లేఖ హృదయం ఆనందంతో పొంగిపోయింది.
అసందర్భమైన ఆలోచన ఆమె మెదడులో తళుక్కుమంది. ప్రధానోపాధ్యాయిని పదవతరగతికి వ్యాసపాఠం చెపుతూంది. పత్రలేఖనాన్ని గురించి కూడా చెపుతుంది. "నిత్యజీవితంలోని అనుభవాలు, ఇంట్లో మాట్లాడుకునే మాటలు, మానవత ఇవి వ్యాసానికి రమ్యత ఇస్తాయి. ఉత్తరంలో మీ ప్రకృతీ, వ్యక్తిత్వం ప్రతిబింబించాలి." మొదటిసారిగా లేఖ వ్రాసిన వాస్తవ లేఖను చూపుతే ఆమె ఎలాంటి అభిప్రాయం వ్యక్తపరుస్తుందో? ఎన్ని మార్కులు ఇస్తుందో?
ప్రతిరోజూ తండ్రి ఉత్తరంకోసం ఎదురుచూసింది లేఖ. వారంరోజుల తరువాత ఉత్తరం వచ్చింది. ఆ కవరులో రెండు పదిరూపాయీల నోట్లు ఉన్నాయి! యుగాల్లాంటి నెలల తరువాత తానూ, బామ్మా పొట్టనిండా తింటారు. అంతేనా? బాబు గెలిచాడు. అతడు తనకాళ్ళమీద నుంచున్నాడు. ఆశ్చర్యం గారడి గారడీ ఎందుక్కావాలి? బాబు మీద ఆమెకు ఉన్న విశ్వాసం రవ్వంతైనా సడలలేదు. ఆశించింది. ఫలించింది. అంతే!
అదృష్టానికి తన పూజలే కారణం అనుకుంది వృద్ధురాలు. దేవతలు ఆశీర్వదించారు.
"బిడ్డా, ఇదంతా ఏమిటనుకున్నావు. తృప్తి కలిగిందికదూ? అయితే విను మనం గుడికి వెళ్ళాలి. తెల్లవారుజామునే వెళ్ళాలి. పళ్ళూ, దీపాలూ సమర్పించాలి."
మరుసటిరోజు పూజాద్రవ్యాలకు ఒక రూపాయి కర్చైంది. తిరిగివచ్చేప్పుడు బామ్మకిరాణా కొట్టుదగ్గర ఆగింది. నెట్టుకొని లోపలికివెళ్ళింది. మహారాణిలా వస్తువులన్నింటినీ ఎగాదిగా చూసింది. లేఖ గుమ్మందగ్గరే నిలిచిపోయింది.
"గోధుమపిండి ఉందా? మంచిరకం"
దుకాణంవాడు బొమలు ముడివేసి ఆ ముసలిదాని ముఖాన ఉన్న కరువును కొల్చాడు. అయిన మెత్తగానే" ఉంది. మంచిరకమే ఉంది"
"ఒక శేరు చాలు. టీ ఉందా? టీ?"
"బామ్మా" గుమ్మంనుంచే లేఖ కేకవేసింది.
బామ్మ వినలేదు. నిర్లక్ష్యంగా టీ, టీ, అని మళ్ళీ అడిగింది.
"గ్రీన్ లేబిల్ పాకెట్టు రెండు రూపాయీలు."
అన్నీ కొనగా మిగిలిన డబ్బుతో బియ్యం కొన్నది. ఒక్కరూపాయి మాత్రం మిగిలించింది. సామానంతా తీసుకొని నడకసాగించారు. "ఇప్పుడు మన చేతుల్లో బాగా బరువుంది. బంగాళాదుంపల కోసం మళ్ళీ వస్తా" అంది బామ్మ.
లేఖ పేలవంగా "బంగాళాదుంపలా?" అంది.
"అవును మన అదృష్టం మళ్ళింది. పండుగ చేసుకోవాలి." అంది వృద్ధురాలు కచ్చితంగా. లోతుగా పీక్కుపోయిన ఆమె కళ్ళలో గర్వరేఖలు కనిపించాయి. "ఇదిగో ఈ చేయి చక్రాన్ని త్రిప్పింది. నా పూజలూ, పునస్కారాలూ ఫలించాయి. ఏమంటావ్" అంది గర్వం, వినయం రెండూ కలిసినట్లు.
బామ్మ ఉల్లాసం లేఖ గుండెను బాదింది. ఆమె రక్తపువేగం పెరిగి వేడెక్కింది. 'అదృష్టం పండింది. పండుగ చేసుకుందాం' అని అరిచింది.
నాటినుంచీ ఆమె కలలుగన్నది. కల - మహానగరపు కల.
ఊహాపథంలోనగరాన్ని చూడాలి. ఆమె స్మృతిఫలకం మీద అందుకు చాలినన్ని చిత్రాలు లేవు. నగరం చూడనైతే చూసింది. కాని సంత చూసినట్లు చూసింది. వింతల్ను చూడ్డానికి వెళ్ళింది. చూచింది. ఆనందించింది. అబ్బురపడింది. ఇప్పుడామె నగరానికి యాత్రకు వెళ్ళదు - నగరవాసిగా వెళ్తుంది. ఆ హర్మ్యారణ్యంలో ఎక్కడో ఒకచోట ఆమె ఇల్లు కూడా ఉంటుంది.
ఆమె ఒక ఊహానగరం నిర్మించుకుంది. ఆ నగరంలో ఒక స్కూలు కూడా కట్టుకుంది.
ఆమెకు అత్యవసరం అయిన వాటిల్లో పాఠశాల ఒకటి. స్కాలర్ షిప్పుతో కాలేజీకి కూడా వెళ్ళొచ్చు. కమ్మరి బిడ్డకు అతీతమైన ఆలోచన. ఏం? వంగదేశపు బాలబాలికల్ను ఓడించి తాను మెడల్ సంపాదించలేదూ? ఇంకా తన శక్తి సామర్ద్యాల్ను ప్రదర్శించాల్సి ఉంది. బాబు ఒక్కడేకాదు పోరాడగలవాడు. బిడ్డ సహితం తనకాళ్ళమీద నిలువగలదు.
ఆమెను విచారాంధకారం అలముకుంది, ఆమె మేడలు అదృశ్యం అయినాయి, ఆమె మెడల్. రక్షరేఖ ఏదీ? పోయింది. ఇంకా మెడల్ ఏమిటి? అది కరిగిపోయి అందియ గానో షర్టు బొత్తాంగానో మారిపోయి ఉంటుంది. పోనీ, అది పోతేనేం? ఇంకెన్ని సాధించాల్సి ఉంది?
"బాబూ, మెడల్ కోసం దుఃఖించింది."
నగరంలో స్కూల్సు ఎలా ఉంటాయి? అని తండ్రికి వ్రాసింది. ఆమాటల అంతరార్ధం కాలూకు తెలుసు. అతడు తదనుగుణంగానే జవాబు వ్రాశాడు. "నేను నీకోసం స్కూలు చూస్తున్నా. ఇక్కడ చాలా స్కూళ్ళు ఉన్నాయి. అవి మన కాన్వెంటు స్కూలులా ఒంటి అంతస్తువికావు. నిన్న సౌత్ పార్క్ రోడ్డుమీద ఒక పాఠశాల చూశాను. అది నిజంగా రాజభవనం. నేను చూస్తూ ఉండగానే ఒక పొడుగుపాటి బస్సు వచ్చింది. అందులోంచి పిల్లల గుంపు దిగింది. అంతా ఒకేరకంగా నీలియూనిఫారం వేసుకున్నారు. ఆ స్కూలుకు స్వంత బస్సుకూడా ఉంది చంద్రలేఖా! అది ఇంటింటికీ వెళ్ళి పిల్లల్ను తెస్తుంది. నీవు నడవాల్సిన పని ఉండదు."
చంద్రలేఖ చిరునవ్వు నవ్వింది. నల్లని కళ్ళల్లో తెల్లని మెరుపు మెరిసింది. 'నీవు నడవాల్సిన పనుండదు" తానేదో అప్పుడే నగర పాఠశాల్లో చదువుతున్నట్లు! "బామ్మా! త్వరగా స్కూలుబాగ్ ఇవ్వు. అయ్యో! అది నిన్న ఎక్కడ పెట్టావో కదా? బస్సు మనింటిముందే రోజంతా ఆగుతుందా?"
"బాబూ, యూనిఫారం ఫ్రాక్ అవుతే నేనెలా వేసుకుంటాను. పెద్ధదాన్ని కదా?" లేఖ వ్రాసింది.
చిన్నపిల్లలు మాత్రమే ఫ్రాక్ యూనిఫారం వేసుకుంటారు. నీ వయసువారు చీర జాకెట్టుతో స్కూలుకు వెళ్తారు. నీలి చీర, తెల్ల జాకెట్టూ. అదీ తేడా" కాలూ జవాబు వ్రాశాడు.
అయితే చంద్రలేఖకు ఇబ్బంది లేదు. మహానగరపు పాఠశాలలో చదివేగుర్తుగా నీలిరంగు చీర, తెల్లని జాకెట్టూ.
ఒకనాడు ఒక కొత్తవ్యక్తి కాలూ ఇంటికి వచ్చింది. మధ్య ఈనాడు స్త్రీ, లావుగా ఉంది. వ్రేళ్ళకు బంగారు ఉంగరాలూ, చేతులకు బంగారు గాజులూ ఉన్నాయి. ఆమె ఎడమ ముక్కుకు "రవ్వ" ఉంది. "కమ్మరి ఇల్లిదేనా?" అని అడిగింది.
లేఖ చకితురాలై చూసింది. ఎవరిది? బామ్మ గుడికి వెళ్ళింది.
వచ్చిన స్త్రీ నేలమీద కూలబడింది. ప్రశ్నల వర్షం కురిపించింది. "నీ తండ్రి క్రితంతడవ ఉత్తరం వ్రాసింది ఎప్పుడు? అయితే అతడు సంపాదిస్తూ కాలంగడుపుతున్నాడని నీకు తెలుసునన్నమాట. నిన్నకాక మొన్న వ్రాశాడన్నావు కదూ? ఆ ఉత్తరంలో ఏం వ్రాశాడు?"
నరాలు బిగపట్టుకుని లేఖ సంక్షిప్తంగా జవాబులు చెప్పింది. "ఏమైంది? ఏమిటి? చెప్పండి" అని ఆదుర్దాగా అడిగింది.
చివరకు ఆ స్త్రీ మౌనంగా నేలవైపు చూస్తూ ఉండిపోయింది. లేఖ ఆమెచేతులు పట్టుకుని ఊపింది. ఇంకో నిముషం అవుతే లేఖ కెవ్వున కేక వేసేదే. ఆ స్త్రీ గునిసినట్లు చెప్పింది.
"అమ్మాయి! నీ గుండె రాయిచేసుకో ఇది నా కర్మ. నేను నీకీ వార్త చెప్పాల్సి వచ్చింది."
"బాబూ" అని అరిచింది. ఆమెగొంతు పగిలిపోయింది. బాష్పధారలు చెక్కిళ్ళమీంచి ప్రవహించాయి.
"అబ్బే నీవు అనుకునేంత దుర్వార్త ఏమీకాదు. నేనే బుద్దితక్కువదాన్ని. నిన్ను కలవరపెట్టాను. అతనికి వీధిలో కారు తగిలింది. పడిపోయాడు. కుడిచేతికి బలంగా గాయం తగిలింది. హాస్పిటల్లో మంచి చికిత్స జరుగుతూంది. రెండుమూడు వారాల్లో బాగైపోతాడు. భయం ఏమీలేదు. అతడు నీకోసం కలవరిస్తున్నాడు. నేను హాస్పిటల్లో నర్సును. హాస్పిటల్ వారు నన్ను పంపారు. " ఆమె తన జాకెట్టుల్లో తడిమి ఒక లేఖ తీసింది. "ఇది నీకోసం వ్రాసింది."
