Previous Page Next Page 
అర్చన పేజి 63


    "ఇవ్వాళే పేపర్లో చదివను. రీసెంట్ గా గ్రూప్ వన్ క్యాండిడేట్స్ కి పోస్టింగ్స్ ఇచ్చారుట. విజయవాడ ఆర్.డి.ఓ.గా ఎవరో అర్చన అనే లేడీ జాయిన్ అయారని. నాకెందుకో ఆమే గుర్తొచ్చారు."
    మాధవి చటుక్కున అనేసింది. "అర్చన జాయిన్ అయిందా?"
    "ఓ అంటే ఆమేనా? నా గెస్ కరెక్ట్ అన్నమాట! కానీ..."
    మాధవి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది "శ్రీధర్! ఈ విషయాలు మాట్లాడటానికి వచ్చాను. నాకు కొన్ని వివరాలు కావాలి. చెప్పగలరా? మీరు బిజీగా ఉన్నారా? నాకు కొంచెం టైం ఇవ్వగలరా?"
    శ్రీధర్ అన్నాడు "ఆఫీసుకి వెళ్ళిపోదాం. నాక్కొంచం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. చూసుకున్నాక మనం కాస్సేపు మాట్లాడుకోవచ్చు. నాకు సెపరేట్ చాంబర్ ఉంది. మీరక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు."
    "ఓ... దెన్ ఓకె పదండి."
    ఇద్దరూ లేచారు.
    చల్లగా, పరిమళభరితంగా ఉన్న శ్రీధర్ చాంబర్ లోకి అడుగుపెట్టగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది. అతని టేబుల్ మీద ఉన్న జర్నల్స్ తిరగేస్తూ కూర్చుంది. శ్రీధర్ విశాలంగా ఉన్న తన టేబుల్ వదిలేసి, ఓ మూల ఉన్న కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చుని కాసేపట్లోనే సీరియస్ గా వర్క్ లో మునిగిపోయాడు. మాధవికి ఏం చేయాలో తోచలేదు. తను వచ్చిన పని అయేలా లేదు. శ్రీధర్ ని ఏమని అడగాలి? అర్చనకీ, కొత్తగా వచ్చిన ఎం.డి.కి మధ్య ఏం జరిగిందని అడగాలి? ఎలా? చిరాకొచ్చేసింది. ఓ అరగంట గడిచాక శ్రీధర్ కంప్యూటర్ దగ్గర్నించి తన టేబుల్ దగ్గరకు వచ్చి బెల్ నొక్కాడు. వెంటనే ఫ్యూన్ వచ్చాడు.
    "సరితను పిలువు" అన్నాడు.
    ఫ్యూన్ వెళ్ళిపోయాడు. రెండు నిమిషాల్లో ఇరవై ఏళ్ల అమ్మాయి వచ్చింది. సన్నగా, బాగా సన్నగా ఉంది. చాలా స్టైలిష్ గా ఉంది. కానీ, వికారంగా ఉంది. దానిక్కారణం ఆమె చేసుకున్న అతి మేకప్.
    "సరితా! నా ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్స్ తీసుకురండి" అన్నాడు శ్రీధర్ ఆమె వెళ్ళిపోయింది.
    "చెప్పండి మాధవిగారూ! సారీ, బోర్ ఫీలయారనుకుంటా."
    మాధవి నవ్వింది.
    "చెప్పండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?"
    మాధవి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ గుండ్రంగా తిప్పుతూ మళ్ళీ తానే దాన్ని ఆపేస్తూ, అదంతా చూస్తోన్న శ్రీధర్ అన్నాడు.
    "మీరేంటో చాలా టెన్షన్ గా ఉన్నట్టనిపిస్తున్నారు."
    మాధవి ఒక్కసారి కళ్ళెత్తి అతనివైపు చూసి, తిరిగి చూపులు వాల్చుకుని అవునన్నట్టు తలపంకించింది.
    "మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. నో టెన్షన్. ఓకే..."
    "అర్చన రిజైన్ చేయడానికి కారణం తెలుసా?"
    "తెలియదు. కానీ, నేను ఒక విషయం విన్నాను. మిస్టర్ భార్గవ్ మనకి యం.డి.గా వచ్చిన మరునాటి నుంచీ ఆమె కనిపించలేదు. ఆయన కూడా చాలాసార్లు ఆమె గురించి ఎంక్వైరీ చేశారు."
    "వాళ్ళిద్దరి మధ్యా ఏదన్నా... ఐమీదన్ లవ్ ఎఫైర్ ఏమన్నా ఉందేమో మీకు తెలుసా?"
    "అలాంటిది ఉందనుకోను. కానీ, ఎం.డి గారు అలా అడగడంలో క్యూరియాసిటీ తప్ప నాకేం ప్రత్యేకత కనిపించలేదు. ఆయన అర్చనగారి పట్లకొద్దిగా ఆకర్షితులయారేమో అనే అనుమానం వచ్చింది. కానీ, బైద టైం హి వజ్ మ్యారీడ్."
    "మైగాడ్!" మాధవి గట్టిగా అరిచినట్టుగా అంది.
    "ఏమైంది?" కొంచెం కంగారుగా అడిగాడు.
    "ఏం లేదు. సారీ...." తడబడుతూ అని "సరేనండి వస్తాను. చాలాసేపైంది నేనొచ్చి. ఇప్పుడు భార్గవ్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా?"
    "స్టేట్స్ వెళ్ళిపోయారు. ఆయన మిసెస్ అక్కడ డాక్టర్."
    "ఓ... ఓకె వస్తాను" లేచింది మాధవి.
    "మీరీ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకడిగారో తెలుసుకోవచ్చా?"
    నవ్వింది.
    "తప్పకుండా.... కానీ ఇప్పుడు కాదు. వస్తాను. థాంక్స్ ఫర్ యువర్ కో ఆపరేషన్."
    శ్రీధర్ కూడా లేచి ఆమెకి బై చెప్పాడు. మాధవి అక్కడినుంచి వేణు ఇంటికి వెళ్ళింది.
    ఆమె వెళ్ళేసరికి తాయారమ్మ మంచి నిద్రలో ఉంది. ఆమె పక్కనే రిత్విక్ పడుకున్నాడు. ఆవిడ చెయ్యి వాడిని చుట్టేసి భద్రంగా గుండెల్లో పొదుపుకుంది. నీలవేణి వరండాలో కూర్చుని ఆరిపోయిన బట్టలన్నీ మడతలు పెడుతోంది. ఆమె చేతిలో వేణు షర్ట్ ఉంది. చాలా శ్రద్దగా, పొందిగ్గా మడత పెడుతోంది. మాధవి కాస్సేపు ఆమెనే చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఈ అమ్మాయి కొంచెం చదువుకుని ఉంటే ఎంత బాగుండేది? తాయారమ్మగారు అంత నిశ్చింతగా నిద్రపోవాలన్నా, రిత్విక్ భవిష్యత్తు బాగుండాలన్నా, వేణు జీవితం గాడిలో పడాలన్నా ఈ ఇంటికి ఇలాంటి అమ్మాయి అవసరం చాలా ఉంది. కానీ నీలవేణి కులం ఏమిటో తెలియదు. కులంకాని పిల్ల అయినా ఆదరించి ఇంట్లో పెట్టుకున్నా ఆమె ఆ ఇంట్లో ఒక పనిమనిషి, అంతకన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చేంత విశాల హృదయం ఎవరికీ లేదు. తనకే లేదు అనుకుంది మాధవి.
    సడన్ గా మాధవికి గొంతు బొంగురుపోయి దగ్గు రావడంతో నీలవేణి తలెత్తి మాధవిని చూసి "అయ్యో, అమ్మాయిగారూ! తవరా? ఎంతసేపైందండి వచ్చి?" అంటూ చటుక్కున ఒళ్ళో ఉన్న బట్టలు కిందపడేసి లేచి నిలబడింది. మాధవి దగ్గడంతో చకచకా లోపలికెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చిచ్చింది.
    నీళ్ళు తాగి గ్లాసు చేతికిస్తోన్న మాధవితో అంది "మిమ్మల్నెవరో తల్చుకుంటున్నారమ్మా!"
    నవ్వింది మాధవి. "ఇంకెవరు తల్చుకుంటారు? మా అమ్మే వారం అయింది ఫోన్ చేసి."        
    "అట్లాగా రండి.... కూర్చోండి" అంటూ శబ్దం చేయకుండా ప్లాస్టిక్ కుర్చీ లాగింది.
    మాధవి కూర్చుని వంగి కింద ఉన్న తాయారమ్మ చీర అందుకోబోయింది మడత పెట్టడానికి.
    "అయ్యయ్యో! మీరుండండమ్మా నేనున్నాగా" అంటూ మాధవి చేతిలోంచి లాగేసి, దూరం జరుపుకుంది నీలవేణి బట్టలన్నిటినీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS