Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 12


    "చూపు"
    "నువ్వు కాని బట్టలు కట్టుకొని, వంటినిండా బూడిద పూసుకొని శివుని త్రిశూలం లాంటి బొట్టు పెట్టుకోవాలి. నువ్వు అలాచేయగలుగుతే నీ భిక్షాపాత్ర ఇట్టేనిండిపోతుంది. అంతేకాదు. అదృష్టం కలిసి వస్తే ఎవరో ఒక మహానుభావుడు నీవు ఒక గొప్ప ఆత్మశక్తిగల యోగివి అనుకోవచ్చు."
    "నన్నెందుకు అపహాస్యం చేస్తావ్?"
    "నేనేం హాస్యానికి మాట్లాడ్డంలేదు. నిజంగానే చెబుతున్నా యోగికావడానికి తగిన హంగు నీకుంది. నీకు కొన్ని రహస్యాలు చెబుతా - అవి నేర్చుకో చాలు కొద్దికాలంలోనే నీకు స్వంత వ్యాపారం పెట్టుకునేంత డబ్బు తేలిగ్గా దొరుకుతుంది."
    కాలూ నోరు కట్టుక్కూర్చున్నాడు.
    "ఆఁ ఇంకో మార్గంకూడా ఉంది. అది సరిగా పనిచేస్తే ఇంకాస్త ఎక్కువే మేలు కలగొచ్చు. "ఈ మంత్రమే పారిందంటే డబ్బూ, విశ్వాసమూ రెండూ ఉన్నవారిని పాడి అవులుగా చేసి దొడ్లో కట్టేసుకోవచ్చు. విశ్వాసాన్ని డబ్బుగా పిండొచ్చు."
    ఇందువల్ల కాలూకు సంతోషం ఏమీ కలుగలేదు. అతనికి కొన్ని ఆచారాలు అలవాటుపడ్డాయి. అనాదిగా వస్తున్న విశ్వాసాలు అతనిలో వేళ్ళు తన్నుకున్నాయి.
    ఆధ్యాత్మికాహారం, భౌతికాహారం పండించబడుతుంది. అయితే అమ్మకంలోనే తేడా, రెంటికోసమూ బిళ్ళల్లాంటి రూపాయిలు రాల్చాల్సిందే. ఆధ్యాత్మికాహారానికి ఖరీదుతో నిమిత్తంలేదు. ఎంతఖరీదైనా పెట్టి కొనేస్తారు జనం.
    కాలూ ఆలోచన వేదాంతంగా పరిణమించింది.
    "ఈ మట్టిముద్ద గాలి, నీరూ వీనిలో కలిసిపోవాల్సిందే. అమరమై, అగ్నిలా, కాంతిలా వెలుగుతూ ఉండేది అంతరాత్మ మాత్రమే" అన్నాడు.
    "ఆధ్యాత్మికాహారం తయారు చేయడానికి ఎత్తుగడ కావాలి. దానికి వేయిన్నొక్క మార్గాలున్నాయి. తయారు చేయడం ఏమంత కష్టంకాదు. అమ్మడానికే ఎత్తుగడ కావాలి.
    ఆధ్యాత్మిక క్షుధార్తులు నీ చేతుల్తో తింటారా?"
    కాలూ తెల్లబారిపోయాడు. ఇదంతా అతనికేమీ అర్ధం కావడంలేదు.
    "బ్రాహ్మడికి మాత్రమే ఆధ్యాత్మికాహారం పంచగలిగే అధికారం ఉంది. పుట్టుకతోనే బ్రాహ్మడు బ్రాహ్మడు అవుతున్నాడు. సృష్టి ప్రారంభం అయిన్నాటినుంచీ ఆయన్లో బ్రాహ్మణరక్తం ప్రవహిస్తూందంటారు."
    "అవును అది నిజమే అన్నాడు కాలూ బ్రాహ్మడికి దేవుడు ఔన్నత్యం ప్రసాదించాడనడంలో కాలూకు ఏమాత్రం సందేహంలేదు.
    "ఇది బ్రాహ్మల గుత్తవ్యాపారం. అలాంటి అధికారం నీకూ రావాలంటే నీవూ బ్రాహ్మడివి కావాలి. అతని విశిష్టత ఎందులో ఉంది? ఒకే చిహ్నం. అతని భుజంమీద జందెం ఉంది. కుర్రాడుగా ఉన్నప్పుడే ఏదో క్రతువు చేసి జందెం వేస్తారు. అప్పటినుంచి ద్విజుడు అయిపోతాడు. తెలిసిందా ? ఇంకా చెప్పాలా?"
    "బ్రాహ్మలందరూ పూజార్లుకారు. చాలా కొద్దిమందే పూజారులవుతారు. ఏదో 500 ల్లో ఒక్కడు."
    "కాని పూజారులంతా బ్రాహ్మలై ఉండాలి. అది తప్పనిసరి. అందుకే నీవు బ్రాహ్మడివి కావాలి. తొమ్మిది తెల్లటి దారాల జందెం మెళ్ళో మెరుస్తేచాలు."
    "నేనా? నేను......నేనా.......ద్విజున్ని" నమ్మలేని గొంతుతో అడిగాడు కాలూ.
    "నువ్వే"
    "ఆపు. ఇకచాలు"
    "ఇంకా ఇది మొదలే. పూజారికూడా రైతులా పేదాడు కావచ్చు. కాని కులం మార్చుకున్నాక నీవూ పేదవాడివిగానే ఉంటే ఏంప్రయోజనం? ఆఁ ఇప్పుడు అసలు వ్యాపారానికి వస్తాం. ఒక గారడీ ఎత్తు."
    "గారడీ ఎత్తా!"
    అంధకారమయం అయిన సెల్లు మూలనుంచి "పిచ్చివాళ్ళు" అనే ధ్వని చెవినిపడింది.
    "సోమరి గాడుదులు, మీకూ రహాస్యాలు కావాలేం?"
    బి- 10 మంచంలో పడిపోయాడు.
    "ఇప్పటికి పడుకో, మళ్ళీ రేపు" అని ఓదార్చినట్లు గొణిగాడు బి- 10.
    
                                                       5
    
    కాలూ విడుదలరోజు రానే వచ్చింది. అతన్ని బైటికి గెంతుతూ 'మళ్ళీ తిరిగిరా' అని గొణిగాడు గార్డు. ఆ ఊపుతో కాలూ రోడ్డుమీద పడ్డాడు. ఆగాడు. వెనక్కు తిరిగాడు. మూడు నెలలపాటు ఉన్న బైలును చూచాడు. అందులో ఉన్నప్పుడు ప్రతి పనీ అన్యుల ఆదేశప్రకారమే చేయాల్సి వచ్చేది. సమయం, కదలిక, వ్యవహారం అన్నీ పరాధీనమే. నిద్రసహితం ఇంకొకరి ఆదేశప్రకారమే పోవల్సివచ్చేది. భావానికి మాత్రం స్వాతంత్ర్యం ఉండేది. విడుదలరోజు కోసం ఎదిరి చూడ్డానికీ, కలలు కనడానికీ బోలెడు స్వాతంత్ర్యం ఉండేది.
    విముక్తి! తాను మళ్ళీ బైటపడ్డాడు. జేలు తల్చుకుంటే అతని గుండె జలదరించింది.
    గార్డు తుపాకిమడమతో బైటికి గెంటాడు. వెళ్ళిపొమ్మని కసిరాడు. కాలూ వెనక్కు తిరిగాడు. నడక సాగించాడు. ఒక విష్కంభం ముగిసింది. మరొకరంగం మొదలైంది. ఈతడవ అతడు కలకత్తాకు దగ్గర్లోనే ఉన్నాడు. అంతేకాదు. జేలువాళ్ళు అతని పాతగుడ్డలు తిరిగి ఇస్తూ, కలకత్తాకో టిక్కెట్టూ, రెండురూపాయల పైచిల్లరా ఇచ్చారు.
    కాలూ స్టేషను చేరుకోవడానికి రోడ్డునపడ్డాడు. ఎండ మండిపోతుంది. వడగాలి వీస్తూంది. దారిననడిచేవారు 'దొంగ దొంగ' అని అరిసారేమోననే భయంతో రోడ్డుపక్కగా ఒదిగి నడిచాడు. టిక్కెటు పంచ్ చేయించుకొని స్టేషన్ గేటు దాటిపోయాడు. ఇంకో అర్ధగంటఅవుతే పడమటి బండి వచ్చేస్తుంది.
    బండి ప్లాటు ఫారంమీదికి వచ్చింది. కాలూ జనం ఒత్తిడిలేని పెట్టెకోసం వెదికాడు. దొరికింది. అందులో దూరి జనంలేని మూలాన నక్కి కూర్చున్నాడు. తల కిటికీలో దూర్చాడు. జైల్లోపడ్డా మచ్చ గుట్టంత బరువనిపించింది. శరీరం స్వేదంలో మునిగితేలింది. ఊపిరి అడ్డంలేదు. జేలుమచ్చ ఏనాటికైనా వదుల్తుందా? దూరంనుంచే ఎవడో ఒకడు జేలుకంపు కనిపెట్టి "దొంగ, దొంగ" అని అరుస్తాడేమో!"
    దూర్చిన తల బైటికి తీసి జనాన్ని చూసే ధైర్యం లేకపోయింది. అతని దృష్టి వంగ భూమిమీద మైళ్ళకొద్ది వేగంగా పరిగెత్తుతూంది. పొలాల్లో వరికంకులు వంగి ఉన్నాయి. ఈ ఏడు పంట బాగుండొచ్చు. కాని ఇదంతా ఎవరిది? ఝార్నా చుట్టుప్రక్కల ఉన్న రైతులంతా తమ పొలాల్ను కుదువపెట్టేశారు. సాహుకార్ల దగ్గర అయిదురెట్లు ధరకు గింజలు కొనుక్కున్నారు. డబ్బు కర్చైంది గింజలు పొట్టల్లో పడ్డాయి. పొలాలు పచ్చగా పండి ఒరిగి ఉంటే రైతులు పస్తులుంటున్నారు. తమ పొలాల్లో పంట చేత్తో సహితం తాకే అధికారం రైతుకులేదు. ఈ పంటకూడా ఒక వెక్కిరింపేమో? వంగదేశం అంతా ఇంతేనా?
    కాలూకు తన ఫుట్ బోర్డు ప్రయాణం తలపుకు వచ్చింది. అతడు ప్రయాణంచేసి చాలాకాలం అయింది. అయినా అది నిన్ననే జరిగినట్లు అనిపించింది. డొక్కలో ఎలుకలు పరిగెడుతూంటే ఫుట్ బోర్డు మీద వ్రేలాడే ధైర్యం తనకు ఎలా వచ్చింది? అవయవాలన్నీ నీరసించి ఊగిపోతూంటే ఆత్మకు శక్తి ఇచ్చింది ఎవరు?
    అతని దృష్టిలో రోడ్డువెంట సాగిపోతున్న జనంమీద పడింది. ఆకలియాత్రలు ఇంకా సాగుతున్నాయా? స్త్రీలు, పురుషులు, బాలురు వందలమైళ్ళ కాళ్ళీడ్చుకుంటూ నడిచి ఉంటారు. సగం జనం ప్రాణాల్ను రోడ్లకే వప్పగించి ఉంటారు.
    జైలుగోడలమధ్య ఉండడాన వాస్తవం కనుమరుగైంది. ఇతర ప్రయాణీకులు కూడా కిటికీల్లోంచి చూశారు.
    అదే మన 'స్వర్గవంగం' (సోనార్ బంగ్లా) అన్నాడొక ప్రయాణీకుడు ఆకలి యాత్రీకుల్ను చూపుతూ. పలురకాల వ్యాఖ్యానాలు సాగాయి.
    కాలూ అబ్బురపడ్డాడు. అంధకార బంధురమైన అతను భావనా ప్రపంచంలో గోరంత దివ్వె వెలిగింది. అతడు ఇప్పుడు ఖైదీకాదు. అతని భుజాలమీదినుంచి ఆ బరువు దిగిపోయింది. అతడు విముక్తుడైనాడు. అన్నార్తులు దూరదూరంగా కనిపించి అదృశ్యులైనారు. వారిని వెనక్కు నెట్టి బండి మహానగరానికి సాగిపోతూంది.
    కాలూ ఆత్మలేఖ కోసం పరితపించింది. అతని చెవులు ఆమె మాటలు వింటున్నాయి. ఆకలితో ఉన్న లేఖ అతని కళ్ళముందు నుంచుంది.
    కిటికీలోంచి తల లాక్కున్నాడు. సరిగా కూర్చొని తీక్షణదృక్కుల్తో ముందుకు చూచాడు. ఇక అంతా అతనిముఖం చూస్తారు. చూడనీ. 'దొంగ' అని అరుస్తారు అరవనీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS