ఆమె తనకేమీ కాదు. ఆమెపై తన కెటువంటి ప్రేమాభిమానాలూ లేవు. ఒంటరి ఇల్లు తన్ను పిచ్చివాడిని చేస్తున్నది. మీనాక్షి తిరిగి వస్తే మళ్ళా బ్రతుకు కలకల్లాడుతుంది. తను అన్నపూర్ణను గురించి తలచబోడు. ఆమె జ్ఞాపకాలు తన మనసుని గాయపరిచేటంత శక్తివంతమైనవి కావు. దులపరించుకొని వాటిలోంచి బయటపడాలని ప్రయత్నించేడు శివయ్య. పురిటికి పోయిన భార్య రాకకై వేయికళ్ళతో ఎదురుచూస్తూ కాలం గడపసాగేడు.
మూడు నెలలనాడు మీనాక్షి తిరిగి వచ్చింది. బిడ్డని చూసుకొనే అదృష్టం శివయ్యకి కలగలేదు. నెలలు నిండక పూర్వమే పుట్టిన ఆడపిల్ల ఆరుగంటలకాలం బ్రతికి కన్ను మూసింది.
వరదరాజును చూసుకొంటూ మీనాక్షి తన బాధ అణచుకో సాగింది. "కొడుకులా చూసుకొంటున్నది. 'అమ్మా' అని పిలవడం నేర్చుకో" అన్నారు ఇరుగుపొరుగువాళ్లు.
"అలాకాదు, వరదుడు నన్ను 'వదినా' అనే పిలవాలి. అప్పుడు నేను అత్తయ్యని మరిచిపోయే ప్రమాదం వుండదు" అంది మీనాక్షి.
వరదరాజు "వదినా! ....వదినా!" అంటూ వెంట తిరుగుతూనే రోజుల్ని, సంవత్సరాల్ని ఒంటికి కలుపుకొంటూ పెరగసాగేడు. గ్రామంలోని ఎలిమెంటరీ స్కూలు చదువు పూర్తి చేసుకొని పట్నంలోని హైస్కూలులో చేరేడు.
ఈ మధ్యకాలంలో మీనాక్షికి మూడుసారులు నెల తప్పినా, నాలుగైదు మాసాలకే గర్భం నిలవకుండా పోతూ వచ్చింది. "అత్తగారు దయ్యమై కోడలికి పిల్లలు కలగకుండా చేస్తున్నది. ఆమెకు పిల్లలు పుడితే తన కొడుకుని సరిగా చూడదేమో అన్న అనుమానంతో ఇలా చేస్తున్నది" అంటూ వ్యాఖ్యానించడం మొదలుపెట్టేరు గ్రామంలో కొందరు చాదస్తులు. ఒకరిద్దరు పెద్ద ముత్తయిదువులు "అమ్ముడూ, ఈసారి నెల తప్పగానే తలంటు నీళ్లు పోసుకొని, కొత్త చీర కట్టుకొని మీ అత్తగారికి దండం పెట్టుకో. నాకు పిల్లలు పుట్టినా మీ పిల్లాడిని పెంచి పెద్దచేస్తానని మొక్కుకో. నీ గర్భం నిలుస్తుంది" అంటూ సలహాలు ఇచ్చేరు.
ఊదరపెట్టే ఈ మాటలు యెంత లేదనుకొన్నా శివయ్య మనసులో కూడా ప్రవేశించాయి. తిరిగి భార్య గర్భవతి అయితే వెంటనే ఆమెను పుట్టింటికి పంపివేయాలనుకొన్నాడు.
వరదరాజు ఏడో క్లాసులోకి వచ్చేసరికి మీనాక్షికి తిరిగి నెలతప్పింది. మూడునెలలు పూర్తి కాకుండానే శివయ్య ఆమెను పుట్టింటికి ప్రయాణం కట్టించేడు.
"ఇప్పటినుండి నేను వెళ్లిపోతే వరదుడి తిండితిప్పలు ఎవరు చూస్తారు?" అంది మీనాక్షి.
"ఏదోవిధంగా నేను చూసుకొంటాను మీనాక్షీ. ఈ ఇంటిలో నువ్వు వుంటే ఈసారికూడా మనకి బిడ్డ దక్కదనిపిస్తున్నది. నామాట విని వెళ్లిపో" అన్నాడు శివయ్య.
భర్త ముఖంలోకి వింతగా చూసింది మీనాక్షి.
"పైవారు అంటున్న మాటల్ని మీరుకూడా నమ్ముతున్నారా?" అంది ఆశ్చర్యంగా.
శివయ్య 'అవు'నని జవాబు చెప్పలేకపోయేడు. 'కా'దని నిర్ధారించలేకపోయేడు. భర్త మౌనాన్ని చూసి బాధపడింది మీనాక్షి.
"చచ్చిపోయిన తరవాతకూడా అత్తయ్యకి ఈ ఇంటి మంచిచెడ్డలమీద ఆపేక్ష ఉంటే మనకి మంచే చేస్తుందికాని చెడు చెయ్యదు. ఆమె దేవత అయి నన్ను ఆశీర్వదిస్తుందంటే నమ్మగలను కాని, దయ్యమై నా బిడ్డల్ని పొట్టపెట్టుకొంటున్నదనే మాట కలలో కూడా ఆమోదించలేను.
"ఆమెమీద ప్రేమానురాగాలు మీకు లేవు. నాకు ఉన్నాయి. ఈసారి పురుడు నేను ఇక్కడే పోసుకొంటాను. నా కటువంటి భయంలేదు" అంది నిశ్చలంగా.
అమ్మలక్కల మాటలకి విలువ ఇచ్చి పిరికిపందలా తను ఆ విధంగా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు శివయ్య. తిరిగి భార్య పుట్టింటికి పోయే ప్రస్తావన చెయ్యలేదు.
* * *
వరదరాజు ఆఖరు పరీక్ష వ్రాసి ఇంటికి వచ్చేసరికి ఇంటిలోంచి కార్.... ....కార్ మంటూ చంటిపిల్ల ఏడుపు వినిపిస్తున్నది.
"వదినకు కూతురు పుట్టింది" అన్నాడు శివయ్య సంతోషంగా.
ఆత్రంగా వరదరాజు గదిలోకి పరుగుతీయబోయేడు.
"ఊర్లన్నీ తిరిగి వచ్చేవు. ముందు పెరట్లోకి పోయి కాళ్లు కడుక్కొని, బట్టలు మార్చుకొని రా." రమణమ్మ అడ్డు పెట్టింది.
పరుగుతో వెళ్లిన రాజు నూతి చపటా మీద జారిపడ్డాడు. కొత్తగా కట్టిన చపటా అంచు కాలికి తగిలింది. కాలు చిట్లిన చోటునించి రక్తం కారుతూంటే ఆ రక్తంమీద రెండు చెంబుల నీళ్లు దిమ్మరించుకొని గదిలోకి పరుగుతీసేడు వరదరాజు.
బట్టలస్టాండుకి ఇంట్లో కట్టుకొనే లాగుమాత్రం ఉంది. లాల్చీకోసం గది అంతా వెతికినా రాజుకి కనిపించలేదు. ఎదురుగా మంచంమీద అన్నయ్య లాల్చీ వుంది. ఆ పొట్టిలాగుమీద అన్నయ్య లాల్చీ తొడుక్కొని వీథి గదిలోకి పరుగుతీసేడు. "వదినా, పాపేదీ?" అంటూ.
చెరిగి చిందరవందరగా ఉన్న జుట్టు కంటిమీద పడుతూంటే పైకి తోసుకొని పాపని బాగా చూడాలని చేయి ఎత్తేడు వరదరాజు. వాడి అరచేతులు ఆ లాల్చీ చేతుల్లో ఏ సగంలోనో ఉండి పోయేయి. మరిదిని ఆ రూపులో చూసిన మీనాక్షికి నవ్వు ఆగలేదు. తలనుండి కాళ్ల వరకూ చూస్తూ "నీ లాల్చీ కనిపించలేదా వరదం. అన్నయ్యది తొడుక్కొన్నావు?" అంది.
అంతలో ఆమె దృష్టి కాలు చిట్లి కారుతున్న రక్తంపై పడింది.
"నీ కాలికేమైంది? ఎక్కడ పడ్డావు?" ఆత్రంగా పక్కమీద లేచి కూర్చుంటూ పరీక్షగా చూడసాగింది మీనాక్షి.
