వరదరాజు రాకతో కాస్త చెదిరిన మేకపిల్లలు అతడు తమని అదిలించక పోవడం చూసి మెల్లి మెల్లిగా పూలమెక్కలవైపు చూపు తిప్పేయి. అవి అతి ఆప్యాయంగా చిగురుటాకుల్ని తింటూ, బెదురుగా ఇటు అటు చూస్తుంటే వరదరాజు వాటివంక చూస్తూ తన్ను తానే మరచిపోయేడు.
అల్లంతదూరంలో పనిచేస్తున్న తోటమాలి పూలమొక్కల్ని తినేస్తున్న మేకపిల్లల్ని చూసి, వేపమండ పట్టుకొని "హెయ్ ....హెయ్" అంటూ అరుస్తూ వచ్చేడు.
మాలివాడి అరుపులతో మేకపిల్లలు హడలిపోయి కంచెమీదుగా గెంతుగెంతేయి. ఒకదాని కాలికి తీగెముడి తగులుకొంది. బాధగా "మే....మే...." అని అరుస్తూ కుంటసాగింది ఆ మేకపిల్ల. వరదరాజు మనసుకి ఎంతో కష్టమనిపించింది. 'పాపం! బాగా తగిలిందేమో, అంతలా అరుస్తున్నది' అనుకొన్నాడు.
"ఎవరు నువ్వు పిల్లోడా? మేకలు చిగుళ్ళు కోరికేస్తుంటే ఆటిని తోలక మిడిగుడ్లేసుకొని తమాసా చూస్తున్నావా?" అంటూ గద్దించేడు తోటమాలి.
భయంతో వరదరాజు గొంతుక వణక సాగింది.
"నేనూ....నేనూ...." అంటూ ఏదో చెప్పబోతే మాట పెగలలేదు.
"అదే నువ్వెవరనే అడుగుతున్నాను? లోపలి యెందుకొచ్చేవు?" ఇంక కాలానికి తను కోపగించుకో గల అవకాశంతోబాటు దానికి తగిన వ్యక్తి దొరికాడని మురిసిపోయాడు తోటమాలి.
"రాజూ, నువ్వు వచ్చి ఎంతసేపయింది?" దగ్గిరకి వస్తున్న సత్తిబాబు రాజును చూసి పలకరించేడు.
'బ్రతికించేవు దేవుడా?' అనుకొన్నాడు వరదరాజు. మాలివాడిచేత చివాట్లు తప్పినందుకు సంతోషిస్తూ.
ఖద్దరుపంచ, కాంగ్రెసు టోపీతో చిన్నతరహా నాయకుడిలా ఉన్న సత్తిబాబుని చూసి తోటమాలి తప్పుకొన్నాడు.
"మీ కుర్రాడేంటి?" అంటూ ప్రశ్నించేడు.
"మా తాలూకే. హాస్టల్లో చేర్చాలని తీసుకొచ్చేం."
"అదా....ఆ సంగతే అడుగుతున్నాను. కొత్త ముఖంలా ఉంటే, ఏవూరు ఏమిటి సంగతిని"__ ప్లేటు ఫిరాయించేడు తోటమాలి.
"రాజూ, త్వరగా రా. నీ పని పూర్తిచేసుకొని నేను త్వరగా వెళ్లాలి. మీ అన్నయ్య ఇదంతా నామీద రుద్దేడు. నాకు చచ్చేందుకైనా తీరుబడి లేదు." వెనక వరదరాజు వస్తున్నాడో, లేదో చూడకుండానే పెద్ద పెద్ద అంగలువేస్తూ నడక సాగించేడు సత్తిబాబు.
ఆవు వెనక పరుగుతీసే దూడలా సత్తిబాబును అనుసరించేడు వరదరాజు.
* * *
సత్తిబాబు వెళ్ళగానే ఎవరో తన్ను తరుముకు వస్తున్నట్లు గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొన్నాడు వరదరాజు. ఇంక ఈ పట్నంలో తను ఒక్కడే వుండాలన్న ఆలోచనతో అతడికి చెప్పలేనంత భయం కలిగింది. గట్టిగా కళ్ళు మూసుకొని భయాన్ని తగ్గించుకోవాలనుకొన్నాడు. తను హాస్టలు గదిలో ఒంటరిగా ఉన్న సంగతి మరిచిపోవాలనుకొన్నాడు. మనసు నిండా తమ ఇంటిని, అన్నా వదినల్ని, చిన్నారి పూర్ణ ముద్దుమాటల్ని నింపుకొన్నాడు. అలా వాటిని తలుచుకొంటూనే నిద్రలోకి జారిపోయేడు.
రాజుకి తిరిగి తెలివి వచ్చేసరికి ఎండ బాగా తగ్గిపోయింది. ఉదయం ప్రయాణానికి తిన్న అన్నం. కడుపులో ఆకలి కెలికింది.
సత్తిబాబు వెళ్ళిపోయే ముందు వరదరాజుకి అన్నీ చూపించేడు. "ఇది నీ గది. ప్రస్తుతం ఈ గదిలో నువ్వు ఒక్కడివే వుంటావు. ఇంకా హెచ్చుమంది పిల్లలు హాస్టల్లో వుండేందుకు వస్తే ఇంకొకరితో కలిసి ఉండవలసివస్తుంది. ఆ పక్కనున్న గది స్నానాలగది. దాని వెనకగా పాయిఖానా.
"ఇది భోజనాల గది. ఉదయం, సాయంకాలం కాఫీ టిఫిన్లు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఇక్కడ పెడతారు. నీకు కావలసింది అడిగి వేయించుకోవచ్చు. అక్కరలేనిది వదలిపెట్టవచ్చు.
"ఆ కాళీస్థలంలో సాయంకాలం ఆటలు ఆడుకొంటారు. మనం మొదట చూసిన హాలు ఆఫీసు. ఆ పక్కనే మీ హాస్టలు వార్డెనుగారి ఇల్లు వుంది. నీ కేదైనా కష్టంగా వుంటే ఆయనతో చెప్పవచ్చు. ఆ కనిపిస్తున్న ఆవరణలోనే మీ కాలేజీ ఉంది. నిండా పావుగంట నడక కూడా లేదు.
"హాస్టలుకి చాకలివాడు వస్తాడు. ఉతికేందుకు నీ బట్టలు వాడికి వేసుకోవచ్చు. గది తుడిచేందుకు జమాదారు వస్తాడు. వీరందరు గదిలో ఉన్న సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వస్తువులు, పుస్తకాలు సరిగా వుంచుకొని, గది నీటుగా వుండేలా చూసుకోవాలి. బయటికిపోయే సమయంలో విధిగా తలుపుకి తాళం వెయ్యాలి.
"పది, పదిహేను రోజులనాటికి ఇవన్నీ నీకు అలవాటు అవుతాయి. మొదట్లో ఏమైనా తెలియకపోతే పిల్లల్ని అడిగి తెలుసుకోవచ్చు. దేనికీ కంగారు పడకు. ఎవరితోనూ దెబ్బలాట పట్టుకోకు."
చిన్నతరహా లెక్చరులాంటిది ఇచ్చివెళ్ళేడు సత్తిబాబు. అతడు తన చిన్నతనంలో ఒక సంవత్సరం హాస్టల్లో ఉండి కాలేజీ చదువు వెలిగించేడు. ఆ అనుభవంవల్ల హాస్టలు వ్యవహారం అంతా తనకి కొట్టిన పిండి అన్నట్లు మాట్లాడతాడు. అందువల్లనే వరదరాజుని హాస్టల్లో ప్రవేశపెట్టేందుకు సత్తిబాబు సహాయాన్ని అర్ధించేడు శివయ్య.
చల్లని నీళ్ళతో ముఖం కడుక్కొని, పెట్టెలోని పన్నె తీసి తల దువ్వుకొని, గదికి తాళం వేసి భోజనాల గదివైపు నడక సాగించేడు వరదరాజు. ఉదయం కాళీగా ఉన్న ఆ పెద్ద గది చిన్నా, పెద్దా పిల్లలతో కిటకిటలాడుతున్నది. అక్కడ లేచిన మాటల సందడి ఆవరణ అంచులవరకూ వినిపించేలా వుంది. కొందరు పాటలు పాడుతున్నారు. మరికొందరు గ్లాసులపై చెంచాలతో గణగణ వాయిస్తున్నారు. నోటిలో పెట్టుకొన్న పదార్ధం నమిలి మింగకపూర్వమే మాటలాడుతూ పక్కవారిమీద ఎంగిలి ఉమ్ముతున్నారు మరికొందరు పిల్లలు.
