Previous Page Next Page 
అర్చన పేజి 70


    "ష్యూర్... థాంక్యూ" అంటూ సూట్ కేస్ తెరిచి టవల్, నైటీ తీసుకుని వెళ్ళిపోయింది.
    మాధవి బాత్ రూమ్ చూపించి, పేస్టు, నీళ్ళు ఇవ్వడానికి ప్రీతి వెనకాలే వెళ్ళింది.
    చక్రవర్తి పనిపిల్లాడితో ప్రీతి సూట్ కేస్ లోపల ఆమెకి కేటాయించిన గదిలో పెట్టించాడు.
    ప్రీతిని స్నానానికి పంపించి వచ్చింది మాధవి. చక్రవరతిని చూసి "ఎలా ఉంది?" అంది.
    "అమ్మాయికేం? చూడముచ్చటగా ఉంది. కానీ, వేణు కుటుంబంలో కలిసిపోతుందా అనేదే అనుమానం."
    "ఎందుకో?"
    "ఆమె డ్రెస్, ఓవర్ యాక్టివ్ నెస్ చూస్తుంటే అనిపిస్తోంది."
    "చక్కగా సరిపోతుంది. మీరేం వర్రీ అవకండి" హామీ ఇస్తున్నట్టుగా అని కౌశిక్ ఏడుపు విని బెడ్ రూములోకి పరిగెత్తింది.
    నిద్ర లేచి, కూర్చుని ఏడుపు మొదలెట్టాడు కౌశిక్. వాడినెత్తుకుని లాలిస్తూ "ఎందుకురా అప్పుడే లేచావు? సరేలే, పిన్ని వచ్చింది చూపిస్తా రా! మనం బ్రష్ చేసుకుని. పాలు తాగి పిన్నితో ఆడుకుందామా?" అంటూ వాడితో కబుర్లు చెబుతూ హాల్లోకి వచ్చిన మాధవి, స్నానం పూర్తిచేసుకుని చుడీదార్ తో కనిపించిన ప్రీతివైపు తృప్తిగా చూసింది.
    "ఇడుగో నా కొడుకు" అంటూ కౌశిక్ ని చూపించింది.
    ప్రీతి "హాయ్" అంటూ చేయి చాచింది. నిద్రమత్తు పూర్తిగా వదలని కౌశిక్ ఏడుపు మొహం పెట్టి మాధవిని హత్తుకుపోయాడు.
    "రారా... నేను పిన్నిని" అంది దబాయింపుగా ప్రీతి.
    అడ్డంగా తల ఊపి ఆమె భుజంమీద వాలిపోయాడు కౌశిక్.
    "సర్లే....కాస్సేపయాక వాడే వస్తాడు. పద కాఫీ తాగుదువుగాని" అంటూ కిచెన్ వైపు దారితీసింది మాధవి. ఆమెని అనుసరించింది ప్రీతి.
    వెనకాలే వస్తున్న ప్రీతిని మాధవి భుజం మీదనుంచి తొంగి చూస్తున్నాడు కౌశిక్. "పిలిస్తే రాకుండా ఏంటిరా దొంగచూపులు చూస్తున్నావు? అన్నీ వెధవ బుద్ధులే... మగ బుద్ధులు" అంది ప్రీతి.
    "ఏంటే పసివాడ్ని దులిపేస్తున్నావు?" చిరుకోపంతో అంది మాధవి.
    'పసివాడైనా, ముసలాడైనా మగాడు మగాడే!"
    "నీకు మగాళ్ళంటే ఏదో కసి ఉన్నట్టుంది."
    "చాలా..." కోపంగా ప్రీతి.
    మాధవి పూర్తిగా ప్రీతివైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగింది "ఎందుకు?"
    "ఎందుకేంటి? ప్రతిదానికీ కాంపిటీషన్ కి వస్తారు" కోపంగా అంది ప్రీతి.
    ఆ అన్న తీరుకి గట్టిగా నవ్వి కౌశిక్ ని ప్రీతి చేతికిస్తూ "వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అమ్మాయిల గురించి ఎత్తుకో వీడ్ని. కాఫీ కలుపుతాను" అంది.
    ప్రీతి చేతుల్లోకి మారిన కౌశిక్ ఏడుపు లంకించుకున్నాడు. "ఏడవకురా! నీకు చాక్లెట్ కొనిస్తాను" అంటూ భుజాన వేసుకుని వంటగదిలోంచి డైనింగ్ హాల్లోకి తిరుగుతూ అవీ ఇవీ చూపిస్తూ వాడిని ఓదార్చే ప్రయత్నం చేయసాగింది ప్రీతి. మాధవి ఐదునిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తూ "ఇలా ఇవ్వు" అంటూ కౌశిక్ ని అందుకుంది. ప్రీతి కాఫీ గ్లాసు చేతికి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చుంది.
    "వీడికి మొహం కడిగించి వస్తాను" అంటూ మాధవి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది.
    పొందిగ్గా, నీటుగా ఎక్కడే వస్తువు ఉండాలో స్కెచ్ గీసినట్టు అందంగా పేర్చుకున్న ఫ్రిజ్, మైక్రో ఓవెన్, వెట్ గ్రైండర్, కాబినెట్లు చోసోతూ గట్టిగా అంది ప్రీతి. "అక్కా! మీ ఇల్లు చాలా బాగుంది. నీటుగా పెట్టుకున్నావు. మా అమ్మ అయితే అన్నీ చేతికి అందేలాగా చుట్టూ పెట్టుకుని వంట చేస్తుంది. నాకు చాలా చికాకు తెలుసా?"
    మాధవి టవల్ తో కౌశిక్ మొహం తుడుస్తూ వచ్చి వాడ్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి. గాజు మగ్ లో ఉన్న నీళ్ళు గ్లాసులో పోసి వాడికి మంచినీళ్ళు తాగించింది.
    అక్కడే ఉన్న కాబినెట్ లోంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసి, బౌల్ లో చాకోస్ వేసి వాడి ముందు పెట్టింది.
    "పోనీలే పాపం, పిన్ని ఒక్కతే చేసుకోవాలి కదా!" అంటూ కిచెన్ లోకి వెళ్ళి గ్లాసులో పాలుపోసి, అందులో కాంప్లాన్ కలిపి తీసుకొచ్చింది.
    "వీడు కాంప్లాన్ బాయా?" కాఫీ తాగడం పూర్తిచేసి కప్పు టేబుల్ మీద పెట్టి కౌశిక్ బుగ్గ గిల్లింది ప్రీతి.
    మాధవి నవ్వింది. "ఇవాళ ఎక్కడికన్నా వెళదాం వస్తావా?" అడిగింది.
    "నీ ఇష్టం.... నువ్వెక్కడికంటే అక్కడికి."
    "ఓకె. లంచ్ అయాక నా ఫ్రెండ్ వాళ్ళున్నారు. అక్కడికి వెడదాం. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి శిల్పారామం వెళ్ళొద్దాం."
    "ఓ... థాంక్యూ నాక్కూడా ఎప్పటినుండో శిల్పారామం చూడాలని కోరిక" హుషారుగా అంది ప్రీతి.
    "ఓకే" అంటూ చక్రవర్తిని పిలిచి అప్పటికప్పుడే మధ్యాహ్నం లంచ్ తరువాత వేణు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి శిల్పారామం వెళ్ళడానికి నిర్ణయించేసింది మాధవి.
    ఆమె పనితీరు, మాటలు, కౌశిక్ ని పెంచుతున్న విధానం, నిర్ణయాలు తీసుకోడంలో ఆమె చూపిస్తున్న నేర్పు అన్నీ పరిశీలిస్తూ... అక్క దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంది ప్రీతి.

                                                         * * * * *

    అర్చన జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఉద్యోగస్తురాలిగా జీవితం ప్రారంభం అయింది.
    హైదరాబాదునుంచి నేరుగా వచ్చి మచిలీపట్నంలో కలెక్టర్ కి రిపోర్టు చేసింది. అతను చిన్నవాడే, మంచివాడు ఎంతో మర్యాదగా, స్నేహంగా మాట్లాడాడు. గుడివాడలో వి.ఆర్.వో. ట్రైనింగ్ కి పంపించాడు.
    తహసీల్దారు కూడా మంచివాడే. స్నేహంగా ఉంటున్నాడు. "ఇంతటితో ట్రైనింగ్ అయిపోయింది అనుకోకండి. చాలా ఉంటాయి" అన్నాడు మొదటి రోజు అర్చన బెదురు చూసి.
    నవ్వేసింది అర్చన. "మంచిదే కదండీ. అనుభవజ్ఞుల ద్వారా శిక్షణ పొందితే నేను పర్ ఫెక్ట్ కలెక్టర్ ని అవుతాను" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS