రి పొగాకు చీల్చి చుట్ట చుట్టుకొంటూ  కనిపించేడు. వారం రోజుల్లో తండ్రిలో ఎంతో మార్పు వచ్చినట్లు అనిపించింది  శివయ్యకి. వయసులో పదేళ్ళు వెనక్కి పోయినట్లు వున్నాడు మనిషి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS