అటువైపు కన్నెత్తైనా చూడనట్లే దాటిపోయాడు కాలూ. దగ్గర్లోనే ఉన్న మలుపు తిరిగాడు. గుండె వేగం హెచ్చింది. నడక సాగించాడు. ఎడమవైపున గేటు కనిపించింది. ప్రవేశించే ముందు చాలసేపు వెనకా ముందూ తిరిగాడు. అతని కాళ్ళు ఎరుపు మెట్ల దగ్గరికి లాక్కుపోయాయి. మూడవ అంతస్తు మీద రజనీ పేరుగల ఫలకం కనిపించింది. గొంతు ఆరిపోతూంది. నీళ్ళు తాక్కుంటేమాట పెకిలేట్లు లేదు. క్రిందికివెళ్ళి నీళ్ళు తాగివద్దాం అనుకుంటుండగానే వీధి నుంచి ఒక పరిచిత ధ్వని వినిపించింది.
"అయ్యా! ఆకలి చంపేస్తూంది. ఒక్క గుక్కెడు గంజి.......బాబూ బతకలేను. అయ్యా!....."
అది ఒక స్త్రీ ఆర్తనాదం. అది వంగదేశపు గుండియనాదం.
సిగ్గుతో చస్తూ తలుపుతట్టాడు.
రజనీ బయటికి వచ్చాడు. పొడుగుపాటి సన్నని ముఖం, గాజుగుడ్డలాంటి కళ్ళు. డేగలాంటి వంకరముక్కు కలిగి ఉన్నాడు. కాలూ మాటలు ముగించాడు. దుంగలాంటి కాలూను చూసి రజని నమ్మలేకపోయాడు.
కాలూ అంగీకరించలేదు. నేను ఈ పని చేయను అని చెప్పేశాడు. ఇక ఏంచేయాలి?
"ఓహో! అయితే మహారాజావారి అతిథిగృహంనుంచి వచ్చావన్నమాట"
అది కాలూ అయోగ్యత! గాజుగుడ్లు కాలూను కొలుస్తున్నాయి. కాలూ కలవార పడ్డాడు. జేల్లో ఉన్నానని ఒప్పుకోడం అసహ్యం అనిపించింది. అయితే రజనీకి తన పాత రికార్డు కావాలి.
"ఆ ఉడుకుమోతు వెధవ ఎలా ఉన్నాడు? వాడి పొగరు అణక్కొట్టారా?"
"ఏది ఏమైనా ఇంకోపది నెల్లు అతనికి ఉద్యోగం వెదకాల్సిన అవసరం ఉండదు."
"బైట ఉన్నందుకు నీకుమాత్రం విచారం ఎందుకూ? ఈ వ్యాపారంలో నువ్వు బాగానే నెగ్గుతావు. నాకు తెలుసు. నేను మనిషిని చూచి గుణం చెపుతా"
"మనిషిని చూసి గుణంచెపుతా" అనేమాట విని కాలూ బిత్తరపోయాడు. అవి తాను ఇదివరకూ విన్నమాటలే. అవి తనను పట్టుకున్న పోలీసు అన్నమాటలు. 'దొంగ' అని ఇదివరకే తన ముఖాన వ్రాసి ఉంది. ఇంక 'తూర్పుకాడు' అనికూడా వ్రాయబడుతుంది. ఆ రాతను ఎలా దాచుకోవాలి? "ఏయ్ నిన్నే, ఏమైంది? ఏమిటీ" రజని ఆశ్చర్యాన్ని కాలూ లెక్కచేయలేదు.
"ఆకలి చంపేస్తూంది బాబూ. అయ్యా! ఒక్క పైస"
కాలూ కదిలిపోయాడు. రొంటినుంచి పావలా తీసి ఆ స్త్రీకి ఇచ్చేశాడు.
కాలూ వీధిని ఎగాదిగా చూచాడు. మునిసిపల్ ట్రక్ వచ్చిపోయి ఉంటుంది. తనలాంటి దౌర్భాగ్యునికి ఎవనికో ఒక రూపాయి దొరికి ఉంటుంది.
నిర్దేశం లేకుండా నడిచాడు. మైళ్ళకొద్ది నడిచాడు. చౌరంఘీ రోడ్డు అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటూంది. దుకాణాల ఇనుపకవచాలు తెరువబడుతున్నాయి. పెద్దపెద్ద అద్దాలు బిగించిన బీరువాలు గర్వంతో విర్రవీగుతున్నాయి. పచ్చని పచ్చిక మైదానాన్ని కర్జన్ పార్కు పూలఅంచు చుట్టివేసింది. సామ్రాజ్యశక్తిని ప్రదర్శించే 'ఓక్టర్ లోనీ మాన్యుమెంటు' ఆకాశాన్ని అంటుతూంది. దక్షిణాన నదికి దగ్గర పోర్టు విలియం సింహంలా నిలిచి ఉంది.
వీధి మూలన ఒక చెత్తకుండీ ఉంది. అందులో దిగి వెదకుతున్న బాలునికి ఎండిన రొట్టెముక్క దొరికింది. ముక్కలు ముక్కలుగా కొరుకుతూ అయిపోతుందేమోననే భయంతో ముక్కల్ను చప్పరిస్తున్నాడు. ఏదో వింతవస్తువు కనిపించినట్లు ఆ కుర్రాడు చప్పరించడంమాని నోరువెళ్ళబెట్టి చూశాడు. నీలిరంగు తోపుడుబండిని ఆంగ్లో ఇండియన్ వనిత నెట్టుకొని పోతూంది. దాని చక్రాలు కాంక్రీట్ పేవ్ మెంటుమీద మెత్తగా దొర్లి పోతున్నాయి. పాలబుగ్గల పసిపాప అందమైన ఫ్రాకుతో దిండ్లకు ఆనుకొని పడుకొని గాలిబుడగలు వదులుతూంది. రంగురంగుల పెద్దపెద్ద బుడగలు పైకిలేచి ఆకాశంలో లీనం అయిపోతున్నాయి. చెత్తకుండీకి ఆనుకున్న కుర్రాడు రొట్టెవిషయం మరచి బుడగల తమాషా చూస్తున్నాడు.
పనికోసం కాలూ గంటలతరబడి తిరిగాడు. పని దొరకలేదు. తిరిగీ తిరిగీ సినీమా హాలుపక్కన నుంచున్నాడు. మధ్యాహ్నం దాటిపోయింది. టిక్కెట్లకోసం నుంచున్న జనం హనుమంతుని తోకలా పెరిగిపోతూంది. అంతులేని కార్ల వరుసలోంచి ఆనందం చిందులు తొక్కుతూ దిగివస్తున్న స్త్రీలూ పురుషులూ కనిపించారు.
కాలూ నిట్టూర్చాడు. మహానగరంలో సంపదలు దొర్లుతున్నాయి. సౌదర్యం మెరిసిపోతూంది. అందం ఆనందం ఆటలాడుతున్నాయి. వాటి సరసనే పొర్లిపోతున్న దుఃఖం, అనంతమైన అసహ్యం, పెరిగిపోతున్న భయం, భ్రాంతి, క్రమ క్రమంగా వచ్చే చావూ కాపురం చేస్తున్నాయి.
కాలూ భుజాన చేయిపడింది. ఉలిక్కిపడి వెనక్కు చూచాడు.
"పాకెట్ కొట్టేయడానికి చూస్తున్నావ్. "ఊఁ" ఎర్రటోపీ వెక్కిరించింది.
"ఏఁ. రోడ్డుప్రక్కన నుంచో వద్దని శాసనం ఉందా?"
"దారిద్ర్యం వంగదేశాన్ని పీల్చి పిప్పిచేస్తూంది. అయితే ఈ డబ్బంతా ఎలా వస్తూంది. ఎక్కడినుంచి వస్తూంది?" కాలూకు అర్ధంకాలేదు.
తన దాపరికంలో అయిదింట నాలుగో వంతు ఎక్కడికి పోతుందో చెప్పాడు బి-10. అది గాల్లోకి గానీ భూమిలోకి గానీ పోలేదు. తన నుంచీ, లక్షలాదిజనంనుంచీ దోచుకోబడింది. అయిదింట నాలుగోవంతు మింగేశారు. పదికోట్ల జనపు రక్తం తాగేశారు.
"విలాసతాపం మహానగరాన్ని మంటపెడుతూంది" అన్నాడు బి-10.
కాలూ నమ్మలేదు. బి-10 యధాలాపంగా చెప్పిన మాటలు అనుకున్నాడు.
"మనం మట్టి బిడ్డలం. వారు మనను పొట్టలో పొడుస్తారు. మనం వారిని వీపుమీద గుడ్డాలి" అంటున్నప్పుడు బి-10 కళ్ళు వెలిగాయి. అదీ ఒక సరదామాటేననుకున్నాడు కాలూ. బి-10 తనగాయాల్ను సాహస వాక్యాలతో కప్పిచూపాలనుకుంటున్నాడు అనుకున్నాడు కాలూ. ఇవ్వాళ ఆ వివరాల్తో ఏంపని? జేలు వాసన. జేలుచూపుగల మనిషికి మంచిచెడ్డల వివక్ష ఏమిటి?
పనికివెళ్ళేముందు పోస్టాఫీసుకు వెళ్ళాడు. చంద్రలేఖ ఉత్తరం వ్రాసిన రోజునుంచీ రోజూ పోస్టాఫీసుకు వెళ్ళి చూస్తున్నాడు. ఉత్తరాలు సార్ట్ చేస్తూంటే అక్కడ నుంచున్నాడు.
"గంట ఆగిరా" అన్నాడు పోస్టుగుమాస్తా.
గంటసేపూ అక్కడే నుంచున్నాడు. అన్ని ఖాకీ సంచుల్లోనూ ఏదో ఒకదాంట్లో నల్లని మెరుపు సిరాతో లేఖవ్రాసిన ముత్యాల్లాంటి అక్షరాలు ఉంటాయి. కాలూకు ఆ కవరు కంటే విలువైంది లోకంలో ఏదీలేదు. పోస్ట్ మాన్ కానీ త్వరగా కానీ, సీళ్ళువేయి. ఊఁ తొందరపడు.
ఎర్రటోపీ అదిరిపోయింది.
"ఓహో; జేలుపరిమళం. నాకు తెలీదనుకున్నావేం? చూడు ఆ మొఖం"
కాలూ గుండె కుంగిపోయింది. వాసన. చూపు. అతని ఆత్మగౌరవం గాలిబుడగలా ఎగిరిపోయింది. అయినా ధైర్యం తెచ్చుకొని "ఏం అలా గుడ్లురిమి చూస్తావు" అన్నాడు.
"చలో వీపు దురదపెడుతున్నట్లుంది......."
కాలూ మాట్లాడలేదు. అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
జేలువాసన. జేలుచూపు. ఏమిటిది? ఇదంతా నిజమేనా?
ఆనాడు అతడు ఏమీ తినలేదు. ఆకలిగా లేదు. దుఃఖం గొంతుదాకా నిండిపోయింది. మంచిదే అయింది. డబ్బు దక్కింది. సాయంకాలం కాగానే పంపు నీరు త్రాగి పేవ్ మెంటుమీద పడుకున్నాడు.
తెల్లవారింది. కాలూకి పని దొరికింది. అదే పీనుగుల్ను మోసేపని. ఒక కుర్రాడు కనిపించాడు. అతని నోరు తెరిచి ఉంది. మూతిమీద ఈగలు ముసురుతున్నాయి. వాడు నిన్న రంగురంగుల గాలి బుడగల్ను చూసిన కుర్రాడేనా? కుర్రాడు చనిపోయినట్టే ఉన్నాడు. కాని శరీరం కాస్త వేడిగా ఉంది. కాలూ కాస్త వెనకాముందు లాడాడు.
'నడూ' మున్సిపాలితీ మనిషి గదిమాడు.
కాలూ కుర్రాణ్ణి తీసుకొని పరిగెత్తాడు. ట్రక్కులో వేశాడు. వాడు బతికినా ఎన్నాళ్ళు? కొన్ని నిముషాలు. అంతే.
రోజంతా పనిచేస్తే అర్ధరూపాయి దొరికింది. ఇంకో అర్ధరూపాయి రావాలని తగాదా పడ్డాడు. "రేటు కోసేశారు. ఆ రేటుకే పనిచేయడానికి వందలకొద్దీ తయారు అవుతున్నారు. ఎక్కువ ఎందుకివ్వాలి?"
