Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 18

   
    "ఇప్పటికైనా వూహించండి."
    సుమతి ఆ కాగితాన్ని చేతుల్లో వుంచుకుని తల దించుకుని వింటోంది.
    "నేను మిమ్మల్ని అవమానించను. మీ మీద నాకు కోపం లేదు. కాని, మన పరిచయాన్ని వృద్ది చేసుకోడం మాత్రం యిష్టలేదు," అన్నాడతను.
    ".........."
    "ఆ చీటీ రాసి పంపడంలో మీ తప్పేమీ లేదు. మీరానుకుంటున్న దేదో రాసేరు. కింద సంతకం లేదు. పోనీండి. రాతలో గాకుండా మాటలో చెప్పి వుంటే బాగుండే డెమో. మిమ్మల్ని శాసించే అధికారం నాకు లేదు. మరిచిపొండి. అన్నీ మరిచిపొండి. నేను మీ యింటికి రాకపోడానిక్కారణం .....అదుగో ...ఆ గోడమీదున్న ఆ ఫోటో. ఆ ఫోటో మా అక్కది. మా అక్క గురించి కొంత మీకు మునుపే చెప్పెను. మా అక్క దేవత. నిజానికి మా అక్క దేవతే! ఆవిడ చదువుకునే రోజుల్లో ఎవరో అక్కని ప్రేమించేరు. ఆ తర్వాత అక్కని అవమానించేరు. అక్క యిప్పటి కిన్ని పెళ్ళి చేసుకోలేదు. తల్లి తండ్రి లేనివాడిని. నన్ను పెంచి పెద్ద చేయడంలోనే ఆవిడ కాలాన్నంతా ఖర్చు పెట్టుకొంటుంది. ప్రేమలో చిక్కుకున్న అక్కకి సుఖం లేకపోయింది. నేను ప్రేమని ద్వేషించను. కాని, మీక్కావాల్సిన ప్రేమ నా దగ్గిర లభించదు. ఈ ప్రేమ కధలకి నేను దూరంగానే వుంటాను. ఇన్నాళ్ళూ నేను మీతో మాటాడటం, మీ యింటి కొచ్చి కూచోడం - మీరాశించిన ప్రేమవల్ల కాదు. ఒకవేళ, అలాటి భ్రమని మీక్కలిగించి వుంటే క్షమించండి. మీకింత మునుపు చెప్పి నట్టుగా ఇందులో మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం నాకే మాత్రం లేదు. ఇంతకంటే మీకేం చెప్పగలను?" అన్నాడతను.
    సుమతి లేచి నుంచుంది. అతని వేపు నిశితంగా చూసింది. తర్వాత చాలా తేలిగ్గా నవ్వేసింది. ఆపైన తిక్కగా మాటాడింది.
    "మీలాంటి యోగ్యులున్నారు గనకనే బజార్లో పెద్ద బాల శిక్షలు అన్ని ఖర్చవుతున్నాయి. ఆడపిల్లతో చనువుగా తిరిగే మగవాడు ఆ ఆడపిల్లని ప్రేమించనే లేదుట పాపం, అలా అని భ్రమిస్తే ఆ తప్పు ఆడపిల్లదట. ఓహో ...... ఏం పెద్ద మనుషులండి బాబూ! నన్ను అవమానించాలని లేదంటూనే అవమానించాలని లేదంటూనే అవమానించేరు. తొందరపాటు నాది గనక  క్షమించమని వేడుకుంటున్నాను. అదిగో ఆ గోడ మీద వెలిసిన మీ అక్క దేవత క్కూడా నా తప్పులు మన్నించమని చెప్పండి చాలా?"
    'సుమతిగారూ!"
    'అరవకండిక!"
    "మా అక్కని ఎగతాళి చేస్తే ....?"
    'అయ్యా, ఎగతాళి చేస్తున్నానా? చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాను. నేను అందరి ఆడపిల్లల్లాటి ఆడపిల్లను కాను. నా ప్రేమ లేఖ - మొదటి లేఖకి విలువ బాగానే ముట్టింది. రేపు నాకు పుట్టబోయే పిల్లలకిది పాఠంగా ఉపయోగపడుతుంది - మీకు మీ అక్క దేవత పాఠంలాగా."
    'అదిగో మళ్లా అక్కని ఎగతాళి చేస్తున్నారు మీరు."
    సుమతికి మరింత వళ్ళు మండిపోయింది.
    'అక్కనేమిటి? నాకింత పరాభవం జరిగిం తర్వాత దేవుడ్ని గూడా దుమ్మెత్తి పోస్తాను. అసలింతకీ మిమ్మల్నేవరు ప్రేమించేరు? నేను రాసిన చీటీ నా చేతిలో వుండగా మిమ్మల్ని ప్రేమించినట్టు బుజువేమిటి? మీరే నన్ను అల్లరి చేయడానికి ప్రయత్నించేరని మాట మాత్రంగా నేనేవర్తోనయినా అంటే మీ గతేమిటి? అక్కట అక్క! ఆ అక్కని ఎగతాళి చేస్తున్నానుట! ఒక టీచరమ్మ తమ్మున్నా నేను ప్రేమించేది? పిటీ .... ఎవరైనా వింటే నవ్విపోతారు! కలలో గూడా యింక నన్ను చూడకండి. గుడ్ బై ..... వెళ్ళొస్తా," అనేసి గది దాటి బయటి కొచ్చింది.
    సరిగ్గా అప్పుడే సీతాపతి వాళ్ళ కారొచ్చి ఆగడం, దాన్లోంచి సీతాపతి, చిరంజీవి, సత్యం, రవీ దిగడం జరిగేయి.
    మొదట్లో సుమతి తడబాటు చెందినా వెంటనే సర్దుతుంది.
    సీతాపతి అడిగేడు.
    "మీ కోసం మేము మీ యింటి కెడితే - మీరిక్కడికి వోచ్చేరా?"
    'అవునండి . ఇక్కడ ప్రెండ్స్ గ్గూడా మీ గురించి చెప్పి పోదామని వచ్చేను."
    'అయ్యో..... ఇది మనకోటండి, ఇక్కడికి ప్రత్యేకించి ఎవ్వరూ రానక్కర్లేదు ," అన్నాడు చిరంజీవి నొచ్చుకుంటూ.
    "ఈ కోటకి మన రవి బాబే ఏజెంటు ," అన్నాడు సీతాపతి.
    "ఇప్పుడే తెలిసింది. ఏమైతేనేం లెండి, ఒకళ్లకి యిద్దరు చెప్పడం వల్ల వచ్చిపడే నష్టమేమీ లేదుగా," అన్నదామె.
    'చాలా థాంక్స్ అండీ! మా మీద మీకింత అభిమానమున్నందుకు కృతజ్ఞతలు నేను చాలా అదృష్టవంతుణ్ణి ," అన్నాడు చిరంజీవి.
    "వస్తానండి. సెలవు, " అన్నదామె.
    "ఏవిటీ? నడిచే వెడతారా? నో .... నేను ఒప్పుకోను. రండి. మా కారుంది. మిమ్మల్నింటి దగ్గిర డ్రాప్ చేస్తాం," అన్నాడు సీతాపతి.
    "ఎందుకులెండిమీకా శ్రమ?"
    "శ్రమా లేదు దోమా లేదు. ముందు మీరు కారులో కూచోండి ప్లీజ్." అన్నాడు సీతాపతి - కారు డోర్ తెరిచి పట్టుకుని.
    గుప్పెట్లో ప్రేమలేఖ .....దాచుకుని సుమతి కారు వెనక సీట్లో కూచుంది - బంతి పూవులా.
    "మళ్ళా వస్తాం .....మీరుండడి రవీ!" అని సీతాపతి చిరంజీవితో పాటు ముందు సీట్లో కూర్చున్నాడు. సత్యం సుమతి పక్కన కూర్చున్నాడు.
    ఆ తర్వాత కారు కదిలింది.
    రవి గదిలోకి అడుగు పెడుతూనే ప్రసాదాన్ని అడిగేడు.
    "ఇక్కడి కెందు కొచ్చింది సుమతి ?"
    "మీకు చెప్పింది గదా?" అన్నాడు ప్రసాదం.
    "నిజమే చెప్పిందంటావా?"
    "నన్నేమీ అడక్కు రవి" రవి టవలూ , సబ్బు తీసుకుని బాత్ రూమ్ వేపు వెడుతూ మధ్యలో ఆగిపోయి అన్నాడు.
    "సీతాపతి సుమతిని గాడంగా ప్రేమిస్తున్నాడు."
    ".... ... ..."
    "చిత్రమేమిటంటే ఆడపిల్లలు ఎవర్ని ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. నీకంటే సీతాపతి ఖరీదైన కుర్రాడు."
    "నువ్వు స్నానం ముగించు. వెళ్ళు."
    "స్నానాని దేముందిలే? రెండు నిమిషాల్లో పూర్తీ చేస్తాను. బద్దకంగా వుంటే స్నానం మాని మొహం కడుక్కోవచ్చు. కానీ ....నీ వ్యవహార మేవిటో వినాలని వుంది."
    "వద్దులే రవి ."
    "ఎంత దాచినా ప్రేమ వ్యవహారాలూ అట్టే కాలం దాగవు . సీతాపతి మంచి మనిషి కాడట. ఎందుకైనా మంచిది . అతన్నో కంట కనిపెట్టుకు నుండాలింక. అవసరమైతే నేను నీ పక్కన నుంచుటాను. వాళ్ళిప్పుడు పరిచయస్థులు గాని నువ్వూ నేనూ నాలుగేళ్ళు గా స్నేహితులం. నాకేదైనా కష్టమొస్తే నేను సహించలేను. ఇన్నాళ్ళు దాచితే దాచేవు గాని, ఇవాళైనా నిజం చెప్పు .
    "... ... ..."
    "ప్రేమించడం నేరమూ కాదు, బూతూ కాదు. నిజం చెప్పు."
    "సుమతినే కాదు, ఇంతవరకు ఏ అమ్మాయినీ నేను ప్రేమించలేదు."
    'అంతేనా?"
    'అంతే."
    "రైట్. అయితే చిక్కేలేదు. సీతాపతితో మనకొచ్చి పడే ప్రమాదమూ లేదు. నేను స్నానానికి వెళ్లొస్తాను. తీరుబడిగా స్నానం చేసి రెండు రోజులై పోయింది. ఇవాళ తృప్తిగా స్నానం చేస్తాను. వెధవ ఎన్నికలు. ప్రాణాలు తింటున్నాయి," అనుకుంటూనే అతను బాత్ రూమ్ వేపు వెళ్లిపోయేడు.

    
                                                  *    *    *

    ఎన్నికల రోజున -------
    వోటు వేసి ఆ సాయంత్రం వరప్రసాదం సిరిపల్లె వెళ్ళేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS