Previous Page Next Page 
వారధి పేజి 19


    గదిలో  ఉన్నా, బయట ఉన్నా  అతన్ని  విడవకుండా  ఊదరపెట్టడం మొదలు పెట్టేరు తోడిపిల్లలు. భోజనాల గదిలో  నానా రభసా  చేసి తిండి సరిగా  తిననిచ్చేవారు కారు. ఆ అల్లరి భరించలేక  అర్ధాకలితో  లేచి  వచ్చేసేవాడు రాజు. ఒక్కొక్కసారి  భోజనానికి  పోకుండా  గదిలో  తలుపులు  మూసుకొని  ఉండిపోయేవాడు. ఆ పిల్లల  ఆగడాలు  భరించడంకన్న  ఆకలితో  ఉండడమే  నయమనిపించేది  రాజుకి.

    అందువల్ల  అతనికి  శాంతి  దక్కితే  అదృష్టమే. దానిని  నాశనం చెయ్యడానికి  ఇంకో రకమైన  కార్యక్రమం ఏర్పాటయేది. ఒక చిన్న  డబ్బా డొక్కు  పట్టుకొని  వాయించుకొంటూ  పదిమంది  పిల్లలు గది ముందు తయారయేవారు.

    "మంత్రీ! ఈ రోజు  వరదరాజులుంవారు  భోజనానికి  వేంచేయలేదు. పాపం, అనారోగ్యంతో  బాధపడుతున్నారేమో _ ఆస్థాన  వైద్యుడికి వర్తమానం పంపు" అనేవాడు  ఒకడు, నాటక ఫక్కీలో.

    "అదికాదు, మాహాప్రభూ! వారికి ఇంటిమీద  ధ్యాస  పుట్టి  బెంగటిల్లి ఉన్నారట. ఇప్పుడే మన చారుడు  వర్తమానం తెచ్చి  ఉన్నాడు" అనేవాడు  ఇంకొకడు.

    "మహారాజా! ఇదంతా  మంత్రిగారి  కల్పన. అసలు విషయం  నన్ను మనవి చెయ్యనీయండి. వరదరాజుంవారి  నాయనమ్మగారు  స్వర్గవాసానికి  ప్రయాణం  సాగించే  ముందు 'నాయనా, వరదం' అని  చేర బిలిచి 'అమావాస్యనాడు  అన్నం  తినకూడదురా' అని  మంత్రోపదేశం  చేసేరట."

    "కాని, వయస్యా, ఈ రోజు  అమావాస్య  కాదే! ఆకాశం మీద చంద్రుడు  కనిపిస్తున్నాడే...."

    "సూర్యాస్తమయానికి  పూర్వమే  గది తలుపులు  బిగించుకొన్న  వరదరాజులుంవారు  చంద్రోదయాన్ని  చూసి ఉండరు, స్వామీ!"

    ఇలా  అంతులేని  విధంగా  అపహాస్యం  చేస్తూ  గోల  చేసేవారు.

    హాస్టల్లో  ఈ విధంగా  యాతన  పొందుతూండే  వరదరాజు  కాలేజీలో  ఎదుర్కోవలసిన  బాధలు  ఇంకోవిధంగా   ఉండేది. వరదరాజు కాలేజీలో చేరిన  మూడవనాడే  అతడికి  లెక్కల  క్లాసన్నా, లెక్కల  మాస్టారన్నా  హడలు పుట్టే  సంఘటన  జరిగింది.

    రాజుకి లెక్కలు  అభిమాన విషయం. ఒకసారి  వాటిలో  తలదూరిస్తే  మరి చుట్టుపట్ల  ఏమి జరుగుతున్నదీ తెలుసుకో లేనంతగా  వాటిలో  లీనమయి పోతాడు. ఆ రోజు  ఒక చిక్కులెక్క  చురుకుగా  విడదీస్తున్నాడు వరదరాజు. అంతంత మాత్రంగా  లెక్కల  పుస్తకాలు  తిరగవేసే  వారికి  ఆది అంతుపట్టేదిగా  లేదు. రాజుపక్క  కూర్చున్న  విద్యార్ధి ఇతని  ఏకాగ్రతను  పాడుచేయడానికి  తన కాలితో  అతని పాదానికి  ఉన్న  చెప్పు  జోడును  పైకి లాగేడు. రాజు ఆది గ్రహించే  స్థితిలో  లేడు. తన పాదంనుండి  జోడు జారిపోయిందని  మాత్రం  తెలుసుకొన్నాడు. చేస్తున్న  లెక్క  పూర్తి  అయేక తీసుకోవచ్చని  ఊరుకొన్నాడు.

    ముందు బెంచి  విద్యార్ధి  ఆ జోడును  మరి కాస్త  ముందుకి  తన్నేడు. ఒకరిద్దరు  అలా చేసేసరికి  ఆది పిల్లలమధ్య  ఆటగా  పరిణమించింది. ఇంకా  ముందుకి, ఇంకా  ముందుకి  పోతూ  చివరకి  డెస్కుకిందగా  ఉన్న  టీచరు కాళ్ళకి  తగిలింది. 

    "ఎవరిదీ  చెప్పుజోడు?" తన చేతికర్రతో  పైకెత్తి  చూపిస్తూ  అడిగేడు  టీచరు.

    అతడి కళ్ళు  అవమానంతో  ఎర్రగా  మండుతున్నాయి. ఆ మంటలో  కరిగిన  ఉక్కు  ద్రవంలా  వచ్చింది  ఆ మాట. యుద్ధ సమయంలో  సైరనుధ్వని  విన్న  పట్నంలా  క్లాసంతా  క్షణకాలం  నిశ్శబ్దంగా  ఉండి పోయింది.

    "ఎవరిదంటే  మాట్లాడరేం?" ఈసారి ఆ ఉక్కు  ద్రవరూపం  విడిచి ఘనీభవించడం  మొదలయింది.

    "నాదికాదు, సార్!" ముందు వరసలో  కూర్చున్న  ఒక పిల్లాడు అన్న మాట  క్లాసంతా  అల్లుకుపోయింది.

    అందరితోపాటు  తనూ 'నాదికాదు.సార్' అనబోయిన వరదరాజుకి, అంతలో  ఏదో  గుర్తుకి రాగా, బెంచీకింద  ఉండవలసిన  తన రెండో  జోడు కోసం  చూసుకొన్నాడు. ఆది టీచరు చేతికర్రని  అలంకరించి  ఉంది.

    "నాదే సార్!" అన్నాడు వణుకుతున్న  కంఠంతో.

    "ఇది తీసుకొని  ముందు  బయటికి  నడువు. తిరిగి నేను  చెప్పేవరకు  నా క్లాసుకి  రాకు." నల్లని  ఉక్కుకడ్డీలా  వచ్చిన  ఆ మాట  వరదరాజు  గుండెలో బలంగా  గుచ్చుకొంది.

    తనకి  అత్యంత  ప్రీతిపాత్రమైన  లెక్కల  క్లాసునుండి  బహిష్కరణ. లెక్కల టీచరు దృష్టిలో  దోషిగా  నిలవడం  వరదరాజుకి  సామాన్యమైన  విషయాలు కావు. కళ్ళనీళ్ళు  ఆపుకొంటూ  ధైర్యాన్ని  కూడగట్టుకొని  తన నిర్దోషిత్వాన్ని  తెలియజేసేందుకు  ప్రయత్నం  చేసేడు.

    "ముందు  నా మాటప్రకారం  బయటికి  నడువు. ఇప్పుడు నేనేమీ  వినదలుచుకో లేదు" అంటూ  గర్జించేడు  లెక్కల టీచరు.

    నిండు క్లాసులో  దోషిగా  తను చేయని  తప్పుకి  తలవంచుకొని  బయటికి నడిచేడు రాజు.

    లెక్కల క్లాసులో  జరిగిన  ఈ అలజడి  అంతలోనే  హాస్టలు  ఆవరణలోకి  పాకిపోయింది. వరదరాజు వంచిన తలతో  తన గదికి తిరిగి వచ్చేసరికి  గది ముందు రెండు వరసలు  దీరి  పదిమంది  పిల్లలు  నిలబడి వున్నారు.

    "టీచరుమీదికి  చెప్పులు  విసిరే  హీరోగారికి జై !" అంటూ  ఒకడు మొదలుపెట్టగానే "వీరాధి వీరుడికి  జై!" అంటూ  అంతా గొంతులు  కలిపి సమూహ గానంలా పాడసాగేరు.

    ఆ రాత్రి పక్కమీద  పడి తలగడ తడిసిపోయేటట్లు  ఏడ్చేడు  వరదరాజు. ఆ రోజు శనివారం, మరునాడు ఆదివారం. ఆదివారం నాడు  అన్నయ్య వస్తాడు. తనకీ చదువు వద్దని అన్నయ్యతో  చెప్పివేస్తాడు. తను  ఈ హాస్టల్లో ఉంటే తిండి లేక  చచ్చిపోతాడని  అన్నయ్యకి అర్ధమయ్యేలా  నచ్చజెబుతాడు. అన్నయ్య  తనని  ఇంటికి  పిలుచుకుపోతాడు. 'పోనీలే, రాజూ! ఈ వెధవ చదువు  రాకపోతేనేం? హాయిగా  మన ఊళ్ళోనే  ఉండు. ఇద్దరం  ఆ పొలం పని చూసుకొందాం. లేకపోతే  రామప్పంతులు  వీధిబడిలో  పాఠాలు  చెప్పుదువుగాని' అంటాడు. అక్కడితో  తనకీ  ఈ పీడ  వదిలిపోతుంది. ఈ కోతులమేళం  బాధ తీరిపోతుంది. వీళ్ళెంత బాధించినా  ఇంక ఒక్క రోజు _ అని మనసుకి  సమాధానం చెప్పుకొని  తన్ను తాను  ఓదార్చుకొన్నాడు  రాజు.

                         *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS