Previous Page Next Page 
అర్చన పేజి 68


    "ఎక్స్ క్యూజ్ మీ" వాళ్ళిద్దరిలో ఒకమ్మాయి వేణుని చూస్తూ పిలిచింది.
    "యస్" ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఆ పక్క సీటులోకి వెళ్తారా? మా ఫ్రెండ్ వస్తుంది."
    వేణు తలతిప్పి చూశాడు.    
    "ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఆ పక్క సీటులోకి వెళ్తారా? మా ఫ్రెండ్ వస్తుంది."
    వేణు తల తిప్పి చూశాడు. తను కూర్చున్న సీటు పక్కన ఖాళీగా ఒకే సీటు ఉంది. అవతలవైపు ఖాళీ లేదు. ఓ... ముగ్గురూ వరసగా కూర్చుంటారు కాబోలు.
    మౌనంగా లేచి పక్క సీటులోకి మారాడు.
    "థాంక్యూ" మధురంగా నవ్వింది.
    వేణు మాట్లాడకుండా స్టేజిమీదకు తల తిప్పాడు. అప్పుడే కార్యక్రమం ప్రారంభం కాబోతుందని అనౌన్స్ చేస్తూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది.
    ముందుగా కళాకారిణి పరిచయం.
    వేణుకిప్పుడు ఏకాగ్రత పోయింది. ఆ అమ్మాయిలిద్దరూ ఎంత అందంగా ఉన్నారు. పిచ్చివెధవలా తను అర్చన వెంటపడి జీవితం నాశనం చేసుకున్నాడు. ఆమె కన్నా అందమైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకిలా జరిగింది? ఈ జీవితం ఇంతేనా? చాల నిస్పృహగా అనిపించింది.
    కొన్నిక్షణాల్లో మెరుపులు విరజిమ్ముతూ వేదికమీదకు వచ్చింది కళాకారిణి. వినాయకుడి ప్రార్ధనతో నృత్యం. తనకు తెలియకుండానే సర్వం మర్చిపోయి అందులో లీనమయ్యాడు.

                                                              * * * * *

    అర్చన జీవనయానంలో మరో మజిలీకి ఆ రోజే నాంది. రిపోర్ట్ చేయడానికి హైదరాబాదు బయలుదేరింది.
    "నాకు కొంతకాలం ట్రైనింగ్ ఉంటుంది నళినీ... ఎక్కడికి పంపిస్తారో ఏంటో నాకేం తెలియదు. ఏదో చదువుకుని పరీక్షలు రాసి, అలాట్ మెంట్ అయితే పొందాను కానీ, నాకేమీ తెలియదు. నేనెక్కడ ఉండాలో ఏం చేయాలో నా డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అంతా అయోమయం. అందుకే నా సామానంతా నీ దగ్గర ఉంచు. ఎక్కడోక్కడ కొంచెం సెటిల్ అయాక తీసుకుని వెళతాను" అంది ఇల్లు ఖాళీ చేస్తూ.
    "అలాగే ఉంచు అర్చనా! అన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళు, భయపడకు ధైర్యంగా వెళ్ళు. హైదరాబాద్ వెళ్తున్నావు కదా! వాళ్ళని కలుస్తావా?" ఆసక్తిగా అడిగింది నళిని.
    అర్చన ఖచ్చితంగా అంది "లేదు ఎవర్నీ కలవను. నేరుగా ఏ పనికోసం వెళ్తున్నానో ఆ పని చేసుకుంటాను. వస్తాను. నేను ఏ బంధాలను పెంచుకొవాలనుకొడం లేదు నళినీ, నేనిప్పుడు ప్రభుత్వాధికారిని, ప్రభుత్వం అధీనంలో ఉండాలి."
    "కాదు పబ్లిక్ అసిస్టెంట్ వి. ప్రభుత్వాధికారివి అయినా ప్రజలకు మాతం నువ్వు సేవకురాలివి. ఈ విషయం మర్చిపోకు."
    "నళినీ!" విస్మయంగా పిలిచింది అర్చన.
    "నీకింత ఖచ్చితమైన అభిప్రాయం ఉందా?"
    నళిని నవ్వింది. "ఆశ్చర్యంగా ఉందా అర్చనా? ప్రతి ప్రభుత్వాధికారీ, ప్రతి మినిష్టరు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సేవకులే. ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ ఒక హోదా, ఒక కుర్చీ, నెలకి జీతం ఇస్తారు. అది మర్చిపోయి, వ్యక్తిగత సౌలభ్యాలకు, వ్యక్తిగత సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే కొందరు ఏసిబి వలలో, సిబిఐ వలలో పడి శిక్ష అనుభవిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ప్రతి అడుగూ, ఆచి తూచి వేయాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి."
    "నళినీ..... భయంగా పిలిచింద్. నువ్వలా అంటుంటే నాకేంటో భయంగా ఉంది. ఇంతకాలం ఉద్యోగం, ఉద్యోగం అని సంబరపడ్డానే కానీ, అందులో ఉండే రిస్క్ నాకు తెలియదు."
    నళిని అర్చన మొహంలో భావాలు చూసి మెత్తగా నవ్వి ఆప్యాయంగా అర్చన భుజం తట్టి అంది. "భయపడకు అర్చనా! నిన్ను భయపెట్టాలని నేనివన్నీ చెప్పడం లేదు. నువ్వు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ప్రజాభిమానం పొందాలని కోరుకుంటూ చెపుతున్నాను. బి కేర్ ఫుల్ అంతే! నీ విధులు నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తూ, ఏ ప్రలోభాలకూ లొంగకుండా ఉన్నావంటే మొత్తం వ్యవస్థే నీ పాదాక్రాంతం అవుతుంది. నిజాయితీతో దేన్నైనా గెలవచ్చు."
    అర్చన కొంచెం తేలిగ్గా నవ్వింది. "నీ మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాను నళినీ! నాకిలా చెప్పేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? నేనెలాంటి ప్రలోభాలకు లొంగేదాన్ని కానని నీకు తెలుసు కదా! అది చాలు."
    నవ్వుతూ అంది నళిని. "ప్రలోభాలంటే తెలుసుగా... లంచాలు! వాటి జోలికి మాత్రం పోకేం."    
    "ఛీ ఛీ నేనంత చీప్ గా కనిపిస్తున్నానా?" చీదరగా అంది అర్చన.
    నళిని నవ్వి అర్చన చేయి చేతిలోకి తీసుకుని నొక్కింది.
    సామాను ఆటోలో వేశారిద్దరూ కలిసి. అర్చన పూర్ణమ్మగారి దగ్గరకు వెళ్ళి సెలవు తీసుకుంది. "కలెక్టర్ కాబోతున్నావు. మమ్మల్ని మర్చిపోకమ్మా" అందావిడ.
    "ఎంత మాటన్నారండి. ఎప్పటికీ మర్చిపోను" మనస్ఫూర్తిగా అంది అర్చన.
    "అప్పుడప్పుడు వస్తుండు. చూడూ... పెద్ధదాన్ని చెబుతున్నాను. నీ భర్తతో నీకేం గొడవలున్నాయో నాకు తెలియదు. కానీ, భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అలాగని విడిపోడం పరిష్కారం కాదు, బంగారు పళ్ళానికైనా గోడ చేటు ఉండాలంటారు. నువ్వు కలెక్టర్ వైనా నీ పక్కన భర్త ఉంటే కలిగే గౌరవం వేరు. నా మాట విని మీ ఆయన్ని కలుసుకుని హాయిగా కాపురం చేసుకో."
    అర్చన మౌనంగా ఉండిపోయింది.
    "ఏం? ఈసారి మీవారితోటేనిన్ను చూడాలి నేను" ఆవిడ ఆజ్ఞాపిస్తున్నట్టు అంది.
    అర్చన నవ్వి "అలాగే వస్తానండి" అంటూ అక్కడ్నించి వచ్చి ఆటో ఎక్కింది. నళిని కూడా అర్చన పక్కన కూర్చుంది. ఆటో కదిలింది.
    సామానంతా నళిని ఇంటికి చేర్చి సూట్ కేసు, హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని బయలుదేరింది. నళిని అర్చనని కౌగలించుకుంది. అర్చన ఆమె భుజం మీద తలవాల్చి అంది. "మరో ప్రస్థానం మొదలవబోతోంది. ఏం జరుగుతుందో నా డెస్టినేషన్ ఎక్కడో నాకే తెలియడం లేదు. కానీ, ఖచ్చితంగా ఒక గౌరవనీయమైన గమ్యం మాత్రం చేరతాను."
    "ఆల్ ద బెస్ట్" నళిని మనస్ఫూర్తిగా అంది.
    "థాంక్యూ" నవ్వుతూ నళిని నుంచి విడివడి సూట్ కేస్, హ్యాండ్ బ్యాగు చేతికి తీసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS