Previous Page Next Page 
వారధి పేజి 12


    "ఈ నాలుగు నెలల కాలంలోనూ  నేను ఎదుటపడి  ఆవిడను ఒక్కమాట అనలేదే! ఆవిడ బాధపడి వెళ్ళిపోతున్నదన్నట్లు  మాట్లాడతావేం?"

    "పొమ్మనలేక  పొగపెట్టేరు  అన్న సామెత  మీరు విన్నారా? మన ప్రవర్తన అందుకు భిన్నంగా వుందా?"

    "మీనాక్షీ, ఆవిడను వెనక వేసుకొని నాతో పోట్లాడమంటే  నీకు సరదా  అని నాకు  తెలుసు. నీ మనసులో  ఏ పురుగు దొలుస్తున్నదో  తిన్నగా చెప్పు" అన్నాడు శివయ్య, కాస్త  కంఠం  హెచ్చింది.

    "దాన్ని యెందుకు కేకలేస్తున్నావు బాబూ! దాని మనసులో  నావంక అభాగ్యులపట్ల  జాలితప్ప  మరేమి  వుంటుంది? వెన్నలాంటి  మనస్సు  నీ భార్యది. మన అదృష్టంకొద్దీ  మనింటి  కోడలయింది.

    "నాన్న  లేకపోయినా  తమ్ముడున్నాడు. చిన్నదో పెద్దదో ఒక  కొంప వుంది. ఎంతకాలం మిమ్మల్ని బాధపెట్టడం? నేనే వెళ్ళిపోవాలనుకొంటున్నాను. నాకోసం మీరు వాదులాడుకోకండి." భోజనాల గదిలోకి  మెల్లిగా వచ్చి, దీపపు నీడను నిలిచి, నెమ్మదిగా  అంది అన్నపూర్ణ.

    తండ్రి పోయిన  తరవాత  పినతల్లిని ఎదురుగా చూడడం  శివయ్యకి అదే మొదటిసారి. ఆ కంఠస్వరం  తప్పితే  మనిషిని పోల్చుకొనే  అవకాశం లేనంతగా  మారిపోయింది.

    తండ్రిచావు  పినతల్లి  మనసుమీద  ఇంతగా  పనిచేసిందా? ఆ ముసలివాణ్ణి  ఈ ప్రాయంలో ఉన్న పిల్ల  అంతగా ప్రేమించిందా? లేక  ముందుగతేమిటి  అన్న  బెంగతో  ఇలా  అయిపోయిందా? శివయ్యకి  ఏమనుకొనేందుకూ  తోచలేదు.

    "ఇల్లు విడిచి  మీరెందుకు  వెళ్ళిపోవాలి? ఈ ఆస్తిలో, ఈ ఇంటిలో మీకూ భాగం వుంది. నాతో కలిసివుండడం  మీకు కష్టంగా వుంటే  రేపే నలుగురు పెద్దలముందు వాటాలు వేసుకొందాం" అన్నాడు శివయ్య, మాటలను  ఒత్తి పలుకుతూ.    

    "చూడు బాబూ! ఈ ఆస్తి కోసం  నేను ఈ ఇంటికి రాలేదు. నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం అతి స్వల్పం. అవాంఛితంగా మీ తండ్రీ కొడుకుల జీవితాల్లో  నేను ప్రవేశించి  మీ మధ్యగల  ప్రేభిమానాల్ని మలినపరిచేను. దానికి కారణం ఏమైనా, కారకురాలిని నేను. ఈ బాధ నాకుచాలు. ఇంకా  ఆస్తికోసం  తగవులాడి  మీ మనసులో నాపట్ల  ఏమైనా జాలి, అభిమానం మిగిలివుంటే  దానిని  చేజేతులా  నాశనం చేసుకోలేను.

    "నేను బ్రతికి ఉన్నంతకాలం  రాజుకి  ఏలోటూ  రానివ్వను. నాలుగిళ్లు  పాచిపని చేసి అయినా వాడిని పెంచుకొంటాను. మిమ్మల్ని  నేను కోరేదలా ఒక్కటే. నేను ఈ లోకంలో లేనని  తెలిసిననాడు  వాణ్ణి  ఆదుకొని  ఇంత అన్నం పెట్టండి. వాడిబ్రతుక్కి  ఒకదారి చూపండి."

    "అత్తయ్యా!" అంటూ  ఆమెని కౌగిలించుకొని  ఏడ్చింది మీనాక్షి. ఉన్నపాళంగా లేచి  చెయ్యి కడుక్కొని  వీధిలోకి  వెళ్ళిపోయేడు  శివయ్య.

    అరగంట గడిచి శివయ్య తిరిగి ఇంటికి వచ్చేసరికి  అత్తా, కోడలూ అదే స్థలంలో, ముడుకుల్లో తలలు పెట్టుకొని కూర్చున్నారు. కంచాలు, గిన్నెలు అలాగే వున్నాయి.

    "మీనాక్షీ!" కాస్త గట్టిగానే  పిలిచేడు  శివయ్య.

    పైటకొంగుతో  కళ్ళ నీళ్ళు  తుడుచుకుంటూ  భర్త  ముందుకి వచ్చింది మీనాక్షి.

    "ఆవిడ ఎక్కడికీ  వెళ్లి పోనవసరంలేదు. నాన్న  లేకపోయినా, నేను వున్నాను. ఈ ఇంటి ఆడవాళ్లు  పాచి పనిచేసి పిల్లల్ని  పెంచుకోనక్కరలేదు" అన్నాడు, అన్నపూర్ణకి  వినిపించేలా.

    "శివయ్య  అంత భరోసా ఇస్తుంటే నాకింకేం  కావాలమ్మా! నేను ఏ క్షణాన కన్నుమూసినా  రాజును గురించిన  ఆందోళన నాకు వుండదు" అంది అన్నపూర్ణ  కోడలితో.

    అటుతరవాత కూడా శివయ్య  అన్నపూర్ణను గురించి  ఒక్కమాటా అన్నదిలేదు. తన బాధ్యత మేరకు రాజు మంచిచెడ్డలు మాత్రం చూస్తూండేవాడు. ఇద్దరివంతూ  తనే ఆదరం, ఆప్యాయతా కనబరుస్తూ  అన్నపూర్ణకి ఊరట  కలిగించేది మీనాక్షి.      

    అన్నపూర్ణ  శివయ్య కంట పడకపోయినా  ఇంటిలోని  ప్రతి పనిలోనూ ఆమె అదృశ్యహస్తం  అతనికి ద్యోతకమవుతూనే  ఉండేది.

    కాపురానికి వచ్చిన నాలుగేళ్ళకి అపురూపంగా మీనాక్షికి నెల తప్పింది. అన్నపూర్ణ కోడలి మనసెరిగి  రుచికరమైన  వంటలు, పిండివంటలు చేసి పెడుతూ  అతి ముద్దుగా  చూసుకోసాగింది.

    అయిదవ నెల రాగానే మీనాక్షి తల్లి రమణమ్మ  పురిటికి  కూతురిని తీసుకుపోతానని వచ్చింది. ఏడవనెలవరకు  రానని మీనాక్షి  పట్టుపట్టింది. "ఇటువంటి సమయంలో కన్నతల్లిదగ్గిర  వుండడం  మంచిది. వెళ్లు, మీ అత్తకేం భయం లేదు. మేమంతా లేమా?" అన్నాడు ఇరుగు పొరుగు.

    "నీకు వెళ్ళాలనిపిస్తే  వెళ్లు, మీనాక్షీ" అన్నాడు భర్త.

    "అత్తయ్య తల్లికన్న మిన్నగా  చూసుకొంటున్నారు. పురుడై మూడో మాసం వచ్చేవరకూ  తిరిగివచ్చే వీలుండదు. అంతకాలం మీ అందరినీ విడిచి అక్కడ వుండాలని  లేదు. ఏడో  నెలలో  వెళతాను" అంది మీనాక్షి.

    అన్నపూర్ణ  కోడల్ని అల్లారుముద్దుగా  చూసుకోవడం, అత్తా కోడళ్ళ పొత్తూ చూసిన రమణమ్మ అట్టే పట్టుపట్టకుండానే  వారం రోజులుండి  వెళ్ళిపోయింది.

    ఇంటిపని అంతా అన్నపూర్ణ  చేసుకొంటున్నా  రత్తయ్య పోయేక ఆమె వీధినిబడి  ఏటికి నీళ్లకి పోలేదు. వంటకీ, తాగేందుకూ  కావలసిన రెండు బిందెల నీళ్ళు  మీనాక్షి తెచ్చి పడవేసేది. మిగిలిన వాడుకలకు  పాలేరు చిన్నయ్య కావిడి వేసేవాడు.

    రమణమ్మ వచ్చేవరకూ  ఏటినీళ్లు  మీనాక్షే  తెస్తూండేది. తెల్లవారి బిందె పట్టుకొని  ఏటికి బయలుదేరుతున్న కూతుర్ని చూసి "నువ్వు ఇంక బరువులు మొయ్యడం మంచిపని కాదమ్మా! ఆ బిందె  ఇలాతే, నేను తెస్తాను" అంటూ  అందుకొంది రమణమ్మ.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS