ఆమెకు భర్తపట్ల ప్రత్యేకమైన అభిమానం, అనురాగం కలుగలేదు. జాలి, సానుభూతి కలిగేయి. ఆ జాలితోనే అతనికి సేవచేసింది. ఆ సానుభూతి కారణంగానే అతని మనస్సు నొప్పించకుండా మసులుకొంది.
మొదటిసారిగా అతని పశ్చాత్తాపాన్ని చూసిన అన్నపూర్ణ మనస్సులో భర్త ఎడల ఆర్ద్రమైనభావాలు కదిలేయి. అతడు తనకోసం, తన పిల్లాడికోసం ఎంతగా తపిస్తున్నాడో తెలుసుకొంది. ఆ సమయంలో అతన్ని ఓదార్చి ధైర్యవచనాలు చెప్పవలసిన విధి తనపై ఉన్నట్లు గుర్తించింది. అతని కన్నీటిని తన చీర చెరగుతో తుడుస్తూ, అతని పలితకేశాల్లోకి వ్రేళ్ళు పోనిచ్చి "మీరేం కంగారు పడకండి. శివయ్య పైకి కఠినుడిలా కనిపించినా మనసు చాలా మెత్తన. రాజుకూ నాకూ అన్యాయం చెయ్యడు. మాకోసం మీరు ఇలా దిగులుపడుతూ, ఆరోగ్యం పాడుచేసుకొంటుంటే నాకు చాలా కష్టంగా ఉంది. వచ్చిన ఆపదేంలేదు. అనవసరపు ఆందోళనలని వెనక్కితోసి ఉత్సాహంగా ఉండండి. రాజుని మీరే పెంచి పెద్దచేద్దురుగాని" అంది ఓదార్పుగా.
ఆమె ఆత్మీయమైన ఊరడింపుతో రత్తయ్య వాడిన బుగ్గలమీదుగా కన్నీరు బొటబొట జారింది. "అన్నపూర్ణా!" అంటూ ఆమెను గట్టిగా గుండెకు అదుముకున్నాడు. తల్లి పిల్లాడిని సందిట చేర్చుకుని ఓదారుస్తున్నట్లుగా అతన్ని చేతుల్లో ఇముడ్చుకొంది అన్నపూర్ణ.
ఆ రాత్రంతా అన్నపూర్ణ భర్తని అనునయించి ధైర్యం చెప్పుతూనే ఉంది. ఇంకా ఎంతో జీవితం కళ్ళముందు పరుచుకు ఉన్నట్లు ఉత్సాహపూరితమైన మాటలు చెప్పుతూనే ఉంది. తెల్లవారుఝామున కాస్త కన్ను మూసేడు రత్తయ్య.
మలికోడి కుయ్యగానే లేచి ఏటికిపోయి స్నానం, ధ్యానం ముగించుకొని సూర్యోదయానికి పూర్వమే శివాలయం ముందు నిలిచి ఉండటం రత్తయ్యకి అలవాటు. ఊరు విడిచి బయటికి వెళ్ళిన ఏ ఒకటి రెండు సమయాల్లోనో తప్పిస్తే అందుకు భిన్నంగా జరిగింది లేదు.
కోడికూతతో లేచిన అన్నపూర్ణ గొడ్లకి గడ్డివేసి, పాలకుండ, పెరుగు చట్టీ కడిగి వచ్చి చూసేసరికి రత్తయ్య ఇంకా నిద్రపోతున్నాడు. రాత్రి అంతా సరిగా నిద్రలేదు. కొంచెంసేపు అయ్యేక లేపవచ్చని ఇంటి పనిలోకి జొరబడింది.
అత్తగారు లేచిన కొద్దిసేపటికి మీనాక్షి "ఈ రోజు మామయ్య ఇంకా లేవలేదా?" అంటూ ప్రశ్నించింది.
"రాత్రి అంతా సరిగా నిద్రలేదు. ఏదో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడే కన్ను మూసేరు" అంది అన్నపూర్ణ.
మరికాస్త వ్యవధిలోనే లేచిన శివయ్య పళ్ళుదోము పుల్ల చేతబట్టుకొని పొలంవైపు వెళ్ళిపోయేడు.
అన్నపూర్ణ మజ్జిగ చేసి, వెన్నతీసి, పాచిపని చేసుకొని, కోడలు పితికితెచ్చిన ఎర్రావుపాలు తంపీమీద ఎక్కించి, బర్రెపాలకోసం ముంత సిద్ధంచేసి వుంచేసరికి ఉయ్యాలలో రాజు కెవ్వుమని ఏడుస్తూ లేచేడు. అప్పటికే కరకర పొద్దుపొడుచుకు వస్తున్నది. రత్తయ్య ఇంకా మంచంమీద ఓరగా తిరిగి పడుకొని ఉన్నాడు. పిల్లాడిని చేతుల్లోకి తీసుకొని భర్త మంచం దగ్గరికి వచ్చింది అన్నపూర్ణ. 'చంటివాడు ఇంతలా ఏడ్చినా తెలివిరాలేదు. ఎంత గాఢంగా నిద్రపట్టింది!' అనుకొంది.
మంచంమీదుగా కొంచెం వంగి "చాలా పొద్దు ఎక్కింది. ఇంక లేస్తారా?" అంది మెల్లిగా.
రత్తయ్యకి మెలకువ రాలేదు.
కొడుకుని మంచంమీద దింపి, మెల్లిగా చేతితో తట్టి లేపింది. కప్పుకొన్న దుప్పటి క్రిందనుంచి శరీరం చల్లగా తగిలింది. తను లేచిపోతూ, ముఖంవరకు కప్పిపోయిన దుప్పటిని ఆత్రంగా సడలించి చూసింది అన్నపూర్ణ. అక్కడ రత్తయ్య లేడు! మిగిలింది అతని కాయం!!
కెవ్వున కేకవేసింది అన్నపూర్ణ. ఆ కేకతో మీనాక్షీ, పాలికావు చిన్నాయ్యా పరుగున వచ్చేరు. క్షణంలో ఆ వార్త పొలంలో ఉన్న శివయ్యకి అందిపోయింది. "నాన్నా!" అంటూ వచ్చి మీదపడి చంటివాడిలా ఏడ్చేడు.
అన్నపూర్ణ రాతిబొమ్మలా అలా నిలబడిపోయింది. ఆమెనోట ఒక్కమాట రాలేదు. కంటివెంట ఒక్క కన్నీటిబొట్టు ఉబికి రాలేదు. ఆఖరి క్షణంలో ఆవేదనతో అలమటించి బ్రతుకును వదలలేక. చావును యెదిరించి విలవలేక చిన్నపిల్లాడిలా తనచేతుల్లో ఇమిడిపోయి కన్నుమూసిన ఆ వృద్ధుడు అదే ఆఖరిమాటగా, అదే ఆఖరిచూపుగా ఈ లోకాన్ని వదలిపోతే ఆమె మనసు జాలితో పేరుకుపోయింది. అతని మనసును అర్ధం చేసుకొని తను అనురాగంతో, ఆప్యాయంతో మసలుకొంటే మరికొంత కాలంపాటు అతను బ్రతుకునేమో. అతని చావుకి పరోక్షంగా తను కారణమేమో అని బాధపడింది ఆమె మనస్సు.
తండ్రికి తనయుడుగా తను చెయ్యవలసిన విధులన్నీ పన్నెండు రోజులూ శ్రద్ధగా నెరవేర్చేడు శివయ్య. గ్రామంలో కొందరు వ్యవహారవేత్తలు, "పిన్ని మాటేమిటి చేస్తావు? పిల్లాడి కేమిస్తావు?" అంటూ ప్రశ్నించసాగేరు.
"ఆ మాటలకి ఇంకా సమయం రాలేదు" అన్నాడు శివయ్య.
వచ్చిన బంధువులంతా పదమూడవనాడు వెళ్ళిపోయేరు. వీధి అరుగుమీద రత్తయ్య లేకపోవడం దారిని పోయేవాళ్ళకి వెలితిగానే అనిపించింది.
* * *
భర్తకి పెరుగు వడ్డిస్తూ "మీ పిన్ని రేపు వెళ్ళిపోతానంటున్నారు" అంది మీనాక్షి.
కలుపుతున్న అన్నాన్ని విసురుగా పక్కకితోసి "ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడమాత్రం ఆదరించేవారు ఎవరున్నారు?" అన్నాడు భార్య ముఖంలోకి చూస్తూ శివయ్య.
"ఇక్కడ మాత్రం మనం చూపుతున్న ఆదరం ఏముంది?" కాస్త విరసనగానే ఆ మాట అంది మీనాక్షి.
