Previous Page Next Page 
అర్చన పేజి 71


    "అవుతారులెండి. మీరు చాలా షార్ప్" అన్నాడు.
    "థాంక్యూ" అని నవ్వేసింది. అలా అన్నదే కానీ మనసులో కొంచెం దిగులు మొదలైంది. ఇకనుంచీ ఊరూరూ తిరగాలేమో! బదిలీలు, ట్రైనింగులు అంటూ ఎక్కడికి వెళితే ఎవరు ఎదురవుతారో అని భయం వేస్తోంది. ఎవరు ఎదురైనా మానిపోతున్న పుండుని ఏదో రకంగా కెలకడమే జరుగుతుంది. అలా జరిగితే తను తన ఉద్యోగానికి న్యాయం చేయలేదు. ఏ అందోళనా లేకుండా ప్రశాంతంగా, నిశ్చింతగా ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏనాటికైనా ఐఏ యస్ అనిపించుకోవాలి. యస్. తప్పకుండా అనిపించుకుంటా.
    అలా అనుకున్నాక అర్చనకి చాలా హాయిగా అనిపించింది.
    అర్చన ఐఏయస్ ఎంత బాగుంటుంది. ఎప్పటికి వస్తుందా రోజు?
    అర్చనకి క్వార్టర్స్, ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేశారు.
    మూడు నెల్లు కాలా. అప్పుడే మూడు ఊళ్ళు తిరగింది. గుడివాడలో ప్రస్తుతం వి.ఆర్.వో. ట్రైనింగ్ ఉంది.
    మొదటిరోజు మచిలీపట్నం రోడ్ల మీద తిరుగుతోంటే అణువణువూ తమాషాగా స్పందించింది. మచిలీపట్నానికి ఓ చరిత్ర ఉంది. ఆంధ్రదేశ చరిత్రలో ఓ ప్రాధాన్యత ఉంది. అయితే, మొదటిసారి చూసినప్పుడు అనిపించింది. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఊరు ఇలా ఉందేం. ఈ మచిలీపట్నం మూడవ శతాబ్ధం నాటికే ఏర్పడిందంటారు. ఇంకా అప్పటిలాగే ఉంది. ఇంతకన్నా బాగుచేయలేరా?
    ఫ్రెంచి, డచ్, బ్రిటిష్ వారు ఆంద్రప్రదేశ్ లో మొదటగా వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు సాగించింది ఇక్కడినుంచే.
    అమ్మ బందరు లడ్డు ఎంత బాగా చేసేది! తల్లి గుర్తుకురాగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎంత నిర్దయ వాళ్ళకి! నా సుఖం కన్నా పరువు, మర్యాదలే ముఖ్యం కాబోలు. గుండె బరువెక్కింది. నిజం చెప్పాలంటే ఇవాళ ఎంత శుభదినం. కూతురు భవిష్యత్తులో కలెక్టర్ అవుతుంది. ఒక మంచి హోదాలో ఉద్యోగం చేయబోతోంది. వాళ్ళకెంత గర్వకారణం. మగపిల్లాడినైతే నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి మనింటిపేరు, నాన్నగారి పేరు నిలబెట్టరా నాన్నా అంటారు. ఆడపిల్లల్ని మాత్రం అణకువగా, మర్యాదగా ఉంటూ, అత్తగారింట్లో బుద్ధిగా ఉంటూ, భర్త ఏమన్నా ఎదురు చెప్పకుండా పుట్టింటి పరువు నిలబెట్టు అంటారు. ఎందుకీ తేడా? ఆడపిల్లగా తను ఎదిగిన తీరు, తన హోదా, రేపు ఈ సమాజంలో, తనని అవహేళన చేసిన ఈ సమాజంలో తనొక పెద్ద ఆఫీసర్ గా తిరుగుతుంది. వీళ్ళంతా రేపట్నించీ తన అడుగులకు మడుగులొత్తుతారు. ఇప్పుడు తను ఆ వెధవ నాగరాజుని ఏమైనా చేయచ్చు. తనకి కొద్దిరోజుల్లో పవర్స్ వస్తాయి. పవర్ ఫుల్ లేడీ. ఇది ఏ తల్లీతండ్రికైనా ఎంత గర్వకారణం. కానీ ఏం జరుగుతోంది? వాళ్ళింటినుంచి, వాళ్ళ కుటుంబం నుంచీ, ఆఖరికి వాళ్ళ జీవితాలనుంచే తనని వెలేశారు. చాలా అన్యాయం! చాలా అన్యాయం భగవాన్. నేనీ అన్యాయం సహించలేను బాధగా అనుకుంది.
    నువ్వు సహించినా, సహించకపోయినా ఇంతే నీ జీవితం అని ఎవరో చెళ్ళున చరిచి చెప్పినట్టు అనిపించింది నిట్టూర్చింది.
    చలికాలం మొదలైందేమో చల్లటి గాలి విసురుగా తగులుతోంది. కొంగు భుజం చుట్టూ కప్పుకుంది.
    కృష్ణా జిల్లా గుడివాడ కూడా బాగుంది. ఎందుకో తెలియదు కానీ, ఆ ఊళ్ళో తిరుగుతోంటే ఊరు మీద తెలియని మమకారం కలుగుతోంది. ఏదో తెలియని చిన్న పులకింత, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఆమె అలోచనల్లో ఉండగానే కారు క్వార్టర్స్ ముందు ఆగింది. అర్చన కారు దిగి లోపలికి నడిచింది. వెనకాలే డ్రైవర్ తన ఫైల్ బ్యాగ్ పట్టుకుని వస్తుంటే గర్వంగా అనిపించింది.

                                                                    * * * * *

    అనుకున్న ప్రకారం వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యంగా వేణు, చక్రవర్తి వెళ్ళి వేణు ఇంటి ఓనర్ ని కలిశారు. ఇల్లు అమ్మే ప్లాన్ లో అతనుండడం వలన కొంచెం అనుకూలంగానే మాట్లాడాడు అతను. దాదాపు గంటసేపు రకరకాల చర్చలు జరిగాక రేటు ఫిక్స్ అయింది. అతను చెప్పిన ధర తాలూకు డబ్బు వేణుకి తప్పకుండా లోన్ వస్తుందని చెప్పాడు చక్రవర్తి. త్వరలోనే నిర్ణయం చెప్పేస్తామని ఆయనతో చెప్పి బైటికి నడిచారు చక్రవర్తి, వేణు. చక్రవర్తి కారులో ఇద్దరూ వేణు ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే తల్లికి, ఫోన్ లో తండ్రికి విషయం వివరించాడు వేణు. తన ఊళ్ళో ఉన్న ఇల్లంత విశాలంగా లేకపోయినా, పట్నంలో ఇలాంటి ఇల్లు దొరకడం అదృష్టంగా భావించిన తాయారమ్మకి కొడుకు తీసుకున్న నిర్ణయం నచ్చింది. వెంటనే తాను కూడా ఫోన్ లో భర్తతో తన హర్షాన్ని ప్రకటించింది.
    "నలభై లక్షలు లోను ఎందుకురా నాన్నా! ఇరవై తీసుకో మిగతాది నేను సర్దుతాను" అన్నాడు కృష్ణస్వామి. వేణుకి ఆయన ప్రపోజల బాధాకరంగా అనిపించినా చక్రవర్తి కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడు.
    మంచిరోజని అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి వెళ్ళి ఓనర్ కి రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంటు రాసుకున్నారు.
    ఆ సందర్భం పురస్కరించుకుని "రాత్రి డిన్నర్ బైట చేద్దాం" అంది మాధవి.
    వేణు అంగీకరించాడు.
    తల్లికి తాను డిన్నర్ కి రానని చెప్పి మాధవి కుటుంబంతో కలిసి ఇన్ ఆర్బిట్ మాల్ కి వెళ్ళాడు వేణు. ప్రీతి ఉద్యోగంలో జాయిన్ అయి నెల రోజులవుతోంది. ప్రీతి వేణుతో స్నేహం కలిపేసింది. ఆ రోజు శిల్పారామం వెళ్ళినప్పుడే చాలా కబుర్లు చెప్పేసింది. ఆ అమ్మాయి కబుర్లు వేణుక్కూడా నచ్చాయి. ఆమెతో మాట్లాడుతుంటే హాయిగా అనిపించింది. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులయిపోయారు. మధ్య మధ్య రెండుసార్లు ఫోన్ లో కూడా మాట్లాడుకున్నా, ఆ రోజు తర్వాత ఇవాళే మళ్ళీ కలవడం.
    "కంగ్రాట్స్ వేణూ" షేక్ హ్యాందిస్తూ అభినందించింది ప్రీతి.
    "థాంక్యూ" నవ్వుతూ చెప్పాడు వేణు.
    మాధవి వాళ్ళిద్దరినీ మరోసారి కలపాలని అనుకున్న తొందరపడకుండా అవకాశం ఎదురుచూసింది. ఆ అవకాశం ఈనాడు కల్పించింది. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే డిన్నర్ ప్రపోజల్ పెట్టింది. ఇంతకన్నా మంచి సమయం ఏం ఉంది అనిపించింది మాధవికి.
    చక్రవర్తి డ్రైవింగ్ సీట్లో, అతని పక్కన ఒల్లో కౌశిక్ తో మధవి, వెనక సీట్లో ప్రీతి, వేణు కూర్చున్నారు. కారు కదిలింది. ప్రీతి గలగలా నవ్వుతూ తన ఆఫీసు విషయాలు చెప్తోంటే సరదాగా వింటూ కూర్చున్నాడు వేణు. మధ్య మధ్య మాధవిని అక్కా ఆ విషయం తెలుసా, ఈ సమగతి తెలుసా అంటూ కదుపుతున్నా మాధవి మాత్రం వాళ్ళ మాటల మధ్య ఎక్కువగా తను గానీ, చక్రవర్తిగానీ అడ్డు రాకుండా జాగ్రత్త పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS