Previous Page Next Page 
వారధి పేజి 13


    తను వున్న వారం రోజులూ  రమణమ్మే  ఏటినీళ్లు  పట్టుకు వచ్చింది. తల్లి వెళ్లిపోయిన  మరునాడు అలవాటు ప్రకారం మీనాక్షి కుదురుమీది బిందె తియ్యబోయింది. తళతళ  మెరుస్తున్న ఇత్తడిబిందెలో  నీళ్లు  నిండుగా  ఉన్నాయి.

    "అత్తయ్యా!" అంటూ  కూరలు తరుగుతున్న  అన్నపూర్ణ  దగ్గిరికి వచ్చింది.

    "ఏం మీనాక్షీ?" అంది అన్నపూర్ణ, కోసిన వంకాయ ముక్కల్ని నీటిలో వేస్తూ.

    "మీరు ఏటికి  ఎప్పుడు వెళ్ళేరు?" ఆందోళనగా  ప్రశ్నించింది మీనాక్షి.

    "త్వరగా  తెలివి వచ్చేసింది. పుచ్చ పువ్వులా  వెన్నెల వుంది. రెండు బిందెలు ఎత్తుకువస్తే సరిపోతుందని లేచి వెళ్ళేను!"

    "అంత రాత్రివేళ  ఒంటరిగా...."

    "భయం ఏముందమ్మా! తెలిసిన  దారేగా. పైగా  వెన్నెలరాత్రి!"

    మరునాడు, ఆ మరునాడూ కూడా  అలాగే జరిగింది.

    "ఈ పద్ధతి నాకేం నచ్చలేదు అత్తయ్యా! పోనీ, కనపొద్దులయితే  మీరు శ్రమపడినా అర్ధముంది. ఇంకా ఆరునెలలు కాలేదు. మీరు లేకపోతే ఏటినీళ్లతోపాటు  ఇంటిపని  అంతా  చేసుకోక  నాకు తప్పుతుందా?" అంది మీనాక్షి.

    "నువ్వు ఒంటరిగా  వుంటే  అప్పటి  విషయం వేరు. నేను  ఇంట వుండగా...."

    "అంత రాత్రివేళ  ఆవిడ  అలా  నీళ్లకు  పోవడం మంచిది కాదు. పొలానికి పోయేముందు  నేను కావిడి  దింపిపోతాను. ఆవిడతో  చెప్పు" అన్నాడు శివయ్య భార్యతో.

    "మంచి మనసుతో  ఆపాటిమాట అన్నాడు. ఆది చాలమ్మా! మగబిడ్డడు. తనచేత ఇంటిపని చేయించుకోవడ మేమిటి?" అని అన్నపూర్ణ తనపని మానలేదు.
 
    నాలుగైదు రోజులు గడిచేసరికి  ఆది అలవాటుగా  మారి ఇంటిలో వారికి బాధగా అనిపించలేదు. నీళ్లు ముంచుకు తిరిగివచ్చే సమయంలో పొలానికి తెల్లవారక  ముందే అరక తోలుకుపోతున్న  ఒక రిద్దరు ముసలి రైతులు "అన్నపూర్ణమ్మా! ఇంత సీకటనే  ఒంటరిగా  పోబోకమ్మా, పురుగూ పుట్రా  వుంటాది" అంటూ  హెచ్చరించేరు.

    మీనాక్షికి ఏడవ నెల వచ్చిన పదిహేను రోజులకి సూడిదలు  తీసుకువచ్చింది రమణమ్మ.

    "వదినగారూ! మీ యింట  పిల్లకి పువ్వులు ముడిపించవచ్చు. మా ఇంట గాజులు పెట్టించాలని వుంది. మీనాక్షిని గాజులచేతితో  చూడాలని నాకు కోరికగా వుంది" అంది అన్నపూర్ణ.

    అభిమానంగా ఆమె అన్న మాటని  కాదనలేక సరే  అని ఒప్పుకొంది రమణమ్మ. నాలుగు రోజులలో మంచి ముహూర్తం కుదిరింది. ఇంటిలో ఆ ఉత్సవానికి  అవసరమైన ఏర్పాటులన్నీ  చేసింది అన్నపూర్ణ. గాజుల బసవయ్యకి కబురు పెట్టడం మాత్రం మిగిలిపోయింది. ఆనాడు భోజనం చేసి శివయ్య వెళ్ళిపోతుంటే 'నాయనా, శివా!' అని మెల్లగా  పిలిచింది అన్నపూర్ణ.

    ఆ పిలుపు  శివయ్యకు తల్లిని గుర్తు చేసింది. తను ఎంత అంటీ ముట్టక వున్నా ఈవిడ యింత అభిమానంగా ఎలా  పిలువ గలుగుతున్నది? ఈ ఆప్యాయతలో కల్మషం, నటన లేదు. "శివా!" అన్న  పిలుపులో మాతృహృదయమే స్పందిస్తున్నది అనుకొన్నాడు శివయ్య.

    "ఏం పిన్నీ?" అన్నాడు.

    శివయ్య  మొదటిసారిగా  "పిన్నీ!" అన్న పిలుపుతో గౌరవ భావం కూడా కలిసి వచ్చింది.

    "కోడలికి రేపు గాజులు  పెట్టించాలనుకున్నాము. గాజుల బసవయ్యకి కబురు పెట్టాలి" అంది.

    "దానికేముంది పిన్నీ! చిన్నిగాణ్ణి  పంపితే సరి" అన్నాడు శివయ్య.

    "ఈ మాట నీ చెవిని వేసి మరీ చేద్దామని." మాట పూర్తి చేస్తూనే ఇంటిలోకి వెళ్లిపోయింది అన్నపూర్ణ.

    తొలికోడి కూయకముందే  నిద్రలేచింది అన్నపూర్ణ. యింటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టింది. నీళ్ల కాగు కింద మంటబెట్టి  కుంకుడుకాయలు కొట్టి గిన్నెలో వేసింది. "మీనాక్షీ! నేను ఏటికి పోతున్నాను. నీళ్లు కాగి ఉన్నాయి. లేచి తలంటుకో" అని కోడలిని  లేపింది.

    "నేనూ రానా, వదినా?" అంది రమణమ్మ.

    "మీరు మీనాక్షి తలంటు సంగతి చూడండి. నిన్నటి నీళ్లు వుండనే ఉన్నాయి. ఒక్క బిందె తెస్తే సరిపోతుంది" అంది అన్నపూర్ణ.

    అన్నపూర్ణ  తిరిగి వచ్చేసరికి యింకా  చిక్కగా చీకటి అలముకొనే వుంది. నిద్రపోతున్న గ్రామం నెమ్మదిగా మేలుకొంటున్నది. ఏడుగంటలకే గాజుల ముహూర్తం. ఇంటిముందు బజంత్రీవాళ్లు  వచ్చి  కూర్చున్నారు. బసవయ్య గాజుల మలారం విప్పి  ఏ రకానికి  ఆ రకంగా  గాజులు చిన్న, పెద్ద  సైజులో  ఎంచుతున్నాడు.

    ఉదయకాంతి  ఇంటినిండా  పరుచుకొంది. వంటఇంటి పంచలో చీర కాలు పైకి ఎత్తి పట్టుకొని కాలు చూసుకొంటున్నది అన్నపూర్ణ.

    "ఏమయింది వదినా ?" ఏదో పనిమీద లోపలికి  వచ్చిన రమణమ్మ ప్రశ్నించింది.

    "ఏం లేదు. నీళ్లు తెస్తూంటే  కాలికి ఏదో కంప  గీరుకొన్నట్లయింది" అంది అన్నపూర్ణ  చీరకుచ్చెళ్లు  జారవిడుస్తూ.

    "కాస్త వెన్నపూస రాయండి" అంది రమణమ్మ కావలసిన వస్తువు కోసం వెతుకుతూ.

    అన్నపూర్ణ నీళ్లబిందె ఎత్తుకొని తిరిగి వస్తూంటే  పోలయ్య పొలం ముందు తడిసిన చీరకుచ్చెళ్లు  చల్లగా కాలికి బంధంలా పడ్డట్లు అనిపించింది. కాలు గట్టిగా  జాడించింది. ఏదో చిమచిమలాడుతూ  మోకాలికి తగిలింది. కంగారుగా పక్కకి తప్పుకొంది. దారిపక్కన  ఎండుటాకులు  గలగల మన్నాయి. ఇల్లు చేరేక పని తొందర్లో ఆ విషయమే మరిచిపోయింది  అన్నపూర్ణ. మొదట్లో చిమచిమలాడినచోట  కరకరమంటున్నది  కాలు. ఏమై వుంటుంది? చీర పైకెత్తి చూసుకొంది. తెల్లని  చర్మం చిన్నగా చిట్లి కొంచెం రక్తం చిమ్మినట్లు మరక వుంది. "ఈపాటిదానికేనా  ఇంత సలువుగా వుంది?" అనుకొని తిరిగి పని అందుకొంది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS