ప్రాణంలేనిచేత్తో లేఖ ఉత్తరం అందుకుంది. ఆమె చదువుతూంటే కొత్త స్త్రీ "చూడమ్మాయి. కాగితంమీద హాస్పిటల్ పేరు అచ్చొత్తి ఉంది. ఆ హాస్పిటల్ నగరంలో ఉన్నవాటిల్లో అత్యుత్తమం అయింది. దరిద్రున్ని, ధనికున్నీ ఒకేరకంగా చూస్తారు. అతని కుడిచేతికి కట్లు కట్టి ఉన్నాయి. కాబట్టి అతడు చెబుతూంటే ఒక నర్స్ వ్రాసింది."
ఆలోచనతో లేఖ నుదురు ముడుతలు పడింది.
"ప్రమాదం జరిగి ఒక్కరోజే అయింది. నీకోసం కలవరిస్తుంటే హాస్పిటల్ వాళ్ళు నన్ను పంపారు. పాపం. నీకు భయంగా ఉంటే రాబోకు."
"భయం! బాబు బాధపడ్తూంటే తానిక్కడే ఉండిపోతుందా?"
'అబ్బ! బాబుకు ఎంత బాధ అయిందో? ఆ కారు డ్రైవరుణు నిర్ధయగా శిక్షించాలి. జేలుకు పంపాలి. ఖూనీకోర్లతోపాటు గానుగ కాడికి కట్టి త్రిప్పాలి. బాబుపోరాటం అప్పుడప్పుడే ముగింపుకు వచ్చింది. మంచి జీవితం మొదలు అవుతూంది."
"ఇంకో రెండు గంటల్లో పట్నంవెళ్ళే బండి వస్తుంది" ఆగంతకురాలు గడియారం చూచి లేఖను కొలిచింది.
"ఒక్క నిముషం అవుతే బామ్మ వస్తుంది. ఆవిడ రాగానే ముగ్గురమూ బైల్దేర్దాం."
'బామ్మా! అయ్యో! హాస్పిటల్ వారు రెండు చార్జీలు మాత్రమే ఇచ్చారు. ఆమె చార్జీకి నా దగ్గర డబ్బులేదు. నీదగ్గర ఏమైనా.......?"
లేఖ గుండె కుంగిపోయింది. బామ్మ పిచ్చిపిచ్చిగా ఖర్చుపెట్టేసింది. ఒక్క రూపాయికూడా మిగల్లేదు.
గుడ్లగూబలాంటి కొత్త స్త్రీ గుడ్లలో వెలుగు కనిపించింది.
"దిగులు పడబోకు. నిన్ను జాగ్రత్తగా తీసికెళ్తాగా, నా డ్యూటీ నాకు తెలుసు. నిన్ను భద్రంగా హాస్పిటల్ దాకా చేరువేస్తేగాని నా డ్యూటీ తీరదు. నీవు పడుకోవడానికి ఒక గదికూడా ఇస్తారు. బిడ్డను చూస్తే బాధతో మూలుగుతున్న తండ్రికి ధైర్యం వస్తుంది. పాపం, నిన్న కుర్రానిలా పలవరించాడు. పోనీ భయంగా ఉంటే ఇక్కడే ఉండిపో జబ్బు చేసి రాలేనిస్థితిలో ఉన్నావని చెబుతా."
'అమ్మో! వద్దు!!"
మళ్ళీ మనసు మారుతుందేమోనని లేఖ తండ్రిదగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. హాస్పిటల్ వారికి ఎంతదయ! బాధలో ఉన్నవారికి ఎంత ఉపకారం చేస్తున్నారు? ఆశ్చర్యం ఏముంది? ఆ నగరం వంగదేశానికి నాయకమ్మణికదా! బాగానే శ్రద్దతీసుకుంటూ ఉంటారు. బాబు రెండుమూడు వారాల్లో బాగైపోతాడు. ఇంక తండ్రినుంచి ఎడబాటు జరుగదు. ఎన్నటికీ జరుగదు.
లేఖ లేచింది. వంటింట్లోకి వెళ్ళింది. తలుపేసుకుంది. నోరువిప్పకుండా ఏడ్చింది. ఏడుస్తూనే కుండలోని నీరుతెచ్చి టీ కోసం పొయ్యి ఎక్కించింది. కొంగుతో ముఖమూ, కండ్లూ తుడుచుకొని గుడ్డలు సర్దుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది.
అతిథికి అరటి ఆకులో బెల్లపు ఉండలూ, రేకు గిన్నెలో టీ ఇస్తూండగా బామ్మ వచ్చింది. ఆగంతకురాలివైపు ఎగాదిగా చూస్తూ కథంతా విన్నది. నేలమీద చతికిలబడి ప్రశాంతంగా ఆలోచించింది. ఒకటి, రెండుసార్లు ముగ్గుబుట్టలాంటి తల ఊపి తన అనంగీకారాన్ని తెలియజేసింది. మరి మార్గాంతరం? లేఖ ప్రయాణం అయింది. వెళ్ళి పోయేప్పుడు దేవికి అర్పించిన పూవుల్లోంచి బంతిపువ్వు లేఖకు ఇచ్చి ఆమెను అదృష్టానికి అప్పగించింది.
"నేను మళ్ళీ గుడికివెళ్ళి నీకోసం చాలా రాత్రిదాకా దేవిని ప్రార్ధిస్తాను."
7
అది లేఖదగ్గరినుంచి ఆ నెల్లో వచ్చిన నాలుగో ఉత్తరం. కాలూ ఉత్తరాన్ని మడిచి పట్టుకొని పెదవులు నొక్కిపట్టి చిరునవ్వు నవ్వాడు. చంద్రలేఖా! ఇంకొంచెం ఓపికపట్టు. నీవు ధైర్యంగలదానివి. ఇంక అట్టే కాలం నీవు ఝార్నాలో ఉండవు. త్వరలోనే పట్నం తీసుకొచ్చేస్తా.
కాలూ భరించిన యాతనల్లోంచి అశాంకురం గోచరించింది. తాను చేసే ఏహ్యమైన పనిలో సహితం ఏదో అర్ధం ఉన్నట్లు కాలూ సంతోషించాడు. ఆయనకు ఈ సంపాదనే లేకుంటే లేఖ క్షామదావానలం నుంచి ఎలా రక్షింపబడి ఉండేది?
అతడు అనుకోనంతగా ఆర్జిస్తున్నాడు. కొద్దో గొప్పో వెనక వేస్తున్నాడు కూడా. ఇంకో రెండుమూడు నెలల్లో ఝార్నావెళ్ళి, లేఖను పట్నం తీసుకొచ్చేంత మిగల్చవచ్చు. అయితే పట్నంలో ఏమూలనో తాను కొలిమి సాగించడానికి తగినంతమాత్రం కూడబెట్టలేడు. ఆ ఆశ ఫలించపోవచ్చు. లేఖ తనవెంట ఉన్నా ప్రస్తుతపు పని కొనసాగించాల్సిందేనా? ఈ విషయం ఆమెకు తెలియకుండా దాచడం ఎలా? ఆమెకు తెలుస్తే వణికిపోదూ!
కాలూ పనిచేసేవాటన్నింటిలోనూ చిత్తూరు రోడ్డుమీద ఉన్న వేశ్యాగృహం ముఖ్యమైంది. గేటుముందు పసుపుపచ్చని గోడమీద ఆకుపచ్చని మెరిసే అక్షరాల్తో 'రూపా' అని వ్రాసి ఉంది. ఆ గృహం పేరు రూపా. ఆ వీధిలో ఉన్న అనామక గృహాల్లో రూపారమ్యహార్మ్యం హిమాలయంలా ఉన్నతంగా ఉంది. బాల్కనీల్లో కొందరు స్త్రీలుకూర్చొని డస్సిన దృక్కుల్తోనూ కృత్రిమపు మందహాసాల్తోనూ, దారిపోయేవారిని కనుసైగల్తో ఆహ్వానిస్తున్నారు. కవర్లుగలలైట్లు ముందు మందంగా పౌడర్లు వేసుకున్న వారి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నగరంలో ఆ వేశ్యాగృహానికి ప్రత్యేకత. వంగసంఘంలో ఉచ్చశ్రేణికి చెందిన కొందరు పురుషులు ఆ వేశ్యాగృహానికి శాశ్వత పోషకులు. సౌందర్యరాసుల్నూ, అనాఘ్రాత పుష్పాల్నూ దూరదూరాల్నుంచి తెచ్చి ఆ గృహరమ్యత పెంచుతూ ఉంటారు నిర్వాహకులు.
కాలూ మీద ప్రత్యేక అభిమానంతో రజనీ అతనిని 'రూపా' లో పనికి నియమించాడు. 'తమ్ముడూ! ఒక్కసారి చూస్తే గుణం కనిపెట్టేస్తా.' కాలూ రజనీ తీర్పును వమ్ముకానివ్వలేదు!
అర్ధరాత్రి సమయంలో - నిద్రవేళ - ఆ గొందుల్లో తిరుగుతూ ఉన్నట్లు లేఖకు తెలుస్తే? అంతేకాదు, అలాంటి కలవచ్చినా ఆమె భరించలేదు. మొదటి అంతస్తు బాల్కనీమీద అతనికి చూపుపడేటప్పటికి కాలూ ధ్యాస పూర్తిగా లేఖ మీదనే ఉంది. మామూలుగానే అక్కడో బొమ్మ నిలిచి ఉంది. ఆ యువతి పిట్టగోడమీద మోచేయి నిలిపి రెండువేళ్ళతో చుబుకం పట్టుకొని చూస్తూంది. మామూలు వేశ్యల్లా ఆమె కంటిసైగచేసి ఎవర్నీ పిలవడం లేదు. బజారుమనుషులు ఆగి సైగలు చేసినా ఆమెలో కదలిక కనిపించలేదు. ఆమె ప్రతిమలా కదిలింది. కాలూకు ఆశ్చర్యం కలిగింది. క్షుత్తరంగాలు నగరం మీదికి విసిరిన నారీజనంలోది కాదుకదా? ఆమెకు ఎప్పుడైనా విముక్తి లభించినా ఈ దుష్ట వాతావరణంలోనే ఉండిపోవాల్సి వస్తుందా?
రూపాముందు ఒక టాక్సీ ఆగింది. అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది. అతడే ఆ రాత్రి అతిథేమో? చేతులు జోడించి అతన్ని ఆహ్వానించాలని కాలూకు ఆదేశం అందింది.
"అయ్యా! ఇటు. ఇదీ దోవ"
తెల్లని సిల్కువస్త్రాల మీద రాళ్ళ గుండీలు మెరిశాయి. ఆ వ్యక్తి తన ముక్కును చేత్తోపట్టుకొని కాలూను చూడనైనా చూడకుండా సాగిపోయాడు.
టాక్సీ రోడ్డుపక్క ఆగింది. మీటర్ టిక్కుతిక్కుమని పెరిగిపోతూంది. అతడు రూపాయిలు తగలపెట్టే వర్గానికి చెందినవాడు అనుకున్నాడు కాలూ అతన్ని అనుసరిస్తూనే. అతడు విస్కీగాని బ్రాందీగానీ అడుగుతాడేమో?
ఆ వ్యక్తి ఇరుకు గొందిలోంచి మెట్లెక్కడానికి బైల్దేరాడు. రండవ అంతస్తుమీద ఒక లావైన స్త్రీ ఉంది. ఆ గృహం ఆమె అధీనంలో ఉంది. ఆమె ఎడమ ముక్కుకు రవ్వ ఉంది. ఆమె ఆ వచ్చే వ్యక్తిని హీనస్వరంతో గౌరవంగా ఆహ్వానించింది.
నాది ఇరవైమూడు సంవత్సరాల వ్యాపారం. నీకు తెలీదూ? మీకళ్ళతోనే చూడండి.
అనుభవంగల వ్యాపారి మంచిరకపు వస్తువును అమ్మచూపినప్పటిలా ఒక కృత్రిమపు నవ్వునవ్వి చకచకా రంగురంగుల రాళ్ళుపరచిన వసారాలోంచి నడిచిపోయింది. నడుస్తూంటే ఆమె పిరుదులు ఊగిపోతున్నాయి.
ఆమె అక్కడికి వచ్చిన వారినందరినీ సగం తెరిచి ఉన్న ద్వారం దగ్గరికి తీసికెళ్తుంది. ఆ ద్వారానికి రక్తవర్ణపు దళసరి వెల్వెట్ తెరవేసి ఉంటుంది. వచ్చినవాడు లోనికి చూసేదాకా అక్కడే నుంచుంటుంది. లోపల మంచంమీద ఒక యువతి మందహాసంతో అతన్ని ఆహ్వానిస్తుంది. వచ్చిన వ్యక్తికి నచ్చుతే లోపలికివెళ్ళి తలుపేసుకుంటాడు. లేదా తిరిగి వసారాలోకి వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకోగది.
భారమైన ఫ్రేములుగల రంగురంగుల పెద్దపెద్ద ప్రతిమలు వసారా గోడలకు వేలాడుతున్నాయి. అందమైన పౌరాణిక దేవతలూ అసభ్యంగా ఉన్న జపాను నగ్నస్వరూపాలూ పక్కపక్కనే ఉన్నారు. నాటి అతిథి రాగానే తలుపువెనుకనుంచి పెద్దగా నవ్వులు వినిపించాయి. మరో గదినుంచి పదయుక్తమైన తంత్రీ మధురస్వరం వినవచ్చింది.
