Previous Page Next Page 
వారధి పేజి 16


    "అదా....అదా....అదేంలేదు వదినా! ...ఉత్తదే ....ఆది రక్తం కాదు....దెబ్బ కూడా  తగలలేదు....ఉత్తిదే....రంగు....ఆ....ఆ....ఎర్రసిరా రంగు....స్కూల్లో పక్క పిల్లాడు  పోసేడు" రాజు తడబడుతూ చెప్పిన ఆ మాటల్ని  నవ్వుతూ  విన్నది మీనాక్షి.

    "పిచ్చిపిల్లాడా! అబద్ధం  చెప్పడం కూడా  నీకు చేతకాదు. పోయి మీ అన్నని కాలు కడిగి  కాస్త  కొబ్బరి నూనె  రాయమను" అంది మృదువుగా.

    పాపని  మరి కాస్తసేపు  దగ్గిరగా  చూసి  వెళ్లి పోయేడు  రాజు.

    పదకొండవ రోజున  బారసాలచేసి 'అన్నపూర్ణ' అని పిల్లకి  పేరుపెట్టేరు. మొదట్లో   అర్భకంగా  వున్నా  మూడోనెల వచ్చేసరికి  బొద్దుగా, ముద్దుగా తయారయింది  అన్నపూర్ణ. శివయ్యా, మీనాక్షి  కూతుర్ని  'పూర్ణా' అని పిలుచుకొనేవారు. పూర్ణంటే  వరదరాజుకి  వల్లమాలిన  అభిమానం. ఇంట్లో ఉన్నంతసేపూ  పూర్ణని  క్షణకాలం  వదిలి  ఉండేవాడు కాడు.


                                   2


    కారుల్ని  బస్సుల్ని  తప్పుకొంటూ, గంటలూ  మువ్వలూ సవ్వడి  చేసుకొంటూ  వివేకానంద హాస్టలు ఆవరణలో  ప్రవేశించింది ఎడ్లబండి. బండిలోని  సరుకును, మొదట్లో  కూర్చున్న  అబ్బాయిని వింతగా  చూసేరు ఇటు అటు తిరుగుతున్న  విద్యార్ధులు.

    వరదరాజుకి  తను పోవలసిన  స్థలాన్ని  గురించికాని, కలుసుకోవలసిన  వ్యక్తులను  గురించికాని సరిగా తెలియదు. కాలేజీకి, హాస్టలుకి  సొమ్ముకట్టిన  నాడు  అన్నతో  రావడమైతే  వచ్చేడు కాని, ఈ రోజు హాస్టలు చూస్తుంటే  ఎటుపోవాలో, ఎవర్ని  అడగాలో  అర్ధం కాలేదు.

    బయలుదేరేముందు  అన్న  చెప్పిన మాటమాత్రం  గుర్తుంది. "గేటు లోంచి తిన్నగా  పోయి  కుడిచేతివైపు  తిరిగితే ఎర్రటి ఇటుకరంగులో  ఉన్న  పెద్దహాలు  కనిపిస్తుంది. సత్తిబాబు  వచ్చేవరకూ  అక్కడే పెట్టె  పెట్టుకొని  కూర్చో. అతడు వచ్చి  అన్నిఏర్పాట్లూ  చేస్తాడు. ఎవరైనా  అడిగితే  హాస్టల్లో  చేరిందికి  వచ్చేనని, పెద్దవాళ్లు  వెనకనించి  వస్తున్నారనీ  మాత్రం  చెప్పు."

    బండి గేటుదాటి  కంకరరోడ్డుమీద  ఫర్లాంగు దూరం  నడిచే సరికి  బాట రెండుగా చీలిపోయింది. ఎడమవైపు కొంచెం  దూరంలో  ఎత్తయిన రెండంతస్తులమేడ, తిన్నని వరండాలతో, చిన్న చిన్న గదులతో, తెల్లగా  పాలరాతి సౌధంలో కనిపిస్తున్నది. 'అదే పిల్లలుండే  హాస్టలయి  వుంటుంది' అనుకొన్నాడు వరదరాజు.

    "కుడిచేతివైపు  పోనీ  రాములూ!" ధైర్యంగా  అక్కడ  అంతా  తనకు తెలుసు నన్నట్లు  అన్నాడు  వరదరాజు.

    "చూసినావా  రాజుబాబూ! పట్నంలో  కాలుపెట్టేసరికి  ఎంతో పెద్దోడిలా  ఎలా మాట్లాడుతున్నావో? అస్సలు పట్నంగాలీ, నీరూలోనే ఆ శక్తి ఉందంటాడు  మా అయ్య." పల్లె  దాటేవరకూ  కళ్ళు  నులుపుకొంటూ  ఏడుస్తున్న  కుర్రాడు  ఆపాటి  సర్దుకున్నందుకు  రాములు సంతోషించేడు.

    ఎర్ర ఇటుక  రంగు  హాలుముందు  బండి  ఆగింది. వరదరాజు కిందికి దిగి బెదురుగా  ఇటూ అటూ  చూసేడు. రాములు రాజుపెట్టె, పక్కచుట్ట  కిందికి దింపి, మినప  సున్నిఉండల  డబ్బా  వరదరాజు  చేతికి  అందించేడు.

    "ఎవరు కావాలి?"__పక్కగా  ఉన్న చౌకీదారు  ముందుకి  వచ్చి బండివాణ్ణి  అడిగేడు.

    "ఈ అబ్బాయిగారు సదువుకోడానికి  వచ్చేరు. మాటలకి  పెద్దోరు వస్తన్నారు.... అంతదాకా...."

    "ఆ పక్క  అరుగుమీద  సామాన్లు  పెట్టుకొని  ఈ బల్లమీద  కూర్చో" వరదరాజు వేషం  చూసి, వరండావైపు  చూపిస్తూ  అధికారయుతంగా  అన్నాడు  చౌకీదారు.

    రాములు  రాజుసామానులు  అరుగుమీద  పెట్టి "ఇంక  నాను పోతాను రాజుబాబూ. మళ్ళా  ఊరు పోయేసరికి  ఎండెక్కిపోతాది" అన్నాడు.

    "ఒక్క నిమిషం  ఉండు  రాములూ!" అంటూ  వరదరాజు లాల్చీ జేబులోంచి  తాళం  చెవి తీసి  పెట్టె  తెరిచేడు. పై నున్న  బట్టల్ని  ఇటూ, అటూ  తిరగవేసి  ఒక చిన్నకాగితం, పెన్సిలు అందుకొన్నాడు. ఆ కాగితం మీద  ఒకే ఒక వాక్యం  వ్రాసి  రాములు  చేతికి  అందించేడు.

    "మా అన్నయ్యకి  దీనిని ఇయ్యి" అన్నాడు.

    రాములు కాగితాన్ని  చిన్నగా మడిచి తలపాగాలో  పెట్టుకొని  వెనుతిరుగుతూంటే  వరదరాజు "రాములూ!" అంటూ  పిలిచేడు.

    "ఏటి రాజుబాబూ! ఏటీ  బయంనేదు. సత్తిబాబు వత్తే  సిటికెలో అన్ని ఏర్పాట్లూ  అయిపోతాయి" అన్నాడు.     
    "ఇంద, ఇవి  తీసుకో." డబ్బాకి కట్టిన  గుడ్డ  ముడి విప్పితాళం  చెవిలో  మూత పెల్లగించి  మూడు మినప  సున్నిఉండలు  తీసి రాములు  చేతిలో  పెట్టేడు  వరదరాజు.

    "మా బాబు  సల్లగా  సదువుకొని  పెద్దోరు  కావాలి" అంటూ ఉండలు  అందుకొన్నాడు  రాములు.

    గంటల  శబ్దం  దూరమవుతూంటే  వరదరాజు గుండె  రెపరెపలాడింది. నాలుగు పక్కలనించి  వరద ముంచుకు  వస్తూంటే  ఒంటరిగా  కట్టుకొయ్యకి తగిలి  ఉండిపోయిన  లేగ  ఆవుదూడ  భయంతో  అంబా అంబా  అని  అరచినట్లు  రాజు మనసు 'అన్నయ్యా, వదినా' అంటూ  ఆక్రోశించింది.

    ఆ రోజు  మంగళవారం. ఉదయం  పదకొండు గంటల  సమయం. హాస్టలంతా  రమారమి  కాళీగా  ఉంది. సరిగా కాలేజీకి పోనివాళ్ళు, క్లాసు లేక కొంచెం  ఆగి  వెళ్ళవచ్చునని  ఆలస్యంగా  లేచినవాళ్ళు....ఏ కొద్దిమంది  విద్యార్దులో  ఇటు అటు తిరుగుతున్నారు.

    తోటమాలి  చెట్లకింద  రాలిన  ఆకులను  చీపురుతో  కుప్పగా పెడుతున్నాడు. ఒక వంక  ముడివిడి  కిందపడిన  ముళ్ళతీగెను  ధైర్యంగా దాటి వచ్చిన ఒకటి రెండు మేకపిల్లలు  ముద్దు ముద్దుగా  దారిపక్కనున్న  గడ్డి తింటున్నాయి. వాటిని  చూసేసరికి  వరదరాజుకి  ఎవరో  ఆత్మీయులు  కనిపించినట్లయింది. వరండా  దిగి నాలుగడుగులు  ముందుకివేసి  వాటి  వంక ఆప్యాయంగా  చూసేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS