గాజుల పెళ్లికూతుర్ని పీటమీద కూర్చోబెట్టి అక్షింతలు వేసేరు ముత్తయిదువులు.
"మీరూ వచ్చి నాలుగక్షింతలు పిల్ల తలమీద వెయ్యండి, వదినా!" అంది రమణమ్మ.
"పచ్చటి కోడలి బ్రతుకులో నా చేయి ఎందుకమ్మా?" అంది అన్నపూర్ణ.
కళ్ళు మూసుకొని దేవుని ప్రార్ధించి మీనాక్షి తలమీద అక్షింతలు వేసింది అన్నపూర్ణ. ఏదో మాట అనబోతూంటే ఆమె నోటివెంట నురగ లాంటి ఉమ్మి వచ్చింది. వెంటనే విరుచుకు పడిపోయింది. అంతా కంగారుగా లేచి అక్కడికి వచ్చేరు.
"మూర్ఛ జబ్బు" అన్నారు కొందరు.
ముఖంమీద నీళ్ళు చల్లేరు. బిగుసుకు పోతున్న పిడికిడిలో తాళం చెవుల గుత్తి పెట్టేరు.
అన్నపూర్ణ కాలు చూసుకోవడం సంగతి చెప్పింది రమణమ్మ.
"ఏ పురుగైనా ముట్టిందేమో?"__ఎవరో అనుమానం వెలిబుచ్చేరు.
"ఏదో జాతి పాము కరిస్తే కొన్ని గంటలవరకూ సరిగానే ఉండి మనిషి ప్రాణం తీస్తుందిట?"__ఇంకెవరో మాట కలిపేరు.
పాముల మంత్రగాడు వచ్చేడు. మంత్రం వేస్తానన్నాడు. ఏమి ఫలితం లేకపోయింది. ఈశ్వరయ్య వచ్చి 'ధనుర్వాతం' అన్నాడు. ఏవో మాత్రలు అరగతీసి తేనెలో నాకించమన్నాడు. మందు కంఠ గతం కాలేదు.
తొమ్మిది గంటల వేళ అన్నపూర్ణ తనువు చాలించింది. ప్రాణం పోయేముందు కొంచెం తెలివి వచ్చింది. తన పక్కనే నీళ్ళు నిండిన కళ్ళతో కూర్చున్న మీనాక్షిని చూసింది. అతి ప్రయత్నంతో చెయ్యి పైకెత్తి మీనాక్షి కంటినీటిని తుడిచింది. క్షణకాలం ఆమెకళ్ళు యిటూ అటూ దేనికోసమో వెతుకులాడేయి. అంతలోనే అవి జీవం కోలుపోయేయి.
పన్నెండు రోజులు అయిపోయిన తరవాత వరదరాజుని తీసుకొని తల్లితో పుట్టింటికి బయలుదేరింది మీనాక్షి.
"వాడు నీతో ఎందుకు?" అన్నాడు శివయ్య.
"నాతో రాక ఎక్కడ ఉంటాడు?" అంది మీనాక్షి.
వరదరాజు ఇంట్లో అంతా ఏడుస్తుంటే తనూ ఏడ్చేడు తప్ప తల్లికోసం బెంగపెట్టుకోలేదు. మొదటినుంచి రాజు పెంపకం అంతా మీనాక్షి చేతుల్లోనే జరిగింది.
అన్నపూర్ణ పోయిననాటి రాత్రి తల్లిపక్క కాళీగా వుండడం చూసి "ఆమ్మేదీ, వదినా!" అని ప్రశ్నించేడు.
"అమ్మ దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది వరదం!" అంది మీనాక్షి, వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ.
"మళ్లీ వస్తుందా?" వెంటనే వచ్చింది రెండో ప్రశ్న.
"అమ్మ రాకపోతే నీకు నాదగ్గిర బాగుండదా, వరదం!" చేతులోకి తీసుకొంటూ ప్రశ్నించింది మీనాక్షి.
వదిన భుజంమీద వాలిపోతూ "బాగుంటుంది" అన్నాడు రాజు నిద్ర కళ్ళతో.
* * *
భార్య అత్తగారితో వెళ్లిపోయేక ఇల్లు వెలితిగా, బావురు మన్నట్లు అనిపించింది శివయ్యకి. తండ్రితో తను గడిపిన జీవితం తండ్రి చావుకి ముందు ఎంతో దీనంగా తనని బ్రతిమాలుతూ అన్నమాటలు గుర్తుకు వచ్చేయి. తన దురుసు సమాధానంతో ఆయన ముఖంలో మారిన రంగులు. ఆయన కంఠంలో పలికిన ఆవేదన, నిర్లక్ష్యంగా తను వెళ్లిపోతుంటే ఆయన చూసిన చూపూ మనస్సులో మెదిలేయి.
"అవాంఛితంగా మీ తండ్రీకొడుకుల జీవితాలలో నేను ప్రవేశించి మీ మధ్య గల ప్రేమాభిమానాన్ని మలిన పరిచేను. దానికి కారణం ఏమైనా కారకురాలిని నేను."
"నేను ఈ ఆస్తికోసం రాలేదు. నాలుగిళ్ల పాచిపని చేసుకొని నా బిడ్డడిని పెంచుకొంటాను" అన్న పినతల్లి మాటలు జ్ఞాపకం వచ్చేయి.
ఆమె యెంత బాధపడి ఆ మాటలు అని వుంటుంది? కాని వాటితో తన మనసు కరగలేదు.
"ఈ ఇంటి ఆడవాళ్ళు పాచిపనిచేసి పిల్లల్ని పెంచుకోనక్కరలేదు" అన్నాడు.
ఆ మాటలో కష్టంలోఉన్న పినతల్లిపట్ల జాలి లేదు. పసివాడిపట్ల అభిమానం అంతకన్నా లేదు. తమ ఇంటిపేరుకు మచ్చరాకూడదు. 'ఫలానా శివయ్య ఇలా' అనీ నలుగురూ చెప్పుకోకూడదు.
ఆ మాటలోని ఆదరాభిమానాన్ని గ్రహించలేనంత తెలివి తక్కువది కాదు ఆమె. అయినా పరువుకి కట్టుబడి వుండిపోయింది. ఆత్మాభిమానం కల ఆ ఇల్లాలు తనని దేనికీ దేవిరించలేదు. భగవంతుడిచ్చిన ఆ జీవితాన్ని కష్టమైనా, సుఖమైనా అనుభవించవలసిందే అన్నట్లు నడుచుకుపోయింది.
ఈనాడు ఆమె ఇంక లేదని తెలుసుకొన్నాక 'తను మరో విధంగా నడుచుకొని వుండవలసింది' అనుకొన్నాడు శివయ్య. తమ ఇంట కాలు పెట్టిన నాటి నుండి ఆమె తనపట్ల చూపిన ఆప్యాయతను తను ఒకనాడైనా తిన్నగా అందుకోలేదు. అభిమానంగా జవాబు చెప్పలేదు.
ఆమె ఈ లోకంనుంచి తరలిపోయే ముందురోజు తనని "శివా!" అని ఆప్యాయంగా పిలిచిన పిలుపు ఇల్లంతా వేనవేలు కంఠాలలోంచి పలుకుతున్నట్లు అనిపించింది శివయ్యకి.
ఇదేమిటి, ఆమెకోసం నేనింతగా యెందుకు బాధపడుతున్నాను? బ్రతికివుండగా పలకరించి ఒక మంచిమాట మాట్లాడని నన్ను ఆమె జ్ఞాపకాలు యెందు కింతగా చుట్టుముట్టుతున్నాయి? కళ్ళముందు ఉన్నంతకాలం నిర్లిప్తతగా మసలగలిగిన ఈ మనసు ఆమె లేదని తెలియగానే యెందుకింత వ్యాకులపడుతున్నది?
