అర్చనకి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అలాగే ఏడుస్తూ కాస్సేపట్లో నిద్రలోకి ఒరిగిపోయింది.
* * * * *
హైదరాబాదు వచ్చాక చక్రవర్తితో తనకీ, అర్చనకీ జరిగిన సంభాషణ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది మాధవి.
అంతా విన్న చక్రవర్తి ఆశ్చర్యంగా అన్నాడు "అయితే ఆ అమ్మాయిలో తానలా వెళ్ళిపోయినందుకు పశ్చాత్తాపం లేదా?"
"దాని తలకాయ ఉంది. పైగా గట్టిగా, ఖచ్చితంగా సమర్ధించుకుంటోంది. అయినా నాకు అసలు అర్ధం కాలేదు. ఎవరో కల్లో కనిపించాడు. అతనే చాలాసార్లు బైట కూడా కనిపించాడు. అతనెవరో తెలియదు. పేరు తెలియదు. ఊరు తెలియదు. అతన్ని ప్రేమిస్తున్నాను అంటుందేమిటి? అసలు ఎక్కడున్నా అలా జరుగుతుందా? పిచ్చిదా? మంచిదా?" అయోమయంగా అంది మాధవి.
చక్రవర్తి తల విదిలిస్తూ అన్నాడు "నీకన్నా ఎక్కువ కన్ ఫ్యూజన్ గా ఉంది."
"కన్ ఫ్యూజన్ లేదు, ఏం లేదు. నాకిప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్ధమైంది. ఇంక జీవితంలో అర్చనా, వేణూ కలవరు. వేణు వేరే పెళ్ళి చేసుకున్నా అర్చన ఎలాంటి అభ్యంతరాలు పెట్టదు. కాబట్టి వెంటనే వేణుకి నేను మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తాను."
"మరి బాబు?"
"బాబు కోసమే! వాడికి తల్లి కావాలి. వేణుకి భార్య కాదు."
"వచ్చే అమ్మాయి వాడిని తల్లిలా చూడాలిగా మధూ!"
"చూడక ఏం చేస్తుంది? అలా చూసే అమ్మాయినే వెదుకుతాను."
"ఏమో! అసలే ఈ కాలం అమ్మాయికి హిరణ్యాక్ష వరాలు. అలాంటి అమ్మయి దొరుకుతుందా?"
"దొరక్కపోతే రిత్విక్ ని నేను పెంచుకుంటాను. వేణుకి వేరే అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తాను."
చక్రవర్తి విబ్రాంతిగా చూశాడు. "నువ్వా? నువ్వు పెంచుకుంటావా?"
"ఏం వద్దా?"
"ఛ... అది కాదు. కానీ, నీకు మళ్ళీ పిల్లలు పుడితే..?"
"పుట్టనివ్వండి. నాకు పిల్లలంటే ఇష్టం. ఎంత మందినైనా పెంచేయగలను."
"కొంపదీసి ఇల్లంతా పిల్లల్తో నింపేస్తావా?" భయం నటించాడు చక్రవర్తి.
అతని మొహంలో భావాలు చూసి అప్పటిదాకా చిటపటలాడుతున్న మాధవి ఫక్కున నవ్వేసింది.
"హమ్మయ్య! నవ్వావా తల్లీ! అర్చన మీద కోపంతో నాకివాళ తిండీ నీళ్ళు లేకుండా మాడుస్తావనుకున్నా."
"కౌశిక్ ని లేపి స్నానం చేయించండి. నేనీలోగా బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాను."
"అవునూ.... నాకో డౌటు?" అన్నాడు చక్రవర్తి.
"ఏంటో అది?"
"అర్చన కూల్ గా జాబ్ చేసుకునేది కదా! సడన్ గా ఎందుకు మానేసిందట? చెప్పిందా?"
"లేదే? నేనేం అడగలేదు. అవునెందుకు అవునెందుకు మానేసింది?" కూర్చ్జున్న చోటునుంచి లేచి కిచెన్ వైపు వెళ్ళబోతున్నదల్లా ఆగిపోయి సందేహంగా చూసింది.
"బాగుంది. నా ప్రశ్న నాకే వేస్తావేం? మీ ఆఫీసులో ఎవరూ నిన్ను అడగలేదా?"
"నన్నెందుకు అడుగుతారు?"
"మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా!"
"కావచ్చు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. పైగా అర్చన చేరిన కొద్ది రోజులకే నేను డెలివరీకి వెళ్ళాను కదా!"
"నాకు ఒక సంగతి తెలిసింది ఆ మధ్య."
"ఏంటది?"
"మీ ఎం.డి. స్టేట్స్ వెళ్ళిపోయాడని, అతని ప్లేస్ లో వేరే ఒకతను వచ్చాడని, అతను జాయిన్ అయిన మరునాటి నుంచీ అర్చన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిందని."
మాధవి చివ్వున చూసింది చక్రవర్తివైపు. "ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు?" ఆత్రుతగా అడిగింది.
"నా కొలీగ్ ఒకతను చెప్పాడు. అతని కజిన్ కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అంతా అనుకున్నారట ఆవిడకీ, అతనికీ ఏదో సంబంధం ఉందన్న అనుమానం ఉందని. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయాక అతను రెండు మూడుసార్లు స్టాఫ్ లో ఎవరో ఒకళ్ళిద్దరిని అర్చన గురించి వాకబు చేశాట్ట కూడా."
"మరి ఈ విషయం నాకింతకాలం ఎందుకు చెప్పలేదు" ఉద్వేగంగా అక్కడినుంచి వేగంగా కదులుతూ అంది మాధవి. "నేనివాళ ఆఫీసుకి వెళ్తున్నాను. అవసరం అయితే మరి కొంతకాలం జాబ్ చేస్తాను. అర్చన వెళ్ళిపోవడం వెనక మిస్టరీ ఛేదిస్తాను. అతనే అర్చన చెప్పిన వ్యక్తి అయితే అతన్నోసారి కలుస్తాను."
"దేనికి? కలిసి ఏం చేస్తావు? కొంపదీసి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తావా?"
"చెప్తా... వెళ్ళొచ్చాక చెప్తా..." అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది మాధవి.
చక్రవర్తి భుజాలెగరేసి, కౌశిక్ ని లేపడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
అమాయకంగా, ముద్దుగా నిద్రపోతున్న కౌశిక్ ని చూస్తుంటే చక్రవర్తికి లేపాలనిపించలేదు. 'చిట్టితండ్రి అంత తొందరగా నిద్ర లేచి ఏం చేయాల్లే' అనుకున్నాడు. వాడి ముద్దు మొహం అలాగే తదేకంగా చూస్తూ తనూ కౌశిక్ పక్కన పడుకున్నాడు. అతని ఆలోచనలు అర్చన మీదికి వెళ్ళాయి. మగవాడినైన నాకే నా రక్తం పంచుకు పుట్టినకొడుకు మీద ఇంత ప్రేమా, ఆప్యాయతా ఉంటే ఆడదై ఉండీ, ఓ తల్లి అయి ఉండీ అర్చన వాడినెలా వదిలేసి వెళ్ళగలిగింది? ప్రేమించి, మనస్ఫూర్తిగా కాపురం చేసిన భర్త ద్వారా కలిగిన పిల్లల మీదే ఉంటుందా ఆడవాళ్ళకి మమకారం. వేణు అంటే ఇష్టం లేదు కాబట్టి వేణు ద్వారా కలిగిన సంతానం మీద కూడా ఆమెకి ద్వేషం ఉండి ఉండచ్చా? అందుకేనా వదిలేసింది. ఏమోలే.... ఇంకా నయం ఏ చెత్తకుప్పలో వదిలేయలేదు. వేణు తల్లితండ్రుల దగ్గర వదిలేసిందంటే చాలా ప్లాన్డ్ గా ఉందన్నమాట! ఇంత ప్లాన్డ్ గా ఉన్న అమ్మాయి చివరి గమ్యం ఎక్కడో, ఏమిటో...?
"కౌశిక్ లేచాడా? వాడిని రెడీ చేయండి. ముగ్గుం ఒకేసారి వెళ్ళాలి. వాడిని క్రచ్ లో దింపేస్తాను" కిచెన్ లోంచి అరిచింది మాధవి.
"ఏ క్రచ్ లో ?" అయోమయంగా అనుకున్నాడు. మృదువుగా కౌశిక్ చెంపమీద తాకుతూ "కౌశిక్.... బంగారూ!" అంటూ పిలిచాడు. వాడూ మత్తుగా కదిలాడు. "చిట్టినాన్నాలే... నాన్నా.... మనం అచ్చి వెళ్ళాలి."
వాడు లేవలేదు. పక్కకి ఒత్తిగిల్లి మరీ పడుకున్నాడు.
