చిరంజీవి ఏమీ మాటాడక పోడం నుంచి మళ్ళా సుమతి మాటాడింది పాపం.....
"ఏమిటలా అయిపోయారు ?"
"ఎలా అయిపోయానూ? నేను మాములుగానే వున్నానే?"
"మాములుగా వున్నారా? అంటే? ఆనందంగా లేదా? నే చెప్పింది శుభవార్త కాదా?"
"ఏమిటది?"
'అదే, మీరు తండ్రి కాబోతున్నారని------"
"ఎవరు? నేనా? సుమీ! .... ఏమిటో నువ్వివాళ వింతగా మాతాడుతున్నావు."
"నేనా?" అన్నది సుమతి ఆందోళనగా.
"అవున్నువ్వే! నాకిన్నేల్లోచ్చి పెళ్ళి చేసుకోలేదు. నేను తండ్రిని కాబోవడ మేమిటి? అది శుభవార్తని నువ్వు డిక్లేర్ చేయడమేమిటి?"
'అంటే."
"ఇంకానయం. ఈ శుభవార్త నాకు చెప్పేవు గనక బతికి పోయేం. ఈ సంగతి మా నాన్నకి తెలిస్తే నాడోక్కచించి డోలు కట్టేయగలడు."
"ఏమండీ!"
"నేను అబద్దం చెప్పను సుమీ! నిజంగానే డోలు కట్టేయగలడు."
"మరి ....మరి...."
"ఏమిటా మరి? ఇంక గోల చేయకు. కొంపముంచి శుఖవార్తంటావే?"
"కొంప ముంచింది నేనా?"
"మరినేనా?"
"ఏమిటండీ మీరు మాతాడేది? నాకేవితో భయంగా వుంది!"
"ఇవతల నాకూ డిటోగానే వుంది!"
నన్ను - నన్ను అన్యాయం చేస్తారా?"
"నన్ను బతకనివ్వవా?"
"ఆరోజు బీచ్ లో మీరన్న మాటేమిటి?"
"అన్నాను అక్కడేనా? రాజుగారి తోటలోనూ అన్నాను. మొత్తం రెండుసార్లు అన్నాను. అవునా? రెండు సార్లు అన్నంత మాత్రాన నా మెడకి ఉరి వేస్తావా?"
'అయితే నన్నిప్పుడెం చెయ్యమంటారు?"
'అలోచించి చెబుతాను."
"ఆలోచిస్తారా?"
"అవునేం చేయమంటావు? ఇంత ప్రమాదం నెత్తి నెక్కి కూచుంటుందని తెలిస్తే - క్షణంలో నీకు చక్కటి సలహా ఇచ్చి ఉందును. అప్పుడీ ప్రమాదం గురించి తెలీదు కనుక ఇప్పుడు ఆలోచించా లంటున్నాను. ఏం తప్పా?"
సుమతి చేతుల్లో తన మొహాన్ని దాచుకొని ఘోల్లున ఏడ్వడానికి ప్రయత్నించింది.
వెంటనే ఆపిల్ల చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె మొహంలోకి చిన్నగా చూస్తో చాలా కరెక్టుగా అన్నాడు చిరంజీవి : "ఏడవమాకు . ఐడియా వచ్చింది. నేను చెప్పేది పూర్తిగా విను. ఖంగారుపడకు. నేను పెళ్ళీ పెటాకు ల్లెకుండానే తండ్రినై పోయానంటే నాన్న నన్ను తన్ని తరవడమే గాకుండా పెద్దవాళ్ళెందరో మనల్ని అల్లరి పెట్టేస్తారు. ఆ తర్వాత మనం పెళ్ళి చేసుకున్నా ముందు ముందు మనకు సుఖాలుండవు. అందుచేత మన సుఖం కోసం ఒక ఉపాయం చెబుతాను. పాటించు. మనూళ్ళో మంత్రసాని రాజమ్మ పుట్టబోయే పిల్లల్ని మాయం చేయడంలో నెంబర్ వన్ హ్యాండ్. నువ్వొక తడవ అక్కడికి వెళ్ళు నీకంత భయంతే వుంటే కూడా నేనూ వస్తాను. రాజమ్మ చేతిలో వందో వెయ్యో పెడతాను. అనువుగాని వేళలో మన మధ్య కిరికిరి పెట్టిన అడ్డాన్ని రాజమ్మ తొలగించి పారేస్తుంది. అనక నువ్వు కన్యవే! ఆ తర్వాత మనం హాయిగా పెళ్ళి చేసుకుని లీగల్ వారసుడ్ని కందాం. ఓ.కే. ఈ రహస్యం దాచేస్తే మానాన్న మరిక నోరెత్తడు. పెద్దలు ఛీ పొమ్మని మనల్ని గెంటవతల పారేయరు. ఏవంటావ్ సుమీ!"
సుమతి ఏమీ అనకుండానే ఘోల్లున ఏడ్చేసింది. ఏడుస్తూనే అతని పాడుబుద్దిని తిట్టింది. భ్రూణహత్య మహాపాపమే గాకుండా అది మనిషిలోని దుర్మార్గాన్నీ నీచాన్నీ చాటి చెబుతుందని హెచ్చరించింది.
ఆ తర్వాత అతన్ని తిట్టేందుకు పదాలు దొరక్క ఓపిక లేకా తన రెండు కళ్ళనీ రెండు చేతుల్తో మూసుకుని సొమ్మసిల్లి పడి పోయింది.
లేచి, కళ్ళు తెరచి చూసినప్పుడు చిరంజీవి లేడు!
ఆ తర్వాత సుమతెవరో తెలీనట్టు ప్రవర్తించేడు చిరంజీవి. ఈ ప్రేమ జ్వరాన్ని యింకా దూరం చేసే నిమిత్తం అతను కొన్ని యితర కార్యక్రమాల్లో పూర్తిగా మునిగిపోయేడు.
సైకిల్ షెడ్డులు కట్టించాలి!
డివార్ లు తగ్గించాలి!
అధ్యాపకులూ! మీకు నోరున్నది పాఠాలు చెప్పేందుకే గాని టూ మచ్ గా మాటాడెందుక్కాదు! వగైరా వగైరా నినాదాల్లో, వాటి తాలుకూ సమ్మేల్లో చిరంజీవి తల దూర్చేశాడు.
(నీ మనసుని తినేసే సంఘటన ఎదురు పడితే - దాన్ని మింగే ఉపాయాన్ని చేబట్టి దేశమ్మీదపడు! నీ కాలికింద నేల కదిలే ప్రమాద మొస్తే, మొత్తం భూమికే ఎసరు పెట్టు! నువ్వు సుఖంగా వుంటేనే నీ పక్కవాడు సుఖంగా వుంటాడు. నీకు లేని సుఖం వాడి కెందుకు? నువ్వేం చెబుతే అది అక్షరాలా పాటించే గంగి రేద్దుల్ని నీ యిష్టానుసారం నడిపించే ప్రజ్ఞ నీకుండాలి. ఇత్యాది నీతి చంద్రికల్ని చిరంజీవి ప్రేమ జ్వరం నుంచే తెలుసుకోడం ప్రారంభించాడు.)
సుమతి తల్లయ్యేందుకు రోజులు దగ్గిర పడుతున్నాయి. ఈ క్వాలిఫికేషన్తో ఆ పిల్ల ఇల్లు దాటేందుకు భయపడి, కాలేజీకి రావడం మానుకుంది.
* * *
సీతక్క కోసం సిరిపల్లె వెళ్ళేందుకు ప్రసాదం బస్టాండుకి వచ్చాడు. ఆ బస్టాండులో అతను సుమతిని చూశాడు.
సుమతి గబగబా ప్రసాదం దగ్గిర కొచ్చి నిలబడి వేగంగా మాటాడింది.
"మీతో నేను అర్జెంటుగా మాటాడాలి. పార్కుకి వస్తారా?"
"నేను అక్క దగ్గరికి వెళ్లాలి"
"వెళ్ళండి. తప్పకుండా వెళ్ళండి. కాని, నాకోసం - ఒక్క అరగంట ...... అరగంట చాలు ........ ప్లీజ్ కాదనకండి" అన్నదామె కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని.
సుమతి కళ్ళలో నీళ్ళు చూసి ప్రసాదం ఉలిక్కిపడ్డాడు.
"మీ రూమ్ కి వెళ్ళెను. మీరు బస్టాండుకి వచ్చినట్టు తెలిసి - తిన్నగా యిక్కడికే వచ్చెను, కాదనకండి. మొన్నటి మొన్నటి వరకూ మీరు నాకు ముఖ్యమైన స్నేహితులు..... పోనీండి ...... ఇవాళ ..... మీతోనే అవసరం వచ్చింది రండి ..... పార్కుకి వెడదాం ..... ప్లీజ్."
ప్రసాదం పార్కు వేపు సుమతితో పాటు నడిచేడు.
పార్కులో వాళ్ళిద్దరూ ఒక మూల కూచున్న తర్వాత సుమతి తన కధ వినిపించింది.....
".... అతను నాకింత అన్యాయం చేసినట్టు నేనెవరికీ చెప్పుకోలేదు. మొదటిగా మీకే చెప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా, ప్రసాదంగారూ? చెప్పనా? నేను చిరంజీవిని పెళ్ళాడి, తద్వారా నా అదృష్టాన్ని మీకు గొప్పగా చెప్పుకుందామనుకున్నాను. అదొక రకమైన ఆత్మ తృప్తి! మీరు నన్ను అవమానించినందుకు , నేను మాడి మసై పోలేదు. పై పెచ్చు వెలిగి పోతున్నానని మీకు తెలిజేయడంలో నా 'కసి' చల్లారుతుందనుకున్నాను... కాని ....ఇప్పుడు నేనే ఓడిపోయాను - చాలా దారుణంగా , హీనంగా .... ఈ తప్పు చిరంజీవి ఒక్కడిది కాదు.... నాకూ వుంది భాగం . ఇప్పుడు నేనేం చేయను? చిరంజీవిని చంపుదామనుకున్నాను. ఆడదాన్ని గదా ..... చేత కాలేదు ..... చిరంజీవిని చంపమని మీకు చెప్పడం లేదు. చెప్పను గూడ - నాకు మగదిక్కుగా సత్యం ఒక్కడే వున్నాడు. వాడుత్త అవకాశవాది! వాడికి నా సమస్య వినే ఓపికా వుండదు! అమ్ముంది - ఆడదిక్కు . నాన్నపోయిం తర్వాత రోడ్డెక్కి ఎరగడు. పైగా , - నాకు తగిలిన దెబ్బతో అమ్మ మంచం ఎక్కేసింది ! .... ఇంక నాకేవరున్నారు ఎవరు! నా దీనావస్థను అర్ధం చేసుకుని నన్ను ఓదార్చేదెవరు? ..... ఒక్కటే ప్రయత్నం మిగిలుంది. రామదాసు గారికి నా దుస్థితిని తెలీజేసుకోవాలి. మమ్మల్ని కనికరించి , మాకు పెళ్ళి చేయవలసిందిగా వారిని వేడుకోవాలి. నాకై నేను వెళ్ళాలంటే ,..... భయం ..... అయినా వెళ్ళక తప్పదనుకుంటే వెళ్ళగలను. కాని, ఏం లాభం ..... మీకు చెప్పినదంతా వారికి చెప్పలేను .... అందుచేత మీరు నాకు తోడు రండి . నాకు అండగా నించోండి ప్రసాదం ...... ఈ సాయం చేయండి ప్లీజ్!"
