Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 11


    కాలూ మాట్లాడలేదు.
    "ఒకే మార్గం నీకూ, నాకూ, మనందరికీ ఒకే మార్గం ఉంది."
    "ఏమిటామార్గం?" కాలూ మెరుపులా తన ముఖం తిప్పాడు.
    "మనం మట్టి మనుషులం. పెద్ద కులాల వాళ్ళకు మనమంటే భయం. అందుకే వారికి మనమంటే ద్వేషం. వారు మనలను పొట్టలో పొడుస్తారు. మనం వీపుమీద బాదాలి.
    కాలూ ఏమీ అర్ధంకానట్లు తల ఊపాడు.
    బి-10 తదేక ధ్యానంతో కాలూను చూచాడు. అతని చూపులు మెత్తపడ్డాయి. బిడ్డను గురించి ఒకటే ఆదుర్దాపడుతూ, సదా ఆమెమాటే మాటాడుతుంటే ఏనుగులాంటి మనిషినిచూసి అతనికి విచారం కలిగింది.
    "మంచిగా బ్రతకడానికి అవకాశాలే లేవంటావ్. అవునా? నీకెవ్వరూ మంచి ఉద్యోగం ఇవ్వలేరా?"
    ఒక క్షణం బి-10 మౌనం వహించాడు. అతని ముఖం చెక్కముక్కలా అయింది.
    "ఒకసారి నాకొకడు ఉద్యోగం ఇస్తానన్నాడు."
    "అయితే"
    "విను" అలవాటు ప్రకారం అతని వేళ్ళను మద్దెల్లా ఇనుప మంచంమీద ఆడించాడు. "కొందరు అనాథలు ఒక గొందిలో ఉన్న సంగతి నాకు తెలుసు. నేను తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవాణ్ణి. ఒక సాయంకాలం నేను అక్కడినుంచి తిరిగి వస్తూంటే ఆ వీధి మలుపున ఒక వ్యక్తి నా భుజాన చేయివేశాడు. అతన్ని నేనిదివరకు రెండు మూడు సార్లు చూశాను. అతడు లాంప్ పోస్టుదగ్గర కిళ్ళీతింటూనో సిగరెట్టు తాగుతూనో కనిపించేవాడు. అతడు మిత్రునిలా నన్ను పక్కకులాగి వెండి పెట్టెలోంచి ఒక కిళ్ళీ తీసి ఇచ్చాడు."
    అతని నోట్లోకివస్తున్న ఏదో చేదు పదార్ధాన్ని తొలగించడానికో అన్నట్లు అతడు కొద్దిగా ఆగాడు.
    "అయితే" అని ఆదుర్దాగా అడిగాడు కాలూ.
    "నువ్వా అన్నార్తుల్ను కాపాడాలనుకుంటున్నావ్ కదూ!" అన్నాడు తనగుడ్లను ఆ గొందివైపు తిప్పుతూ నేను రజనీ (అతడు అది తన పేరని చెప్పాడు) వైపు చూచాను. 'మిత్రమా! నేనేదో అర్ధరహితంగా మాట్లాడుతున్నాననుకోకు. నీవూ, నేనూ ఈ కరువు కథను ఒక వ్యాసంతో మార్చలేము. కాని కొన్ని ప్రాణాల్ను రక్షించవచ్చు. ఆ గుంపులో అయిదుగురు యువతులున్నారు - ఇద్దరు అందకత్తెలు- మిగతావారు మామూలువారు. ఆ సుందరుల్లో ఒకర్తె పాపట్లో కుంకం ఉంది కాబట్టి ఆమె వివాహిత అని తెలుస్తూంది. ఈ స్త్రీలనూ వారి బంధువుల్నూ రక్షించడానికి ఒక మార్గం ఉంది. నీక్కూడా బహుమతి లభిస్తుంది. నీవు చేయదలచుకుంటే పనీ, సరియైన వేతనంకూడా ఇప్పిస్తాను. ఏమంటావు మిత్రమా?"
    "భగవంతుడా!" అని అరచాడు కాలూ.
    "చక్రాల్లాంటి కళ్ళతో రజని నన్ను చూశాడు. 'మిత్రమా, చిన్నవాడివైనప్పటికీ నీ ముఖాన తెలివి కనిపిస్తూంది. కాబట్టి విను. ప్రాణదానంకంటే మించిన దానం ఏమిటి? ప్రాణదానం అన్ని దానాలకంటే గొప్పదానమని మన మతగ్రంథాలన్నీ ఘోషించడం లేదా? ఒక భీకరబాధనుంచి రక్షించడంకంటే గొప్ప పని ఏంకావాలి? ఆ యువతులు దానం ఆర్జిస్తారు. అక్కడున్న జనులు నిన్ను గౌరవిస్తారు. వారు నీవు మాట్లాడిన ప్రతి మాటనూ ఎలా గౌరవిస్తారో నేను చూశాణు. కాబట్టే నేను నీతో చెబుతున్నాను. నన్ను అపార్ధం చేసుకోకు."
    బి-10 ముఖం తిప్పుకున్నాడు. అతని వ్రేళ్ళు ఇనుప మంచాన్ని మద్దెల కొడుతున్నాయి.
    కాలూ "భగవంతుడా!" అని అరిచాడు. "ఆ మహానగరం కలియుగ నరకం అయిపోతూంది. రజనీ! తానిది వరకు ఆపేరు విన్నాడా? అవును. ఝార్నాకువచ్చిన బంగారు వర్తకుడు అదే పేరు చెప్పాడు. రజని.....అవును అదేపేరు. అతడు పని ఇస్తానన్నాడు. న్యాయమైన వేతనంకూడా. అతడు ఈ రజనీయేనా? అతడు చెప్పింది ఈ వ్యాపారమేనా?"
    కాలూ పళ్ళు పటపటా కొరికి పిడికిళ్ళుబిగించి "భగవంతుడా" అని గట్టిగా అరచాడు.
    "రజని ఒక వేశ్యా గృహంలో పనిచేస్తాడు. తెలిసిందా? అతడు ఆ ఇంటికి యజమానైతేకాడు. పైనున్న వారెవ్వరూ కనిపించరు. వారు సంఘపు స్థంబాలు, లాయర్లు, బ్యాంకర్లూ కావచ్చు. వేశ్యా గృహాలు నేడు వర్ధిల్లినంతగా పూర్వమెప్పుడూ వర్ధిల్లలేదని రజని నాతో చెప్పాడు. యువతుల్ని తల్లిదండ్రుల దగ్గర కొంటారు. దొంగిలిస్తారు. ఆశలు చూపి బుజ్జగిస్తారు."
    "నువ్వేం చేశావ్?"
    "నిరుత్తరమైన ప్రశ్న నా మనస్సును వేధించింది. స్త్రీ తనను అమ్ముకున్న దానికంటే చావాలి. ఆమె ఎందుకు చావాలి? ఈ వ్యాపారంలో ఆమె శరీరమే వినియోగపడేది. అమ్మకుండా ఉంటే ఆ మాంసం సేరు మేక మాంసపుటంత ఖరీదు చేయదు. ఆమె గౌరవంకోసం ఎందుకు చావాలి? ఎన్నడో చచ్చిన ఆదర్శాలకోసం ఎందుకు అస్తమించాలి?"
    "చచ్చిన భావాలూ?" కాలూ గర్జించాడు.
    "ఈదేశంలో ఇంకా మాన మర్యాదలు కూడా మిగిలాయా?"
    కాలూ జవాబు చెప్పలేకపోయాడు. అంత చిన్న వయస్సులో బి- - 10 అంత కటికవాడు ఎలా అయినాడా? అని ఆశ్చర్యపోయాడు. బి- 10 చెపుతూనే ఉన్నాడు. "కుళ్ళిపోయిన గౌరవం అనే శవాన్ని స్త్రీ తన భుజాలమీద ఎందుకు మోయాలి? సాంఘిక దౌర్జన్యానికి బలియై కృశించి నశించే ఆడది ఎందుకంత త్యాగం చేయాలి?"
    కాలూ కళ్ళు విచారదష్టములైనాయి. అతని గుండెలో బి-10 ఇంకాస్త స్థలం చేసుకొని కూర్చున్నాడు. "అయితే అప్పుడు నీ దశ ఎలా ఉండింది మిత్రమా?"
    "నా ఆలోచనలు కలతపెట్టాయి. ఇలాంటి వాటిని గురించి వివరించడానికి నాకు మిత్రులెవరూ లేరు. అయినా నా వ్యధ రెండు మూడు రోజుల్లో అంతమొందింది. సెంట్రల్ ఎవిన్యూలో ఒక ఆహారపదార్ధాల దుకాణంముందు, పేవ్ మెంటు మీద ఒక దిక్కులేని ముదివగ్గును చూశాను. అతని కళ్ళు కాల్చిన రొట్టెనూ, కూరల్ను తినేస్తూండగా, అతని ముక్కువాటి వాసన్ను పీల్చేస్తూంది. ఒక పోలీసువాని బెత్తపుదెబ్బ గట్టిగా అతని వీపుకు తగిలింది. 'చలో అని' ఆ పోలీసు ఆజ్ఞాపించాడు. ఆ వృద్ధుని మోకాళ్ళు మాటవినకపోవడంతో అతడు రోడ్డుమీద కూలబడ్డాడు. 'ఓరి పంది! ఆజ్ఞను ధిక్కరిస్తావా?' అని అన్నార్తుని నెత్తిన బెత్తం పడింది. అతడు పడిపోయి దుమ్ము కరిచాడు. అతడు పడ్డంచూసిన నేను అక్కడికి దగ్గర్లోనే ఉన్న గొందికి పరిగెత్తి, చుట్టూకూర్చున్న జనాన్ని చూసి 'ముసలివాణ్ణి చంపేస్తున్నారు. మీ సోదరుణ్ణి చంపేస్తున్నారు' అనరిచాను. మొదలు వారు నన్ను అర్ధం చేసుకోలేక పోయారు. 'వాళ్ళు మన్నెందుకు చంపుతారు? ఏదో నాల్గు రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళం,' అనుకున్నారు."
    "అతన్ని బాదేస్తున్నారు" గట్టిగా కేక పెట్టేశాను. నా కళ్ళు చింత నిప్పులైనాయి. "అతడు మట్లో పడిపోయాడు. తినుబండారాల దుకాణంలో చూచే ధైర్యం చేసినందుకు వారతన్ని చంపేస్తున్నారు. అతని చూపే కలిగినవారికి విషం అయింది." నేను ఈమాట అనగానే కొద్దిగా కలవరం బైల్దేరింది."ఒక కుక్కకు దూరంనుంచి ఆహారాన్ని చూడ్డానికే కాదు వాసన చూడ్డానికి సహితం స్వాంతంత్ర్యం ఉంది." కలవరం ఎక్కువైంది. "మీ సోదరుణ్ణి ఒకణ్ణి చంపుతుంటే మీరు చూస్తూంటారా?" ఈ పదాలు నిప్పురవ్వలా పని చేశాయి. నిముషంలో కళ్ళల్లో ప్రాణాలున్న కళేబరాలు గుంపులు గుంపులుగా గొందినుంచి బైటపడ్డాయి. అడుగు తీసి అడుగుపెట్టలేనివారు కళ్ళలో నిప్పుతో పరుగుతీశారు."
    ఆ విచిత్రక్షణం మేధస్సులో మెరవగా బి-10 తదేకధ్యానంగా చూశాడు.
    "ఆ ఎర్రటోపీ లంజాకొడుకులు నిన్ను పట్టుకున్నారు అంతేనా?"
    "వారు నన్ను పట్టుకున్నారు. ఆకలి గుంపులో చాలా కొద్ది మంది అజ్ఞాతంగా అల్లరికి కారణం అయిన ముసలి శరీరంతో తప్పుకున్నారు. వారంతా శ్మశాన వాటికకు మోటారు ట్రక్కుల్లోనే పోయారనుకో!"
    ఆ యువకుని ముఖంలోని అపారమైన వ్యాకులతను కాలూ చూస్తూ ఉండిపోయాడు. ఆ వ్యాకులత క్షణమాత్రమే నిలచింది. తన మనసులో పాతుకొని ఉన్న అభిప్రాయాల్ను బైటపడనివ్వకుండా ఉండడం బి-10కు బాగా తెలుసు.
    "అబ్బ నువ్వెంత చిన్నవాడివి. అయినా ఎంత జీవితం చూశావ్! నీకు ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసనుకుంటా."
    'చిన్నవాన్నా! నేను నా అసలు వయసు కంటే 20 ఏళ్ళు పెద్దపెరిగాను" అంటూ బి-10 నవ్వాడు.
    నాటిరాత్రి బి-10 తన ఇనుప మంచంలో కూర్చొని పి- 14తో "నేను నిన్ను గురించే ఆలోచిస్తూన్నా" అన్నాడు.
    కాలూ మాట్లాడలేదు. ఈ యువకుని భావాల్లోనూ మాటల్లోనూ కాలూకు ఆశ్చర్యంగా విశ్వాసం కలిగింది.
    "ఆ మహానగరంలో జీవించడానికి నీ కొక ఉపాయం చూపగలననుకో."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS