యువతీ మణులకు మాత్రం అతి జాగ్రత్తగా నమస్కరించాడు.
పురప్రభువు మామూలు మనిషై , అతి సామాన్యుల్తో కరచాలనం చేసి పలుకరించడమనే మర్యాదకి హాజరైన యువజనులందరూ అమితానందం పొందేరు.
పరిచయాలు పూర్తయిన పిదప కొడుకు చాలా ముచ్చట పడి కోరుతున్నట్టు ---
"ఎలాగో యింతసేపూ నీ అమూల్యమైన కలాన్ని వృధా చేసుకున్నావు. మా ప్రేండ్స్ అంతా నీ నుంచి నాలుగు మాటలు వినాలనుకుంటూన్నారు నాన్నా!" అన్నాడు.
వ్యవహారం యింతవరకూ వచ్చిం తర్వాత, ఇక బాగుండదని చెప్పి యువజనులంతా శ్రీవారిని మాటాడవలసిందిగా కోరి మరీ ప్రార్దించేరు.
తప్పదన్నట్టు పోజు మొహాన్న వెలిగించుకుని, శ్రీవారప్పుడు చిద్విలాసంగా నవ్వేసి, వున్న చోటనే నిలబడి నాలుగు మాటలూ దులిపెశారు.
"తండ్రిగా , మా చిరంజీవి భావి జీవితాన్ని సుందరంగా ఊహించుకోడం నా ధర్మం. చిరంజీవికి ఆయురారోగ్య సంపదల్ని అనుగ్రహించాలని ఆ శ్రీరామచంద్రుడ్ని - మా ఇలవేలుపుని - చేతులు జోడించి వేడుకుంటున్నాను. చిరంజీవికి పుట్టింరోజు పండుగలు యింతకు ముందూ చేసుకున్నాము. కానీ, ఈ సంవత్సరం, మీ వేడుకలో ప్రత్యేకత వుంది. చిరంజీవి మీ కళాశాలకి స్టూడెంట్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యేడు. ఈ ఎన్నిక ద్వారా వాడు మీ లాటి మంచి వాళ్ళ అభిమానాన్ని సంపూర్ణంగా గ్రహించేడు. అదృష్టవంతుడు, పదిమంది సమస్యల్ని తన సమస్యలుగా భావించి, వాటికి తరుణోపాయం ఆలోచించటం సామాన్యమైనపని కాదు. ఇది నేను నా అనుభవ పూర్వకంగా చెప్పగలుగుతున్నాను. నన్నడుగుతే ఈ లీడర్ షిప్ అతి ప్రమాదకరమైనదని మనవి చేస్తున్నాను. తనని తనే సరిదిద్దుకోలేని ఈ రోజుల్లో , ఈ వేగంలో , పదిమందిని ఒకే త్రాటి మీద నడపడం సాధ్యమా? - సాధ్యమే - చెబుతాను. ఈ లీడరనేవాడు ముందు తన తోటి వాళ్ళందరి అభిమానాన్ని సంపాయించుకోవాలి. మనసా వాచా వాళ్ళందరి క్షేమాన్ని ఆశించాలి. అవసరమైతే నీ సొంత సౌఖ్యాన్ని కొంత దూరం చేసుకుని కష్టపడి తీరాలి. చిరంజీవి అభిమాన ధనాన్ని సంపాయించుకున్నట్టు యీ ఎన్నిక ఫలితం, ఇక్కడ ఈ వేడుక వైభవం చాటి చెబుతున్నాయి. అయితే, మీ అందరి క్షేమం కొరకు అతనోక్కడూ పాడుపడే నేర్పునీ, ఓర్పునీ రామచంద్రుడు అనుగ్రహించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. చిరంజీవి నా కొడుకు. ఇలాటి కొడుకుని రామడనుగ్రహించినందుకు నేను అదృష్టవంతుడినే. ఇక్కడే మీకో చిన్న మనవి చేయదలచుకున్నాను. నాకా వయసు ముంచుకోస్తోంది! రాముడిచ్చిన ఓపిక సన్నగిల్లుతుంది. నా అడుగుజాడల్లో నడిచే యువకుడు నా తర్వాత నిలబడగలిగితే?- రాముడు నన్ను అనుగ్రహించినట్టే లెక్క. చిరంజీవి, చదువుకుంటున్న చదువుతో పాటు ...... మీ మీ సమస్యల పాఠాల్ని అర్ధం చేసుకుని వాటి నివారణోపాయాన్ని ఇవాళ్టి నుంచే ఆలోచిస్తుంటే ... రేపటికి తనే న వారసుడవుతాడు. ఇతనే నా వారసుడు. ఆ శుభతరుణం కొరకు మనమంతా ఎదురు చూద్దాం . సెలవు."
మేడమేడంతా కరతాళధనుల్తో మారుమోగిపోయింది.
చిరంజీవి రెండు చేతుల్నీ జోడించి వినయంగా నిలబడి వున్నాడు. రామదాసు ప్రతి మనిషినీ గమనిస్తూ, అతను చేసే కరతాళధ్వనీలోని బలాన్ని అంచనా వేస్తూ నుంచున్నాడు.
ఈ కరతాళధ్వనులే ఆ తండ్రీ కొడుకులకి ప్రాణవాయువులై పోయేయి పాపం! వాళ్ళ బ్రతుక్కి కావలసిన ముఖ్యమైన 'హంగు' ఈ కరతాళధ్వనులే మరి!
8
నీకు సిగ్గులేదురా సత్యం! నువ్వు వాజమ్మవి. వాడి తోత్తువి ," అన్నాడు సీతాపతి.
"అవునవును. మహా నీకే వుంది , సిగ్గు! తగుదునమ్మా అని వచ్చి నా ప్రాణం తీసి చిరంజీవిగాడికి పనిచెయమన్నావు. చేసెను. ఇవాళ వాడు నా యింటికి వచ్చి నన్ను పలకరించి వెడితే నీ కది మంటగా వుంది. ఇంటికొస్తున్న వాడిని మెడ పట్టుకు గెంటమంటావా?" అన్నాడు సత్యం రోషంగా.
"ఎంత నేను చెబుతే మాత్రం అంతపని నువ్వెందుకు చేస్తావులే ? పోరాపో! మీ కేవ్వరికీ సిగ్గులేదు ."
"ఇందాక నాకొక్కడికి అని యిప్పుడు మా అందరికి అంటున్నావ్, నీ ఉద్దేశ మేమిట్రా అసలు?"
"ఉద్దేశమా? ఒరే సత్తిగా! నన్నెందుకు రెచ్చగోడతావ్ చెప్పు , నీకేం తెలీదుట్రా?"
"ఏమిటి తెలిసేది?"
'అమ్మ కొడకా! ఎదిగిపోయేవురా బాబూ! అవున్లే చిరంజీవి గాడికి గుండేవి కదూ. ఎదక్క ఏమవుతావ్ మరి? ఒరేయ్ మీ రాజకీయాలు తగులబడిపోనూ. ఎంతెంత రాజకీయంరా సన్నాసీ! నేను రాజకీయాలకి వర్రీ కావడం లేదురా బోడిగా! రాజకీయాల్ని ప్రేమల్లోకి తీసుకురావద్దంటున్నాను. అర్ధమయ్యిందా?" అన్నాడు సీతాపతి కోపంగా.
ఎన్నికలు పూర్తయిన ఆరు నెలలు గడిచిం తర్వాత వాళ్ళిద్దరూ తీరుబడిగా కూచుని మాటాడుకునే అవకాశం చిక్కింది. వాళ్ళిద్దరూ హోటలు రత్నంలో ఒక మూల కూచుని తర్జన భర్జనలు చేసుకోవడం ప్రారంభమైంది 'సిగ్గులేనితనం' దగ్గిర్నుంచే.
సీతాపతి ప్రేమ పేరు ప్రస్తావించడంతోటే సత్యం చాలా రకాల ఆలోచనలకి గురైపోయేడు. చాలాసేపు నిశ్సబ్దంగా వుండి చివరికి అన్నాడు.
'అయితే నన్నిప్పుడెం చేయమంటావు? వాడిని మా యింటికి రానివ్వ కూడదంటావ్ , అంతేగా?"
"ప్రే మొదిలేపెట్టి ఇల్లంటా వేమిట్రా గాడిదా? నీ యింటికి వాడొస్తే నాకేం మంటనుకున్నావా?"
"డొంక తిరుగుడు మాని తిన్నగా మాటాడు."
"వాడు మీ సుమతిని ప్రేమిస్తున్నాడు, తెలుసా?"
"అయితే, ఎమిటయిందంటావ్?"
"ఏమి టయ్యిందా? నువ్వేనా అడుగుతున్నావ్ ------- ఏమి టయిందని? నీకు చీమ కుట్టినంత బాధైనా లేదుట్రా?"
"నన్నెందుకు కుట్టాలి చీమ?"
"చిరంజీవి మీ సుమతిని ప్రేమిస్తున్నాడురా!"
'చెప్పేవ్!"
"మీ సుమతిని నేనూ ప్రేమించాన్రా రాస్కెల్!"
"మరి సుమతి నిన్ను ప్రేమించవద్దూ?"
"ఆ మాట కొస్తే సుమతి చిరంజీవిగాడినీ ప్రేమించడం లేదు తెలుసా? వాడి మేడని , కారుని , వాడి హోదనీ చూసి ఆశ పడుతుందేమాగా నోరేయ్; వాడు దొంగ రాస్కెల్! ఉదాహరణ కావల్సోస్తే ..... నేను. నేనురా! అవసరమున్నంతవరకూ నన్ను వాడుకుని, ఆ అవసరం గడిచిం తర్వాత నన్ను పుట్ బాల్ ని కొట్టునట్టు కొట్టి పొమ్మన్నాడు. అదే విధంగా, మీ సుమతితో వాడి అవసరం తీరిం తర్వాత సుమతిని పోమ్మంటాడే గానీ పెళ్ళి చేసుకోడు. యమదెబ్బ గాడు వాడు. వాడి దొంగబుద్ది , వాడి నక్కవినయం నాకు తెలుసున్రా సన్నాసీ! పో.... వెళ్ళి మీ సుమతితో చెప్పు. కళ్ళు మూసుకుని గోతిలో పడొద్దని హెచ్చరించు . తెలిసిందా?" అన్నాడు సీతాపతి.
"గొయ్యో, నుయ్యో , దానిష్టం. దానిష్ట మోచ్చినట్టు నడుస్తుందే గాని మధ్య మన మెవళ్ళం సలహా లిచ్చేందుకు?" అన్నాడు సత్యం.
