Previous Page Next Page 
అర్చన పేజి 66


    మాధవి ఉలిక్కిపడింది.
    "ఏంటి హఠాత్తుగా ఎక్కడికెళ్ళావు?" చిత్రంగా ఆమెనే చూస్తూ అడిగాడు.
    మాధవి పల్చగా నవ్వేసి అంది. "ఏం లేదు. నీకు పెళ్ళి చేసేద్దామా అని ఆలోచిస్తున్నాను."
    వేణు మొహంలో ప్రసన్నత మాయమైపోయింది. కొంచెం సీరియస్ గా అయిపోయి తీసిన తలుపుల గుండా బైటికి చూస్తూ ఉండిపోయాడు.
    మాధవికి వేణు మోహంలో వచ్చిన మార్పులు చూడగానే అరే తొందరపడి నా మనసులో మాట అనేశాను. అనకుండా ఉండాలిసింది అనిపించింది. తనను తాను సంబాళించుకుని "కూర్చో వేణూ! చక్రవర్తి వచ్చే లోపల బజ్జీలు వేస్తాను" అంటూ లేవబోయింది.
    వేణు కూడా మామూలుగా అయిపోతూ "మిర్చీ బజ్జీలు వేస్తావా? నేను హెల్ప్ చేయనా?" అన్నాడు తానూ లేస్తూ.
    "వద్దులే. నువ్వు వీడితో ఆడుకుంటూ కూర్చో. నేను చేసేస్తాను."
    "సరే అయితే మిర్చిలో ఓన్లీ వాముపొడి, ఉప్పు మాత్రం రాయి. చింతపండు, మసాలా అవన్నీ వేయకు."
    "అలాగేలే....నాకూ అలాగే ఇష్టం" అంటూ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది.
    మాధవి మిరపకాయలు చీల్చి అంతకు ముదే రెడీ చేసి డబ్బాలో పోసి పెట్టుకున్న వాము పొడి తీసి మిర్చి మధ్యలో రాయసాగింది.
    స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోస్తుంటే చక్రవర్తి బండి చప్పుడైంది.
    "హలో వేణూ! బ్యాంకుకి రాలేదా ఇవాళ?" అంటూ చక్రవర్తి స్వరం వినిపించింది.
    "వచ్చానురా. కానీ త్వరగా వెళ్ళిపోయాను. మా నాన్నగారి స్నేహితుడి కొడుకు ఊరునుంచి వచ్చాడు. అతని ఫ్లాట్ ఏదో రిజిస్ట్రేషన్ ఉందంటే వెళ్ళాను. ఏంటి విశేషాలు?" కౌశిక్ దగ్గర్నించి లేచి సోఫాలో కూర్చుంటూ అన్నాడు వేణు.
    "ఏం ఉంటాయి? మూడు లోన్ లు ఆరు వడ్డీలు.... "వేణు ప్రశ్నకి సమాధానం చెబుతూ కౌశిక్ ని ఎత్తుకుని ఎగరేసి "ఏరా! మావయ్యతో ఆడుకుంటున్నావా?" అంటూ వేణు పక్కన సోఫాలో కూర్చుని కౌశిక్ ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కాస్సేపు తండ్రి జేబులో పెన్నుతో ఆడుకుని తిరిగి థామస్ గుర్తొచ్చిందేమో చక్రవర్తి ఒళ్ళోంచి జారి వెళ్ళిపోయాడు కౌశిక్.
    "నీది లోన్ సెక్షన్ అయిపోయి చాలా బిజీ అయిపోయావనుకుంటా."        
    "ఇంటరెస్ట్ రేట్ ఎంత పెరిగినా లోన్స్ కోసం వచ్చేవాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంద కానీ తరగడం లేదు."
    "మన పనే అది కదా! బ్యాంకులు ఉన్నదే అందుకు."
    "అంతేలే.... అవునూ నువ్వెందుకు ఇల్లు ప్లాన్ చేయడం లేదు?"
    "అనుకుంటున్నాను చక్రవర్తీ! అదే ఆలోచన వచ్చింది ఇవాళ. నాకు ఫ్లాట్స్ వద్దు. ఇండిపెండెంట్ ఇల్లు కావాలి. అమ్మా, నాన్నలకు ఫ్లాట్స్ నచ్చవు."
    "అవునూ... ఇప్పుడు నువ్వన్న ఇల్లే కొనేయచ్చు కదా! ఆ మధ్య ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నట్టు ఓనర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది."
    "అలాగా! నాతో అనలేదే?" ఆశ్చర్యంగా అడిగాడు వేణు.
    "నాతో కూడా వాళ్ళు డైరెక్ట్ గా అనలేదు. ఎవరో అంటే విన్నాను. ఓసారి మాట్లడదామా?"
    "వైనాట్ ష్యూర్! ఎలాగా ఫస్ట్ కి రెంట్ ఇవ్వడానికి వెళతాం కదా! మాట్లాడదాం. కొంచెం రిపేర్స్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది ఇల్లు. మూడేళ్ళనుంచీ ఉంటున్నాను. కాని నాతో కలిసినప్పుడైనా మాటవరసకి అనచ్చు కదా!"
    "చూడు వేణూ! కొన్ని పనులు వాయిదా వేస్తే అవుతాయి. కొన్ని పనులు వెంటనే చేస్తే అవుతాయి. ఎల్లుండి ఆదివారం కదా వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ రావడానికింకా పదిహేను రోజులుంది. ఈలోగా అతనికి వేరే పార్టీ దొరికితే?"
    చక్రవర్తి అంది నిజం అన్నట్టుగా తలూపుతూ అన్నాడు. "ఓకె. ఆదివారం వెళదాం."
    ఇంతలో మాధవి వేడి వేడి బజ్జీల ప్లేటు, మంచినీళ్ళ జగ్గు, గ్లాసులు పెట్టుకున్న ట్రేతో వచ్చి "సార్ గారూ! కాళ్ళూ, చేతులూ కడుక్కుని వస్తారా?" అంది చక్రవర్తిని ఉద్దేశించి.
    "యస్ మేడమ్" అంటూ గట్టిగా ఎగబీలుస్తూ "వావ్ మిర్చిబజ్జీ..." తీసుకోబోయాడు చక్రవర్తి.
    మాధవి చిన్నగా కసురుతూ అంది "వెళ్ళండి బాబూ! చేతులన్నా కడుక్కుని రండి. అసహ్యంగా అలాగేనా తినేది?"
    "ఓకే" అంటూ తిరిగి కౌశిక్ ని ముద్దు చేస్తూ "మరి నా బుజ్జిగాడికి స్నాక్స్" అన్నాడు.
    "వాడి స్నాక్స్ వాడికి రెడీ" అంటూ ప్లేటు టీపాయ్ మీద పెట్టి తిరిగి లోపలికి వెళ్ళి క్యాడ్ బరీ చాక్లెట్ తీసుకొచ్చి కౌశిక్ కి ఇచ్చింది మాధవి.
    "తీసుకో వేణూ" అంటూ మంచినీళ్ళ జగ్, గ్లాసులు పెట్టింది.
    వేణు వేడి వేడిగా ఉన్న బజ్జీ చేతిలోకి తీసుకుని ఊదుకుంటూ అన్నాడు "మాధవీ! నువ్వు మిర్చిబజ్జీ చెయ్యడంలో పర్ ఫెక్ట్ అనుకుంటా" అన్నాడు.
    "ఊ...ఊ... ఫర్లేదు. బండి పెట్టుకోవచ్చు అవసరం అయితే" అంటూ వచ్చాడు చక్రవర్తి.
    మాధవి కొరకొరా చూసింది.
    "సరదాగా అన్నాను లేరా" నవ్వుతూ బజ్జీ తీసుకున్నాడు.
    ముగ్గురూ కాస్సేపు ఇళ్ళు, ఫ్లాట్స్, పెరిగిన సిమెంట్ ధరలు, స్టీలు ధరలు వీటి గురించి మాట్లాడుకుంటూ బజ్జీలు తినడం పూర్తచేశారు. మాధవి మంచి టీ ఇచ్చింది. అది తాగి ఇద్దరి దగ్గరా సెలవు తీసుకుని కౌశిక్ ని ముద్దుపెట్టుకుని బయలుదేరాడు వేణు.
    వేణు వెళ్ళిపోయాక ఉత్సాహంగా అంది మాధవి.
    "వేణు పెళ్ళి అయిపోయినట్టే!"
    "ఎవరితో?"
    "అమ్మాయితో."
    "అలాగా అబ్బాయిల్ని కూడా చేసుకుంటున్నారా?"
    "చేసుకోకేం? పేపర్ నములుతుంటారు కదా తెలియదా?"
    "వద్దులే గుర్తుచేయకు. నాకు బజ్జీ వామిట్ అవుతుంది."
    మాధవి నవ్వుతూ ప్లేటు, గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే అడిగాడు "ఇంతకీ ఎవరు?"
    "మా పిన్ని కూతురు ప్రీతి వస్తోంది. దాన్ని వేణుకి పరిచయం చేసి, ఇద్దర్నీ ఎడాపెడా తిప్పేస్తాను." 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS