"అవును గానీ, మీ ఊళ్ళో ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఎంతకిస్తారు?" అడిగింది ప్రీతి.
"ఎంతకివ్వడం ఏంటి?" చిత్రంగా చూశాడు వేణు.
"ఏం లేదు మా ఆఫీసులో నాకు కొలీగ్స్ ఇద్దరున్నారు. వాళ్ళకసలు నాలెడ్జి లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు కొనుక్కున్నారని నా నమ్మకం."
వేణు నవ్వాడు. "ఏమో కావచ్చు" అన్నాడు.
"అసలేమీ రాదేంటి వేణూ! ఇంగ్లీషే రాదు. నేను చెబుతుంటే ఇగో అడ్డం వస్తుందేమో మాకు తెలుసు, మాకు తెలుసు అంటూ నన్నసలు నోరెత్తనివ్వరు."
"పోనీ వాళ్ళ పనిలో నువ్వెందుకు ఇన్ వాల్వ్ అవడం,?"
"వాళ్ళ పని కాదు బాబూ! కంబైన్డ్ ప్రాజెక్ట్. వాళ్ళకేం రాదు. నన్ను చేయనివ్వరు. నాకసలు చిరాకొస్తోంది."
ఆమె మొహంలో కనిపించిన చిరాకు చూసి నవ్వాడు.
అలా వారి వారి ఉద్యోగాల గురించి, చదువుల గురించి, విదేశాలకు వెళ్ళడానికి ఎదురవుతున్న సమస్యల గురించీ మాట్లాడుకుంటుంటే మాధవి వినీ, విననట్టు వింటూ మధ్య మధ్య చక్రవర్తికి చూశావా నా తడాఖా అనే సందేశాలు పంపిస్తూ కూర్చుంది.
గంటన్నర తరువాత కారు జూబ్లీ హిల్స్ చేరింది. అక్కడినుంచి మాల్ మరికొంచెం దూరం. ట్రాఫిక్ ఆగిపోయింది. చక్రవర్తి ఇంజన్ ఆఫ్ చేశాడు.
"పాపం మీ ఊళ్ళో డెలివరీలన్నీ రోడ్లమీదే అవుతాయేమో!" అంది ప్రీతి.
ఆ మాట ఆమె ఎందుకందో తెలిసిన మాధవి నవ్వుతూ "నోరుముయ్యవే! వెధవ వాగుడూ నువ్వూనూ" అంది.
"వెధవ్వాగుడేంటక్కా! ఎప్పుడనగా బయల్దేరాం. ఈ లోపల నేను రెండుసార్లు విజయవాడ వెళ్ళి వచ్చేదాన్ని. బాప్ రే ఇంత ట్రాఫిక్కా?"
అప్పుడే వెనకనుంచి అంబులెన్స్ హారన్ వినిపించడంతో "చూశావా నేనంటూనే ఉన్నా ఖచ్చితంగా అందులో డెలివరీ కేసే ఉండచ్చు" అంది ప్రీతి.
అంతలో గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు కదిలింది. కొన్ని నిమిషాల్లోనే మాల్ ముందు ఆగింది.
* * * * *
వేణు ఇంటికి మరమ్మత్తులు మొదలుపెట్టాడు.
వంటగది తాయారమ్మకి అనుకూలంగా విశాలంగా చేయించారు. ఈశాన్యంలో విడిగా పూజగది కట్టించాడు తండ్రికోసం.
రెండు పడకగదులను తన అభిరుచి మేరకు ఆధునికంగా చేయించాడు.
మేడమీద రెండు పడక గదులు, ఒక పెద్ద హాలు.
నీలవేణికి విడిగా మేడమీద ఒక గది ఉంది. దానికి అటాచ్ డ్ బాత్ రూమ్ కట్టించాడు.
మార్బుల్ ఫ్లోరింగ్, బాత్ రూములో చక్కటి డిజైన్ ఉన్న టైల్స్, పూజగదిలో దేవుడి బొమ్మలున్న టైల్స్, వంటగదిలో గ్రైనేట్ తో ఫ్లాట్ ఫామ్, గోడలకి కాఫీ కప్పులున్న టైల్స్, వెనుక భాగంలో పెరట్లో వరసగా చెట్లు పెంచడానికి రెండు వరసలు తవ్వించి చుట్టూ సిమెంటుతో గట్టులా కుట్టించాడు. మిగతా భాగం బండలు వేయించాడు. పాత గేటు తీసేసి కొత్త గేటు పెట్టించాడు. అటు ఆధునిక సౌకర్యాలు, ఇటు సంప్రదాయ నగిషీలు అద్ది చూడగానే మనసు దోచేలా తయారైంది పాత ఇల్లు, బడ్జెట్ అంచనా దాటింది.
వంటగదిలో, బెడ్ రూమ్స్ లో రాక్స్, హాల్లో షోకేసు, ఫాల్స్ సీలింగ్, లైట్లు....ఆ ఇల్లు చూసి నీలవేణి మురిసిపోయింది.
'సినిమాల్లో ఇల్లులా ఉంది. ఎంత బాగా కట్టించారో వేణుబాబు. ఎంతైనా పట్నం బాబు కదా!' అనుకుంది.
తాయారమ్మ ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా అయింది.
బాబుకి మూడో ఏడు వచ్చేసింది. ఇల్లంతా తిరిగేస్తూ చిలకపలుకులు పలుకుతూ ఇంట్లో అందరి ఆనందానికి కేంద్రబిందువైనాడు.
కృష్ణస్వామి వేణుగోపాలస్వామి గుడిలో రామస్వామిని అతనితో పాటు తన స్నేహితుడి కొడుకైన శ్రీధర సిద్దాంతిని అర్చకుడిగా నియమించాడు. శ్రీధర సిద్దాంతిని అర్చకుడిగా నియమించాడు. శ్రీధర సిద్ధాంతి తిరుపతి వేదపాఠశాలలో వేదాలు చదువుకుని వచ్చాడు. బుద్దిమంతుడు. అర్చకుడిగా నియమించే ముందు గుడి బరువు, బాధ్యతలే కాదు, గుడి అభివృద్ధి కోసం కూడా పాటుపడాలని చెప్పాడు.
ఆ గుడి సుమారు 60 సంవత్సరాల క్రితం నాటిది. ఇంతవరకూ కృష్ణస్వామీ కుటుంబంవారే గానీ, మరెవ్వరూ అర్చకులుగా చేయలేదు. అక్కడ వేణుగోపాలుడు వెలిశాడని అంటారు. పురాతన కాలంనాటి కట్టడం. గర్భగుడి కూడా చాలా లోపలికి ప్రధాన ద్వారానికి నలుగు అడుగులు లోపలికి ఉంటుంది. నల్లటి విగ్రహం. గుడి ఆవరణలో వేపచెట్లు, రావిచెట్లు, మావిడి చెట్లు ఉంటాయి, ఒక మర్రిచెట్టు కూడా బాగా కిందికి వేళ్ళాడే ఊడలతో ఉంటుంది. ధ్వజస్థంభం ముందు పెద్ద తులసికోట ఉంటుంది. ఎంతటి అశాంతినైనా హరించి మనశ్శాంతిని ప్రసాదించే వాతావరణం అక్కడ నెలకొని ఉంటుంది.
భక్తులు హారతి పళ్ళెంలో, హుండీలో వేసే డబ్బు తప్ప మరో గుడి నిధి అంటూ ఏమీ లేదు. ఎవరు అర్చకులుగా ఉంటే వాళ్ళే ప్రసాదాలు చేసి నైవేద్యం పెడతారు. ఇప్పటిదాకా దేవుడి నైవేద్యానికి ఎలాంటి లోటూ జరగలేదు. ఇకముందు కూడా అలాంటి లోటు జరగకుండా చూడమని కన్నీళ్ళతో చెప్పిన కృష్ణస్వామికి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు శ్రీధర సిద్దాంతి ఈ పవిత్రత ఎప్పటికీ ఇలాగే ఉంటుంది బాబాయ్ అన్నాడు.
ఆ గుడితో అనుబంధం తెంచుకుని వెళ్తుంటే ఆయన గుండె ముక్కలైనట్టు అనిపించింది. భగవంతుడితో ఉన్న అనుబంధం ఎక్కడున్నా అలాగే ఉంటుంది. కానీ, పిల్లలతో అనుబంధం దగ్గరగా ఉంటేనే ఉంటుందేమో అనిపించింది ఆయనకి. ప్రస్తుతానికి ఇల్లు మాత్రం తాళం వేసేసి, కొడుకు దగ్గరకు హైదరాబాదు బయలుదేరాడు.
కృష్ణస్వామి రాకతో ఆ ఇంటికి నిండుదనం వచ్చినట్టు అనిపించింది తాయారమ్మకి. ఇన్నాళ్ళూ భర్త అక్కడ ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో అని ప్రతి క్షణం దిగులుండేది. మనిషి కొడుకు దగ్గర ఉన్నా, మనసు మాత్రం భర్త చుట్టూ తిరుగుతుండేది. అరవై అయిదేళ్ళ వృద్ధుడిని జీవితంలో మొదటిసారిగా ఒక్కడినే వదిలిపెట్టడం నిజానికి ఎంతో బాధాకరమైన విషయం. కానీ, పరిస్థితులు ఆవిడని ఆయనకి దూరం చేశాయి. ఒక పసివాడిని, అందునా తన మనవడిని తల్లి లేనివాడిని, ఏమాత్రం పిల్లల్ని పెంచే అనుభవంలేని కొడుకు దగ్గర వదిలిపెట్టి ఉండడం అంతకన్నా బాధాకరం అనిపించింది. పోనీ నీలవేణిని ఇక్కడ ఉంచాలన్నా, అక్కడ ఉంచాలన్నా ఆ పిల్ల నిండు యవ్వనంలో ఉంది. ఏ క్షణంలో ఏం జరిగినా అందుకు తనే బాధ్యురాలు అవుతుంది. అటు భర్తమీదా, ఇటు కొడుకు మీదా నమ్మకం లేక కాదు. పరిస్థితుల మీద ఆవిడకి నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన రావడంతో ఆవిడ ఆనందానికి అవధుల్లేకుండా ఉంది.
