Previous Page Next Page 
అర్చన పేజి 69


    నళిని గుమ్మందాకా వచ్చి వీడ్కోలు చెప్పింది.
    ఆమె వెళ్ళేటప్పటికే హైదరాబాదు వెళ్ళాల్సిన రైలు ఫ్లాట్ ఫామ్ మీదికి వచ్చి ఉంది. తన కంపార్ట్ మెంట్ చూసుకుని, బెర్త్ వెతుక్కుని, సూట్ కేస్ సీటు కిందకి తోసి, సీటులో కూర్చుని రిలాక్స్ అయింది అర్చన.
    భూమి గుండ్రంగా ఉండును. జీవితం ఎటు వెళ్ళినా ప్రారంభించిన చోటుకే వస్తోంది. హైదరాబాదు.....! ఇక్కడ తనకేం జ్ఞాపకాలు గుర్తుంచుకోవాల్సినవి ఏమీ లేవు. ఏ అనుబంధాలూ లేవు. వేణుతో సహజీవనంలో మధురానుభూతులకు చోటే లేదు. ఇకపోతే పేగు చీల్చుకుని పుట్టిన బాబు......వాడెక్కడున్నాడో? వాడి తాతగారు, నానమ్మల దగ్గర ఉండి ఉంటాడు. వాళ్ళు వేణు దగ్గర ఉండిపోయే అవకాశం లేదు కాబట్టి అప్పుడప్పుడు వేణూనే వెళ్ళి వాడితో గడిపి వస్తున్నాడేమో! తను వేణుకి ఎదురుపడే అవకాశమే లేదు. సెక్రటేరియట్ లో పని కాగానే తిరిగి రైలో బస్సో ఎక్కి వెనక్కి వచ్చేస్తుంది. ఇకపోతే బాబు.... వాడిని చూడాలన్న ఆరాటం తనకి లేదు, కాకపోతే వాడిని వదిలేసి వచ్సినందుకు మాత్రం అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కానీ తప్పదు.
    ఇంకెవరున్నారు? మాధవి? మాధవి ఉద్యోగం చేస్తోందో, మానేసిందో?
    అతను ఉండి ఉంటాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో! అతను కానీ మళ్ళీ కనిపించడు కదా! మానుతున్న గాయం మీద కారం చల్లినట్టు అతను కనుక కనిపిస్తే తను ఖచ్సితంగా డిస్టర్బ్ అవుతుంది. భగవంతుడా! అతను మాత్రం కనిపించకూడదు. మనసంతా వికలమైపోయింది. హఠాత్తుగా భవిష్యత్తు శూన్యంగా అనిపించింది.
    "ఎక్స్ క్యూజ్ మీ..."
    అర్చన ఆలోచనల్లోంచి తేరుకుని తలతిప్పి చూసింది.
    పాతికేళ్ళ యువతి ఎదురుగా నిలబడి ఉంది. చేతిలో సూట్ కేస్, భుజానికి హ్యాండ్ బ్యాగ్.
    "కొంచెం జరిగితే  సూట్ కేస్ పెట్టుకుంటాను" అంది.
    అర్చన కాళ్ళు దగ్గరికి లాక్కుంది.
    ఆ అమ్మాయి వంగి సూట్ కేసు సీటు కిందకి తోసి హమ్మయ్య అంటూ సీటులో కూర్చుంది.
    "మీరు హైదరాబాదేనా?" అడిగింది.
    అవునన్నట్టు తలూపింది అర్చన.
    "నేనూ హైదరాబాదేనండి. నాకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఓ అలాట్ మెంట్ వచ్చింది. సెక్రటేరియట్ లో రిపోర్టు చేయాలి."
    అర్చన కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి. "అరే! నేను కూడా రిపోర్టు చేయడానికే వెళ్తున్నాను."
    "ఓ అలాగా! గ్లాడ్ టు మీట్ యు. నా పేరు గాయత్రి. మీరు?"
    "నా పేరు అర్చన."    
    "అబ్బ! చాలా హ్యాపీగా ఉంది అర్చనా! ఒక్కదాన్ని నాకేం తెలియదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ బయల్దేరాను."
    "నేనూ అంతే!" నవ్వింది అర్చన. కాసేపట్లో ఇద్దరూ కబుర్లలో పడిపోయారు. వాళ్ళు కబుర్లలో ఉండగానే రైఉ కదిలింది.

                                                                              * * * * *

    ప్రీతికి హైదరాబాదులో హైటెక్ సిటీలో ఉద్యోగం సంపాదించింది మాధవి. ప్రీతిని ఎలాగైనా హైదరాబాదు పిలిపించాలన్న ఆమె కోరిక నేరవేరింది. "వచ్చాక వెతుక్కుంటుందిలే పిన్నీ... పంపించెయ్. నాకూ బోర్ర్ గా ఉంది. ప్రీతి తోడుగా ఉంటుంది" అని ఎంత బతిమాలినా, శైలజ మాత్రం "ముందు ఉద్యోగం దొరకనీవే. అలాగే పంపిస్తాను. అట్నుంచి అటే పెళ్ళి చేసి పంపించేద్ధువుగాని" అని ఉద్యోగం దొరికిందాకా పంపలేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం త్వరగానే దొరికింది.
    ఆ రోజే ప్రీతి వచ్చే రోజు. శుక్రవారం ఉదయాన్నే ఆరింటికే వచ్చేస్తుంది బస్సు. చక్రవర్తి డిపోకి వెళ్ళి ప్రీతిని పికప్ చేసుకున్నాడు.
    సన్నగా, నాజూగ్గా ఉంది. చుడీ మీద షార్ట్ వేసుకుంది. పొట్టి జుట్టు క్లిప్ పెట్టి వదిలేసింది. చున్నీ మెడకు వేసుకుంది. డ్రస్ పూర్తిగా ఫిగర్ కనిపించేలా ఫిట్టింగ్. ఒక చేతికి బ్రెస్ లెట్, మెడలో సన్నటి గొలుసు గొంతువరకే ఉంది. డానికో చిన్న లాకెట్. చెవులకి చిన్న టాప్స్, పాయింటెడ్ షూస్.
    ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి అనుమానంగా పిలిచాడు "ప్రీతీ!"
    చటుక్కున చూసి నవ్వింది. "హాయ్ బావగారూ! ఎలా ఉన్నారు?" అంటూ పలకరించి చనువుగా కారులో చక్రవర్తి పక్కనే కూర్చుని "మిమ్మల్ని పెళ్ళిలో చూశానంతే. నేనప్పుడు టెన్త్ లో ఉన్నాను. మీరు నన్నసలు గుర్తుపట్టరేమో అనుకున్నా. ఫర్వాలేదే" గబగబా మాట్లాడుతూ దారి పొడుగునా తన కాలేజీ కబుర్లు, ఉద్యోగం కబుర్లు తెగ చెప్పేసింది. తనకి హైదరాబాదులో ఉద్యోగం చూపించినందుకు బోలెడన్ని థాంక్స్ కూడా చెప్పింది. ఆ అమ్మాయి చలాకీతనం, మాటకారితనం చూశాక మాధవి అంచనా తప్పు కాదని, త్వరలోనే వేణుని బుట్టలో వేసేయగలదని అనిపించింది చక్రవర్తికి.
    కారు ఇంటి ముందు ఆగింది. తన సూట్ కేసు కారులోనే వదలేసి, హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని లోపలికి పరిగెత్తింది. గుమ్మంలోనే ఎదురొచ్సిన మాధవిని కావలించేసుకుని "బాగున్నావా అక్కా?" అంటూ పలకరించింది.
    "ఏడీ నీ కొడుకు? నాకు మంచి కాఫీ ఇస్తావా? తలనొప్పిగా ఉంది" గబగబా మాట్లాడేస్తూ, సమాధానం కోసం చూడకుండా ఇల్లంతా తిరిగేస్తున్న ప్రీతివైపు మురిపెంగా చూస్తూ 'ఎలా ఉంది?' అన్నట్టు కళ్ళెగరేస్తూ చక్రవర్తివైపు చూసింది మాధవి. చక్రవర్తి 'గుడ్' అన్నట్టుగా బొటనవేలు చూపించి నవ్వాడు.
    ఒక రౌండ్ ఇల్లంతా చూసి మాధవి వైపు చూస్తూ "బావగారు చాలా మంచివారు" అంది ప్రీతి.
    "ఏంటో ఆయన మంచితనం అప్పుడే ఏం చూశావు?" నవ్వింది మాధవి.
    "చిన్న మెతుకు ముట్టుకున్నా అన్నం పూర్తిగా ఉడికిందో లేదో చెప్పేయచ్చు కదా! అది సరేగానీ నిజంగా నాకు జాబ్ చూశావా? అమ్మకలా చెప్పి పిలిపించావా?"
    "ఎందుకే అంత అపనమ్మకం? నిజంగానే దొరికింది నీకు జాబ్. సోమవారం వెళ్ళగానే అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇస్తారు. సరేనా?" నమ్మకంగా చెప్పింది మాధవి.
    "థాంక్స్ అక్కా! నాకు హైదరాబాదులో జాబ్ రావాలని చాలా కోరిక ఉండింది. మా నాన్న పడనివ్వలేదు. నీకు చాలా చాలా థాంక్స్. నా కోరిక తీర్చావు" అంది కృతజ్ఞతగా.
    "ఇంకేం నీ కోరిక, నా కోరికా కూడా తీరాయిలే. వెళ్ళు ఫ్రెష్ అయిరా. మంచి కాఫీ ఇస్తాను" అంటూ ఆమె చేతిలో హాండ్ బ్యాగ్ అందుకుని గోడకున్న హ్యాంగర్ హోల్డర్ కి తగిలిస్తూ అంది మాధవి "హాయిగా ఇవాళ రెస్ట్ తీసుకో. రేపు ఎటన్నా సరదాగా తిరిగి వద్దాం. సోమవారం జాయిన్ అవుదువుగాని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS