Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 23


    "క్షమించు . నేను తొందరపడి వాళ్ళందర్తో కలిసి చేతులు కల పడం నాదే పొరపాటు. గొప్ప వాళ్ళతో కలిపి వాళ్ళ కారెక్కి తిరగడమే చాలనుకున్నాను గానీ అవతల కాళ్ళు నన్నెలా వాడుకుంటున్నారో, ఊహించుకుంటూన్నారో గమనించలేకపోయేను. రాత్రి వాళ్ళ అసలు రంగులేవో బయటపడి నా కళ్ళు తెరచుకున్నాయి. మాటల మధ్యలో సీతక్క మాటొచ్చింది. వాళ్ళెం పిచ్చిగా మాట్లాడుతారోనని భయపడి సీతక్క ఫోటోని గోడ వైపు తిప్పాను. పార్టీ అయిపోయిన తరువాత ఫోటోని సర్ధలేదు గనక పట్టుబడి పోయేను. నేను చేసిందతా తప్పే నన్ను క్షమించు."
    వరప్రసాదం కను కొలకుల్లో నీళ్ళు నిలిచాయి.
    అతనేమీ మాటాడలేక పోయేడు.

                              *    *    *

    ఉదయమే చిరంజీవి ఇల్లు చేరుకున్నాడు.
    పూజామందిరంలో రామదాసు గారు బిజీగా వున్నారు.
    తిమ్మాపురంలో ఒక మనోహరమైన 'రామాలయం' కట్టించాలని రామదాసుగారికి మధ్యనే కోరిక కలిగింది. ఆలయాలూ, సత్రవులూ ఇవన్నీ గూడ పాపపరిహార నిమిత్తం మనిషి చేసే ఏర్పాట్లంటే రామదాసు గారు వప్పుకోరు. ఈ సత్కార్యాలన్నీ కేవలం సేవానిరతినే తెలీజేస్తాయని వారు అతి సౌమ్యంగా చెప్పి జనాన్ని నొప్పించడం ఏమంత కష్టవూ కాదు.
    ఏవో కొన్ని అనివార్య కారణాలు మినహాయించి శ్రీవారు నిత్యమూ పూజాదిక్రియలు చేసి పుణ్యం మూట కట్టుకుంటున్న పుణ్య మూర్తులు!
    శ్రీవారు గంట కొట్టేసరికి చిరంజీవి స్నానం ముగించి పూజా మందిరం ముందు అర్ధనిమీలిత నేత్రుడై నించుని వున్నాడు.
    కొడుకుని చూసి రామదాసుగారు ముచ్చట పడ్డారు. ప్రసాదం అనుగ్రహించి అతన్తో అన్నారు.
    "రాత్రంతా ఎక్కడున్నావు?"
    కొడుకు అతి వినయంగా వొంటిని ముడుచుకున్నాడు.
    'కనకం గారి మేడలో వున్నావా?"
    "అవును నాన్నా! రాత్రి పార్ట్టీలూ అభినందన సమావేశాలూ ముగిసేసరికి చాలా లేటయిపోయింది. ముఖ్యమైన స్నేహితులు బలవంతం చేస్తే సీతాపతితో పాటు వుండిపోక తప్పింది కాదు. నే నొచ్చే వేళకి నువ్వు పూజలో వున్నావు. పూజలో వున్నావు గదాని స్నానం చేసి వచ్చెను."
    "మంచిది. నన్నడుగుతే - ఇవాళ నుంచీ నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. చిన్నదో, పెద్దదో - ఎదై తేనేం - నువ్వూ ఒక సింహాసనం పుచ్చుకున్నావు. రాజకీయ పాఠాలు శ్రద్దగా నేర్చుకుని జాగ్రత్తగా వ్యవహరించు. ఒరేయ్ నాన్నా ......నా కివాళ చాలా సంతోషంగా వుందిరా అబ్బీ! వచ్చే పదిహేడో తారీఖున నీ పుట్టినరోజు. ఈ ఎన్నికలో నీకు సహాయం చేసిన వాళ్ళందర్నీ పిలు. వాళ్ళకి అందమైన పార్టీ యివ్వు. వాళ్ళందరి చేతా అవుననిపించుకో.
    'అలాగే నాన్నా!"
    "అడగడం మరిచేను. నీ విజయరధసారధి సీతాపతి ఏవంటున్నాడేమిటి?"
    "నాకంటే ఆనందంగా వున్నాడు."
    "ఉంటాడు. ఉంటాడు మరి. ఆనందంగా వుండటం లోనే వుందిరా కిటుకు. వాడు కనకం గాడి మేనల్లుడా? మరోడా?"
    "కిటుకా?"
    'అక్షరాలా అంతేరా జీవీ! పోటీలో గెలిచింది నువ్వే. కాని,  వ్యవహారం నడిపింది వాడు. రాజకీయ అతిరధులు రంగంలోకి సుళువుగా దిగరు. వెనకుండి వాతావరణం చాలా చక్కగా పరిశీలిస్తారు. కోడిపుంజువు నువ్వు. నీ మీద పందెం కాశాడు వాడు. అదృష్టం బాగుండి నువ్వు గెలిచేవు. ఎంత కృషి చేస్తే నువ్వు గెలిచేవో తెలుసుకుని వాడు అనందించేడు. దురదృష్టం కొద్దీ నువ్వు ఓడిపోయి వుంటే నువ్వొక్కడివి దుఃఖిస్తావేమో గాని వాడు మాత్రం నీ ఓటమికి కారణాలు వెతికే పాఠం చదివి, అప్పుడు గూడా ఆనందిస్తాడు. ఆశ్చర్యపడకు. వాడు కేవలం రాజకీయ వాతావరణం ఎప్పుడెలా పరిణమిస్తుందో పరిశీలించే మనిషే గాని నీ గెలుపు ఓటములతో ముడి వేసుకున్న పూల్ కాడు. నువ్వు కాకపోతే మరో నారాయణరావ్! ఎవడైతే వాడికేం? ఒకణ్ణి అక్కడ నించోబెట్టి తద్వారా జరిగే తంతంగం యావత్తూ గమనించి, పట్టులేవో నేర్చుకుని ముందు ముందు బాగుపడే మేధావివాడు. ఇప్పుడంతా అర్ధమేందనుకుంటాను?"
    చిరంజీవి అయోమయంగా తలూపాడు.
    "కీలెరిగి వాతపెట్టడం నువ్వూ నేర్చుకోవాలి చిరంజీవి. కనక, నెమ్మదిగా సీతాపతిని దూరం చేయడం ప్రారంభించు ...... వెర్రి మొహంతో బెంగపడకు , నేను చెప్పింది తు.చ తప్పకుండా చేయి. ఎలాగోలాగు వాడితో మాటా మాటా తెచ్చుకో. అందుకోసం వాడిని నువ్వు చెడ్దనకు. నీతో తిరిగే మనుషుల్తో చెడ్డనిపించు. ఎవడు వాడూ? ఓడిపోయిందేవడూ?" అని అగేరాయన.
    "సుబ్బారావు నాన్నా!"
    "రైట్ ...... ఆ సుబ్బారావుని ముందు మంచి చేసుకో. నీ పుట్టిన రోజుకి అతన్ని తప్పకుండా పిలు. రానంటే వాడి కాళ్ళ మీదైనా పడు. తప్పులేదు. వాడిముందు నువ్వు మంచిగా నటించు, ఆ తర్వాత సరిగ్గా వాదిచేతనే సీతాపతిని చెడ్డనిపించు. అక్కడితో సీతాపతి ఆటకట్టు."
    చెప్పవలసిందంతా పూర్తిగా చెప్పి కొడుకు వేపు వాత్సల్యంగా చూసేరు రామదాసు.
    "థాంక్స్ నాన్నా! నువ్వు చెప్పినట్టే చేస్తాను," అన్నాడు చిరంజీవి ఆనందంగా.
    "ప్రస్తుతానికి నేను చెప్పింది నువ్వు చేస్తే, ఆ తర్వాత నువ్వు చెప్పింది మంది చేస్తారు. కాలేజీకి టైమైంది కాబోలు నా కారు తీసుకు వెళ్ళు. కారులో సుబ్బారావు నేక్కించుకో. మరిచిపోకు. వెళ్ళింక" అన్నారాయన.
    చిరంజీవి అతి సంతోషంగా బయటికి వచ్చి "వెంకటస్వామీ ...... కారు తీసుకురా !" అన్నాడు.
    మరో నిముషంలో చినబాబు ముందు అందమైన కారొచ్చి ఆగింది.

                                 7


    పదహారో తారీఖున సొంతకారులో చిరంజీవి ఒక్కడూ సుమతి వాళ్ళింటికి వెళ్లాడు. ఆవేళకి సుమతి తయారై ఎక్కడికో వెళ్ళబోయేది కారునీ, అందులో చిరంజీవినీ చూసి గుమ్మం దగ్గిరే ఆగి పోయింది.
    "రండి!" అంది, ఎంతో ఆప్యాయంగా , మరెంతో అందంగా.
    చిరంజీవి కారు దిగి ఠీవిగా, హుందాగా యింట్లోకి వెళ్ళేడు. సోఫాలో దర్జాగా కూచున్నాడు. అతని ముందు మరో పేము కుర్చీలో పొందిగ్గా కూచుంది సుమతి.
    "చాలా అవసరమైన పని మీదోచ్చేను సుమతీ!"
    'చెప్పండి!"
    "రేపు నేను పుట్టింరోజు. రేపు సాయంత్రం మనవాళ్ళందరికీ  చిన్న పార్టీ యిస్తున్నాను. మీరు మాత్రం తాప్పకుండా రావాలి."
    'చాలా సంతోషమండి. తప్పకుండా వస్తాను."
    "లోపల అమ్మగారు లేరా?"
    "లేరు. ఏదో పని మీద బయటకు వెళ్ళింది."
    "వారిగ్గూడా చెప్పి పోదామని వచ్చేను."
    "ఫర్లేదు లెండి, నేను చెబుతాను."
    "వారిని గూడా రమ్మని చెప్పండి."
    "ఎక్కడికి? రేపు పార్టీ కెనా?"
    'అవును . మీరిద్దరూ కలిసే రండి."
    "అమ్మ రాదులెండి. నాన్నగారు పొయిం తర్వాత అమ్మ ఏ ఫంక్షను కూ వెళ్ళడం లేదు. అసలు, అమ్మ ఇల్లు కదలడం అరుదు. అందుచేత అమ్మ రాదులెండి. అయినా నేనోస్తున్నానుగా ..... ... ఇంక అమ్మెందుకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS