Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 24

 

    అంతేనంటారా ?" అన్నాడు చిరంజీవి.
    "ఏం! నేనొక్కతేనీ వస్తే మీక్కష్టంగా ఉంటుందా?"
    "అంతమాటే? బలే!"
    "సరిగ్గా ఎన్ని గంటలకు పార్టీ?"
    "సాయంత్రం ఆరింటి కనుకోండి . మీరు మాత్రం అయిదింటికే రండి."
    "అయిదింటి కెందుకు ?"
    "..... .... ....."
    "అందరూ ఆరింటికి వస్తుంటే నేనొక్కతేనీ అయిదింటి కొచ్చి ఏం చేయను?"
    ప్లీజ్ కాదనకండి. మీరు అయిదింటికే రండి. మీతో నేను చాలా మాటాడాలి.
    "ఏమిటో అది?"
    "ఇప్పుడు కాదు. రేపు చెబుతాను."
    "ఫర్లేదు. ఇప్పుడే చెప్పండి. వింటాను."
    చిరంజీవి సిగ్గు నభినయించాడు. సోఫా మీద చేత్తో రాస్తూ కూచున్నాడు.
    సుమతి మళ్ళా రెట్టించి అడిగింది.
    "చెప్పండి; చంపక."
    'చెప్పమంటారా/ అల్ రైట్ నేను చేబుతాననుకోండి. అదంతా విని మీరేమీ అనుకోరు గదా!"
    "నే నేమీ అనుకోను. చెప్పండి."
    "ప్రామిస్?"
    "ప్రామిస్! చెప్పండి."
    చిరంజీవి చేతివేళ్ళని లెక్కపెట్టు కున్నాడు. లెక్క పూర్తయిం తర్వాత ఒక్కో మాటా చెప్పడం ప్రారంభించాడు.
    నిజానికి ఈ విషయం మీతో ఎప్పుడో చెప్పవలసింది ..... ...... సమయం చిక్కక చెప్పలేదు ..... ఇప్పుడు చెప్పక తప్పడం లేదు..... పైగా మీరు గూడా చెప్పమని వత్తిడి చేస్తున్నారు గనక ..... ఇవాళ చెబుతున్నాను .... నేను .... మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సుమతీ!" పూర్తీ చేసేడు చిరంజీవి.
    సుమతి తన పెద్ద కళ్ళని టపటప లాడించి తల దించుకుంది.
    క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.
    మళ్ళా చిరంజీవే అడిగేడు.
    "మీకేమైనా అభ్యంతర మైతే చెప్పండి. ఈ జన్మకి మళ్ళా ఈ ప్రసక్తి తీసుకురానని ప్రామిస్ చేస్తున్నాను, చెప్పండి సుమతీ!"
    సుమతి ఏమీ చెప్పకుండా కళ్ళెత్తి చిరజీవిని చూస్తుండి పోయింది.
    "నేను తొందరపడ లేదనుకుంటాను. పోనీండి .... మీ అభిప్రాయం ఏమిటో యిప్పుడు చెప్పడానికి అభ్యంతర మైతే మరోనాడెప్పుడైనా - బాగా ఆలోచించుకునే - చెప్పండి." అన్నాడు చిరంజీవి.
    "అదేం కాదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పేరు కదా .... నాలో మీరేం చూసి ప్రేమిస్తున్నారో నని ఆలోచిస్తున్నాను." అన్నది సుమతి సూటిగా.
    చిరంజీవి చిర్నగవొకటి మొహాన తగిలించుకుని అన్నాడు ; తెలివిగా ----
    "ప్రేమెందుక్కలిగిందనే ప్రశ్నకి జవాబు చెప్పడానికి నేనేం సిగ్గుపడనవసరం లేదనుకుంటాను. ఎలక్షన్లలో నాకు మీరెంతో సాయపడ్డారు. నిజానికి మీ సాయం వల్లనే గెలిచాను. అప్పటివరకూ మీరు నాకేమీ కారు. మీ సత్యానికి నేను ఫ్రెండ్ ని. అంతే. ఆ ఒక్క బంధుత్వం వల్లనే మీరు నాకు సాయం చేశారు. ఆ మాటకొస్తే సీతాపతి గూడా నాకు సాయం చేశాడు గాని, అది నామీదున్న స్నేహితం వల్ల కాదు, అవతల ఆ సుబ్బారావు మీదున్న విరోధం కారణం. అందుచేత సీతాపతి సాయాన్ని నేను గొప్ప సాయంలా ట్రీట్ చేయను. మీ దగ్గిరే నాకు నిజమైన స్నేహం దొరికింది. ఈ స్నేహాన్ని నేను జీవితాంతం పొందాలను కుంటున్నాను. మిమ్మల్ని పెళ్ళి చేసుకుని మీ సహాయ సలహాలను పాటించి సుఖ పడదామనుకుంటూన్నాను. చెప్పండి ..... సుమతి. నా నిర్ణయంలో ఎక్కడైనా పొరపాటున్నదా?"
    సుమతి అతని వినయ విదేయతలకి మురిసిపోయింది. సమయానికి అమ్మ లేదు గానీ, అమ్మే వుంటే ..... చిరంజీవి శపధాన్ని విని ఎంతెంత మురిసిపోయేదో .....వరప్రసాదమనే మూర్ఖుడి చేత పరాభవింపబడిన తన ప్రేమ హృదయం - ఇక్కడ చిరంజీవనే ఖరీదైన కుర్రాడి చల్లటి మాటలకి తిరిగి ఉపశమనం పొందుతుంది.
    సుమతికి కళ్ళల్లో వెలుతుర్నీ మాత్రమే చూసిన చిరంజీవి హృదయ పూర్వకంగా అన్నాడు.
    "మీ కళ్ళల్లో జవాబుని చదువుకున్నాను చాలా థాంక్స్!"
    "మరి .....మరి ...."
    "అడగండి సుమతి. ఏమీ దాచుకోకండి. నేనింతకు ముందు జరుపుకున్న పుట్టిం రోజులన్నీ చాలా సామాన్యంగా జరిగేయి. రేపు మాత్రం అల్లా కాదు. విక్టరీ ..... విజయవంతమైన పండుగ. మీ సంశయ మేవిటో చెప్పండి ముందు ," అన్నాడతను ఆవేశంగా.
    సుమతి అంత చప్పున అడగలేకపోయినా , చివరికి అడగదలిచిందేదో అడగగలిగింది.
    "మరి .....ఈ విషయం మీ ఫాదర్ కి చెప్పేరా?"
    ఆ మాట విని అతనింత గాలి పీల్చుకున్నాడు. గొంతు సవరించుకుని ఠీవిగా జవాబు చెప్పేడు.
    "మంచి ప్రశ్న ; ..... మా నాన్నని గురించి మీ కింత వరకూ చెప్పక పోవడం నా పొరపాటు . మా నాన్న అందరి నాన్న ల్లాంటి వాడు కాడు. నా అదృష్టం కొద్దీ దేవుడే నాకు నాన్నగా దొరికేడు. గొప్ప చెప్పడం కాదు గానీ , ..... వృత్తి రాజకీయమే అయినా అయన మనసు నవనీతం. ఎదుటివాడు బాధపడటం చూస్తే ; ఆరోజు నాన్న సుఖంగా వుండలేడు. అల్లాటిది .....ఆయనకి ఏకైక పుత్రుణ్ణి నేను! నా సుఖం కాదనగలరా ? ఇంతవరకూ నా కోరికను ఏదీ కాదనలేదు. ఇకముందు కాదనరు. కనక, నాన్నని గురించి మీరేమీ ఆలోచించకండి. ఆ విషయాలన్నీ నాకోదిలేయండి."
    "అవుననుకోండి, మా స్థితిగతులు గురించి కూడా అయన ఆలోచించాలి గదా!" అన్నది అమ్మడు పెద్ద అరిందలా?
    చిరంజీవి మెల్లిగా నవ్వి, తల గాల్లోకి విసిరి చాలా సుళువుగా చెప్పేడు.
    "ప్రేమకీ స్థితి గతులు అడ్డం కావు సుమతీ! మేము మీ స్థితికీ పై మెట్టు మీద వున్నవాళ్ళ మే కావచ్చు. సరిగ్గా ఈ తేడాతో మీ సంబంధం చేసుకుంటే నాన్న సహృదయత ఎలాంటిదో మీ అందరికీ అర్ధం అవుతుంది. నేను చెప్పడమెందుకు? ఏవంటారు?"
    సుమతీ ఏమీ అనలేదు.
    'అయితే నేను వెళ్ళొస్తానింక. పార్టీకి పిలవవలసినవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మాత్రం రేపు పెందరాళే రండి."
    'ఇంక, పెందరాళే ఎందుకు" చెప్పవలసిందంతా చెప్పారుగా, నేనూ అందర్తో పాటే వస్తాను. ఆ తర్వాత సంవత్సరం పార్టీకి మాత్రం నేను మీ పక్కనే వుండి అతిధుల్ని ఆహ్వానిస్తాను . సరేనా?"
    "సుమతీ!" అన్నాడు చిరంజీవి ఆనందంగా.
    సుమతి కళ్ళతో నవ్వేసింది. చిరంజీవి ముగ్ధుడై పోయేడు.
    "చాలా సంతోషం సుమతీ! నేను చాలా అదృష్టవంతుణ్ణి. వెళ్ళొస్తానింక!" అన్నాడతను.
    అతన్ని గుమ్మం వరకూ సాగనంపి , అతని కారు కదిలేటంత వరకూ గుమ్మం దగ్గిరే నుంచుంది సుమతి.
    చిరంజీవి కారు రంగుల మేడ రోడ్ మీదుగా రవీ వాళ్ళ గది వేపు బయలుదేరింది.
    సరిగ్గా రంగుల మేడ సెంటర్లో సుబ్బారావు, అతని మిత్రులిద్దరు నించుని వుండటం చూచి చిరంజీవి కారాపు చేసేడు.
    ఆ కారు చూట్టుతా చేరేరు సుబ్బారావు అతని మిత్రులిద్దరూను. చిరంజీవి చిర్నవ్వుతో చేయి ముందుకు చాచి ఎంతో ఆప్యాయంగా కారు దిగి వచ్చేడు. సుబ్బారావు చేతిని పుచ్చుకుని అన్నాడు.
    "రేపే పార్టీ .... మరచిపోకండి గురూ గారూ!"
    "మరచిపోవడమా నెవ్వర్! మీరిన్ని సార్లు చెప్పడం- అందునా నాకు చెప్పడం బాధగా వుంది గురూజీ! తిన్నగా వెళ్ళి మీ సీతాపతితో చెప్పండి" అన్నాడు సుబ్బారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS