Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 28

 

    ప్రసాదం తెలీదన్నట్టు తలూపేడు. సీతాపతి నవ్వి అన్నాడు.
    "ఎకనామిక్స్ పుస్తకంలో ఏ పేజీలో ఏ మేటరుందో చెప్పగలరు గాని, ఈ వూళ్ళో ఏ కారు ఎవరిదో పోల్చుకోలేరు మీరు. ఆ కారు మన చిరంజీవి దండి బాబు!"
    "విని వూరుకున్నాడు ప్రసాదం. మళ్ళా నడక ప్రారంభించాడు.
    "వీడెందు కొచ్చాడో యిక్కడికి? మీతో మాటాడుతూ సరదాగా గడుపు దామనుకుని యింత దూర మోస్తే , శనిలాగా వీడూ యిక్కడికి దాపురించేడేమిటి ఖర్మ! పోనీండి వెధవని. మనమలా పోదాం రండి," అన్నాడు సీతాపతి.
    సీతాపతి ఏదో దాచేస్తున్నాడని గ్రహించేడు ప్రసాదం.
    సరుగుడు తోపులోంచి నడక సాగుతోంది. ఒకచోట సీతాపతి కాళ్ళకి బ్రేకు పడింది. ప్రసాదం చేతిని గట్టిగా నొక్కి చాలా నెమ్మదిగా అన్నాడు.
    'అటు చూడండి!"
    ప్రసాదం అటు చూసేడు.
    నేలమీద జంపఖానా వుంది. జంపఖానా మీద తినుబండారాలూ ప్లాస్కు వున్నాయి. మరో పక్క అందమైన ట్రాన్సిస్టరుంది. వీటన్నిటి మధ్యా చిరంజీవి వున్నాడు. చిరంజీవి గుండెల మీద సుమతి వుంది!
    ప్రసాదం గిరుక్కున వెనక్కి తిరిగి అన్నాడు-
    "రండి పోదాం!"
    'అయ్యో యింకా సినిమా ప్రారంభం కాలేదండి బాబూ! వెళ్ళి పోదామంటా రేమిటి? చెట్టు చాటున ఓపిక చేసుక్కూచున్నా మంటే, బ్రహండమైన సెక్సు సినిమా చూడొచ్చు. ఉండండి!" ప్రాధేయపడ్డాడు సీతాపతి.
    ప్రసాదానికి వళ్ళు మండిపోయింది. వేడిగా అన్నాడు.
    "మీరోస్తే రండి. నేను వెళ్ళి పోతున్నాను."
    సీతాపతి ప్రసాదం వేపు చూసి చాలా మర్యాదగా అన్నాడు.
    "సరే, మీ ఇష్టం! మీరు నాతో ఇక్కడికి రావడానికి కిష్టపడ్డట్టు నేను మీతో తిరిగి వెళ్ళిపోడాని కిష్టపడుతున్నాను. ఈ బూతు సినిమా రోజూ ఉండేదేగా! మరోనాడు నేనెక్కడినీ చూస్తాలెండి. పదండి పోదాం."
    ఇద్దరూ తిరుగు మొహం పట్టారు, వాళ్ళిద్దరూ కారులో కూచున్న తర్వాత కారు కదిలింది.
    దార్లో ప్రసాదం సీతాపతి నడిగేడు.
    బీచ్ లో వాళ్ళిద్దరూ వుంటారని మీకు ముందే తెలుసు గదూ?"
    'ఆహా. తెలుసు, ఈ చోద్యాన్ని మీకు చూపించాలనే మిమ్ముల్నిక్కడికి తీసుకోచ్చేను. ఇందాక సినిమా అన్నాను చూడండి - మీరు సినిమాకి రానన్నారు. అవునా " సినిమా అంటే ఏవను కున్నారు? మీరేవనుకున్నారో నాకు తెలీదు గాని మన ఉద్దేశంలో సినీమాంటే ఈ రామాయణమనే" అన్నాడు సీతాపతి తాపీగా.
    "నేను ఈ సినిమాని చూస్తె మీక్కలిగే ఆనంద మేమిటో గూడా చెప్పండి సీతాపతి గారూ?"
    సీతాపతి నవ్వి సమాధానం చెప్పేడు.
    "నా ఆనందం మాట దేముడి కొదిలేయండి. సుమతి మడి కట్టుకున్న ఆడపిల్ల కాదని మీరు తెలుసుకొంటే చాలు. అందుకే, మిమ్మల్ని తీసుకోచ్చేను."
    "పరాయి వాళ్ళ మడీదడీ మన కెందుకు చెప్పండి?"
    "అదేమిటి గురూగారు! విడ్డురంగా మాటాడుతున్నారే! సుమతి మీకు పరాయి ఆడపిల్లా? నన్ను నమ్మమంటారా?"
    "మీరు నమ్మినా నమ్మకున్నా నా మాట మాత్రం అదే! రేపో మాపో చిరంజీవిని పెళ్ళాడబోతున్న సుమతి గురించి మనం మాటాడుకొడం మంచిది కాదు. మరో రిక్వస్ట్ . మనం చూసింది యిక్కడే మరచిపోదాం. ప్రచారం చేయకుండా జాగ్రత్తపడదాం ఓకే?"
    సీతాపతి ఏవను కున్నాడో ఏమో గాని మరి మాటాడలేదు.
    కారు తిన్నగా వచ్చి ప్రసాదం గదిముందు ఆగింది.
    ప్రసాదం కారు దిగి గదిలోకి వెళ్ళేడు.

        
                                 9

    పరీక్షలు దగ్గర పడ్డాయి!
    తిమ్మాపురం ఇళ్ళలో దీపాలు జోరుగా వెలుగుతున్నాయి. టీ దుకాణాలు రద్దీగా వుంటున్నాయి. అంత మాత్రం చేత సినిమాహాళ్ళు మూలపడలేదు.
    తిమ్మాపురం విద్యార్ధులు చదువు పట్ల తమ భక్తీ శ్రద్దల్ని ఆ కొన్ని రోజులే ప్రదర్శిస్తారు.
    సంవత్సరం పొడుగుతా చెప్పిన పాఠాన్ని సరిగ్గా ఆరోజుల్లోనే చదువుతారు. నోట్సులు, పూర్తీ చేసుకోడాలు, పాత పరీక్ష పేపర్లు తిరగవేయడాల్తో ఆ కాసిని రోజులు బిజీగా గడిచిపోతాయి.
    ఆ రోజుల్లోనే విద్యార్ధులకి భక్తీ భావం కూడా పెరుగుతుంది. పరమ భక్త శిఖామణులై పోయే ప్రమాదం అప్పుడే!
    తిమ్మాపురం దేవాలయాలు విద్యార్ధి సమూహంతో నిండి కలకలలాడుతున్నాయి. తిరుపతి వెంకన్నకి డిమేండెక్కువై పోతుంది.
    దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనిషి తన విధుల్ని మరచి పోవడం వల్ల ఈ మధ్య దేవుడి గ్గూడా వొళ్ళు మండి పోతుందని తెలుసుకున్న విద్యార్ధులు 'అపచారం - మహాప్రభో? ఈ కడవకి ఎలా గోలా గండం గడిచే ఉపాయం ఆలోచించు స్వామీ!' అని మరీ మరీ వేడుకుంటున్నారు.
    కొందరు మాత్రం - చదవడం పూర్తిగా మాని చిన్న చిన్న కాగితాల మీద రాసుకోవలసిన విషయమంతా రాసుకుని, దాన్ని పరీక్ష పేపర్ల మీద గుద్దించే ఉపాయాల ఏర్పాట్లలో వుంటున్నారు. మరి కొందరు, ముక్కు మీద అతి ముఖ్యమైన పాఠాన్ని కంఠతా పట్టి, లాటరీ అడేదామని నిర్ణయించు కుంటున్నారు.
    ఇంత బిజీగా గడిచే సీజనులో ప్రేమలూ, వంకాయలూ చర్చించేందుకు టైమెక్కడిదీ!
    కానీ!-
    సుమతి మాత్రం కేవలం ప్రేమ పరీక్షకే తయారై. ఆ పరీక్షలో ఫెయిలై పోవడం వల్ల బేజారెత్తి "రేపు నా బతుకేమిటి బాబో" నని దిగులుపడి పోతోంది.
    కాలు జారి ప్రేమ బురదలో అడుగు పెట్టి మూడు నెలలై పోయింది సుమతికి. తత్పలితంగా ఆరేడు నెలల్లో తను తల్లి నవ్వబోతున్ననని తెలుసుకుని తన తొందరపాటుకి కుళ్ళి కుళ్ళి ఏడవటం ప్రారంభించింది.
    తల్లికి చెప్పాలో చెప్పకూడదో నిర్ణయించుకోలేని స్థితిలో దాచడం తరం గాని సృష్టి రహస్యం తల్లి కంట పడిందనే వేళకి తనతో పాటు ఏడుస్తూ కూచోడానికి తోడు దొరికిందని కొంతలో కొంత ఊరడిల్లినది సుమతి. తల్లితో జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. అంతా విని : "ఏంత అన్యాయం జరిగి పోయిందే తల్లీ! కారులో వస్తున్నాడు గదా అని, సంబరపడ్డాను. మనింటో కాఫీ పుచ్చుకుంటూన్నాడని, ఈ సంబంధం కలుపుకోవచ్చని ముచ్చట పడ్డాను. గొప్పింటి వియ్యమని మీ నాన్నే వుంటే విని ఎగిరి గంతేసి ఉండేవారని ఎంతో యిదై పోయేను. వాళ్ళ సిరిని చూసి ఔరా అనుకున్నానే గాని వాళ్ళ మనసు తెలుసుకోలేక పోయేనే అమ్మడూ! ఎంతెంత రవుడీనే వాడూ! ఇంతా చేసి నిన్నెంత మాటనేశాడే సుమతీ! వాడి నోరు పడిపోనూ! నీకెంత అన్యాయం చేసేడే కూతురా," అని ఏడ్చింది తల్లి. తల్లి వివరిస్తున్న దుస్థితిని విని విలవిల్లాడి పోయింది అమ్మడు సుమతి!
    ......అసలు జరిగిందిది, ఆ రోజు సుమతి చిరంజీవితో అన్నది గదా.....
    'శుభవార్త చెప్పనా?"
    "నీ నోటి నుండి శుభవార్త కాకుండా దుర్వార్త వింటానా సుమీ! చెప్పు తొరగా" అన్నాడు చిరంజీవి.
    సుమతి సిగ్గుపడుతూ అన్నది.
    "మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు."
    అది విని పక్కలో బాంబు పడినట్టు ఉలిక్కిపడ్డాడు చిరంజీవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS