పని సంపాదించాలి. పని దొరుకుతుంది. తన కాలి ఒక లెక్కేంకాదు. కాని లేఖ? ఆమె ఆకలి? లేఖ ఏమీ తినలేదు.
అదే ఆలోచన గంటలకొద్దీ మెదడులో భ్రమించింది. జనపురద్దీ కలవర పెడ్తూంది. అయినాకాళ్ళనూ, చెవులనూ అదుపులో పెట్టుకొని కలకత్తా మధ్యభాగంలో పేవ్ మెంట్ మీద నడుస్తున్నాడు.
వెళ్ళడం వెళ్ళడమే ఆయుధాల ఫ్యాక్టరీకి వెళ్ళాడు. తోవలోనే ఆశ నిరాశ అయింది. పని దొరక్క తిట్టుకుంటూ వచ్చిన జనప్రవాహం అతని కంటపడింది.
కాలూ ఆగలేదు. సాగిపోయాడు. ఆ వచ్చే జనానికి సమ్మెటపట్టరాకపోవచ్చు. వారి రైతులు కావచ్చు. కాలూ పనితనం కలవాడు. ఉక్కును మట్టిముద్దలా వంచగలవాడు. అతనికి పని దొరక్కపోతుందా? ఎంప్లాయ్ మెంటు ఆఫీసుకు వెళ్ళాడు. అదనంగా మనుషులు అవసరం లేదనే ఫలకమూ కనిపించింది.
అయినా ప్రయత్నించాలనుకున్నాడు మళ్ళీ వద్దనుకున్నాడు. కొంత సంపాదించుకొని పొట్టనిండా తింటే జేలుకంపు వదులుతుంది. అప్పుడు తానెవరో వారికి చూపించవచ్చు.
వచ్చినదోవనే వెళ్ళిపోయాడు. ఏలాగోలా కనీసం రాగిపైసలైనా సంపాదించాలి.
తాను రిక్షా లాగగలడు. పోనీ దాంతోనే ప్రారంభిస్తే? రోడ్డు పక్కనే రిక్షా పెట్టుకొని, పులుపుకై ఎదురుచూస్తున్న రిక్షావాలా కనిపించాడు. అతన్నే అడుగుతే సరిపోదూ? కాలూ ఆదుర్దాగా అతని దగ్గరికి పరుగుతీశాడు. కాలూ ప్రశ్నకు జవాబుగా "నీవు డిపాజిట్టు కట్టాల్సి ఉంటుంది. అయిదు రూపాయలు డిపాజిట్టులేందే రిక్షా అద్దెకురాదు" అన్నాడు రిక్షావాలా.
కాలూ తన అసమర్ధతను నిందించుకుంటూ వెళ్ళిపోయాడు.
మహానగరం నిరుద్యోగుల్తో నిండిపోయింది. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చిన వేలకొలది జనం ఉద్యోగాలకోసం అర్రులు చాస్తున్నారు. వీరంతా ఎవరిక్కావాలి?
మధ్యాహ్నానికల్లా అతని అదృష్టం పడింది. ఉద్యోగాలు దొరకని నిర్భాగ్యుల శవాలు ఫుట్ పాత్ ల మీద దొర్లాడుతున్నాయి. వారిని వేసుకొనిపోయే మున్సిపల్ వాన్ కు ఒక అదనపు మనిషి కావలసివచ్చాడు. కాలూ కనిపించాడు. పని దొరికింది. శవాల్ని ట్రక్కులోకి ఎత్తడం. శ్మశానంవద్ద దింపడం కాలూపని.
ఆ రాత్రి ఒక ఇరుకుగొందిలో, శిథిల గృహాలమధ్య; అంధకారంలో, తడినేలమీద, కాలూ మేను వాల్చాడు. కన్ను మలుగుతే శవాలు - అతడు మోసిన పీనుగులు కనిపించాయి. ఎముకలు కూరిన చర్మపు సంచులు పీక్కుపోయిన దవడల్తో గుడ్లప్పచెప్పి చూస్తున్నాయి. ఆ భీకర దృశ్యంనుంచి తప్పుకోవాలని యత్నించాడు. సాధ్యపడలేదు. ముచ్చెమటలు పోశాయి. జేల్లోనే బాగుందనుకున్నాడు. అక్కడ కనీసం శవాల్ని మోయాల్సిన పని ఉండేదికాదు.
భారీ బియ్యపు నిల్వలు ఉన్న బెంగాల్ రైస్ లిమిటెడ్ వారి 5వ స్టోర్ హౌస్ కిటికీల్లేని గోడలవెంట కొన ఊపిరి ఉన్న కళేబరాలు చాలా కనిపించాయి. రేపు పని దొరుకుతుందనేది ఖాయం. మున్సిపల్ ట్రక్కుకు మళ్ళీ మనిషి కావల్సి రాడూమరి. అతడినోరు అసహ్యం అయింది. ఎక్కడో ఒక కిటికీలోంచి కమ్మనిగానం వినిపించింది.
"నిండు వెన్నెల
పండు వెన్నెల
పాల ధారగ
పారు వెన్నెల
స్వర్గ ధామము
చేర్చు వెన్నెల
నిండు వెన్నెల
దండి వెన్నెల"
ఆ పాట అతన్ని వెక్కిరించడానికే పాడుబడిందనుకున్నాడు. వెన్నెలేమిటీ? ఏదీ వెన్నెల? కటికచీకటి కన్ను పొడుచుకున్నా కనిపించని తమస్సు. అది స్వర్గం చేర్చేదైతే తాను ఒక్క క్షణంకూడా అక్కడుండడు.
తూర్పు ఎర్రవారింది. ఇంకా వీధి మేల్కొన లేదు. ఒక సూటు వ్యక్తి రోడ్డు పక్కన కారు ఆపాడు. బరువైన అతని అడుగులు గొంది చుట్టూ పచారు చేశాయి. అప్పుడప్పుడూ వంగి ఆడముఖాన్నీ, మగముఖాన్నీ పరిశీలనగా చూస్తున్నాడు. కాలూ అతన్ని అనుసరించాడు. కాలూ గుండెమీద సమ్మెట పోట్లు పడుతున్నాయి. ఏదో సేవా కార్యక్రమం కావచ్చు. తనకు పని దొరుకుందనుకున్నాడు.
"రూపాయి కావాలా?" మోటార్ వాలా అడిగాడు కాలూ వైపు తిరుగుతూ.
అబ్బుర పాటుతో కాలూ శ్వాస క్షణం ఆగింది. మోటార్ వాలా కొన ఊపిరి ఉన్న శవాల వైపు చేయెత్తి చూపుతూ "వాటిల్లో పూర్తిగా ప్రాణం పోయిన వాటిని చూడు. ఇక్కడికి ఒక ఎద్దుల బండి వస్తుంది. వాటిని దానిమీద పడేయి. ఆ బండితో ఇంకోచోటికెళ్ళు. అక్కడి పీనుగుల్ను కూడా తీసుకో. ఇదీ పని"
ఏదో మహాపిశాచం తనను నలిపివేస్తున్నట్లనిపించింది కాలూకు. పనంతా ముగిసింది. తరువాత బండివానితో "అన్నా! ఈ శవాల్ను మోసుకొని పోవడానికి కార్లు లేవూ?" అని అడిగాడు.
బండివాడు విచారంగా తల ఊపి "ఇది ప్రైవేటు పని. ఈ శవాలన్నీ డాక్టరు ఇంటికి పోతాయి. అవును. అతడు డాక్టరే!" అన్నాడు.
కాలూ కళ్ళు తిరిగిపోయాయి. "డాక్టరు బతికున్న వారిని గురించి జాగ్రత్తపడాలి. చచ్చిన వాళ్ళనేం చేస్తాడు? ఈ రోగాలు కుదుర్తాయి కాబట్టా?"
"రోగం కుదరడం కాదయ్యా! అతనికిఎముకల బోనులు కావాలి. చర్మం ఒలిచేసి కడిగి వాటిని సముద్రాల ఆవలికి పంపుతారు."
"ఎముక లెందుకూ?" కాలూ ఆశ్చర్యంగా అడిగాడు.
"వాటికి మంచి ధరపలుకుతూంది. ఏవో కాలేజీల్లో ఎముకల బోన్లు కావాల్ట. అందుకే వాటికి మంచి ధర పలుకుతూందని డాక్టరు నౌకరు చెప్పాడు."
కాలూ నోరు మూత పడింది. అతడు ముందుకు సాగిపోయాడు.
ఆ రాత్రి కాలూ నిద్రపోలేదు. అతని గుండెలో బల్లాలు గుచ్చినట్లు బాధపడ్డాడు. తల కొలిమిలో పెట్టి ఊదినట్లనిపించింది. ఎంతకాలం ఇలా గడపడం? కుంగి కృశించి తానూ వీధుల్లో ఎముకల బోనులా తయారైతే? తన దేహానికి ప్రాణం ఉన్నప్పటికంటే ఎక్కువ విలువ వస్తుంది. అది విదేశాలకు పయనిస్తుంది. కాలేజీల్లో ఉంచబడుతుంది. అలా కాదనుకున్నా చేతికి మూతికి సరిపోయేంత సంపాదించుకోవచ్చు. అదనంగా కూడబెట్టి లేఖను మహానగరానికి తీసుకొచ్చేంత సంపాదించడం మాత్రం అసాధ్యం. ఆమెను ఇక్కడికి తీసుకొనిరావడం వల్ల ప్రయోజనం?.
కాలూమోసిన కళేబరాల్లో లేఖ ఈడుగల అమ్మాయి కూడా ఉంది. అది తల్చుకుంటే అతని గుండె పెరికి వేసినట్లైంది.
మరుసటి రోజు పోస్టాఫీసుకు వెళ్ళాడు. టెలిగ్రాఫుఫారాలు తీసుకొని వాటివెనుక సుదీర్ఘ లేఖ వ్రాశాడు. కవరు కొన్నాడు. మూడు ఎరుపు కాగితాల మధ్య నలిగిపోయిన రెండు రూపాయి నోట్లు పెట్టి కవర్లో పెట్టాడు. ప్రియంగానూ, భావపూరితంగానూ లేఖ వ్రాశాడు. కష్టాలు గట్టెక్కాయి. ఇంకా తనకాళ్ళ మీద నుంచోడానికి పోరాటం సాగుతూనే ఉందని రాశాడు.
కాలూ కొన్ని నిజాలు కప్పిపుచ్చిన మాట వాస్తవం. అతని బాధలు తల్చుకుంటే ఆమెగుండె పిండికావచ్చు. ఆమె జబ్బున పడిందో ఏమో? ఈ భయంతో అతని కాళ్ళు చల్లబడ్డాయి. ఆమెకేదైనా అవుతే? ఆమె చనిపోతే? అతడు బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం? చంద్రలేఖ అతని జీవిత తమస్సుకు చంద్రలేఖ. ఆమె కోసం - అచ్చం ఆమెకోసమే - అతని బ్రతుకంతా.
నేలమీద పడి అలముకుంటున్న అంధకారాన్ని అదేపనిగా గంటలతరబడి అవలోకిస్తున్నాడు. తుదకు లేచి కూర్చొని గబగబా శ్వాసపీల్చాడు. లేఖకోసం పదివేల సంవత్సరాలు నరకంలోపడి, కాలి, మసిబొగ్గు కావడానిగ్గూడా సంసిద్ధం. కాలం కర్పూరంలా కరిగిపోతూంది. ఇంకొక్క క్షణంకూడా వృధా కారాదు.
రజని - ఆ పేరు తనకు ఇద్దరు చెప్పారు. "అతడు నీకు పనీ, మంచి జీతమూ ఇస్తాడు. తెలిసిందా?" ఇది ఒక రన్నమాట. రజని చూపే పనిని గురించి బి-10 వివరించి చెప్పాడు. వైరాగ్యాన్ని జయించాలి. అలాంటి పనినిగురించి తల్చుకునేవరకూ మెత్తపడే అతని స్వభావంలో మార్పు రావాలి.
సూర్యుడు ఉదయించి గగనయానం సాగించాడు. కాలూ లేచి, రెండు మైళ్ళలో ఉన్న చిత్పూరు రోడ్డువైపు నడక సాగించాడు. చిత్పూరు వచ్చేసింది. అతడు నడక వేగం తగ్గించాడు. గొంతు ఆరిపోతుంది. దగ్గరే పంపు కనిపించింది. నీరు తాగడానికి నిల్చిపోయాడు. ఊడ్పు మనిషి చెత్త డబ్బాను చెత్తకుండీలో బోర్లించింది. వెళ్ళిపోయింది. చెత్తలో రొట్టెముక్కలు ఉంటాయనే భ్రమతో నలుగురైదుగురు ఆ చెత్తకుండీ మీద విరుచుకుపడ్డారు. ఈ దశలో తాను రజనికంట పడకుండా ఉండాలని దేవునికి మొక్కాడు. సాధూస్ కాస్మపాలిటన్ క్యాబిన్ ముందు అర్ధగంట నుంచున్నాడు. తెల్లని నిక్కర్ల వెయిటర్లు ఫలహారాల ప్లేట్లతో టేబుల్స్ వైపు నడుస్తున్నారు. సగం తెరచి ఉన్న తలుపులోంచి మాంసం వేపిన వాసన వస్తూంది.
