Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 16


    అలాంటి రక్షరేఖ పట్నంనుంచి వచ్చిన వర్తకుడికి మూడుశేర్ల బియ్యానికి అమ్మింది. సంవత్సరం క్రితం అవుతే ఆ బియ్యపు వెల అర్ధరూపాయి. రక్షరేఖగా కాకున్నా మెడల్ కు వెండివిలువ ఉంది. ఆమె దాన్నికూడా వదలుకుంది. అంతకంటే చేయగలిగింది మాత్రం ఏమిటి? వర్తకుల దగ్గర తప్ప అది కొనేంత డబ్బు ఎవరిదగ్గర ఉంటుంది? ఆమె బంగారు గాజులు లాక్కుపోయి ఇంకా అర్ధసంవత్సరం కూడా కాలేదు.
    "వెల్వెట్ కేసు ఉంచుకోవాలా?" అని అడిగింది లేఖ కనీసం అదైనా మిగులుతుందనే ఆశతో. వర్తకుడు గుడ్లుమిటకరించి మరికాసిన్ని గింజలు తీశాడు. వాటిని మూడు శేర్ల బియ్యంలో విసిరి "ఇదిగో ఇవి కేసుకు చాలా? అబ్బ! మంచి బేరకత్తెవే? ఈ పతాకం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఎన్నాళ్ళు? మళ్ళీ కొద్దిరోజుల్లోనే ఇది నీది అవుతుంది" అన్నాడు. అతని దృష్టి ఆమె ముఖాన్ని పట్టుకొని వ్రేలాడింది. ఆమె గుండె రెపరెపా కొట్టుకుంది. "ఏదో కాలం గడవనీ కాలం ఈరోజులు ఉండబోతాయా? పస్తులు మాత్రం ఉండకు. అదిగో చూడు. అప్పుడే కళ్ళచుట్టూనల్లని చారలు ఏర్పడ్డాయి. యవ్వనంలో మాంసిలములై ఉండాల్సిన కపోలాలు పీక్కొపోతున్నాయి. అందాన్ని జాగ్రత్త పర్చుకో" అంటూ సంచీలోకి పిడికిలి పోనిచ్చి" ఇవి కూడా తీసుకో" అన్నాడు. మళ్ళీ సంచిలోకి చేయిపోనిచ్చి "ఇదిగో ఇవికూడా" అని మూడవ పిడికిలి ఖాళీచేశాడు. "నీవి వరాల చూపులు. జాగ్రత్త" అన్నాడు. లేఖ సిగ్గుతో చచ్చిపోయింది. ఏదో పెద్దదయచూపినట్లు ఇచ్చిన గింజలన్నీ తిరిగి ఇచ్చివేయాలనుకుంది. కాని ఆమెగుండె నీరసించింది. చేయిమొద్దు బారిపోయింది.
    "దేవుడు మేలుచేస్తే తిరిగి కలుసుకుంటాం అని చెప్పాను కదూ"
    లేఖ గిరుక్కున తిరిగి చకచకా వెళ్ళిపోయింది.
    "ఆ పట్నపు వర్తకుని దగ్గర ఏమీ కొనబోకు" అంది మర్నాడు బామ్మ.
    "అందరూ అలాంటి నీచులే, ఏంచేస్తాం మరి?"
    ఆకలికి పీక్కుపోయిన బామ్మ ముఖం మీద కోపరేఖలు గోచరించాయి. "వాడు విషనాగు. వాడి వీపున ముప్పై చీపురు దెబ్బలు పడాలి" అని అరిచింది.
    లేఖ అదిరిపడి కేక వేసింది.
    "దుర్గా, దుర్గ, దుర్గ" అంటూ వగరుస్తూ జపించింది బామ్మ. కొంతసేపటికి ఆమె చల్లబడింది. "వాడు నీచుడు దుర్మార్గుడు. వాడు...." ముసలిది నాలుక కరుచుకుంది. "ఆ విషపు పురుగునుంచి దూరంగా ఉండు. మళ్ళీ గుమ్మం తొక్కుతోనే చూసుకుంటా" ఆమె ముఖం మీద అగ్గి భగ్గుమంది. కంపించే స్వరంతో "ముప్పైచీపురు దెబ్బలు" అన్నది.
    "మనం ఒక్కళ్ళమేనా? ఊళ్ళో ఎంతమంది లేరు. ఎవరో పొరక పుచ్చుకున్నారట. పాము పారిపోయిందటలే. ఇంక మళ్ళీ ఝార్నాలో కనిపించదు."
    ఆకలి వార్ని మాడ్చేసింది. ఆశలు అడుగంటాయి. అప్పుడు కాలూ దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది.
    లేఖ గుండెను పిండి చేస్తున్న భయం దూరం అయింది. కారు మబ్బుల్లో కాంతిరేఖ గోచరించింది. కాలూ జీవించి ఉన్నాడు. అతడు క్షేమంగా ఉన్నాడు. ఇంక పీడ కలలు లేఖను బెదిరించి మేల్కొల్పలేవు.
    ఆకలిమాత్రం అలాగే నిల్చిపోయింది. అయినా లేఖ పూర్వంలా నవ్వనూగలదు. ఆనందించనూగలదు. ఆకలితో పోరాడనూ గలదు. బాబు క్షేమంగా ఉన్నాడు. ఇంకేంకావాలి? ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది.
    రెండు రూపాయి నోట్లు తీసుకొని బామ్మ దుకాణానికి పరుగెత్తింది. లేఖ మాత్రం చేతిలో ఉత్తరంలో నేలమీద చతికిలపడింది. ఎరుపు టెలిగ్రాఫు ఫారాల మీద ఉన్న అక్షరాల్ను ఒక్కొక్కటే అనేకసార్లు చదివింది. కాలూ ఒక అక్షరం తప్పు రాశాడు. అందువల్ల దాని రమ్యత పెరిగింది కాని తరుగలేదు.
    అవి శాశ్వతంగా స్మృతిపథంలో నిలిచిపోయే గడియలు.
    ఆదుర్దా చల్లారింది. ఆమె ఉత్తరంలోనే మరొక అంశం చూచి కలత చెందింది. బాబుగడ్డుకాలం గడిపాడు. ఏమిటా గడ్డుతనం? తనకాళ్ళమీద నుంచోడానికి పోరాడుతున్నాడు.
    స్మృతిపథం నగరంలో ఉన్న తండ్రిని చూడాలనుకుంది. ఆమెకు తన కలకత్తా యాత్ర స్మృతి ఫలకంమీద మెరిసింది. విశాలమైన సిమెంటురోడ్లు, వాటి పక్కన రాజభవనాల్లాంటి అంబర చుంబిత సౌధాలు ఉన్నాయి. రోడ్లమీద చక్కని దుస్తులు వేసుకున్న ప్రజలు గుంపులుగుంపులుగా నడుస్తున్నారు. నెత్తిన విద్యుత్తంత్రులు తగిలించుకున్న ట్రాములు రోడ్లవెంట పరిగెత్తుతున్నాయి. ప్రపంచంలోకెల్ల పెద్దసంతలా పెద్దపెద్ద దుకాణాలు అందంగా అలంకరించబడిఉన్నాయి. నగరం మొత్తంమీద ఇంట్లో వండుకునేవాడే లేనట్లు వందలకువందలు హోటళ్ళు ఉన్నాయి. ప్రతి హోటల్లోనూ ఉల్లిముక్కలు ఉండి చమురు కారుతూన్న మాంసపు ఉండలు కనిపిస్తున్నాయి.
    అలాంటి మహానగరంలో మనిషికి గడ్డుకాలం రావడం ఏమిటి? తన కాళ్ళమీద నుంచోడానికి మూడునెల్లు పడుతుందా? పనితనంగల మనిషికి మంచిపనీ, వేతనమూ దొరక్కపోవడం ఏమిటి?
    ఆమె ఊహాసౌధం కూలిపోయింది.
    "అతడు బాధపడ్డాడు. పడుతున్నాడు" ఆ మాటలు ఆమె గుండెలో గూళ్ళు కట్టుకున్నాయి. ఏంబాధ? ఎలాంటి బాధ? తిండి దొరకడంలేదా? ఆకలి జాడ్యం ఆ మహానగరానికికూడా పాకిందా? లేక జబ్బున పడ్డాడా? వీధిలో ఏక్సిడెంట్ జరగలేదుకదా?
    అతడు రెండు రూపాయిలు ఎందుకు పంపాల్సివచ్చింది? డబ్బు విషయం స్ఫురించగానే ఆమె ఆలోచనలో మునిగిపోయింది. అప్పటికే డబ్బు గింజగా మారిపోయింది. డబ్బు కర్చుచేయకుండా తిరిగి పంపుతే? "బాబు! ఇంట్లో ఇంకా గింజలున్నాయి. గుంటల్లో పట్టుకున్న చేపలు తింటూ బియ్యం పొదుపు చేసుకుంటున్నాం. దొడ్లో గుమ్మడితీగ కాయలు కాస్తూంది. నీకు మంచిరోజులు వచ్చేదాకా డబ్బు పంపాల్సిన అవసరం లేదు" అని వ్రాసి ఉండేది.
    లేఖ వరండాగోడకు ఆనుకుని అలాగే కూర్చుండిపోయింది. బాబు ఎండు డొక్కతో ఉంటే ఆమె ఎలా తింటుంది? ఆమె కళ్ళు బాష్పపూర్ణములు అయినాయి. ఆ మసకలో ఆమెకు తండ్రి కనిపించాడు. ఎప్పుడూ కూర్చునేచోటనే తిత్తి ఊదుతూ, సమ్మెట లేపుతూ కనిపించాడు.
    వారి ఇంటికి చెడుగు చుట్టుకుంది. బామ్మ పూజలుచేసి దాన్ని తొలగించాలనుకుంది. తూర్పు ఎర్రవారకముందే లేచేది. దర్భాసనం మీద పద్మాసనం వేసి కూర్చొని స్వర్గంలో దేవతల దయను అర్ధిస్తూ, ఆమె అంతరాత్మ అరుస్తూందా అన్నట్లు, ప్రార్ధనలు, పూజలు సాగించేది. ఒకనాటి తిండికి సరిపోయేంత డబ్బుతో ఆమె పరిమళద్రవ్యాలుకూడ కొన్నది. అగరుధూపాల వాసనతో గుబాళించే ఇంటిని దేవతలు దీవిస్తారట! అయితే దేవతలేరీ! వారెక్కడున్నారు?
    అయినా వృద్ధురాలు ఆశవదులుకోలేదు. యుగయుగాలుగా వస్తున్న నమ్మకాలు ఆమె బొమికల్లో జీర్ణించాయి. లేఖ ఓపిక చచ్చింది. ఆమె గుండె "దేవతలేరీ?" అని అరిచేది. కాని పెదవి కదిలేదికాదు.
    బామ్మ బజారునుంచి సంచితో బియ్యం తెచ్చింది. లేఖ నేలమీద కూర్చొని ఉత్తరం వ్రాస్తూంది. ఆమె జీవితంలో వాస్తవంగా వ్రాసిన ఉత్తరాల్లో అదే మొదటిది. స్కూల్లో ఉత్తరాలు తప్ప ఆమె అప్పటికి ఉత్తరాలు వ్రాసి ఎరుగదు. ఆమె చేయి వణికింది. తన్ను గురించి ఏమని వ్రాయాలి? నిజం వ్రాస్తే బాధపడ్డాడు. ధైర్యం కోల్పోతాడు. అతడుపడే బాధలు చాలక పైగా ఇదొక బాధా? నిజం కప్పిపుచ్చి సంతోషం ప్రకటిస్తే? అందులో బూటకం కనిపిస్తుంది. పరిస్థితి నిజం చెప్పిందానికంటే అధ్వాన్నం అయిపోతుంది. ఉత్తరాలు రాసింది. చింపింది. రాసింది. చింపింది. బొమలు ముడివేసి ఆలోచిస్తూ కూర్చుంది.
    గంటల తరబడి కూర్చొని ఉత్తరం వ్రాసింది. మరుసటిరోజు పోస్టుచేసింది. ఆమె విచారం కరిగిపోయింది. తన కాళ్ళమీద నుంచోవడానికి పోరాటమా? అతనికి విజయం లభిస్తుందనడం నిస్సందేహం. తండ్రి విషయం ఆమెకు బాగా తెలుసు. ఆమెకు అతని విషయంలో సంపూర్ణవిశ్వాసం ఉంది. అతనిది దృఢనిశ్చయం, ఉక్కులాన్తి శరీరం. ఆమె గాఢమైన విశ్వాసం క్షణంకూడ సడలదు.
    అలాంటి ఆలోచనలు ఆమెలో ఆనందాన్ని పొంగించాయి. బాబు జీవనసంగ్రామంలో యోధునిగా నగరంలో పోరాటం సాగిస్తున్నాడు. లేఖ కూడా జాగ్రత్తపడాలి. ఒకపూట తిండి అయిదుముద్దలకే తగ్గించాలి. మంచిరోజులు అట్టే దూరం లేవు.
    జనం ఆకలితో చస్తున్నారు. కాన్వెంటుస్కూలు మూసివేయాల్సి వచ్చింది. ప్రధానోపాధ్యాయిని మదనపడింది. పట్నం వెళ్ళింది. పిల్లలకు ఆహారకేంద్రం ప్రారంభించడానికి విరాళాలు పోగుచేసింది. పాఠశాల విద్యార్ధినులే కేంద్రం నడిపిస్తారు. లేఖ అన్నం వండుతుంది. వడ్డిస్తుంది. అది ఒక ఆనందం. అది ఒక సంతోషం. తెల్లవారితే తాను చేయబోయే పని తలచుకొని ఆమె గుండె పూసింది. బాబు క్షేమంగా ఉన్నాడు. తాను ఇతరులకు సేవ చేస్తుంది. కొన్ని వారాల తరువాత మొదటిసారిగా ఆమెకు కంటినిండా నిద్రపట్టింది. తూర్పుతెల్లవారకముందే లేచింది. స్కూలుకు వెళ్ళింది. ఆకలితో ఉన్న బాలబాలికలు ఆమెకంటే ముందే పాఠశాలకు వచ్చేశారు. ఆకలితో అలమటించేముఖాల్తో వారు వరండాలో పడి ఉన్నారు. నెలలతరబడి ఉపవాసాలతరువాత వారు మొదటిసారిగా తిండి తినబోతున్నారు. లేఖ బకెట్టు తీసుకుంది. అందులో పెద్ద గరిట ఉంది. అరటి ఆకులు ముందువేసుకొని బాలురు వరుసలుగా కూర్చున్నారు. లేఖ పొగలుకక్కుతూ ఉన్న అన్నం వడ్డిస్తూంది. ఎముకల ముఖాలు చిగిర్చాయి. తెల్లని నన్ బట్టలు వేసుకున్న ప్రధానోపాధ్యాయిని అటూఇటూ పచారు చేస్తూ, 'అంతేబిడ్డా! అలాగే అలాగే వడ్డించడం. మనదగ్గర ఒక వారానికి సరిపోయేంత సామాగ్రి ఉంది. మళ్ళీ ఆదివారానికల్లా ఇంకా వస్తుంది," అంటున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS