Previous Page Next Page 
అర్చన పేజి 67


    "ముందవన్నీ లోపల పెట్టేసి వచ్చి తీరుబడిగా, నాకు అర్ధం అయేలా చెప్తావా?" విసుగ్గా అడిగాడు.
    మాధవి ప్లేట్లు, గ్లాసులు సింక్ లో వేసి వచ్చింది. నాప్ కిన్ తో చేతులు తుడుచుకుని, కౌశిక్ మూతినిండా నిండిపోయిన చాక్లెట్ తుడిచింది. వాడిని ఎత్తుకుని సోఫాలో కూర్చుంటూ శైలజ ఫోన్ చేసిన విషయం, తనకి వచ్చిన ఆలోచన వివరంగా చెప్పింది.'    
    "బాగుంది, నీ ఐడియా చాలా బాగుంది. కానీ, వర్కవుట్ అవుతుందంటావా? వేణు అర్చనని మర్చిపోయి పెళ్ళికి ఒప్పుకుంటాడంటావా?"
    "అర్చనని మర్చిపోడు. కానీ, పెళ్ళికి ఒప్పుకుంటాడు."
    "ఎలా చెప్పగలవు?"
    "సైకాలజీ స్టూడెంటుని కదా!"
    "అబ్బో గుడ్!" అని నవ్వుతూ మాధవి నెత్తిమీద సున్నితంగా మొట్టాడు.
    మాధవి కౌశిక్ షర్ట్ విప్పుతూ అంది "వేణు యోగి కాదు. అలాగని భోగీ కాదు. మామూలు మగవాడు. అర్చనంటే ప్రేమ ఎంత ఉందో, ఆమె మీద కోపమూ అంతే ఉంటుంది. అయితే మరో పెళ్ళికి ఒప్పుకోవాలంటే రొటీన్ గా పెళ్ళిచూపులకి తీసుకెళ్ళి ముక్కూ మొహం తెలియని అమ్మాయినెవరినొ చూపించి ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టు అంటే కట్టలేడు. అతనే కాదు. అతని స్థానంలో ఏ మగాడున్నా కట్టలేడు. కాబట్టి అతని జీవితంలోకి మరో అమ్మాయి ముందు ప్రవేశించాలి. ఆమె అతన్ని తన స్నేహంతో, అభిమానంతో ఆకట్టుకోవాలి. ఈ వయసులో అమ్మాయిలతో స్నేహం ఆకర్షించినంతగా అబ్బాయిల స్నేహం ఆకర్షించదు."
    "అవునవును. నాకూ అంతే!" కొంటెగా నవ్వాడు.
    "ఇంకేం క్యారీ ఆన్" కోపంగా లేవబోతుంటే ఆమె చీరచెంగు పట్టుకుని ఆపుతూ అన్నాడు "అంతలోనే కోపం వచ్చిందా?"
    "నాకేం కోపం లేదు. వీడికి స్నానం చేయించాలి."
    "చేయిద్డువుగానిలే కానీ చెప్పు."    
    "ఏంటి చెప్పేది? రామాయణమా? భారతమా? ఇప్పటికింతే సంగతులు. మిగతావి వెండి తెరమీద చూడండి. అన్నట్టు అర్చన జాయిన్ అయిందిట." 
    "ఓ! సాధించిందన్నమాట. ఇప్పుడు ఆవిడ చాలా బిజీ. డిఫరెంట్ ఫీల్డ్స్ లో ట్రైనింగ్ ఉంటుంది."
    "ఓ! అవునా!" అంటూ కౌశిక్ ని ఎత్తుకుని బాత్ రూమ్ వైపు వెళ్ళబోతుంటే ఆమెవైపు చేయి చాపి అన్నాడు చక్రవర్తి "ఇలా ఇవ్వు వాడికి నేను చేయిస్తాను స్నానం."
    "ఓ థాంక్యూ" కౌశిక్ ని చక్రవర్తికిచ్చి తను చిందరవందరగా ఉన్న కౌశిక్ ఆటసామాను సర్దడంలో మునిగిపోయింది.
    
                * * * * *

    మాధవి ఇంటినుంచి బైటికి వచ్చిన వేణుకి ఎందుకనో వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పావుగంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ, మనసంతా దిగులు ఆక్రమించింది. భవిష్యత్తు శూన్యంగా అనిపిస్తోంది. హఠాత్తుగా తననెవరో విరిసి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి పడేసినట్టు అనిపించింది. ఎంత ఒంటరితనం? చక్రవర్తి నిజంగా చాలా అదృష్టవంతుడు. మాధవి లాంటి అమ్మాయి భార్య కావడం అంటే ఎంత అదృష్టం ఉండాలి? అంత డబ్బున్నవాళ్ళ అమ్మాయి అయినా ఎప్పుడూ ఆడంబరాలకు పోదు. సింప్లిసిటీ ఈజ్ మదర్ ఆఫ్ బ్యూటీ అన్నట్టు సింపుల్ గా ఉంటుంది. చక్కటి పనిమంతురాలు, సంప్రదాయాలంటే గౌరవం ఉన్న అమ్మాయి. పెద్దవాళ్ళంటే భక్తి, పిల్లలంటే ప్రేమ.
    వేణు బండి టాంక్ బండ్ వైపుకి పోనిచ్చాడు.
    ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. బైకు చాలా నెమ్మదిగా కదుల్తోంది. కార్ల వాళ్ళు కార్లు ఆపుకుని, బండ్లవాళ్ళు బండ్లు ఆపుకుని, ఆటోలవాళ్ళు కూడా నోరుమూసుకుని హారన్లు కొట్టకుండా కూర్చున్నారు.
    అబ్బా విసుగ్గా ఉంది. సిగ్నల్ దగ్గర పావుగంటసేపు బండి కదలలేదు. ముందూ, వెనకా వందల కొద్దీ వివిధరకాల వాహనాలు ఆగి ఉన్నాయి. సిగ్నల్ నాలుగువైపులా ఎక్కడా గ్రీన్ లైట్ వెలగడం లేదు.
    బాబేం చేస్తున్నాడో పాపం అమ్మ వాడితో ఉదయం నుంచి ఎంత అవస్థపడుతుందో? ఆ అమ్మాయి నీలవేణి ఎంత చాకిరీ చేస్తోంది? ఈ ఇంటికీ, ఆ అమ్మాయికీ ఇది ఏనాటి ఋణానుబంధమో కానీ, ఎంతకాలం ఇలా? అర్చనలాంటి మూర్ఖురాలి కోసం తానిలా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాల్సిందేనా? పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇవాళ మాధవి నోటినుచి ఆ మాట ఎందుకొచ్చింది? మాధవి మనసులో ఎప్పటినుంచో ఉందా ఆ ఆలోచన. తోటి స్త్రీగా అర్చనకి అన్యాయం జరుగుతుందేమో అని ఆలోచించడం లేదా మాధవి. లేక అర్చన ఇక రాదని దృఢంగా నిశ్చయించుకుందా? నిజమే ఎందుకొస్తుంది? బాధగా అనిపించింది వేణుకి. 
    ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ ఏవో కొన్ని ఆశయాలుంటాయి. ఆశలుంటాయి. కోరికలుంటాయి. అవి తీర్చుకోవాలన్న లక్ష్యం ఉంటుంది. అందులో చిత్రం ఏం లేదు. కానీ, ఏం సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి ప్రతివాళ్ళకీ కావాల్సింది తన అనుకునే మనుషులే కదా! అనుకున్నది సాధించాక అయినా భర్త, పిల్లలు, సంసారం కావాలనిపించదా? అనిపిస్తుందేమో!
    సడన్ గా వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా కదలడంతో వేణు ఆలోచనల్లోంచి తేరుకుని బండి స్టార్ట్ చేశాడు. ఇంతసేపు ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం అయిన ఆ విఐపి ఎవరో గమనించలేదు. సర్లే ఎవరైతే ఏం?
    వేణు అసెంబ్లీ దాటి రవీంద్రభారతి దగ్గరకు వచ్చాడు. రవీంద్రబారతి బైట బ్యానర్లు కనిపించయై. మంచి కూచిపూడి డ్యాన్స్ బాలే..... బ్యానర్లు కట్టి ఉన్నాయి. బ్యానర్ల మీద కళాకారిణి ఫోటోలు అందంగా ఆకర్షణీయంగా.
    ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవలేదు. చల్లగా ఉంది లోపల. ప్రేక్షకులు పల్చగా ఉన్నారు. బైట చూస్తే అన్ని కార్లు, స్కూటర్లు.... మరి జనమేంటి ఇంత తక్కువ అనిపించింది. కాకపోతే పైన కూడా రెండు ఆడిటోరియమ్స్ ఉన్నాయన్న విషయం గుర్తొచ్చింది. పైన ఫాస్ట్ ఫ్లోర్ లో ఏదో సాహిత్య కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఆపైన ఏం ఉందో?
    ఉచితంగా నాట్యప్రదర్శనలు, ఉచితంగా సంగీత కచేరీలు, ఉచితంగా నాటక ప్రదర్శనలు అన్నీ ఉచితంగానే అయినా జనం సినిమా పాటలకి వచ్చినట్టు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కారో అనిపించింది. అయితే కొద్దిసేపట్లోనే వేణు అభిప్రాయం తప్పని ఋజువు చేస్తూ హాలు నిండిపోయింది.
    వేణు పక్కన ఉన్న ఖాళీ సీట్లోకి ఇద్దరమ్మాయిలు వచ్చారు. అందంగా ఉన్నారు. చక్కటి డిజైన్ చీరలు కట్టుకున్నారు. చీరలకు తగిన సెట్ చెవులకి, మెడలో తెల్లగా, లేత గులాబీరంగు లిప్ స్టిక్ వేసుకున్నారు. సంప్రదాయబద్ధమైన చీరకట్టుని ఆధునికంగా కట్టుకుని ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని చూస్తూ అనుకున్నాడు. ఈ కాలంలో అందంగా లేని అమ్మాయిలు అరుదేమో! ఇన్ని రకాల అలంకరణ వస్తువులు, బ్యూటీపార్లర్ లు ఎలాంటి వాళ్ళనైనా అందంగానే తఃయారుచేస్తున్నాయి. కాకపోతే వీళ్ళిద్దరూ సహజంగానే అందగత్తెలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS