తిమ్మాపురానికి సిరిపల్లె ఇరవై మైళ్ళ దూరంలో వున్న పల్లెటూరు. ఆ పల్లెటూల్లోనే వర ప్రసాదం అక్క టీచరమ్మ చేస్తోంది.
అక్క పేరు సీతమ్మ. వయసు దాదాపు నాలుగుపదులు. అక్కయ్య కళ్ళు అస్తమానమూ మెరుస్తూ వుండవు. ఒక్క వరప్రసాదాన్ని చూసిన క్షణం మాత్రం ఆ కళ్ళల్లో వెయ్యి దీపాలు వెలిగే మాట నిజం.
"ఇవాళ మధ్యాహ్నమే వస్తావనుకున్నాన్రా వరం! ఇంతాలస్యం చేసేవేం?"
"కాలేజీలో ఎన్నికలక్కా!"
"నువ్వేమైనా పోటీ చేశావా?"
"నేనా? బలేదానివి. అందుకు నేను పనికి రాను."
ఆ మాట వినీ వినడంతోటే అక్క మనస్సు చివుక్కుమన్నది. ఈ వరప్రసాదం 'పనికి రాని" ఎన్నికలూ .....ఒక ఎన్నికలే .....అనుకుందామె! అందుచేతనే నొచ్చుకుంటూ అన్నది.
"అదేం మాటరా వరం?"
'అవునే అక్కా! ఆ పోటీ చేయడానికి కొన్ని అర్హత లుండాలి."
'అర్హతలా? ఏవిట్రా ఆ అర్హతలు?"
"కాలేజీలో పలుకుబడి , చేతినిండా డబ్బు - చుట్టుతా స్నేహితులూ కావాలి."
అక్క వెంటనే మాటాడలేదు. క్షణమాగి అడిగింది.
'అంటే, నీకివేమీ లేవంటావు . అంతేనా?"
"కాలేజీలో నా పలుకుబడి సంగతెలా వున్నా, నాకు ఎక్కువగా స్నేహితులు లేరు. నాకున్న ఒకరిద్దరు మిత్రులు నాలాగే ఒంటరి పక్షులు. పోటీలో ఎన్నికవ్వాలంటే పెద్ద ఎత్తున ప్రచారం కావాలి. ప్రచారానికి మనుషులుండాలి. నాకున్న ఒకరిద్దరు మిత్రులు ఈ ప్రచారానికి చాలదు. అందుచేత మరి కొంతమందిని దగ్గిరకు తీసుకోవాలి. మిత్రులు కాని వాళ్ళు దగ్గిర చేరాలంటే డబ్బు కావాలి. డబ్బుతో స్నేహితుల్ని కొనుక్కోడమంటే చిరాకు. అధవా, కొనుక్కుందామనుకున్నా నా దగ్గిరా డబ్బు లేదు. ఆ డబ్బు నెలగోలా సంపాయించి మనుషుల్ని కొనుక్కొన్నా మనసుకి శాంతి వుండదు. ఎన్నో సమస్యలోచ్చి పడతాయి. నిశ్చింతగా బతికే ప్రాణానికిన్ని కష్టాలెందుకు చెప్పు. అంచుచేత ఆ రొంపిలో దిగలేదు."
"అవున్లేరా వరం! అందని ద్రాక్షపళ్ళు చేదుగానే వుంటాయట కదూ" అన్నది సీతక్క ముసిముసిగా నవ్వేస్తూ.
వరప్రసాదం సిగ్గుపడ్డాడు.
"నీతో మాటాడలేనే అక్కా! ఏం మాటాడినా చిక్కుల్లో పెట్టేస్తావు. దురదృష్టం కొద్దీ నువ్వు టీచరవయ్యేవు గాని - దేవుడు తిన్నగా చూచి వుంటే లాయరు వయ్యేదానివి!"
దేవుడి మాటవిని సీత ఉలిక్కిపడింది. చాలా చిత్రంగా మారిపోయి అన్నది ---
"వృత్తి దానాని క్కూడా దేవుడ్ని పిలవకురా వరం! ప్రతి చిన్న విషయానికి దేవుడ్ని పిలుస్తే, అతడు మాత్రమేం చేయగలడు? సరే ముచ్చట కేమొచ్చేగాని ముందు స్నానం ముగించు నీ కిష్టమని చెప్పి వంకాయ స్పెషల్ చేసెను. ఫస్టుగా కుదిరిందనుకో. గడ్డ పెరుగు ముచ్చటగా వుంది. స్నానం ముగించి వస్తివా, పదినిమిషాల్లో సిద్దం చేస్తాను."
వరప్రసాదం కంచంలో కమ్మని వంటకాలను వడ్డించి అతని ముందామే కూచుని ఖబుర్లు చెబుతోంది. వరప్రసాదం ఆ ఖబుర్లను నంజుకుంటూ భోజనం చేస్తున్నాడు.
"ఈ బి.ఏ సలక్షణంగా పూర్తీ చేస్తివా, ఆ తరువాత లా చదువుకోవచ్చు. ఒక్క రెండేళ్ళు, రెండేళ్లంటే ఎంతని...... కళ్ళు మూసుకుంటే యిట్టే గడుస్తాయి. ఆపైన - నీకు నచ్చిన పిల్లని పెళ్లాడి ....."
'ఇప్పుడప్పుడే అవేం పెట్టకే బాబూ!"
సీతక్క వరప్రసాదం అమాయకత్వానికి హాయిగా నవ్వుకుంది.
"ఓరి పిచ్చీ! ఇప్పుడన్నానేవిట్రా? ఎప్పుడో రెండేళ్ళమాట గదా!"
"నువ్వే అంటివి గదా, రెండేళ్లంటే ఎంత కళ్ళు మూసుకుంటే యిట్టే గడుస్తాయని......"
"చాల్లే ........బడాయి .......మాటకి మాట చెప్పడం నేర్చుకున్నావు ....... ఉండు ...... కొంచెం నేయి వడ్డించనీ .....మొన్నా మధ్య శరభయ్య గరోచ్చేరు .....తెలీనట్టు నా మొహం వేపు చూస్తావేమిరా? - నీకు అక్షరాధ్యాసం చేసేరు చూడూ - బట్టతలాయన ......ఊ ........వారే!"
"ఎందుకొచ్చారు?"
"ఎందుకేవిట్రా బడుద్దాయ్! పెళ్ళీడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో వున్నదంటే మనసు కెంత చిరాకో తెలుసా ? నీకాలేజీ ఎన్నికల కంటే గొప్ప చిరాకన్నమాట........ అదేం తినడంరా ......ఈ పోపు కొంచెం వద్దించుకో ......."
'చాల్లేవే బాబూ! నేనింక తినలేను ."
"ఫర్లేదు . వడ్డించుకో ........ఆ శరభయ్య గారికి మనింటో వున్న బంగారు బాబు గుర్తుకొచ్చేట్ట. రెక్కలు కట్టుకు వాలేరు. నిన్నూ నన్నూ మంచి చేసుకోవాలని కాదు గాని, ఇప్పటి కొచ్చి గూడా నిన్నింకా బంగారు బాబూ! అనే పిలుస్తారాయన !"
"అవునవును ..... ఆయనే మో బంగారు బాబు అని నన్ను పిలవగానే, ఇక్కడ అక్కగారేమో ఉబ్బితబ్బిబ్బై బంగారు బాబుకి నేను చెబుతాన్లెండి అని హామీ యిచ్చి వుంటుంది. అవునా ?"
"ఏం? హామీ యివ్వకూడదేవిట్రా?"
"కాని, ఇంత త్వరలో పెళ్ళి చేసుకోవాలని లేదక్కా!"
"రెండేళ్ళుకాపోతే, నాలుగేళ్ళు ఆగమన్నా అగుతారయ్యా!"
"మనకోసం వాళ్ళ నాగమంటే ఏం బావుంటుంది చెప్పు!"
"ఎంతో బాగుంటుంది. ఆ బాగోగులు నాకు వదిలిపెట్టు వరం."
"ఏమిటోనే, నువ్వింత వత్తిడి చేస్తే నేనేం చెప్పలేను గానీ ........"
"తప్పు బాబూ! నేను నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను..... అవున్రా నువ్వేమీ అనుకోనంటే నేనొకటి అడుగుతాను ."
"అడుగు ."
"పెళ్ళి విషయం మాటాడితే యింత కలవరపడుతున్నావు, నువ్వు గాని ఎవర్నైనా ప్రేమించావా?"
వరప్రసాదానికి ఆ క్షణం సుమతి గుర్తుకురాగా అతని మనసు బాధపడ్డది. ఆ బాధ తాలూకు చాయల్ని సాధ్యమైనంతవరకు అక్క దగ్గిర దాచేటందుకు అతను ప్రయత్నించేడు.
సీతకి అతని పరిస్థితి బోధ పడలేదు. ప్రసాదం వేపు నిశితంగా చూస్తో అన్నది.
"నీ యిష్టానికి వ్యతిరేకంగా నేనెన్నడూ ఏ నిర్ణయమూ తీసుకోనురా వరం! పర్లేదు చెప్పు. నేను శరభయ్యగారికి కూడా మాటివ్వలేదు. అయినా ఎవరో ఒక పిల్లని పెళ్ళిచేసుకోవడం, చేసుకోపోవడం అదంతా నీ యిష్టం. నీ యిష్టాన్ని కాదనేందుకు ఎవరికి అధికారం లేదు గదా. చెప్పు- ఎవరికైనా మాటిచ్చేవా!"
అతను లేదన్నట్టు అడ్డంగా తలూపేడు. నోటి పని తల కప్పగించడం సీతమ్మకి నచ్చింది కాదు. అందుచేత కొంచెం ఆవేశంగా మాటాడవలసి వచ్చింది.
"తప్పురా వరం! ఎవరో పిల్లకి మాటిచ్చి, నామీద నీకున్న భయభక్తుల కొద్దీ ఆ పిల్లని దూరం చేసుకోవడం అన్యాయం. నీకేం భయం లేదు. నీ స్వేచ్చకి ఈ సీతమ్మ ఎన్నడూ అడ్డురాదు. ఏం జరిగిందో విపులంగా చెప్పు. తలూపి తప్పుకోవద్దు. ఆడపిల్లల్ని అన్యాయం చేసి బాగుపడిన మగవాడేవ్వడూ లేడు. ఉండడు."
"అక్కా!" అన్నాడతను ఖంగారుగా.
"అందుచేత, న్యాయానికి నువ్వు దూరం కాకూడదు. ఈ సీత కోసం, నన్ను కష్ట పెట్టకూడదనే నీతి కోసం నువ్వు ఎవరో అమ్మాయికి అన్యాయం చేస్తే నేను సహించను. నిజం చెప్పు - నువ్వు ఎవరికైనా మాటిచ్చేవా?"
"లేదు ."
"ఈ మాట చెప్పడాని కెందుకంత తాత్సారం చేశావ్? నేను అడుగుతున్నా దానికి నిర్భయంగా జవాబు చెప్పడం మాని తప్పు చేసినట్టు ఎందుకు తలూపావ్?"
