వరప్రసాదం నిజం చెప్పేడు.
"మా కాలేజీలో సుమతి అనే ఆడపిల్లుంది. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు ఉత్తరం రాసింది. నేను ప్రేమించడం లేదని చెప్పాను. ఆ అమ్మాయికి అభిమానం దెబ్బతినే వుంటుంది. మాటల మధ్య నీ పేరు వచ్చింది. అప్పుడు, సుమతి నీగురించి తిక్కగా మాటాడింది. నాక్కోపం వచ్చినమాట నిజమే గాని నేనేమీ నోరు జారలేదు. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తోచక సంశయించెను."
"నా గురించి అ అమ్మాయి తిక్కగా మాటాడిందా? అవునూ, అసలు నా ప్రసక్తి ఎందుకొచ్చింది?"
"ప్రేమించడం నాకిష్టం లేదన్నాను. ప్రేమించి మా అక్కకి సుఖం లేకుండా పోవడం వల్ల నేనీ రకమైన ప్రేమలకి దూరంగా ఉంటున్నానన్నాను. అంతే నేనేన్నది."
సీత చాలాసేపు మాటాడలేదు. వరప్రసాదం నిశ్శబ్దంగా భోజనం ముగించేడు.
నిద్రపోయేముందు సీత అడిగింది.
"సుమతి నీకు నచ్చిందా వరం?"
"ఆ అమ్మాయికి తొందరెక్కువ."
"ఆడపిల్ల ప్రేమలేఖ రాసిందంటే ఎదటి, మగవాడు తొందర పడలేదని అర్ధమా?"
"నేను వాళ్ళింటికి వెళ్ళి వస్తుండే వాడిని. సుమతి నా నోట్సులు తీసుకుంటూ వుండేది, అంతే."
"నువ్వు ఆ పిల్లతో స్నేహంగా వుండేవాడివే గాని ఆ పిల్లని ప్రేమించలేదంటావ్?"
'అవునంతే."
"స్నేహానికి ప్రేమకి తేడా గమనించలేదు సుమతి."
'అవును"
"ఆడపిల్లతో స్నేహంగా మాటాడినంత మాత్రాన అది ప్రేమెందుకవుతుందనే ఉద్దేశం నీకుంది. చనువుగా మాటాడటమే ప్రేమంటుంది సుమతి. అంతేగదూ?"
వరప్రసాదం అసహనంగా అన్నాడు.
'అక్కా! ఎందుకిన్ని ప్రశ్నలు? నా అత్మసాక్షిగా చెబుతున్నాను. నేనా పిల్లని ప్రేమించలేదు. ప్రేమించడం లేదు."
"నీ ఆత్మ సాక్షి ఎవడిక్కావాలి వరం! ఆత్మ సాక్షిట! బోడి ఆత్మ సాక్షి! ఆ పిల్లతో స్నేహంగా వున్నాను. మరే యితర వాంచలూ నాకు లేవని చెబుతే లోకం నమ్మే స్థితిలో వుందా? నువ్వు నా కంటికి బుద్దిమంతుడివైనంత మాత్రాన లోకానికీ బుద్దిమంతుడివై పోతావా?"
"నాకు లోకంతో పనిలేదక్కా! నువ్వు నన్ను నమ్మితే చాలు!"
"సంతోషం బాబూ! చాలా సంతోషం! నన్నొక ఎత్తునా, లోకాన్నంతనీ ఒక ఎత్తునా వుంచి మాటాడేవ్! నువ్వలా అనడానికీ నేనది వినడానికీ చాలా కమ్మగానే వుంటుంది. కాని బాబూ, వ్యక్తీ పూజ మంచిది కాదు. గుడ్డిగా ఒకర్ని నమ్ముకుని వాళ్ళ కోసం సర్వత్యాగాలూ చేయ పూనుకుంటే యింక నీ వ్యక్తిత్వమెక్కడ" నీ జీవితమంతా నా మెచ్చుకోలుకే వెచ్చిస్తే అవతల నీ బతుకేముంది? నామీద గౌరవ ముంచు. ఆ మాత్రం చాలు. కానీ, నాకోసం నువ్వు కొన్ని పనులు చేయడం, చేయకపోవడం తోటే నీ జీవితమంతా ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో వూహించావా?"
వరప్రసాదం చాలా నెమ్మదిగా తన స్థితిని చెప్ప నారంభించేడు.
"అమ్మ నాన్న ఎల్లా వుంటారో గూడా తెలీదు నాకు. నాకు నువ్వు అమ్మావీ, నాన్నవీ అన్నీను. అందువల్ల తల్లీ, తండ్రీ లేని అభాగ్యుణ్ణి కాలేదు నేను. నీ ఆదరణలో పెరిగి పెద్దవాణ్ణి అయ్యేను. అక్కా, నువ్వే నాకు లేకుండా పొతే, ఇంక నేనెక్కడ బతికి బాగుండే వాడిని?"
అతని కంఠం గద్గదికమైనది. అతనికి అక్కపట్ల వున్న కృతజ్ఞతతో అతని గొంతు పూడుకుపోయింది.
మళ్ళా అతనే అన్నాడు.
"అందుకనే అక్కా, నాకు లోకం నువ్వే అన్నాను. అతి దయనీయమైన బ్రతుకు నాది. కాని, ఆ బ్రతుక్కి అర్ధం చెబుతున్నది నువ్వు. అందుకనే అక్కా, నీ గురించి నా స్నేహితులకి చెప్పుకుంటాను. కష్టంలో, సుఖంలో ----- ఎల్లప్పుడూ నువ్వే నాకు గుర్తు కోస్తుంటావు......... నా స్నేహితులందరికీ తల్లీ దండ్రులున్నారు. ఆ తల్లీ తండ్రుల కధ ఎక్కడా ఒక్కటే. ఆ కధల్లో నాకు కొత్తదనం గానీ, వింత గానీ, కనిపించదు. నా కధ మాత్రం వేరు. నేనాడు, సుమతితో నువ్వు దేవత నన్నాను. అక్కలను దేవతలనే తమ్ముళ్ళు బహుశా సుమతికి తెలీదు. తెలిసినా ఆ దేవతలు అతి మామూలు స్త్రీలని యెంచుకున్నది కాబోలు, అందుకే నిన్ను ఎగతాళి చేయ ప్రయత్నించింది."
సీతక్క మరేమీ మాటాడలేదు. దుప్పటి మొహమ్మీదికి లాక్కుంది.
"ఆ ఉదయం వరప్రసాదానికి తలంటింది సీత.
కొత్త బట్టలు తొడుక్కుని సీతకి నమస్కారం చేశాడు ప్రసాదం. సీత ప్రసాదాన్నిఏమని ఆశీర్వదించిందో తెలీదు గానీ, ఆమె కళ్ళ నిండా నీళ్ళు నిండుకోవడం చూశాడు ప్రసాదం ......
"అక్కా .......ఇవేళ నా పుట్టినరోజు. నన్ను దీవించడం మరిచి కన్నీరు పెట్టుకుంటున్నావ్. నీ మనసు కష్టం కలిగించెను కాబోలు. దీవించకపోయినా క్షమించు!" అన్నాడతను.
"నీ ప్రవర్తనే నీకు రక్షణరా వరం! ఇంక నా దీవెనలు ప్రత్యేకించి ఎందుకు? కన్నీ రంటావా? కారణాలు చాలా వున్నాయి. అవిప్పుడు అప్రస్తుతం " అన్నదామె.
6
చిరంజీవి, కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా అధిక వోట్ల మెజారిటీ బలంతో ఎన్నికయాడు. తిమ్మాపురం తాలుకూ ముఖ్యమైన వీధుల్లో ఊరేగింపు పూర్తయిం తర్వాత రవీ వాళ్ళ గదిలో ఏర్పాటు చేసుకున్నతడి పార్టీకి హాజరయ్యేరు సీతాపతీ, సత్యం, చిరంజీవితో.
రవీ వాళ్ళ గదిలో రవి ఒక్కడే వున్నాడు.
అతను గదిని తుడిపించి, అందంగా అలంకరించి స్నేహితులోచ్చే వేళకి ఎదురెళ్ళి సాదరంగా ఆహ్వానించేడు.
"కంగ్రాట్స్ చిరంజీవిగారూ! సాధించేరు!" అన్నాడు రవి.
చిరంజీవి తన మొహాన్న యింత వెలుతురు నింపుకుని.
"నా విజయంలో మీ సహాయం ఎంతైనా వుంది. కృతజ్ఞుణ్ణి " అన్నాడు ఇంగ్లీషులో.
'అంటే ఏమిటి? ఈ గెలుపు చిరంజీవి ఒక్కడిదీ గాదు. మనందరిదీను. కనుకనే విజయం సాధించిన మనమంతా యిక్కడ రవిగారి గదిలో పండగ చేసుకునే నిమిత్తం హాజరయ్యేం," అన్నాడు సీతాపతి.
'ఇంక నేను నించోలేను. ఇంతవరకూ ఊరు ఊరంతా తిరిగి నా కాళ్ళు పడిపోయేయి. తిరుగుతున్నప్పుడు తెలిసింది కాదుగా నోరేయ్..... యిప్పుడు దుంప తెంచేస్తోంది. కాళ్ళ నొప్పి. అయ్యా రవిగారూ! నా సీటెక్కడో చెప్పండి, వెళ్ళి అక్కడ చతికిల పడతాను ," అన్నాడు సత్యం.
ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు.
నవ్వుకుంటూనే గదిలోకి చేరుకున్నారు.
గదిలో పంకా వుంది. రెండు పరుపులు కలిపి కిందపరిచేరు. ఆ పరుపుల మీద తేల్లటి దుప్పటి ముచ్చటగా వుంది. అగరొత్తులు, ఖరీదువేమో, గొప్ప పరిమళాన్ని గదంతా నింపేసేయి. ఇన్ని హంగులు దర్జాగా వుండటవే గాకుండా -----అలిసిన వాళ్ళ వంటికీ , మనసుకీ హాయిని కలిగిస్తున్నాయి.
నలుగురు మిత్రులూ పరుపుల మీద చతికిల పడి వళ్ళు విరుచుకుంటూ హాయ్ హాయ్ అనుకున్నారు. అప్పటికి రాత్రి ఎనిమిది దాటింది.......
"దుష్ట చతుష్టయం," అన్నాడు సీతాపతి.
