Previous Page Next Page 
వారధి పేజి 18


    వరదరాజు గుమ్మంలో  నిలబడి ఇటు, అటు  చూసేడు. ఎక్కడా  కాళీ  కుర్చీ  కనిపించలేదు. వరండాలో  ఉన్న  చిన్న  బెంచీమీద  కూర్చున్నాడు. వెళుతున్నవారు  వెళుతూనే  ఉన్నారు __ వస్తున్నవాళ్ళు  వస్తూనే  ఉన్నారు. పక్క బెంచీమీద  కూర్చున్న  వరదరాజు  వంక  ఎవరూ చూడలేదు. చూసిన వారైనా  చూడనట్లే  తమ మాటల్లో  ములిగి నడిచిపోతున్నారు. నిద్ర, బద్ధకం ఇంకా పూర్తిగా  తీరని  వరదరాజు  కూర్చునే  అలా  మరో కునుకు  తీసేడు.

    అతడికి  తిరిగి తెలివివచ్చి  చూసేసరికి  హాలంతా  నిశ్శబ్దంగా ఉంది. ఒకరిద్దరు  బేరర్లుమాత్రం  అటు, ఇటు తిరుగుతున్నారు. మెల్లిగా అడుగులు వేస్తూ  హాలులోకి  నడిచేడు  రాజు. ఒక కుర్చీలో నెమ్మదిగా  కూర్చున్నాడు. విద్యార్ధులు తాగిన  కాఫీకప్పులు, గ్లాసులు తీసుకుపోయేందుకు  వచ్చిన  పనివాడు "ఎవరు నువ్వు?" అన్నాడు వరదరాజును  చూసి.

    "నా పేరు  వరదరాజు" అన్నాడు  రాజు.

    "పేరు కాదు అడుగుత; ఎందుకు  వచ్చేవని?"

    "ఎవర్రా, జోగాన్నా?" హాలుకి  ఆ చివరనుంచి  ఒక  బేరరు కేక వేసేడు.

    "ఎవరో కుర్రాడు" జోగన్న  జవాబు  చెప్పేడు.

    "ఇప్పుడు  దేనికి? ఇంకా  భోజనానికి  టైము  కాలేదు." చేతిలోని  గుడ్డ  భుజంపై  వేసుకొంటూ  ముందుకి  వచ్చేడు  ఆ బేరర్.

    "భోజనం కోసం  కాదు, నేనింకా  ఫలహారం చెయ్యలేదు." కడుపులో ఆకలి ధైర్యాన్ని  పురికొలిపి  వరదరాజు  నోట మాట  పలికించింది.

    "ఎవరు నువ్వు? ఇప్పుడు టిఫినేమిటి! టైమెంతయిందో  తెలుసా?"  
  
    "నేను చాలాసేపయి  వచ్చేను. ఇక్కడ  చోటు  లేకపోతే  బయట కూర్చున్నాను."

    'అడగందీ  అమ్మయినా  పెట్టదంటారు. అటువంటిది  హాస్టల్లో  నువ్వు తిన్నదీ మానిందీ  ఎవరికీ కావాలి? ఒకటి రెండుసార్లు  అడిగి పెట్టించుకొనిమరీ  తినాలి.' వదిన చేసిన  హెచ్చరిక జ్ఞాపకం  వచ్చింది  వరదరాజుకి.

    "బయట కూర్చున్నావా, నిద్దరోతున్నావా? నౌకర్లుకూడా  తినిపోయేక ఇప్పుడు  టిఫినంటూ  వస్తే?...." చీదరింపుగా  అన్నాడు ఆ బేరర్.

    అంతలో  ఒక ముసలి  బేరర్  ఆవైపు  వచ్చేడు.

    "ఏంటిరా, గుర్నాధం?" అని ప్రశ్నించేడు.

    "ఈ పిల్లాడికి  ఇప్పుడు  టిఫిను కావాలిట!" వరదరాజుని  వేలుతో చూపిస్తూ, అన్నాడు గుర్నాధం.

    వరదరాజుకి  అప్పటికే  కళ్ళలో  నీళ్ళు  తిరిగేయి. ఆకలి  అని అడగకుండానే  అన్నీ  అమర్చిపెట్టి, 'మరికొంచెం తిను, ఇవి కొంచెం  రుచిచూడు' అనే వదిన  జ్ఞాపకం వచ్చింది.

    'ఛీ....ఎందుకు  వచ్చేను? ఒక్కపూట  ఆకలిగా  ఉండిపోతే  ఏం నష్టం?' అనుకొన్నాడు.

    ఆ ముసలి బేరరు  వరదరాజు  పరిస్థితి  గ్రహించేడు. అతడు  తన సర్వీసుకాలంలో  ఇటువంటి  పిల్లల్ని  చాలామందిని  చూసేడు. ఇటువంటివారి  పట్ల  అతనికి  జాలి, సానుభూతి కలుగుతుంది.

    "ఎవరు బాబూ, నువ్వు? కొత్తగా  హాస్టల్లో  చేరేవా?" అన్నాడు అభిమానంగా.

    అతడి మాటతో  అంతవరకూ  కళ్ళలో నిల్చిన  నీళ్ళు  బొటబొట చెంపమీదుగా  కారేయి వరదరాజుకి. తత్తరపాటుతో  కన్నీళ్ళని  లాల్చీకొసతో  తుడుచుకొని  మామూలుగా  ఉండేందుకు  ప్రయత్నించేడు రాజు. బేరర్ అడిగిన ప్రశ్నకి  'అవును' అన్నట్లు  తల ఊపి, "పదిహేనో  నంబరు గది నాది" అన్నాడు.

    "చూడు బాబూ! కాఫీ టిఫిన్లు ఆరుగంటల లోపులే  పూర్తి అవుతాయి. ఇప్పుడు రమారమి  ఏడు గంటలు  కావస్తున్నది. రేపటినుండి  కాస్త ముందుగా వస్తూండు." ఆ మాట  అంటూనే  లోపలికి వెళ్ళి  కాల్చిన  రెండు రొట్టె ముక్కలు, వెన్న, జామ్ తెచ్చి  రాజు ముందు  పెట్టేడు.

    అతడి వెనకనే  గుర్నాధం  ఒక కప్పుతో కాఫీ తెచ్చేడు. రొట్టె ముక్కలు  చప్పగా చల్లారి కొరుకుడు పడకుండా సాగుతున్నాయి. కాఫీ మరీ చేదుగా ఉంది. ఇంతా  తీసుకువచ్చి  ముందు  పెట్టినప్పుడు  ఏమీ తినకుండా  వదిలిపోతే  బాగుండదన్నట్లు  ఒక్క ముక్క  కొరికి  గుక్కెడు  కాఫీ  తాగేడు రాజు.

    "ఇంకొక్క  గంటలో  భోజనం  తయారుగా ఉంటుంది. మళ్ళీ వెనక పడకుండా  కాస్తసేపు  ఇటు అటు తిరిగి  వచ్చేయి" అన్నాడు  ఆ ముసలి బేరర్.

    "అలాగే" అంటూ  భోజనాల గది  వదిలి  బయటికి  వచ్చేడు వరదరాజు.



                            *    *    *


    రెండు మూడు రోజులు గడిచినా  వరదరాజుకి  హాస్టలు  జీవితం అలవాటు పడలేదు. ఈడూ జోడూ  పిల్లలతో  స్నేహం కుదరలేదు. ఏపని చేసినా. ఏ మాట అన్నా  అక్కడ  చేరినవారంతా  ఒకటై  తనని  వేళాకోళం  పట్టించడం రాజు గమనించేడు.

    తనుకూడా హైస్కూల్లో  చదువుకొన్నాడు. క్లాసులో  చాలామంది కన్న తనకు మంచి మార్కులు  వచ్చేవి. అక్కడ పిల్లలంతా  తనతో స్నేహంగా ఉండేందుకు  ప్రయత్నించేవారు. టీచర్లు  తనని అభిమానంగా చూసేవారు. ఒక్కరోజయినా  స్కూలు  మానివేయాలనే  బుద్ధి తనకు  కలిగేది కాదు  మరి. ఇప్పుడెందుకు  ఇలా అయింది? ఇక్కడ పిల్లలంతా  తనని ప్రత్యర్ధిలా ఎందుకు  చూస్తున్నారు? కాలేజీకి  పోవాలంటే  తన కాళ్ళు ఎందుకు గడగడలాడుతున్నాయి? టీచరు అడిగిన ప్రశ్నకి  జవాబు  తెలిసి  కూడా  తనెందుకు  చెప్పలేక  పోతున్నాడు? అంతు దొరకని  భయ సందేహాలతో  వేగిపోసాగేడు  వరదరాజు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS