"అయ్యా!............"
మునిసిపాలిటీ మనిషికి కోపం వచ్చింది.
"గొనగడం మీకున్న రోగమే. అది నాకు తెలియందేమీకాదు. మీరొదంతా వినే ఓపిక నాకులేదు. మళ్ళీ నీముఖం చూపకు"
కాలూ ఒక గొందిలోకి వెళ్ళిపోయాడు. తల రెండు చేతుల్తోనూ పట్టుకొని కూర్చుండిపోయాడు.
జేలువాసన. జేలుచూపు.
ఆర్తనాదాల రణగణధ్వని అతన్ని ఆలోచనలోంచి బైటపడేసింది. ఆర్తనాదాలు కార్ల హారన్లతో కలిసి ప్రతిధ్వనిస్తున్నాయి. గొంది చివరిదాకా వెళ్ళాడు. చూడగానే అతనికి ఏమీ అర్ధంకాలేదు. బ్రాహ్మలు పూలపాడెమీద మోసుకొని పోతున్న ఒక శవం కనిపించింది. దానివెంట ఒక డజనుమంది చేతులెగరేస్తూ చిత్రంగా నినాదాలు చేస్తున్నారు.
"పేరు పలకండి. మరి పేరు మాసింది. పేరు కాపాడాలి. పలకండి పేరు. అన్నలూ! తమ్ములూ పలకండి పేరు" అని అరుస్తున్నారు.
ఊరేగింపు చివర ఇద్దరు మనుషులు కప్పులేని కారులో నుంచున్నారు. వారు సంచిలోంచి బియ్యం తీసి రోడ్డుమీద వెదచల్లుతున్నారు. మధ్యమధ్య పైసలు కూడ గుప్పిళ్ళతో చల్లేస్తున్నారు. రాగి డబ్బులకోసం జనం నెట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. కొందరు గింజలు ఏరుకొని సంతృప్తి చెందుతున్నారు.
కాలూ పట్నానికి కొత్త. ధనికశవపు ఊరేగింపును ఆసక్తితో చూచాడు. చూపందినంత సేపూ చూసి తిరిగి గొందిలో దూరాడు. ఆత్మను ఆకాశానికి పంపడానికి చనిపోయినవారి పేరు బిగ్గరగా అరుస్తున్నారు. అలా చేయకుంటే తరువాత జరిగే కర్మకాండ అంతా వృధా అవుతుంది. వారి ఆత్మ నేలమీదనే నిల్చిపోతుంది. వీధుల్లోచల్లిన గింజలూ. డబ్బూ చనిపోయినవాడికి పుణ్యం సంపాదించి పెడ్తాయ్. ఆ పుణ్యం అతనికి స్వర్గంలో స్వాగతం చెబుతుంది.
వీధుల్లోపడి చచ్చేవాళ్ళ గతేంకాను? వారు శాశ్వతంగా పిశాచాలుగా భూమిమీద నిలిచిపోవాల్సిందేనా? కాకుంటే శాశ్వతంగా నరకంలో పడిచావాల్సిందేనా? వారి పేరుతో మంత్రాలు చదివేదెవరు? భౌతికకాయాన్ని మేపడానికి గింజలు వెదజల్లేది ఎవరు? వీధుల్లోపడి చచ్చే ఎముకల పోగులకు దహన సంస్కారమూ, వేదపఠనా ఎలా జరుగుతాయి? స్వర్గం ధనికుల గుత్తసొమ్మేనేమో!!
కాలూ దుమ్ములోనే పడి మేనువాల్చాడు. ఆ ప్రశ్నలు అతన్ని కలవరపెట్టాయి. సమాధానాలు ఊహాపథంలో ఎక్కడా గోచరించలేదు. అనాదిగా అతనిలో పేరుకున్న విశ్వాసాలమీద ఆ ప్రశ్నలు ద్రావకంలా పనిచేశాయి.
* * * *
రజనీ కాలూను మిత్రునిగా ఆహ్వానించాడు. "నాకుతెలుసు - నీవు బాగా ఆలోచించుకొని తిరిగి వస్తావని. నీవు ఈపనికి ఖచ్చితంగా సరిపోతావు. మానవ ప్రకృతిని గురించి నాకు కొద్దిగా తెలుసులే. "రజనీ కాలూను అయిదు వేశ్యాగృహాల్లో పనిచేయడానికి నియోగించాడు. వాటిల్లో ఒకటి ప్రఖ్యాతమైంది.
"గాంధీటోపీ తగిలించుకో. కాస్తగౌరవం వస్తుంది" అని సలహా ఇస్తూ రజనీ వెళ్ళిపోయాడు.
మెట్లుదిగుతూ తలరుద్దాడు. ఉన్న వెంట్రుకలు కాస్తా ఊడిపోయాయి. నున్నటి బట్టతల పక్కన ఉన్నభాగంలో వెంట్రుకలు పల్చబడ్డాయి. కాలూ నడుస్తూ, నడుస్తూ ఒక పేవ్ మెంటు కొట్టుమీద ఒక తెల్లని గాంధీటోపీ కొన్నాడు. అది నేతబట్టది. టోపీ తలకు తగిలించి నడకసాగించాడు. మహాత్మునిపేరుగల టోపీ పెట్టుకుంటే తనకు కాస్త గౌరవం వచ్చింది అనుకున్నాడు. కొంత దూరం నడచి ఇంకో దుకాణం దగ్గర ఆగాడు. చిన్న అడ్డం తీసుకొని ముఖం చూచుకున్నాడు. ముఖం మారిపోయింది. తాను మారిపోయాడు! కొత్త జీవితంలో అడుగుపెట్టాడు. అతడు అనుకున్న జీవితం కాకపోయినాఅదీ కొత్త జీవితమే! తాను చేసేపని అసహ్యం అనిపించింది. అతడు అసహ్యాన్ని జయించలేకపోయాడు. భార్య చనిపోయిన్నాటినుంచీ అతడు అన్య స్త్రీ ముఖం ఎరుగడు. అతని జీవితం నిష్కల్మషం అయింది. ఆత్మ పవిత్రం అయింది. పతితల్ను చూసి బాధపడేవాడు. నేడు తాను వారికి ఏజెంటుగా తయారైనాడు. శరీరాల్ను అమ్ముకోవడానికి స్త్రీలకు కాలూ సహకరిస్తున్నాడు. డాక్టరు ఎముకల గూళ్ళు అమ్ముకుంటున్నాడు. తాను శరీరాల్నే అమ్ముతున్నాడు. తాను అతనికంటే ఏం తక్కువ?
జేల్లో బి-10 వీటన్నిటినిగుర౯ఇన్చే కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. యుద్ధం బెంగాలును రెండు కాటకాల్లో ముంచేసింది. ఆకలి దహించుకుపోతున్న అన్నార్తులు తమ భూముల్ని వదులుకొని భిక్షుకులుగా మారిపోయారు. అన్నీ కలిగినవారికి విలాసపు టాకలి పట్టుకుంది. అది మహా తాపంగా పరిణమించింది. పతితలూ, అనాథలూ ఆకలితో చస్తూ ఉన్నవారి విలాసపుటాకలికి తమ శరీరాల్ను బలి ఇవ్వాల్సి వస్తూంది.
భీకర పరిణామాల్ను గురించి బి-10 వర్ణించిన దాన్ని మననం చేసుకున్నాడు. దారిద్ర్యం వంగభూమిని తుడిచిపెట్టింది. చితికిపోయిన మానవత వంగదేశంలో తాండవ మాడింది. అది ఒక దుర్దినం. చరిత్రలో ఒక గాథగా నిల్చిపోయింది.
సార్టింగ్ అయిపోయింది. ఉత్తరం రాలేదు.
'బాగా చూచావా?" అని అడిగాడు అనుమానంగా బొంగురుపోయిన గొంతుతో. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. రిక్తంగా కదిలిపోతున్నట్లనిపించింది.
లేఖ రోగాన పడ్తే? కాలూ కూడా బజారు మనుషుల్లాగే రోడ్లమీద పడిపోతాడు.
మళ్ళీ ఇవ్వాళ పోస్టాఫీసు కిటికీ దగ్గర నుంచున్నాడు. సంచులకు సంచులూ సార్ట్ అయినాయి. కాలూకు ఉత్తరం రాలేదు. శ్వాస బరువుగా వచ్చింది. ఇంతట్లోకే పోస్టుమేన్ కాలూ పేరు పిల్చాడు. కిటికీలోంచి ఒక ఉత్తరం తనమీద పడింది.
కన్నీరు కట్ట తెంచుకుంది. చెక్కిళ్ళమీదినుంచి భాష్పాలు దొర్లిపోయాయి. లేఖ! అబ్బ! ఆమె కాలూనుండి ఒక్కముక్క వినడానికి ఎంత పరితపించింది? అన్నివైపుల నుంచీ ఆమెను భయం చుట్టివేసింది. ఊపిరి పీల్చలేనంతగా వణికిపోయింది. అయినా లేఖ చేయగలిగిందేమిటి? ఏమి చేయలేక దుఃఖం, భయం, బాధలమధ్య ఆత్మహత్యకు సిద్దపడింది. ఆ విపత్సమయంలో కాలూ ఉత్తరం అందుకోగానే ఆమె చేతులు కవరు చించలేనంతగా వణికిపోయాయి.
ఒకసారికాదు పదిసార్లు చదివాడు. రెండుపుటలమీద ఉన్న ముత్యాలన్నీ హృదయంలో హత్తుకునేదాకా చదివాడు. కన్నీరు ముంజేతితో తుడుచుకొని "చంద్రలేఖా! నేనంటే నీకంత ప్రాణమా? లేఖా! నిజంగానా?" అని గొణుక్కున్నాడు.
6
లేఖ తన మెడల్ అమ్మేసింది. తరువాత రెండు రోజులకు కాలూ ఉత్తరం అందింది. అన్నీ అమ్మేయడం జరిగిపోయింది. పరుపుల దగ్గరనుంచీ అమ్ముకున్నారు. అవసరాలకు, సరిపోయేవికూడా ఇంట్లోలేవు. పరుపులకు పిడికెడు గింజలు వచ్చాయి. ఆ వర్తకుడు వాటికి మెరిసే గుడ్డవేసి పట్నంలో మంచిధరకు అమ్మివేశాడు.
తండ్రి అమ్మకానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోక ఏంచేస్తాడు? అమ్ముకోకుండా బతికేది ఎట్లా? కాని మెడల్? అది డబ్బుకాదు. అది నీ ఆత్మగౌరవం. అది నువ్వే దాన్ని అమ్మడంవల్ల నీలో కొంతభాగం దాంతోపాటే వెళ్ళిపోయింది. పోయిన నీభాగం మళ్ళీరాదు. అది ఎన్నటికీ రాదు.
బాబుకు దుఃఖం కలుగుతుంది. అత్యాశతో అతడు మెడల్ను గంటల తరబడి చూచేవాడు. ఊరు విడిచి వెళ్ళేరోజుల్లో దాన్ని కేసునుంచి బయటికి తీసి చేతిలో పట్టుకుని నిశ్చలంగా చూచుకున్నాడు. "కూతురు విజయం మరిచిపోకుండా దాన్ని తీసుకెళ్ళకూడదూ?" అంది లేఖ హాస్యంగా. కాలూ నీరసంగా చిరునవ్వునవ్వి "నేనెలా తీసికెళ్తాను?ఇది అచ్చం వెండిముక్క మాత్రమేకాదు. చంద్రలేఖా! ఇది నీకు రక్షరేఖ" అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా "రక్షరేఖ!" అన్నది.
అతని గొంతులో వెలక్కాయ పడింది. ఎలా చెప్పుతాడు? చెప్పరాందే? లేఖ అతని ఉద్దేశం గ్రహించింది.
మెడల్ తరగతిలో అణగి ఉన్న లేఖను పైకెత్తింది. కులానికి అతీతమైన గౌరవాన్ని తనకు ప్రసాదించింది. అదే అతడు చెప్పదల్చుకుంది. కాలూ కళ్ళతో చూడ్డం లేఖకు సాధ్యపడదు. అతని దృక్కోణాలను ఆమె పంచుకోలేదు. మరి ఇదంతా ఏమిటి? ఇది అనుభూతి. అనుభూతి ఒక సామాన్య పథకానికి పవిత్రతను ఆపాదించింది. దాన్ని రక్షరేఖగా చేసింది.
