Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 17


    అతనికి తన మీద ప్రేమ లేనేలేదా?
    కేవలం - ఇన్నాళ్ళూ ఇంటికొచ్చి మాట్లాడి వెళ్ళి పోవడంతోనే తమ పరిచయానికి చుక్క పెట్టేసేడా?
    అర్ధం కాని పాఠాల్ని విపులీకరించి అర్ధమయ్యేట్టు చెప్పే పెద్ద మనిషి ఈ ప్రేమ పాఠంతో జీరోమనిషెనా?
    నోట్సు అందించే చేయి. ఆహ్వానం పంపినా ప్రేమ నందించలేదా?
    ఏమిటతని మౌనినిక్కారణం? అందంలో గాని, గుణంలో గాని, డబ్బు,  కుల గౌరవాల్లో గాని తను కింద తరగతి మనిషని అతను భావించేడా?
    అసలింతకీ అతను ఆ ప్రేమలేఖ చూశాడా లేదా?
    సుమతి మనసు మరింత చికాకై పోయింది.
    స్నానానికి మళ్ళా పిలుపు రావడంతో సుమతి సోఫా మీద నుంచి లేచి పెరట్లో కి వెళ్ళిపోయింది.
    ---స్నానం ముగించి , నిలువుటద్దం ముందు నుంచున్న సుమతికి, ఆ అద్దంలో సినిమా మార్కు వరప్రసాదం కనుపించేడు. ఆ వరప్రసాదం తెగ నవ్వేస్తూ, తనని ఎగతాళి చేస్తున్నాడు. సుమతి అసహనంగా 'మైపుట్ ' అన్నది గట్టిగా.
    "ఏవిటే విడ్డూరం? ఎందుకూ విసుక్కుంటావ్?" అన్నది తల్లి కూతురి వైపు కుతూహలంగా చూస్తూ.
    "ఏమిలేదు. నా గొడవేదో నన్ను పదనివ్వు," అన్నది సుమతి- చిరుకోపంగా.
    రంగం నించి నిష్క్రమించింది తల్లి.
    సింగారించుకోడం పూర్తయిం తర్వాత,  చెప్పులు తొడుక్కుని, బయటకి వెళ్ళ బోతుండగా, మళ్ళా తల్లి వచ్చి కూతుర్ని ఇంకో తడవ వేడిలో పెట్టింది.
    "ఎక్కడికే ప్రయాణం ?"
    "వల్లకాట్లోకి. అన్ని వివరాలూ చెప్పాలి. చంపేస్తున్నావే అమ్మా! నాకు లక్ష పనులుంటాయి. అవన్నీ చెబుతూ కూచోడానికి అవతల టైం లేదు. మళ్ళా గంటలో వచ్చేస్తాను. సరా."
    సుమతి సమాధానానికి తల్లి బిత్తరపోయింది.
    "అదేమిటే సుమతి! ఇప్పుడు నేనేమి అన్నానని నోరు పారేసుకుంటావ్? అవున్లే చదువుకుంటూన్న పిల్లవు గదూ! తల్లి వైపు వుండి గూడా నిన్ను పల్లెత్తు మాట అడగడానికి తగను కామోసు. ఇదంతా నా ప్రారబ్ధం. వెళ్ళిరా. నీ యిష్ట మొచ్చిన చోటికి వెళ్ళి నీ యిష్టమైనప్పుడే యింటికి రా. వెళ్ళు," అన్నదామె బాధగా.
    కటువుగా మాటాడి తల్లి మనసుని బాధ పెట్టినందుకు సుమతి మనసూ బాధపడింది పాపం. చాలా మెత్తగా సంజాయిషీ చెప్పుకుంది.
    "నేనేదో పని మీద వెడుతున్నాను? శుభామాని 'ఎక్కడికే?' అని అడుగుతే కష్టమనిపించి విసుక్కున్నాను అంతే. మళ్ళా గంటలో వచ్చేస్తానంటిని గదా."
    "అవుననుకో ..... ఈలోగా చిరంజీవి వాళ్ళ కారోస్తే"
    "నేనూ వాళ్ళ పనిమీదే వెళ్ళానని చెప్పు ."
    "అలా అని నువ్వు యిందాకే చెప్పి వుంటే ఇంత గొడవ జరిగేది కాదు గదా. అలాగే వెళ్ళిరా..... మనక్కావలసిన వాళ్ళకి మనం సాయపడకపోతే ఎల్లా? వెళ్ళవుతే. అబ్బాయి వస్తే నేను చెబుతాలే. నువ్వెళ్ళు." అన్నదామె ఎంతో ఆనందంగా.
    సుమతి బయట కొచ్చి రిక్షా ఎక్కింది.
    ఆ రిక్షా తిన్నగా వరప్రసాదం వాళ్ళ గది ముందు ఆగింది. రిక్షావాడికి డబ్బు లిచ్చి పంపి సుమతి ఆ గది వేపు నడిచింది.
    గది తలుపులు తెరిచే వున్నాయి. ఆ తలుపులకి ఎదురుగా వాలు కుర్చీలో కూచుని ఏదో చదువుకుంటున్నాడు వరప్రసాదం.
    అతన్నీ చూసీ చూడటం తోనే సుమతి మనసులోని కోపమంతా మాయమైంది. ఆ స్థానంలో ఉత్సాహం నిలిచింది. గబగబా నడిచి వెళ్ళి గది గుమ్మం దగ్గిర ఆగిపోయింది.
    చప్పుడు విని ప్రసాదం తలెత్తి చూశాడు.
    సుమతి!
    అతను దిగ్గున లేచి,
    "ఏవిటిలా వచ్చేరు?" అనడిగేడు.
    ఆ మాటలోని "అనాగరికత" ని చాలా బలంగా గ్రహించి సుమతి చిన్నబుచ్చుకుంది. ఆ తర్వాత ఎంతో పౌరుషంగా అడిగింది.
    "ఏం , రాకూడదా?"
    ఆ మాటలోని 'నాగరికత' ని అతి సుళువుగా గ్రహించి ప్రసాదం బాధపడ్డాడు.
    "బలే .....అదేం మాట? నిరభ్యంతరంగా రావచ్చు. రండి లోపలికి" అన్నాడు.
    సుమతి లోపలి కొచ్చింది. వస్తూ అన్నది ------
    "ఎందుచేతనో మీరు మా యింటికి రావడం మానుకున్నారు. అందుచేత , నేనే మీ దగ్గరికి వచ్చేను."
    "ముందు కూచోండి. ప్లాస్కులో కాఫీ వుంది. క్షణంలో సిద్దం చేస్తాను," అన్నాడతను.
    "నేను కాఫీ తాగడానికి రాలేదు, " అన్నదామె కూచుంటూ.
    అతనేమీ మాటాడలేక పోయేడు.
    "మీరు కూచోండి ," అన్నదామె.
    వరప్రసాదం ట్రంకు పెట్టి మీద కూచున్నాడు. కూచుంటూ అన్నాడు.
    "రవి, చిరంజీవిగారితో కలిసి యిప్పుడే బయటకు వెళ్ళాడు. ఏం తోచక ఇదిగో ఈ పుస్తకం చదువుతున్నాను. 'నరబలి' అని గొప్ప పుస్తకం లెండి."
    సుమతి, అతని తోచని సమయం తాలుకూ వివరాలు అడగదల్చుకోనూ లేదు. అందుచేత చాలా సూటిగా ప్రశ్నించింది.
    'అవును గాని, మీరెందుకు మాయింటికి రావడం మానుకున్నారు?"
    "ఈ మధ్య మా అక్కయ్య వంట్లో సుస్తీగా వుంటోంది. అక్కని చూడటానికి వెళ్ళివచ్చెను."
    "అందుకు రెండు రోజులు , పోనీ వారం రోజులు వదిలేయండి. ఆ తర్వాతనైనా రావచ్చుగా?"
    "ఏమిటో నండి . రాలేకపోయాను. "
    "కారణం చెప్పలేరా?"
    వరప్రసాదం తలొంచుకు కూచున్నాడు.
    "మునుపు రెండు రోజులకో తడవైనా కనుపించి పలుకరించేవారు. ఇప్పుడసలు కనుపించడవే కరువై పోయింది. కనుపించినా తప్పించుకు వెళ్ళిపోతున్నారు. అవునాండి?"
    వరప్రసాదం తలోంచుకునే అవునన్నట్లు తలూపేడు.
    "ఎందుకో చెప్పవచ్చుగా?"
    అతనప్పుడు తల వూపనూ లేదు, నోరు మెదపనూ లేదు.
    'అమ్మ రోజూ మిమ్మల్నడుగు తోంది. ఇవాళే మళ్లా అడిగింది. - "మీ రిద్దరూ ఏమైనా తగూపడ్డారా?" అని. నేను అమ్మ కేమని చెప్పేది ?"
    " ... ... ..."
    "మనం తగూ పడ్డామని చెప్పనా?"
    ".... ... ..."
    'అలా అని చెబుతే ఎందుకు తగూలాడేరని అడుగుతుంది. అప్పుడేమని చెప్పను?"
    " ... ... ..."
    "చెప్పండి. అలా తలొంచుకు కూచుంటారే?"
    వరప్రసాదం చాలా నెమ్మదిగా అన్నాడు.
    "నే నెందుకు రావడంలేదో మీరు ఊహించనే లేదా సుమతి గారూ?"
    అయితే, అతను ప్రేమలేఖ చదివే వుంటాడనే నిర్ణయాని కొచ్చేసింది సుమతి. కాని, చాలా అమాయకంగా తలూపుతూ 'వూహూ' అని అన్నది.
    వరప్రసాదం లేచి, సుమతి రాసిన చీటీ పట్టుకొచ్చి, దాన్ని ఆమె కిచ్చి అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS