రార, రరా, రార, రారా!
ఈ అందం, ఈ చందం
వయసూ, సొగసూ
అంతా నీదేరా, రార రరా, రార, రారా!
పొంగిపోవు నా మొలక యవ్వనం
త్రాగిపోవగా రార నవమోహనా!
రార రరా, రార రారా!
వచ్చినవాడు ఒక తెరముందు నుంచున్నాడు. తెర పక్కకు లాగాడు. తార్పుకత్తె అతని వెనకే దూసుకుపోయింది.
మరుక్షణంలో ఆమె అరుపు కొరడాదెబ్బలా తగిలింది.
"ఆగు."
గది ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంది. తర్వాత ఛళుకుల్లా ఆమె కేకలు వినిపించాయి.
"ఏమిటా చీదుడూ నువ్వూ, చాలించు. ఆయన ఇక్కడే ఉన్నాడు. అయిదురోజులు నీతో తంటాలు పడ్డది ఈ గడియకోసమే. నీ అదృష్టం పండింది. వంటినిండాబంగారం వేసేవాడు దొరికాడు. జనపవ్యాపారంలో పేరు పొందినవాడు. ఇప్పటికైనా అర్ధంఅయిందా?" మళ్ళీ స్వరం తగ్గించి "జానపవ్యాపారంలో ప్రముఖుడు" అన్నది.
గదిలోంచి గుండెపగిలే ఏడ్పు వినవచ్చింది. ఆ ఏడ్పులోనిబాధ రాళ్ళను నీళ్ళు చేసేట్టుంది.
గుండెగట్టిపడ్డానికి ఏమైనా ఇవ్వాలా?
లేఖ హృదయం దుఃఖంతో నిండిపోయింది. మాట పెకల్లేదు. కష్టంగా "వద్దు, వద్దూ వద్దు" అని ఏడ్చింది.
ఆ ధ్వని కాలూచెవిని పడింది. చకితుడై గది దగ్గరికి పరిగెత్తాడు. తార్పుకత్తె ఎదురుగా వచ్చి దఢాల్న తలుపు వేసింది. కొద్దిగా ఒకరెక్క తీసి తలబైటికి పెట్టి "ఇక్కడ నీకేంపని? వెళ్ళు, బైటికెళ్ళు" అంది. కాలూ అడుగులు బరువుగా కదిలాయి. "క్యాబిన్ కు పరిగెత్తి వేసిన మాంసం పట్టుకురా." అని ఆదేశించింది.
వ్యధిత హృదయంతో కాలూ దిగుతున్నాడు. అతడు పరధ్యానంలో ఒక మెట్టు వదిలేవరకు క్రిందపడిపోయేంతపని అయింది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. హాలు యావత్తూ మంచులో తేలి ఆడింది. వడగళ్ళు మీదపడ్డట్టు వణికిపోయాడు. భారంగా శ్వాసంపీలుస్తూ "నేను పిచ్చివాణ్ణి అయిపోయానా?" అనుకున్నాడు.
అతి ప్రయత్నం మీద వణకును ఆపుకొని చివరి మెట్టుమీద కూలబడిపోయాడు. కళ్ళ మసక వదిలించుకోవడానికి తల జాడించాడు.
"అది లేఖ ధ్వనిలాగే వినిపించింది. పూర్తిగా లేఖ ధ్వనే అనుకున్నా."
అది తల్చుకుంటే తనమీద తనకే నవ్వువచ్చింది. పెద్దగా నవ్వాడు. కాని ఆ నవ్వు వల్ల అతని మనసేమీ తేలికపడలేదు. వెధవ పట్నం. రేపు వదిలేయాలి. కూతురుదగ్గరికి వెళ్ళాలి. అవును రేపే.
కణతలు బద్దలు అవుతున్నాయి. క్షణం కూర్చున్నాడు. లేచేవరకు ఊపిరి పీల్చలేక పోయాడు. గాలికోసం బయటికి నడచాడు. ఆ గొంది నీడలో తోటి పనివాడు కనిపించాడు. పెదవుల మధ్య సిగపెట్టు పెట్టుకొని "రూపాలో ఒక పెద్ద చేప పడింది. అదిగో చూడు ఆ టాక్సీ!" అని కాలూకు చూపాడు.
ద్వారబంధాల్ను పట్టుకున్న ఒక స్త్రీ నిరాశగా "ఈ కరువుముండలే ఫేషన్ అయిపోయారు. మా నోట్లో దుమ్ము కొట్టేస్తున్నారు" అని గొణిగింది.
కాలూ తననుంచి దూరంగా పరిగెత్తాలనుకున్నాడు. గబగబా అడుగులు వేశాడు. పిచ్చి అతణ్ణి వదల్లేదు. ఝార్నా వెళ్ళడానికి బండెక్కాలి. లేఖ కోసం ఏవైనా కొనాలి. మళ్ళీ ఆమెతో సహా నగరానికి తిరిగి రావాలి. ఈ ప్లానులు అతని వెర్రితనాన్ని దూరం చేస్తున్నాయి.
"అది చంద్రలేఖ మాటే అనుకున్నా."
కాలూ ఒక లాంపుపోస్టుదగ్గరనుంచుని నోటితో గాలిమింగుతున్నాడు. కళ్ళు మూసుకుంటే ఆలోచనలన్నీ దూరం అవుతాయి అనుకున్నాడు. కాని ఆ భీకర దృశ్యం అతని మనోఫలకంనుంచి మాయం కాలేదు. గుండె వణికిపోయింది. రక్తానికి నిప్పు అంటుకుంది. ఇంటికి వెళ్ళిపోదామనుకున్నాడు. కాని అతనిలో శక్తి దగ్ధం అయిపోయింది. నీరసించిపోయాడు. కదల్లేక మెట్లుమీద కూలబడిపోయాడు.
"ఓరి శుంఠా, ఈకాస్తకే పిచ్చివాడివి అయిపోతావా?" అనుకున్నాడు తన్నుతాను ఓదార్చుకోవడానికి యత్నిస్తూ.
అంతా పదినిముషాలు అయి ఉంటుంది. రాళ్ళగుండీలు మెరుస్తూ, పోయినవ్యక్తి కస్సుబుస్సుమంటూ దిగి 'టాక్సీ' అని గర్జించాడు. కాలూ దిగ్గునలేచి నుంచున్నాడు.
బాధ భరించలేక గదిలోకి వెళ్ళిచూసి తన పిచ్చిదనానికి నవ్వుకోవాలనుకున్నాడు. ఆ ధ్వని లేఖది కాదని రూఢి చేసుకోవాలి. ఎందుకూ తానెలాగూ రేపు కూతురు దగ్గరికి వెళ్తున్నాడు. అంతటితో తన భయం అంతం అవుతుంది. మళ్ళీ ఆ రక్కసిగదిలోకి వెళ్ళనివ్వకుండా ఆపితే దానిమెడ నులిమేయాలి.
నిశ్శబ్దంగా మెట్లెక్కి నీడలా వసారాలోంచి నడిచాడు. గది దగ్గరకు వెళ్తున్నకొద్దీ అతని గుండెధ్వని తగ్గిపోతున్నట్లనిపించింది. చేతులు వణకుతుండగా తలుపు తెరిచాడు.
ఒక అమ్మాయి నేలమీద కుప్పలాపడి నిట్టూరుస్తూంది. ఆమె ముఖం కనిపించలేదు. దగ్గరికి వెళ్ళి చూచాడు.
మెల్లగా "లేఖా" అని పిలిచాడు.
ఆమె మెరుపులా తలెత్తి చూచింది. క్షణం నోరు పెగల్లేదు. "బాబు" అన్నది మెల్లగా.
కాలూ కళ్ళలో భయం నిండింది. అయినా అర్ధగంట నుంచి అతని మనసులో ఈ ఆలోచనలే మసలుతున్నందున అతడు సహించగలిగాడు. కాళ్ళు వణికాయి. ధైర్యం తెచ్చుకొని నుంచున్నాడు.
"త్వరగాలే" అంటూ కాలూ, లేఖను లేవనెత్తాడు. వారు గుమ్మంవైపు నడిచారు. తివాసీమీద ఉన్న లేఖ వాన్తిలో కాలూ కాలు పడింది.
గుమ్మంముందు నుంచొని అటూ ఇటూ చూస్తూ ఉండగా ఆ రాక్షసి ముండ కనిపించింది. ఆమె చేతిలో కొరడా ఉంది. లేఖ కట్టెబారిపోతూంది. కాలూ వెనక్కు తగ్గాడు. అతని విశాలవక్షం ద్వారం నిండిపోయింది; మానరక్షణకు హత్యచేయడానికి సహితం సిద్దంగానుంచున్నాడు.
కోపంతో గొణుక్కుంటూ ఆ దెయ్యం అటువైపే నడిచివస్తూంది.
"హుఁ. నిన్నపుట్టిన కూన నన్నే మోసం చేస్తుందీ? గజ్జికుక్కా లా కక్కుతుందీ? చూసుకుంటా. సున్నానికి ఎముక దొరక్కుండాచేస్తే రోగం తిరిగి దారికి వస్తుంది." కోపంతో కంపిస్తూ మరుగుదొడ్డివైపు మళ్ళింది. పెద్ద ధ్వనితో తలుపు పడింది.
కూతురు చేయిపట్టుకొని గబగబా మెట్లుదిగి గొందిగుండా పెద్ద వీధికి చేరాడు కాలూ. రిక్షా అక్కడ పెట్టుకొని కూలబడి ఉన్న రిక్షావాలా కనిపించాడు. కాలూ కేకవేశాడు.
భయం అడుగుపట్టి ఇద్దరూ మౌనంగా రిక్షాలో కూర్చున్నాడు. ఒకరినొకరు కనీసం చూసుకోనైనా చూసుకోకుండా దూరదూరంగా కూర్చున్నట్లు కూర్చున్నారు. నగరాన్ని అర్దరాత్రి ఆవరించింది. బ్లాక్ ఔట్ కవర్లతో వీధిలైట్లు మసక మసగ్గా వెలుగుతున్నాయి. ఆ ప్రశాంతతను భేదిస్తూ ఫెయిర్ ఇంజన్ కేకవేస్తూ పరిగెత్తింది.
కాలూ ఉద్రేకం తుదముట్టింది. అడగాల్సిన ప్రశ్నలూ కనిపించలేదు. అతని మెదడు పూర్తిగా కాళీఅయిపోయింది. కాని అగాధమైన అతని మనసులో ఒక పోరాటం సాగుతోంది. కొన్నినెల్లక్రితం తనలోని ఒకభాగం విడిపోయి కోర్టుబోనులో పడిపోయింది. అంతకంటే పెద్దభాగం జేలు గేటుముందు పోయింది. నేటిరాత్రి కాలూ వ్యక్తిత్వపు ప్రధానభాగం బోగంకొంపలోని తివాసీమీద పడిపోయింది.
మరి లేఖ? నరకంనుంచి విముక్తురాలైందనే సంతోషం ఆమెకు ఏమాత్రం లేదు. ఆమె వ్యక్తిత్వం కోలుపోయి గుల్లగా అయిపోయింది. ఆమె కోరిందల్లా నిద్ర లేక చావు. రిక్షాకు ఉన్న ఇనుప సీకును పట్టుకొని కళ్ళుమూసుకొని కూర్చుంది. మళ్ళీతెరిచే అవసరం లేనంతగట్టిగా మూసుకుంది. క్రిందగా పోతూన్న విమానధ్వని విని మళ్ళీ వారు ఈ లోకంలోకి వచ్చారు. కాలూ పైకిచూచినప్పుడు మొదటిసారిగా అతని దృష్టి కూతురుమీద పడింది. ఆమె అతన్ని చూడలేదు. వారు విమానంతో బాటు ఆకాశంలో విహరిస్తున్నారు. దిగిరావడం వారికి ఇష్టంలేదు.
ముఖాన దుఃఖమూ విచారమూ తాండవం ఆడుతూ, కళ్ళక్రింద లోతుగుంటలు కలిగి వెంట్రుకలు చెదిరిపోయి ఉన్న లేఖ కాలూకు కొత్తగా కనిపించింది. నీలిరంగు ఉల్లిపొర చీర కట్టుకున్న ఆమె శరీరంలోంచి కస్తూరి పరిమళం వస్తూంది. కాని పుల్లని వాంతి వాసన ఘప్పుమని ఆ పరిమళాన్ని మింగేస్తూంది.
