తను పెద్దవాడవుతున్నమాట రాజు ముందే గుర్తించేడు. అన్నయ్య కుట్టిస్తున్న లాల్చీలు, నిక్కర్లు ఇట్టే ఇరుకయిపోయి, పొట్టిగా మీదికి పోతున్నాయి. వంట ఇంటి గూట్లో పై అరలోని వస్తువులుకూడా, వదినకి అవసరం అయితే, బల్లమీద ఎక్కకుండానే, అందుకోగలుగుతున్నాడు. మరి ఇవన్నీ చూస్తే తను పెద్దవాడు అవుతున్న భావన రాజు మనసులో కలిగింది; కాని వదిన 'నువ్వు పెద్దవాడిలా ప్రవర్తించాలి' అనడంతో తనని దూరంగా తోసివేసినట్లు అనిపించింది రాజుకి. అయినా వదిన సంతోషం కోసం "అలాగే వదినా!" అన్నాడు.
మీనాక్షికి అంతదూరం ఏకబిగిని నడిచివచ్చిన ఆయాసంవల్ల వెంటనే నోట మాట లేదు. క్షణకాలం వరదరాజు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది.
"ఏం, వదినా? పూర్ణ కెలా ఉంది?" ఆందోళనగా ఆమె ముఖంలోకి చూస్తూ ప్రశ్నించేడు రాజు.
"పూర్ణ ఇంకా లేవలేదు, రాజూ! ఈ రోజు జ్వరం తగిలేలా లేదు. ఒళ్ళు చల్లగా ఉంది. ఇదిగో, ఈ మినపసున్ని ఉండల డబ్బా బండిలో పెట్టడం మరిచిపోయేను" అంటూ తను తెచ్చిన మూట అందించింది.
"దీనికోసం ఇంతదూరం వచ్చేవా వదినా!" అన్నాడు రాజూ ఆప్యాయంగా.
"ఇంతా నీ కోసం చేసేనా...."
"ఆదివారం నాడు అన్నయ్య వస్తాడు కదా! అప్పుడే పంపుతే తీరిపోదూ?"
"చేసిన వెంటనే ఉండే రుచి వారంనాడు ఉంటుందా? ఇంతకీ జానకమ్మ నీళ్ళకి వస్తూంటే కలిసి వచ్చేను. కనిపిస్తే ఉయ్యొచ్చునని."
బండిదారి ఎంత చుట్టు అయినా మామూలుగా నడుస్తూవస్తే బండిలో పోతున్నవారిని కలుసుకోడం కష్టం. మీనాక్షి ఒక రకమైన పరుగు పెట్టే బండిని కలుసుకొంది. ఆ విషయం రాజు గుర్తించకపోలేదు. నీలాటిరేవు సమీపంలో జన సంచారం లేదు. రాజు చూపుల అర్ధం మీనాక్షి తెలుసుకొంది.
"రాజుబాబూ, తొందరగా తెమిలి రా! ఎండెక్కి పోనాది" అంటూ రాములు కేకపెట్టేడు.
"వెళ్ళివస్తాను, వదినా!" అన్నాడు రాజు.
"మంచిది నాయనా!"
రాజు అటునించి ఇటు తిరగడంలో అంతవరకూ దాచుకొన్న దెబ్బ మీనాక్షి కంట పడింది.
"అదేమిటి వరదం, ఆ కణతమీద ఏమయింది?" ఆత్రంగా అడిగింది.
"అదా....అదా....అదేమీలేదు వదినా! నీ పిలుపు విని బండినించి గెంతుతుంటే ముందుకు వాలేను. నేలదుమ్ము అంటుకొని ఉంటుంది."
వదినముందు మొదటి అబద్ధం ఆడేడు వరదరాజు.
* * *
మీనాక్షి ఇల్లు చేరేసరికి పూర్ణని భుజంమీద వేసుకొని శివయ్య వీధి వరండాలో పచార్లు చేస్తున్నాడు.
"ఎక్కడికి వెళ్ళేవు? పూర్ణ లేచి నీకోసం ఏడుస్తున్నాది" అన్నాడు శివయ్య, అప్పుడే స్నానంచేసి వచ్చినట్లు చెమటతో తడిసి ఉన్న భార్యని చూస్తూ.
"కడుపులో గలగలమంటే అలా బైటికి పోయేను" అంది మీనాక్షి.
మీనాక్షి చేతివంక చూసేడు శివయ్య. చేతిలో చెంబువంటిది ఏదీలేదు. తను అబద్ధం ఆడి పట్టుబడి పోయేనని తెలుసుకొంది మీనాక్షి.
"రాజు కనిపించేడా? బండి ఇంకా చాలాదూరం పోయి ఉండదు." ఆమె ఎక్కడికి వెళ్ళిందో తనకి తెలుసునన్నట్టు చూస్తూ ప్రశ్నించేడు శివయ్య.
ఆ మాట విననట్లే భర్త చేతిలోంచి పిల్లని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి. భార్యపోయిన దిక్కే చూస్తున్న శివయ్యని "శివరామయ్యా! తమ్ముడు పట్నం వెళ్ళిపోయాడా?" అని పలకరించేడు, దారిని పోతున్న లక్ష్మయ్య.
"బాబుముఖం చూస్తుంటే తెలవలా? మళ్ళా వేరే అడగాలా? అయినా ఈ రోజుల్లో నీలాంటివాళ్ళు అరుదు బాబూ! సవతి తమ్ముణ్ణి ఈ విధంగా ఎవరు సూత్తున్నారు?" అన్నాడు అసిరిగాడు.
"ఏంటిరా, అసిరిగా! రాజుబాబు మాటేనా అంటున్నది? ఆడిని తమ్ముడేంటిరా, కన్నకొడుకులా సూసుకొంటున్నారు కదరా శివయ్యబాబు" అన్నాడు దారిన పోతున్న గంగులు_ మాటల్లో తలదూర్చి, కొడుకు అన్నమాట ఒత్తి పలుకుతూ.
శివయ్యనించి సమాధానం ఆశించకుండానే లక్ష్మయ్య వెళ్ళిపోయేడు. పల్లెటూరిలో పలకరింపులకు ఒక అర్ధం అంటూ ఉండదు. ఎదురుగుండా పెట్టె, మూట పట్టుకుని అప్పుడే బండి దిగుతున్న మనిషిని 'ఎప్పుడు వచ్చేవు?' అంటూ పలకరిస్తారు. వస్తాదులా ఉన్నవాడిని పట్టుకొని 'అప్పుడేదో జ్వరం వచ్చిందని విన్నాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావా?' అని అడుగుతారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న అలవాటు తప్పితే, వాటికో వావి _ వరస వుండవు. ఎదుటి మనిషిని గుర్తించేమన్న తృప్తి ఒక్కటే.
రామభజనమండపం వైపు పోతూ "ఎంతకాదన్నా పెద్దవారు కదా, ముఖంమీదే అలా అనచ్చురా గంగులూ?" అంటూ మందలించేడు అసిరిగాడు.
"ఏటోస్...ఏరికి తెలియని సంగతి! ఈడయ్య ఈడిమూలంగానే కదట్రా మనోయాదితో సచ్చింది! ఈడి పిన్నమ్మమాత్తరం సజావుగా సచ్చిందంటావా? ఏ మందో మాకో తిని వుంటాది" అన్నాడు గంగులు చులకనగా.
