"సీతాపతితోనా?" అడిగేడు చిరంజీవి.
"మరే ....అతన్తోనే చెప్పండి. మీరు నన్ను పార్టీకి ప్రత్యేకంగా పిలిచినట్టు తెలిసిందిట. కారాలూ మిరియాలూ నూరుతూ కూచున్నాడుట."
'అరే ......అదేం పని? మీరోస్తే అతని కేమిటి నష్టం?"
"ఏం చేస్తాం గురూజీ! మొదట్నుంచీ మాకు బద్ద విరోధమయ్యే! మా వాసన కూడా అతనికి గిట్టదు."
అతన్ని గురించి మీరేమీ ఇదవ్వకండి. రేపు నా పార్టీలో మీ యిద్దరి చేతులూ కలిపే పూచీ నాది . సరేనా?" అన్నాడు చిరంజీవి.
సుబ్బారావు నొచ్చుకుంటూ అన్నాడు. "ఎంత మంచివారండీ గురూజీ! మీ రాజీ ప్రయత్నాలేవీ కుదిరి చావవు లెండి. మా జాతకాలింతే. మమ్మల్నిలా చావనీయకండి. అంటున్నానని కాదుగా నీండి..... వాడి కిరాతకం మనుషుల్లో వుండదంటే నమ్మండి. నాతొ పెట్టుకుని వాడేం బాగుపడతాడో నేనూ చూస్తాను. మీరు మాత్రం రాజీ ప్రయత్నాలేవీ చేయకండి. మీరూ నేనూ పోటీల్లో నించున్నాం. మీరు గెలిచారు, నేను ఓడిపోయెను. అంత మాత్రాన మీరు గొప్పకి పోయి మూతి ముడుచు క్కూచున్నారా? పోనీ - మనం తిరిగి చేతులు కలిపేందుకు ఎవడైనా రాజీ ప్రయత్నాలు చేసేడా? మీ మనస్సుకి తోచిందానికి మారు మాటాడకుండా నా దగ్గిర కొచ్చి చేతులు కలిపేరవునా? ఆ సంస్కారం వాడి కెక్కడి దండి బాబు? మీరు రామదాసు గారి పుత్రులు. వారి బుద్దులన్నీ పుణికి పుచ్చుకున్నారు గనక సంస్కారం , చుట్టుబండలని యిదై పోతున్నారు. వాడేవడనుకున్నారు? కనకం గారి మేనల్లుడు. గుండెలు తీసే బంటు వాడు. వాడీ జన్మ కాలంలో మారడు గనక మారడు. పోనీండి గురూజీ! ఎవడెట్టా చస్తే మనకేమిటి? వాడితోనే గడవదు గదా మన బ్రతుకు. నేను తప్పనిసరిగా పార్టీ కోస్తాను. వాడుగా వాడు చేయి కలిపితే సంతోషిస్తాను. మీరక్కడ మాత్రం రాజీ ప్రయత్నాలూ చేస్తే నావళ్ళు మండి పోతుంది. ఆ పరిస్థితి ని మాత్రం తీసుకు రాకండీ. ఒకే?"
చిరంజీవి సంశయిస్తూ యిబ్బందిగా మొహం పెట్టి, అనిష్టంగా అన్నట్టు అన్నాడు: "సరే, మీ యిష్టం. మీరింత చెప్పిం తర్వాత నేనేమీ అనగలను? పార్టీకి మాత్రం తప్పకుండా రండి. మీరు గూడా గురూ గార్లూ .... మీరంతా రండి!"
'అలాగే నండి," అన్నారు సుబ్బారావు మిత్రులిద్దరూ.
"మరి.....నేను వెళ్ళొస్తానండి. ఒక్క పనీ అవలేదు. ఏర్పాట్లన్నీ అలానే వుండిపోయాయి వెళ్ళిరానా?' అన్నాడు చిరంజీవి.
వాళ్ళందరి దగ్గరా సెలవు పుచ్చుకుని చిరంజీవి కారెక్కాడు. చినబాబు కారులో కూచున్న తర్వాత , వెంకటస్వామి వినయంగా కారు తలుపు మూసి , కారుని స్టార్ట్ చేశాడు.
ఆ కారు రవి వాళ్ళ గడివేపు నడుస్తుంది.
* * *
మేడ మేడంతా కలకల లాడుతుంది!
సాధారణంగా ఆ మేడ ఎప్పుడైనా కలకలాడుతోందంటే --- అక్కడ చేరిన పుర ప్రముఖులనేక మంది వల్లనే అనే అర్ధం చెప్పుకొడం జరిగేది. కాని, ఇప్పుడది కాదు విషయం!
ఆ మేడలో చేరిన వాళ్ళంతా చదువుకుంటున్న కుర్రవాళ్ళు. రేపో మాపో దేశాన్నుద్దరించే యువశిఖామణులు.
పుర ప్రభువుకి వారసుడైన యువ ప్రభువు పుట్టిం రోజు పండుగ అనాడక్కడ తోటి యువ ప్రజల సమక్షంలో కన్నుల పండుగ్గా జరుగుతుంది.
తినేవాళ్ళు తింటున్నారు. తాగేవాళ్ళు తాగుతున్నారు. తిని, తాగుతూ, గూడా తలా ఒకరకంగా మాటాడుకుంటున్నారు. వెరైటీ కోసం నవ్వి, భుజాలేగురవేస్తున్నారు.
కొందరు యువతీమణులు గూడా వచ్చారు. కేవలం ఆ యువతీమణుల కోసం కొందరు యువకు లోచ్చేరు - అది వేరే విషయం.
అక్కడ కొచ్చినవారంతా కేవలం చిరంజీవి పండుగని చూచి పోదామనే వచ్చేరు.
హాలు మధ్యన చిరునవ్వు లోలకబోస్తూ చిరంజీవి ఠీవిగా నిలబడి వున్నాడు.
అతని కుడి ప్రక్కన అంటిపెట్టుకుని సుబ్బారావు నుంచున్నాడు.
ఆ యిద్దరూ ఖరీదైన దుస్తుల్లో మిలమిలా మెరిసిపోతున్నారు. రేలీని వాడెవడైనా అక్కడి కొచ్చి వుంటే, ఆ యిద్దర్లో పుట్టిం రోజు ఎవడు చేసుకుంటున్నాడో చెప్పడం తలకు మించిన పని. అంతలా మిడిసి పడుతున్నారు వాళ్ళిద్దరూ. నిన్నటి వరకూ ఆ యిద్దరూ ఎన్ని కల మహా సంగ్రామంలో ప్రత్యర్దులని తెలిసినవాడు సైతం అనుకోడానికి ఆస్కారం లేకుండా వాళ్ళెంతో చనువుగా, చెలిమిగా కలిసి పోయి వున్నారు.
చిరంజీవి ఎడం ప్రక్క మాత్రం ఖాళీగా వుంది.
వాళ్ళకి దూరంగా - అయితేనేం వాళ్ళేదురుగా మిస్. సుమతి హోయలోలకబోస్తూ ఒక సోఫా ముందు నిలబడి వుంది. ఆమె కటూ యిటూ యిద్దరు చెలికత్తెలున్నారు. ప్రియసఖి సుమతి మిసెస్ చిరంజీవిగా కాబోయే రహస్యం చెలికత్తె లిద్దరికీ తెలియడం వల్ల - వాళ్ళ స్థలాన్ని యిప్పట్నుంచే జాగ్రత్త చేసుకుంటున్నారు.
మిస్. సుమతికి అక్కడెంతో హాయిగా వుంది. రేపు తనెటూ ఆ మేడకి రాబోతున్న పడుచునని గమనించి మరింత ముచ్చట పడుతుంది.
యువ ప్రజల్లో - రేదర్ - గుంపులో అన్నీ పోగొట్టుకున్న అభాగ్యుడిలా కనుపిస్తున్న వరప్రసాదాన్ని చూస్తున్నప్పుడు మాత్రం మిస్. సుమతికి వొళ్ళు మండుకోస్తోంది! (బ్రతకలేని వెధవకేం తెలుసు ప్రేమ! ప్రేమించడం లేదుట- బోడి ప్రేమించడం వీడూను!)
మనిషి చేత ఖబురంపి అతన్ని తన దగ్గిరికి పిలిపించుకుని చెళ్ళున చెంప పెట్టి ఒకటి పెట్టి "పార్టీ ఎలా వుందోయ్ ప్రసాదం! నీ కసలు బర్త్ డే ఏమిటో గుర్తుందా? అంత కల్చరున్న మనిషివేనా నువ్వు?" అని కోప్పడాలనే చిరువాంచ కలగడంతో తాగుతున్న కూల్ డ్రింక్స్ వేడిగా నోటికి తగల్డంతో - విసుక్కుంది మిస్ సుమతి!
అంత పెద్ద పార్టీలో మిస్. సుమతి ఎందుకు విసుక్కుంటుందో కనుక్కుందామనే కోరిక ఎవరికీ కలగనే లేదు పాపం!
సుబ్బారావు చిరంజీవితో అన్నాడు.
"ఇంతమందోచ్చేరు, మీ ప్రెండ్ సీతాపతి రానేలేదు. మీరతన్ని పిలవలేదా?"
చిరంజీవి బాధని అభినయిస్తూ అన్నాడు.
"మంచి మాటే! నేను స్వయంగా పిలిచేను. పార్టీ ప్రారంభమయ్యే ముందు మళ్ళీ మనిషి చేత ఖబురు గూడా పంపాను. అయినా, అతను రాలేదు. ఏం చేయగలను చెప్పండి? స్నేహ ధర్మం- వెధవది- రాజకీయాలకు దూరంగా వుండాలే గాని మరి అంత దారుణమైపొతే ఏం బాగుంటుంది? పోనీండి. నా యింటి కొచ్చిన వాళ్ళే నా స్నేహితులు!"
"బాగా అన్నారు, " అన్నాడు సుబ్బారావు.
"అయితే, అతనేదో అనాగరికంగా ప్రవర్తించేడని నేనూ అలాగే ప్రవర్తిస్తే అర్ధం లేదు. అతన్ని నేను క్షమించాను. ఈ తప్పుతో అతను మొత్తం వంద తప్పులూ పూర్తీ చేసినా క్షమిస్తాను. క్షమించి నంత మాత్రాన నేను తక్కువైపోనుగా? ఏవంటారు?
"అవునదే కరెక్ట్," అన్నాడు సుబ్బారావు బెంగగా.
పార్టీలో అంతా అకస్మాత్తుగా మవునం వహించారు. అందరి చూపులూ మేడ దిగి వస్తున్న రామదాసు గారి దివ్యమంగళ విగ్రహమ్మీద నిలిచేయి.
శ్రీవారు చాలా నిండుగా, హుందాగా మేడ దిగి వచ్చి హల్లో నుంచున్నారు. కొంచెం సేపు తటపటాయించి అన్నాడు.
"ఎంజాయ్ ది డే! చిరంజీవి పట్ల మీకున్న అభిమానం, స్నేహం వాడికి విలువైన ఆభరణాలు. నాకు బయట అర్జంటు పనొకటి ఉంది. మరి నేను వెళ్ళొస్తాను."
తండ్రీ కొడుకులు అనుకున్న ప్రకారం - కొడుక్కేదో స్పురించినట్టు నటించి,
"ఒక్క నిమిషం నాన్నా! మావాళ్ళందర్నీ పరిచయం చేస్తాను, " అన్నాడు.
తండ్రి ఆగిపోయేడు. కొడుకు పరిచయాలు ప్రారంభించాడు.
"ఓహో నువ్వా! ఆహా నువ్వా! మంచిది! ఏవిటీ ఆలాగుటోయ్! బాగుందమ్మా నువ్వా!" మొదలైన పలుకరింపు బాణాల్తో తండ్రి అందరితోనూ కరచాలనం చేశాడు.
