"అయ్యో! ఎలా మర్చిపోతాను పిన్నిగారూ? తప్పకుండా వస్తాను" అంది ఆవిడ మాటలకు నొచ్చుకుంటూ.
ఆవిడ మాధవి భుజమ్మీద చేయేసి ఆప్యాయంగా నొక్కింది.
మాధవి బైటకొచ్చేసి అటు వెళ్తున్న ఆటో పిల్చి ఎక్కింది.
క్రచ్ లో అడుగు పెట్టేటప్పటికి కౌశిక్ పూర్తిగా బొమ్మల్లో మునిగిపోయి ఆడుకుంటున్నాడు.
"ఏమన్నా పేచీ పెట్టాడా?" అడిగింది సుధారాణిని.
"లేదండి. అసలు పేచీ పెట్టలేదు. మీరిచ్చిన ఫుడ్ పెట్టాను. పాలు తాగించాను. రెండు గంటలసేపు పిల్లలతో పాటు పడుకున్నారు. అడుగో ఇంతకు ముందే లేచి మళ్ళీ ఆటల్లో పడ్డాడు" అంటూ ఆడుకుంటున్న బాబుని చూపించింది.
మాధవి దగ్గరకు వెళ్ళగానే పరిగెత్తుకుని వచ్చి ఒళ్ళో వాలిపోయాడు. అంతసేపు వాడిని వదిలి ఉన్నందుకు చాలా గిల్టీగా అనిపించింది మాధవికి. వాడిని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది.
వచ్చీరాని మాటలతో వాడేవో కబుర్లు చెపుతుంటే ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చింది. కౌశిక్ కి నీళ్ళు పోసి, జారుడుగా ఉప్మా చేసి పెట్టి పాలు పట్టింది. టీవీ ఆన్ చేసి కార్టూన్ నెట్ వర్క్ పెట్టేసి బుల్లి కుర్చీలో వాడిని కూర్చోబెట్టి తను సాయంత్రం వంటకు ఏర్పాట్లు చేసుకోసాగింది. ఆమెకి పదే పదే నీలవేణి, ఆమె పనితీరు మెదలసాగింది. భలే పిల్ల. అలాంటి పిల్ల ఒక్కతి ఉంటే చాలు. ఇల్లంతా అప్పగించేయచ్చు.
మాధవి అలా అనుకుంటుండగానే ఫోన్ మోగింది.
"హలో... ఆ .... పిన్నీ నువ్వా? ఏంటి సంగతులు?" అడిగింది మాధవి.
"ఏముంటాయమ్మా! అవునూ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా?"
"లేదు పిన్నీ! డెలివరీకి మానేసిందాన్ని మళ్ళీ చేరలేదు. ఇదిగో కౌశిక్ ని ఇవాళే క్రచ్ లో వేశాను. బానే అడ్జెస్ట్ అయాడు. ఇంక వెతుక్కుంటాను. బాబాయి ఎలా ఉన్నారు? ప్రీతి, నిశాంత్ బాగున్నారా? అన్నట్టు వాడికి, నిశాంత్ కి ఇంజనీరింగ్ లో సీటొచ్చిందా?"
శైలజ నవ్వింది. "ఏవిటే బాబూ! ఆ ప్రశ్నల పరంపర. చెప్తాను. ఒక్కొక్కటే చెప్తాను. వాడికి సీటొచ్చింది. కానీ, ఇక్కడ కాదు. చెన్నైలో చేరాడు. ప్రీతికి జాబ్ వచ్చింది. ఇక్కడే విజయవాడలో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ. దానికి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. మనకి అన్నీ నచ్చడం లేదు. అదసలే పెంకిది. ఉద్యోగంలో ఎవడ్నో చూసి ముడేయించుకున్నా వేయించుకుంటుంది. ఆ ప్రమాదం జరక్కుమ్డా దానికేదన్నా సంబంధం చూడవే."
మాధవి ఆసక్తిగా అడిగింది. "నీ రిక్వైర్ మెంట్ ఏంటి పిన్నీ?"
"ఏముంటుందే పిల్లాడు బుద్ధిమంతుడు కావాలి. మంచి ఉద్యోగం ఉండాలి. భార్యని ప్రేమగా చూసుకోవాలి. మన పిల్ల చక్కటిది. కాబట్టి కుర్రాడు కూడా కొంచెమన్నా అందంగా ఉండాలి కదా!"
సాలోచనగా అంది మాధవి "సరే పిన్నీ! తప్పకుండా చెప్తాను" అని ఏదో అడగబోయినదానిలా రెండుసార్లు "పిన్నీ, పిన్నీ" అని ఆపేసింది.
"ఏంటమ్మా? చెప్పు" ఆప్యాయంగా అడిగింది శైలజ.
'ఏం లేదులే, తరవాత చెప్తాను" అంది మాధవి.
"ఏంటి ఏదన్నా శుభవార్తనా? రెండోవాళ్ళు వస్తున్నారా?"
ఆవిడ మాట అర్ధమైన మాధవి సిగ్గుగా అంది "ఛీ, ఛీ అదికాదులే తరువాత చెప్తాను. ఇంకా ఏంటి విశేషాలు?" అడిగింది మాధవి సంభాషణ మళ్ళిస్తూ.
"ఏం ఉంటాయి మాకు? నిద్రలేవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, టీవీ చూడడం.
"మీ ఆయన్ని అడిగానని చెప్పు. ప్రీతీ సంగతి మర్చిపోకు."
"మర్చిపోనులే."
"సరే మరి ఉంటాను."
"అలాగే బై" ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాధవి ఆలోచనలో పడిపోయింది.
ప్రీతీ కొంచెం పెంకిదే కానీ, మంచిది. మనసు మంచిది. పైగా పనిమంతురాలు. నెట్ లో రకరకాల వంటలు చదివి ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటుందని పిన్ని చాలాసార్లు చెప్పింది. పైగా చక్కటి పిల్ల. వేణుకి మాట్లాడితే.
కాలింగ్ బెల్ మోగింది.
మాధవి కూర్చున్న చోటునుంచి కదిలి డోర్ తీసింది.
* * * * *
"హాయ్ మాధవీ..." వేణు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు.
"హాయ్ వేణూ! దా దా బ్యాంకు నుంచేనా?"
"ఊ... ఏడీ వీడు రాలేదా?" లోపలికి వచ్చి, చుట్టూ చూస్తూ అడిగాడు చక్రవర్తినుద్దేశించి.
"లేదు, వచ్చే టైం అయింది. నువ్వేంటి అప్పుడే వచ్చావు?"
"నేను కొంచెం పనుండి మధ్యాహ్నమే బైటికి వచ్చేశాను. చక్రవర్తిని కలవలేకపోయాను."
"అలాగా! కూర్చో కాఫీ తెస్తాను. మంచినీళ్ళివ్వనా?"
"ఏం వద్దు. చక్రవర్తిని కూడా రానీలే. కలిసి కాఫీ తాగుదాం. వచ్చే టైం అయింది కదా" అలా సోఫాలో కూర్చుంటూ టి.వి.లో కార్టూన్ మూవీ చూస్తున్న కౌశిక్ ని చూసి "హాయ్ హీరో! హౌవ్వార్యూ?" అంటూ పలకరించాడు.
కౌశిక్ వేణు పలకరించగానే మొహం నిండా నవ్వుతో కేరింతలు కొట్టి తిరిగి టీవీలో మునిగిపోయాడు.
"నీకిప్పుడు పిల్లలతో ఆడుకోడం బాగా అలవాటైపోయింది కదూ!" అంది మాధవి కూడా నవ్వుతూ.
"నిజం మాధవీ! పిల్లలతో ఉంటే కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో కదా! హాయిగా ఉంటుంది. నాకు చిన్నప్పటినుంచీ పిల్లలంటే ఇష్టమే కానీ, వాళ్ళ సమక్షంలో జీవితం ఇంత ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది."
మాధవి వేణువైపు అలాగే చిత్రంగా, అధ్బుతంగా చూస్తూ ఉండిపోయింది.
ఆమె మనసులో అప్పటికప్పుడే ఎన్నో భావాలు చెలరేగసాగాయి. వేణు మంచివాడు. ఒక మామూలు అమ్మాయి కోరుకునే లక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతనికి ఎందుకు పెళ్ళి చేయకూడదు? చేయాలి. వెంటనే ప్రీతిని ఇక్కడికి పంపించమని పిన్నికి చెప్పాలి. ఆ మాత్రం తొక్కలో ఉద్యోగం ఇక్కడ దొరకదా? బోలెడన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు హైదరాబాదు నిండా ఉన్నాయి. ప్రీతి వస్తే వేణుకీ, ప్రీతికీ మంచి స్నేహం కలపాలి. ఆ తరువాత ఎలాగూ ఇద్దరి మధ్యా అనురాగం, అభిమానం అనే కెమిస్ట్రీ తప్పకుండా ఏర్పడుతుంది. అల ఏర్పడపోతే వాళ్ళిద్దరూ యువతీ, యువకులు కారు. మాధవి ఆలోచనల్లో వేణు మాటలు వినలేదు. వేణు ఆమె మొహం దగ్గరగా చిటికెలు వేస్తూ.... "హలో" అన్నాడు.
