"ఫర్వాలేదులే నీలవేణి" అంది మాధవి.
"వద్దమ్మా! మీరు చదువుకున్నవారు. పెద్దవాళ్ళు. ఇట్టాంటి పనులు మీకెందుకు? నేనున్నాగా!"
"నువ్వేం చదువుకున్నావు నీలవేణీ?"
"నేనా? నాకు చదువెక్కడిదండి!" నవ్వింది నీలవేణి.
"ఎందుకు చదువుకోలేదు?"
"మా ఇంట్లో ఆడపిల్లల్ని బళ్లోకి పంపించరండి. ఆరో ఏట నుంచే నేను పన్లోకి వెళ్ళేదాన్ని. మా నాయన బాగా తాగేవోడండి. మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళం మా అక్కలిద్ద్రిరికీ పన్నెండేళ్ళకే పెళ్ళయి అత్తారిళ్ళకెళ్ళిపోయారు. మా అన్న పదో తరగతి వరకూ చదువుకుని పట్నం ఎల్లి ఉద్యోగం చేసుకుంటున్నాడండి."
"ఏ పట్నం? అంటే ఏ ఊళ్ళో ఉన్నాడో తెలుసా?"
"లేదండి. తెలియదు. గోదారి పుష్కరాలొచ్సినపుడు అమ్మతో కలిసి గోదారికెళ్ళాను. అమ్మ మునిగిపోయింది. నేను తేలాను. కానీ, మునిగింది ఎక్కడో, తేలింది అయ్యగారి పాదాల దగ్గర."
"నీకు మీ వాళ్ళని చూడాలనిపించదా?"
"నా వాళ్ళు ఎవరున్నారండి? మా అయ్య తాగి తాగి పోయే ఉంటాడీయాలకి. మా అక్కలిళ్ళకి నేనెల్లనండి. ఆళ్ళ అత్తారోళ్ళు మంచోళ్ళు కాదు. ఇంక మా అన్న ఎక్కడున్నాడో? అయినా నాకిప్పుడు అమ్మగారు, అయ్యగారు తప్ప ఇంకెవరిమీదా ఆశ లేదండి. బతికినా, చచ్చినా వాళ్ళిద్దరి పాదాలే."
మాధవి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
వీళ్ళ మాటలు విన్న తాయారమ్మ లేచి వచ్చింది. "ఏమ్మా! ఎంతసేపైంది నువ్వొచ్చి?" ఆవలిస్తూ అడిగింది.
"పదినిమిషాలైందండి" అంది మాధవి.
"నిద్ర పట్టేసింది" అంటూనే ఆవిడ కూడా ఓ కుర్చీ జరుపుకుని కూర్చుంది.
నీలవేణి మడతలు పెట్టిన బట్టలన్నీ బొత్తిగా పట్టుకుని లోపలికెళ్ళిపోయింది.
"ఏంటమ్మా విశేషాలు? ఎలా ఉన్నారు? వచ్చి చాలా రోజులైంది కదూ!"
"అవునండి. తిరుపతి నుంచి వచ్చాక ఇవాళే వచ్చాను."
"పిల్లాడేడి?"
"క్రచ్ లో వదిలానండి. నాకు కొంచెం పనుండి ఉదయాన్నే బైటికి వెళ్ళిపోయాను."
"క్రచ్ అంటే?" అయోమయంగా చూసిందావిడ.
"అంటే పిల్లల్ని చూసుకునే టీచర్లంతా కలిసి ఒక స్కూల్ లాంటిది పెడతారు. అక్కడ పిల్లలకి కావలసిన సదుపాయాలన్నీ ఉంటాయి. ఆటు, కథలు చెపుతారు. చిన్న చిన్న పోయమ్స్ నేర్పిస్తారు. స్కూలుకి పంపించే ముందు అలవాటు చేయడానికి కొంతకాలం క్రచ్ లో పెట్టాలి. అప్పుడు స్కూల్ కి వెళ్ళడానికి మారాం చేయరు."
"అలాగా! వాళ్ళంతా మనవాళ్ళేనా?" అడిగిందావిడ.
మాధవి నవ్వింది. "అన్నిరకాల వాళ్ళు ఉంటారండి."
"మరెందుకమ్మా! ఒక్క పూటకి అక్కడ దింపడం?"
"కాదండి. ఒక్కపూట కోసం కాదు. మరో ఆరునెలల్లో వాడిని స్కూల్లో చేర్పిస్తాను. మూడో ఏడూ వస్తుంది. అందాకా అలవాటు చేయడానికి చేర్పించాను. వాడు అలవాటు పడితే నేను కూడా ఏదన్నా ఉద్యోగం చూసుకుందామనుకుంటున్నాను."
"ఎందుకమ్మా హాయిగా ఉండక. నీకేం తక్కువ? నువ్వు సంపాదించకపోతే గడవదా?"
"అదికాదండి. ఇంట్లో ఊరికే కూర్చుంటే బ్రెయిన్ దయ్యాల కొంపలా తయారవుతుంది. అందుకే చిన్న ఉద్యోగం చూసుకుందామనుకుంటున్నాను."
"నా మాట విని ఆ ఆలోచన మానుకో. సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకున్నట్లు అవుతుంది. నీకంతగా కాలక్షేపం కాకపోతే మా వేణుకి ఏవన్నా సంబంధాలు చూడు."
మాధవికి నవ్వొచ్చింది. ఆపుకుంటూ అంది "వేణుకి సంబంధాలు చూడాలన్నా నాకు నలుగురు తెలియాలి కదా! వాళ్ళకి చెబితే ఎవరన్నా వాళ్ళ దృష్టిలో ఉంటే చెపుతారు. ఈసారి వేణుకి, మీకు అన్నివిధాలా అనుకూలంగా ఉన్న అమ్మాయిని చూసి చేద్దాం. నేనీ కార్యాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. తప్పకుండా వేణుకి మంచి అమ్మాయిని, చదువు, సంస్కారం, గుణం అన్నీ ఉన్న అమ్మాయిని చూస్తాను. సరేనా?"
మాధవి చెప్పిన తీరుకి ఆవిడకి ఆమె పట్ల వాత్సల్యం పెల్లుబికింది.
"నా తల్లే! బంగారు తల్లి.... ఆ పని చేయి నీ కడుపున పుడతా" అంది.
ఇంతలో నీలవేణి కాఫీ కప్పులతో వచ్చింది.
కాఫీ కప్పు అందుకుంటూ తాయారమ్మ అంది. "దీనిక్కూడా ఏదన్నా సంబంధం ఉంటే చూడమ్మా. ఆడపిల్లని ఎన్నాళ్ళు మనింట్లో అట్టే పెట్టుకుంటాం. దీని పెళ్ళి చేసి పంపించేస్తే మనకొక బాధ్యత తీరుతుంది. ఆ తరువాత వేణు పెళ్ళి చేసి మేమిద్దరం మా ఊరు వెళ్ళిపోతాం."
"నేనూ అదే అనుకుంటున్నాను పిన్నిగారూ! తప్పకుండా నీలవేణికి తగిన అబ్బాయిని చూస్తాను."
నీలవేణి చటుక్కున అంది. "నేనిక్కడనుంచి... అంటే అమ్మగారూ! మీ దగ్గరనుంచి ఎక్కడికీ వెళ్ళనండి. నాకు పెళ్ళీ వద్దు, పెటాకులు వద్దు. మీ సేవలు చేసుకుంటూ బతకనివ్వండి."
"అదేంటే... నీకు పెళ్ళి చేయకుండా మా సేవల కోసం మా ఇంట్లో అట్టేపెట్టుకోమంటావా? మంచిదానివే వల్ల కాదు" అనగానే నీలవేణి చివ్వున లోపలికెళ్ళిపోయింది.
ఒక్కక్షణం మాధవితో పాటు తాయారమ్మ కూడా నివ్వెరపోయింది. తరువాత తేరుకుంటూ "దాని మొహం. ఇదే ప్రపంచం అనుకుంటోంది వెర్రిబాగుల్ది. దాని మాటలు పట్టించుకోకుండా గంతకు తగ్గ సంబంధం ఏదో చూడమ్మా!"
ఇంతలో రిత్విక్ ఏడుపు వినిపించింది. నీలవేణి పరిగెత్తుకుంటూ రిత్విక్ దగ్గరకు వెళ్ళి వాడిని భుజం మీద వేసుకుని రావడంతో వాడి ఏడుపు ఆగిపోయింది.
నీలవేణి వాడిని ముద్దు చేస్తూ "పాలు తాగుదామా తండ్రీ! దా పాలు తాగుదాం" అంటూ వంట గదివైపు వెళ్ళడం చూసిన మాధవికి మరోసారి అనిపించింది. ఈ అమ్మాయి కొంచెం చదువుకున్నా బాగుండేది అనుకుంది.
కాసేపు ఆవిడతో పిచ్చాపాటీ మాట్లాడి మూడవడంతో క్రచ్ కు బయల్దేరింది.
"వస్తుండండమ్మా! మమ్మల్ని మర్చిపోకు" అంది తాయారమ్మ.
