Previous Page Next Page 
తపస్వి పేజి 5


    "నా మాట విను విక్రమ్!"
    విసుగ్గా అడ్డు తగిలాడు విక్రమ్.
    "నేను ఎవరి మాటా విననని నీకు తెలుసు! నాకేం కావాలో నాకు తెలుసు! ఏం చెయ్యాలో నాకు తెలుసు!"
    "అవకాశాలు రమ్మన్నప్పుడల్లా రావు- నువ్వు రీసెర్చ్ చేసినా ఇంతకంటే మంచి ఉద్యోగం రాకపోవచ్చును!"
    "వామన్! నువ్వు నన్ను ఏనాడూ అర్ధం చేసుకోలేదు! ఇంక మాట్లాడకు!"
    "అర్ధం చేసుకున్నాను! బాగా అర్ధం చేసుకున్నాను- అందుకే.." లోలోపల అనుకున్నాడు వామనమూర్తి.
    "విక్రమ్! మనం చదువుకుంటున్న రోజుల్లో అప్పుడప్పుడు నువ్వు నాకు....అదే.... కొన్ని సలహాలు...కొంచెం...అందుకు"
    తడుముకుంటూ మాట్లాడుతున్న వామనమూర్తిని చూసి నవ్వాడు విక్రమ్.
    "ఆ విషయాలేవీ నువ్వు మనసులో పెట్టుకోనక్కర్లేదు! నేను నీకే నాడూ ఏ సహాయమూ చెయ్యలేదు!"
    పట్టరాని ఆనందం కలిగింది వామనమూర్తికి.
    "సహాయమంటే సహాయం కాదనుకో! కానీ..."
    "మన మెడికల్ లైన్ లో నా ఎదురుగా ఎవరైనా పొరబాటు చేస్తుంటే చూసి సహించలేను! వెంటనే సరిదిద్దకుండా ఉండలేను- ఇది నా బలహీనత! నీకు సహాయం చెయ్యటం కాదు!"
    వామనమూర్తి ముఖం నల్లబడిపోయింది. ఎదురుగా ఉన్న విక్రమ్ ని నమిలి మ్రింగాలన్న కోపం వచ్చింది.
    "సరే! నేను వెళ్తున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ లో సర్జన్ గా అప్పాయింట్ అయ్యాను!"
    "గుడ్!"
    వామనమూర్తి వెళ్ళిపోయాడు. అప్పుడు లోపలి నుండి వచ్చింది విక్రమ్ తల్లి వసుంధర.
    "నీ స్నేహితుడు వచ్చాడు. కాఫీ ఇద్దామనే అనుకున్నాను. పాలు లేవు." నొచ్చుకుంటున్నట్లు అంది.
    తల్లి మాటలు ఒక్కసారి తన పరిస్థితినీ, తల్లి మోస్తున్న భారాన్నీ తన కళ్ళ ముందుకు తెచ్చినట్లయింది విక్రమ్ కు.
    "అమ్మా! నాకు రీసెర్చ్ చెయ్యాలని ఉంది. ఉద్యోగంలో చేరితే డబ్బు వస్తుంది. ఏం చెయ్యమంటావ్?"
    "క్రొత్తగా అడుగుతున్నావా విక్రమ్? నీకు మనసారా ఏది చెయ్యాలని ఉంటే అది చెయ్యి ఏనాడూ దేనికోసమూ నీ మనసుని చంపుకోకు!"
    విక్రమ్ మనసులో ఏ మూలో మెదులుతున్న కొద్దిపాటి సంకోచం కూడా వదిలిపోయింది. తన తల్లి... తన అదృష్టాలన్నింటిలో గొప్ప అదృష్టం.
    అదే క్షణంలో వసుంధర కూడా తనలో తను అనుకుంది "ఇంట్లో ఇబ్బందిగా ఉన్న మాట నిజమే! కార్లలో తిరిగే వాళ్ళనీ-సూట్లలో తిరిగే వాళ్ళనీ ఎంతో మందిని చూశాను. కానీ నా విక్రమ్ ముఖంలో ఉన్న ఆ వెలుగు ఎక్కడుందీ? ఏమున్నా ఏం లేకపోయినా ఆ వెలుగు అలాగే ఉండాలి! నా విక్రమ్ ను చినిగిన బట్టల్లో చూడగలను. అర్ధాకలితో ఉన్నా సహించగలను. కనీ ఆ ముఖం కళావిహీనమయితే మాత్రం భరించలేను."
    
                                     *  * *
    
    ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ విక్రమ్ ఉద్దేశం విని చాలా ఆనందించారు.
    "నువ్వు రీసెర్చ్ చెయ్యటమే నాకు ఇష్టం. సబ్జెక్టు ఏమిటి?"
    "మన ఇండియాలో చాలా మంది చిన్న పిల్లలు లివర్ జబ్బులతో బాధపడుతున్నారు. సిరాసిస్ మీద చెయ్యాలనుకుంటున్నాను."
    "అదా! అయితే నువ్వు డాక్టర్ మాధవయ్యగారి దగ్గర చెయ్యవలసి ఉంటుంది."
    "అవును"
    డాక్టర్ కిరణ్ కుమార్ ఇంకేం మాట్లాడకుండా ఒకసారి విక్రమ్ వంక చూసి ఊరుకున్నారు.
    ఆ చూపులలో ఉన్న మాటలలో పెట్టలేని భావాన్ని విక్రమ్ చదువుకున్నాడు.
    డాక్టర్ మాధవయ్యగారు మేధావి. కానీ తన మాట కాదనటం సహించలేరు. ఒకసారి హాస్పిటల్ కు ఆస్తమాతో బాధపడుతున్న ఒక రోగి వచ్చాడు. అప్పుడు విక్రమ్ హౌస్ సర్జన్ గా ఉన్నాడు. మాధవయ్యగారు పైపై లక్షణాలు చూసి బ్రోనికల్ ఆస్తమా అని అభిప్రాయపడ్డాడు. విక్రమ్ కార్డియాక్ ఆస్తమా అయి ఉంటుందని సూచించాడు. తన అభిప్రాయం కాదన్నందుకు మండిపడ్డారు మాధవయ్యగారు. పేషెంటుకు అడ్రినలిన్ ఇంజక్షన్ చేశారు. ఆ పేషెంట్ మరణించాడు. మాధవయ్యగారు లోలోపల బాధపడకపోలేదు. విక్రమ్ ది రైటని  గుర్తించకపోనూ లేదు. కానీ పైకి అంగీకరించ లేకపోయారు. ఆ సంఘటన తరువాత నలుగురూ గుసగుసగా విక్రమ్ డయాగ్నసిస్ రైటనీ మాధవయ్యగారే పొరపాటు పడ్డారనీ చెప్పుకోవటం ఆయన అభిమానాన్ని మరింత గాయపరచి విక్రమ్ పట్ల ఏదో ద్వేషాన్ని రగిల్చింది. విక్రమ్ కు న్యాయంగా రావలసినన్ని మార్కులు రాలేదని అందరూ గుసగుసలాడుకున్నారు.
    "నాకు ఆ విషయంలోనే ఆసక్తి ఉంది. నాకు ఉన్న ఆసక్తి అణచుకోలేను. లేనిది కలిగించుకోలేను."
    విక్రమ్ లో ఒరిజినాలిటి గుర్తించి గౌరవించే కొద్దిమందిలో డాక్టర్ కిరణ్ కుమార్ ఒకరు.
    విక్రమ్ లో ఉప్పొంగే ఆ విజ్ఞాన తృష్ణను మరింత ప్రోత్సహించాలనే అనిపించింది ఆయనకు.
    "తప్పకుండా ప్రారంభించు. నీ పరిశోధన వల్ల వైద్యలోకం చక్కని ఫలితాలు పొందగలదని నాకు నమ్మకం ఉంది. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!"
    డాక్టర్ మాధవయ్యగారి దగ్గర తన పరిశోధన ప్రారంభించాడు విక్రమ్.
    
                                      4
    
    "అబ్సర్డ్" అన్నాడు. పేపర్స్ మోచేత్తో పక్కకు తోసేసి తన ఎక్సెపెరిమెంట్ మీదనే దృష్టి కేంద్రీకరిస్తూ మాట్లాడుతున్నారు డాక్టర్ మాధవయ్య.
    "ఇలా చేతికొచ్చింది రాసేసి రీసెర్చ్ పేపరుగా పబ్లిష్ చెయ్యాలని ప్రయత్నం చెయ్యకు. నువ్వు చేరి నెల కూడా కాలేదు. అప్పుడే రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చెయ్యగలనని అనుకుంటున్నావా?" చాలా విసుగ్గా, కొంత కోపంగా, పరమ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు డాక్టర్ మాధవయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS