Previous Page Next Page 
అర్చన పేజి 62


    "అప్పుడే గదిలోకి వచ్చిన మాధవి అక్కడ జరుగుతున్న వింత చూస్తూ "బాగుంది. ఇలా అయితే వాడు సాయంత్రం దాకా లేవడు. జరగండి తమరు" అంటూ కౌశిక్ ని నిద్రలోనే ఎత్తుకుని "బంగారు తండ్రీ! లేచేయ్. మనం ఇవాళ స్కూలుకి వెళదాం. అక్కడ నీకు బోలెడన్ని ఆటలుంటాయిరా. ఇంకా ఆంటీలుంటారు. అక్కలుంటారు. లే నాన్నా! నా బంగారు కదూ!" అంటూ బాత్ రూములోకి తీసుకెళ్ళిపోయింది.
    మాధవి అలా నిర్దాక్షిణ్యంగా వాడిని లేపుతోంటే ఒళ్ళు మండిపోయినా ఏమీ అనలేక తానూ రెడీ అవడానికి బయల్దేరాడు చక్రవర్తి.
    కాసేపట్లోనే ముగ్గురూ బైటకి వెళ్ళిపోయారు.
    ఆఫీసుకి దగ్గరగా ఉన్న క్రచ్ లో కౌశిక్ ని వదిలింది. మాధవికి పరిచయం ఉన్న సుధారాణి ఆ క్రచ్ నిర్వహిస్తోంది. ఆమె అచ్చి చేయి చాపగానే ముందు బిక్కమొహం పెట్టాడు కౌశిక్. మళ్ళీ వాడిని తీసుకుని లోపలికెళ్ళి బొమ్మలన్నీ చూపించేటప్పటికి కాసేపట్లోనే సుధారాణితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు.
    ఏడ్చి మారాం చేస్తే ఫోన్ చేయమని చెప్పి తన ఫోన్ నెంబర్ సుధారాణికిచ్చి మాధవి ఆటోని ఆఫీస్ వైపు పొమ్మని చెప్పింది.
    ఆఫీసు దగ్గర ఆటో ఆగగానే ఒళ్ళంతా జలదరించినట్టు అనిపించింది. ఆటో దిగి మీటర్ చూసి డబ్బులిచ్చేసింది.
    చాలాకాలం తరవాత ఆఫీసు ప్రాంగణంలో అడుగుపెడుతుంటే సన్నగా శరీరం కంపించినట్టు అయింది. అరచేతుల్లో చెమట పట్టింది. తనను తాను నిగ్రహించుకుంటూ తల వంచుకుని ఆఫీసువైపు నడిచింది. చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు అయితే లెక్కలేదు. ఎనిమిది అంతస్తుల ఆ కాంప్లెక్స్ లో మాధవి ఆఫీసు మూడో అంతసతులో ఉంది. లిఫ్ట్ దగ్గరకు నడిచి ఎదురుచూస్తూ నిలబడింది.
    రెండు నిమిషాల్లో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి ఆగింది. తెరుచుకున్న లిఫ్ట్ డోర్ లోంచి బైటకు వస్తున్నాడు శ్రీధర్.
    "మాధవీ" మాధవి ముందు ఆగి సందేహంగా పిలిచాడు. లిఫ్ట్ లోకి వెళ్ళబోతున్న మాధవి ఆగిపొయింది.
    "హాయ్ శ్రీధర్" పలకరింపుగా నవ్వింది అతణ్ణి చూసి.
    "మీరేనా అని డౌటుగా పిలిచాను. మీరే అన్నమాట!" నవ్వాడు శ్రీధర్.
    "నేనే... మీరింకా ఇక్కడే చేస్తున్నారా? ఈపాటికి యు.ఎస్. వెళ్ళిపోయుంటారనుకున్నానే!"
    "ఓ చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట మీకు నా గురించి. లేదండి. నాకిక్కడ మంచి పోస్ట్ ఇచ్చి కంఫర్టబుల్ శాలరీ ఇస్తున్నారు. మా మిసెస్ కి హైదరాబాదు వదిలి వెళ్ళడం అసలిష్టం లేదు. ఇంతకీ మీరు మళ్ళీ జాయిన్ అవడానికి వచ్చ్రారా?"
    "నా పోస్ట్ వేకెంట్ గా ఉందా ఏంటి ఇంకా?" నవ్వుతూ అడిగింది.
    "మీరొస్తానంటే కొత్త పోస్ట్ క్రియేట్ ఛేద్దాం!"
    "థాంక్యూ" అంటూ లిఫ్ట్ వైపు చూసి అంది "అరే లిఫ్ట్ వెళ్ళిపోయిందే!"
    "పోతే పోయిందిలెండి. మళ్ళీ వస్తుంది. రండి కాఫీ తాగుదాం. కింద కాఫీ డే ఉంది" ఆహ్వానించాడు శ్రీధర్. మాధవికి అదే మంచి అవకాశం అనిపించింది. శ్రీధర్ మంచి యువకుడు. తెలివైనవాడు. ఎం.బి.ఏలో రెండు కోర్సులు, ఇంకా ఏవో చాలా చదువుకున్నాడు. ముఖ్యంగా మాధవికి ఆమె అక్కడ పనిచేసిన రోజుల్లో ఏవో సలహాలిస్తూ, సాయం చేస్తూ చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఇతనికి అర్చన కూడా బాగా తెలుసు. ఇతని ద్వారా కొన్ని విషయాలైనా తెలుస్తాయి కదా అనిపించింది.
    "రండి" అంటూ ముందుకు నడిచింది.
    "మీ బాబా, పాపా ఎలా ఉన్నారు?" అడిగాడు శ్రీధర్ ఆమెని అనుసరిస్తూ.
    "బాబే... బాగున్నాడు. మీరు చూడలేదు కదా!"
    "మీరు చూపించలేదు కదా!"
    "అవును నాదే తప్పు. సారీ" నవ్వింది.
    "ఇట్స్ ఓకే. చక్రవర్తిగారు బాగున్నారా?"
    "బ్రహ్మాండంగా ఉన్నారు."
    ఇద్దరూ కాఫీ డే దగ్గరికి వచ్చారు.
    "ఏం కాఫీ తాగుతారు?"
    "నాకే పేర్లూ తెలియదు. తెలిసినా ఏం వద్దు, హాయిగా మన ఇండియన్ కాఫీ విత్ మిల్క్, షుగర్ కావాలి" అంది.
    "ఓకే" అంటూ రెండు కాఫీ ఆర్డర్ చేసి "రండి" అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మాధవి కూడా అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది. ఆ కాంప్లెక్స్ లో చాలా ఆఫీసులున్నాయేమో, చాలామంది కాఫీ కోసం వచ్చి టేబుల్స్ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నారు. తక్కువ వాల్యూంలో ఏదో కొత్త హిందీ సినిమా పాట వినిపిస్తోంది. మాధవి ఆ వాతావరణం గమనిస్తూండగానే బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు.
    "పరిమళం మాత్రం అద్భుతంగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో?" కప్పు చేతిలోకి తీసుకుంటూ అంది.
    "తాగి చూడండి" తానూ కప్పు అందుకుని సిప్ చేశాడు,
    "ఆఫీసు విశేషాలేంటి?" అడిగింది మాధవి.
    "ఏం ఉంటాయండి? ఏవో ప్రాజెక్ట్స్ తెచ్చుకోడం, పూర్తిచేయడం. ఇంతకీ మీరు వచ్చిన కారణం చెప్పలేదు."
    "ఏం లేదు జస్ట్ అందర్నీ కలుద్దామని. అవునూ మనకి ఎవరో కొత్త ఎం,డి. వచ్చారుట?"    
    "ఎవరూ? మీరు వెళ్ళాక ఇద్దరు ఎం.డి.లు మారారు" అన్నాడు ఎవరో అని ఆలోచిస్తూ.
    "అలాగా!" ఏమని అడగాలో అర్ధం కాలేదు మాధవికి. మౌనంగా కాఫీ సిప్ చేస్తూ ఉండిపోయింది.
    "మాధవిగారూ! మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు? అదే అర్చనగారు" అడిగాడు శ్రీధర్.
    మాధవి చేతిలో కప్పు వణికి కాఫీ తొణికి చేయిమీద పడింది. కప్పు టేబుల్ మీద పెట్టింది.
    "అరెరె, అక్కడ వాష్ బేసిన్ ఉంది. వాష్ చేసుకోండి" అన్నాడు.
    అతను చూపించినవైపు చూసి బ్యాగు టేబుల్ మీద పెట్టి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కుంది. ఏమని చెప్పాలి? అర్ధం కాలేదు. అర్చన ఎక్కడికెళ్ళిందంటే ఏమని చెప్పాలి? కొన్ని క్షణాలు అక్కడే గడిపి కర్చీఫ్ తో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది.
    కాఫీ కప్పు చేతిలోకి తీసుకోబోతుండగా అన్నాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS