Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 21

 

    "వెధవ పోలిక ," అన్నాడు సత్యం.
    "తప్పుడు పని చేయబోతున్నాం . మంచి పోలిక లేలా నోటి కొస్తాయి? రవిగారూ! ఆ దినుసుల్నింక దాచకండి. లేచినవాళ్ళు ఎల్లాగో లేచారు గనక తలుపులు జాగ్రత్తగా బిగించండి. మద్యపాన మ్మీద ప్రభుత్వాధికారులకి వొళ్ళు మండి పోతుందిట! మన జాగ్రత్తలో మనం వుండాలిగా!" అన్నాడు సీతాపతి.
    "మరేం ఫర్లేదు. మీ మావ పరపతి బతికుండగా మనల్నెవరూ ఏం చేయలేరు. ఏదో చేయడానికి వాళ్ళకి దమ్ములు ఉండొద్దూ," అన్నాడు సత్యం.
    "పైగా రామదాసుగారబ్బాయి చిరంజీవిగారూ ఉన్నారు. ఇంకా భయమేవిటి? అన్నట్టు మందు మీద నిషేధం త్వరలో తొలగించబోతున్నారని విన్నాం కష్టకాలం తొలిగి వడ్డున పడితే ఈ తలుపులూ గోల్లెలూ గదులూ వీటవసరం గాల్లో వదిలెయవచ్చు. అంటూనే తలుపులు మూసి వచ్చేడు రవి.
    సోడాలు తెచ్చిన కుర్రాడు ఒక మూలని ఒదిగి కూచుని సోడాలు కొట్టడం ప్రారంభించేడు. గ్లాసుల్లో మెరుస్తున్న మందుకి సోడా జత చేసి, ఆ గ్లాసుల్ని పొందిగ్గా మిత్రులందరికీ పంచేడు వాడు.
    గ్లాసులు ఎత్తి పట్టుకున్నారు మిత్రులు.
    చిరంజీవితో పాటు మనల్నందర్నీ వరించిన 'విక్టరీ' నిమిత్తం ........" అన్నాడు సీతాపతి.
    అందరూ గొంతులు తడుపుకున్నారు.
    తడి పార్టీ వెక్కించింది. మూడు రౌండ్స్ పూర్తయ్యాయి. మిత్రులప్పుడే జోగిపోడం ప్రారంభించేరు. సత్యానికి తల తొందరగా దిమ్మెక్కింది. అతి ప్రయత్నం మీద తనన్నాడు.
    "మాటా మంచీ లేకుండా మందు కొట్టడం నా కిష్టం లేదు.  మనలో ఎవరైనా మాట్లాడాలి.
    సీతాపతి గుర్రం గూడా వడిగానే పరుగెత్తడం ప్రారంభించింది.
    "నీ ప్రతిపాదన బాగుందిరా సత్యం! ఎవడో ఎందుకు? నేను ........ నేనే మాటాడతాను. అంతా శ్రద్దగా వినండి. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ మహత్తరమైన , కళాత్మకమైన పార్టీ ఒకే ఒక లోటు వల్ల వెలితిగా తయారయ్యింది. అది మీరు గమనించేరో లేదో గాని ........ ఆలోటు వల్ల యింత రసవత్తరమైన పార్టీకి బ్రహ్మాండంగా ముసురు పట్టింది," అన్నాడతను.
    "ఆ లోటేవిటో గూడా నువ్వే చెప్పు, " అన్నాడు చిరంజీవి.
    "సెక్సు . సెక్సురా సన్యాసి ! సెక్స్ లేదిక్కడ . మందుకీ సెక్స్ కీ గొప్ప కాంబినేషను తెలుసా ? ఇప్పుడిక్కడ మందుంది గాని సెక్స్ లేదు. గనుక బోర్ గా వుంది, " అన్నాడు సీతాపతి.
    "మీ ఉద్దేశం?" రవి వెంటనే అడిగేడు.
    "చెబుతా , విపులీకరిస్తాను మహాశయా! మరో రౌండ్ పూర్తీ కానివ్వండి. ఒరేయ్ సోడాల కుర్రాడూ! నీ సోడాలకో దండం గాని, సోడా కలపకుండా మా అంతరికీ ఉత్త మందు మాత్రం వడ్డించు!"
    సోడాల కుర్రాడు ఆ ప్రకారం తూ.చ. తప్పకుండా చేసేడు. ఈ తడవ మిత్రులు 'రౌండు' బిగించేరు.
    "పుచ్చుకోండి ఫ్రెండ్స్ ! పుచ్చుకుని నా సెక్సుపన్యాసం వినండి. ఈ సెక్సుంది చూసేరూ ....... దీనికి గొప్ప పవరుంది. దీని పేరు సుమతి," అన్నాడు సీతాపతి.
    సత్యం ఖంగారు పడిపోయేడు. వెంటనే అరిచేడు.
    "ఒరేయ్ .....సీతాపతి! కళ్ళు పేలిపోతాయ్ . సుమతి నా సిస్టర్రా! కారు కూతలు కూయకు ."
    "కారు కూత లోద్దంటే లారీ కూతలు కూస్తాను. నా దగ్గిర అన్ని రకాల కూతలూ ఉన్నాయి. సిస్టరట! సిస్టరు! నోర్మూసుకోరా సత్తెం! అనవసరంగా కలగజేసుకో మాకు. నేను మంచి వెధవని కాను...... అయిపోయిందా? ....ఆ సుమతి మనందర్తో పాటు చిరంజీవిగాడికి ప్రచారం చేసిందా పాపం! ఇప్పుడా అమ్మాయి నొదిలేసి మనమిక్కడ మందు కొట్టడం బాగుందా? తప్పు గదూ. తప్పే గదరా సత్తెం? తప్పే గదూ?" అన్నాడు సీతాపతి.
    "సిస్టరు మందు కొట్టదురా, అది ఆడపిల్ల!"
    "అదేనోయ్ నా బాధ, ఆడపిల్ల మందు కొట్టకపోవడం గురించే మాటాడబోతున్నాను. పైగా .......పేరు చూడు సుమతిట! సుమతి? ఆ పేరంటేనే నాకు వళ్ళు మంట. ఆ పేరుతొ బోర్డు కట్టుకుంది గనకనే మందు కొట్టడం లేదు. సుమతేమిట్రా బొత్తిగా .......పాడు పనులు చేయడానికి కుమతి అని పేరు మార్చేస్తే పోలా?"
    "సీతాపతి! అన్యాయంగా మాట్లాడకు. టాపిక్ మార్చేయ్," అన్నాడు సత్యం.
    "నో ......నేను మార్చను. అయినా నేనెందుకు టాపిక్ మార్చాలి? చెప్పండ్రా మిత్రులూ! టాపిక్ ని నేనెందుకు మార్చాలీ అంటున్నాను? బెల్లం కొట్టిన రాళ్ళు కారుగా మీరు! మనుషులు బ్లడ్ అండ్ ఫష్ గాళ్ళు పైగా మందు మీడున్నాం మనం. కొన్ని నిజాలు మనమిక్కడ మాటాడక తప్పదు. సత్తేమురేయ్! మీ కుమతి వుంది చూసేవూ..... ఆ అమ్మాయ్ పెద్ద యాక్టర్రా సన్నాసీ! ఆ అమ్మాయ్ ని మొన్నీ మధ్య యిదిగో ఈ రూమ్ దగ్గిరే చూశాం. ఎందుకొచ్చావ్ సుమతీ అంటే వొటడగడానికొచ్చాను కొడుకులు అంది. అందా లేదా" అంది! అది పచ్చి గేసంటాను. వోటు మాటతో మనందరి కళ్ళల్లో కారం కొట్టిందని గూడా అంటాను. ఏమిటి? నేనంటున్నది మీ అందరికీ అర్ధమవుతుందా?"
    "కారం కొట్టలేదు. మా సుమతి నిజమే చెప్పింది," అన్నాడు సత్యం.
    "ఎంచక్కగా వెనకేసుకొస్తున్నావురా సత్తెం! మీ కుమతి వర ప్రసాదాన్ని లౌ చేసిందోయ్ లవ్వూ! నీ కది తెలుసా?"
    సీతాపతి కసిగా అడిగేడు.
    "చేసి వుండొచ్చు. అందులో తప్పేమిటి?"
    "తప్పా! తప్పున్నరా?" వర ప్రసాదం ఎవడ్రా? అప్టారుల్ గాడు. గాలిగాడు, వాడినా మీసిస్టరు లౌ చేస్తే? నేనూరుకోను," అన్నాడు సీతాపతి.
    "కాదనేందుకు నువ్వెవడివి? వర ప్రసాదం కాపోతే మరో జిడ్డు గాడు. దానిష్టం. అదేవ్వరినైనా లౌ చేస్తుంది," అన్నాడు సత్యం.
    "ఇప్పుడు వర ప్రసాదం సంగతెందుకు?" వోదిలేయండతన్ని. వర ప్రసాదం కాకుండా మీ యిష్టమొచ్చిన వాళ్ళ గురించి చెప్పండి వింటాం," అన్నాడు రవి.
    "ఏమిటో విశేషం! ఓహో అతను మీ రూమ్మేటనా? హబ్బబ్బ! ఎంత స్వార్ధమండి బాబు?" అన్నాడు సీతాపతి.
    "అయినా పేర్లెందుకు గాని .....సెక్సు గురించి మాటాడతానన్నావ్ ........బాగుంది మాటాడు, "సర్ది చెప్పేడు చిరంజీవి.
    "సెక్సుకి పేర్లవసరంరా జీవీ! పే రెట్టకపొతే ఉత్సాహం రాదు." అన్నాడు దిగులుగా సీతాపతి.
    'అయితే వద్దులే. టాపిక్ మార్చు, " మొహం ముడుచుకుంటూ అన్నాడు చిరంజీవి.
    అప్పుడు -
    సరిగ్గా అప్పుడే సీతాపతి దృష్టి గోడమీదున్న ఫోటో వేపు నిలిచింది.
    "రైట్ .......పేరేట్టకుండానే మాటాడుతాను. అదిగో అంతా చూడండి. నువ్వు గూడా చూడ్రా సోడాల సన్నాసీ! ఆ గోడ మీద ఆ అందమైన ఫోటో వేపు చూడండి. ఈ నాటి తారమాణుల్నందర్నీ తలదన్నె ఆ బొమ్మని చూడండి. ఆ బొమ్మ గురించి నేనూ తెల్లవార్లూ మాటాడగలను." అన్నాడు సీతాపతి ఉత్సాహంగా.
    'అలా అన్నావ్ బాగుంది. నేను పడుకుని వింటాను. నువ్వు మాటాడిందై పొయిం తర్వాత నన్ను లేపు, " అన్నాడు సత్యం పరుపు మీద చోటు చేసుకుని నడుం వాల్చుతూ.
    'అవున్రా పతీ! ఆ బొమ్మ అందంగానే వుంది మాటాడయితే," అన్నాడు చిరంజీవి గుటకలు మింగుతూ.
    'ఆగండి!" అన్నాడు రవి.
    అంతా అతనివేపు భయంభయంగా చూశారు. నడుం వాల్చిన సత్యం, లేచి కూర్చుని బెదురుతూ అడిగేడు.
    'ఆ బొమ్మ మీ సిస్టరు గురూ గారూ?"
    "నా సిస్టరు కాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS