అర్చన గబుక్కున నీలిమని కావలించేసుకుంది. "నాకు చచ్చిపోవాలనిపిస్తోంది నీలూ... నాకు చచ్చిపోవాలనిపిస్తోంది."
మంచం అంచున కూర్చోబెట్టింది. వెంట్రుకలు సవరిస్తూ మృదువుగా అంది. "ఎవరా అమ్మాయి? ఎందుకంత హడావిడిగా వచ్చావసలు?"
అర్చన సమాధానం చెప్పలేదు. ఏడుస్తూనే ఉంది. నీలిమకి జాలేసింది. ఎంతైనా తన స్నేహితురాలు. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి తిరిగారు. చేతివేళ్ళలాగే ఈ సమాజంలో మనుషులు కూడా అందరూ ఒక్కలాగే ఉండరు. అలాగే మనస్తత్వాలు. అందరి మనస్తత్వాలు ఒక్కలాగే ఉంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? అర్చనకి ఏవో ఆలోచనలు, తనవి అనే స్వతంత్రభావాలు ఉన్నాయి. వాటిని కాదని, తన భావాలను నియంత్రించి నువ్విలాగే ఉండాలి అనే హక్కు ఎవరికుంది? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికిష్టమైనట్టు వాళ్ళు బతికే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంది కదా! మరి ఈ విషయంలో స్త్రీలను ఎందుకు మినహాయిస్తారు? స్త్రీ ఏం చేసినా తప్పుగా, మహాపాపంగా ఎందుకు పరిగణిస్తారు? ప్రజలంటే కేవలం పురుషులే కాదు కదా! అర్చన చేసిన తప్పేంటి? ఆమెవెనకాలే వచ్చి న అమ్మాయి ఎవరు? వీళ్ళిద్దరి మధ్యా ఏం జరిగింది? అర్చన ఎందుకింతగా డిస్టర్బ్ అయింది?
ఒక్కసారిగా అనేక ప్రశ్నలు నీలిమని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మెల్లిగా అడిగింది.
"ఏం జరిగింది అర్చనా? ఎందుకేడుస్తున్నావు? ఉదయం నుంచి బాగున్నావు కదా!"
అర్చన మాట్లాడలేకపోయింది. ఏదో చెప్పాలని ప్రయత్నించి, ఏడుపు అడ్డం పడడంతో తిరిగి వెక్కిళ్ళు పెట్టసాగింది.
నీలిమ అర్చన భుజం చుట్టూ చేయి వేసి తన గుండెల దగ్గరగా ఆమెని పొదుపుకుని మృదువుగా అడిగింది.
"చెప్పవా?"
అర్చన కన్నీళ్ళతో తఃలెత్తి చూసింది. ఎర్రటి కళ్ళల్లో నీళ్ళతో చూస్తున్న అర్చనని చూడగానే కడుపు తరుక్కుపోయింది. నెమ్మదిగా అంది "నాకు తెలుసు. నువ్వు చెప్పలేకపోతున్నావు. అవునా?"
అవునన్నట్టు తలూపింది అర్చన.
"అర్చనా! నీకూ, ఆ అమ్మాయికీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, నీ సున్నితమైన మనసుకి గట్టి దెబ్బ తగిలిందని మాత్రం అర్ధం చేసుకోగలుగుతున్నాను. ఏం జరిగినా నువ్వింత బేలవై ఇలా ఏడవడం మాత్రం బాగా లేదు. ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చింది ఏడవడానికా? చూడు నీకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన భవిష్యత్తుని అరచేతిలో పట్టుకుని ఆయన దీవెనల కోసం వచ్చావు. అవునా? ఇంకెందుకు ఏడుపు? గతం మర్చిపో. నీకు నచ్చిన దారిలో నువ్వు ఏర్పరచుకున్న రహదారిలో మహారాణిలా నడిచిపో. ఎవరి మాటలు వినకు. ఎవరినీ లక్ష్యపెట్టకు. జరిగిందేదో జరిగింది. మంచో, చెడో ఒక నిర్ణయానికి వచ్చావు. దాని ఫలితం ఏదైనా ఆ నిర్ణయానికే కట్టుబడి ముందుకు సాగిపో. విజయం వరిస్తుందా? ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది. ఓడిపోయావా? ఈ జీవితమే దానికి పరిష్కారం చూపిస్తుంది. సరేనా? లే..... లేచి మొహం కడుక్కో! ఇక్కడ అ దేవుడికి తప్ప ఇంకెవరికీ, ఎలాంటి ఎక్స్ ప్లనేషన్ నువ్వు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు."
నీలిమ మాటలు పగిలిన హృదయం మీద నవనీతం రాస్తున్నట్టు చల్లగా, హాయిగా వినిపిస్తున్నాయి.
కన్నీళ్ళతో నిస్సహాయంగా చూసింది.
"నేను నిజం చెపుతున్నాను. నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నీకొచ్చిన అపూర్వమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. అర్ధమైందా? లేచి మొహం కడుక్కో. పద లే! ఆమె భుజం పట్టి బలవంతంగా లేపబోయిన నీలిమని ఆపుతూ అంది "నే....నేను లేస్తాలే" అంటూ నెమ్మదిగా చేతిమీద లేచింది.
"అవును. నేను ఆ భగవంతుడికి మాత్రమే సమాధానం చెప్పాలి. ఇంకెవరికీ కాదు. నాకు తెలుసు నేనేంటో" సణుగుతున్నట్టుగా అంటూ అరచేత్తో కళ్ళు తుడుచుకుంటూ లేచింది. బాత్ రూమ్ లోకి వెళ్ళి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని వచ్చింది.
"కాస్సేపు రిలాక్స్ అయి, చీర మార్చుకో. నేను మళ్ళీ ఓ గంటలో వస్తాను. వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేద్దాం" సరేనా నీలిమ ఆప్యాయంగా అంది.
బుద్ధిగా తలూపింది అర్చన.
ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచిన కనుదోయితో చిత్రమైన అందంతో మెరిసిపోతున్న అర్చనని చూస్తూ 'ఆడదానికి ఇంత అందం కూడా శత్రువే. ఈ అందాంతో భవిష్యత్తులో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ పిల్ల!?' అనుకుంటూ సన్నగా నిట్టూర్చి అక్కడినుంచి వెళ్ళిపోయింది నీలిమ.
అర్చన చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంది. జుట్టుకున్న క్లిప్ తీసి జుట్టు వదిలేసింది. తలుపు గడియ వేసుకుని మంచం మీద వాలింది.
ఆమె మనసు ఎంత మళ్ళించాలనుకున్నా మాధవి మాటల చుట్టూనే తిరుగుతోంది. 'నీకు ప్రేమించే అర్హత లేదే...' మాధవి మాట ఆమె గుండె మీద చెళ్ళు చెళ్ళున కొడుతున్నట్టు వినిపిస్తోంది. ఎందుకు లేదు? నాకెందుకు ప్రేమించే అర్హత లేదు? ఆ ప్రశ్న పదే పదే వేధిస్తోంది. పెళ్ళి అయిందని ప్రేమించే అర్హత కోల్పోయిందా లేక నాగరాజు కిడ్నాప్ చేయడం వల్ల ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఈ రెండింటికీ తాను బాధ్యురాలు కాదే! అలాంటప్పుడు తన భావస్వాతంత్ర్యం ఎందుకు కోల్పోవాలి? ఎవరు చేసిన శాసనం ఇది? అయిన తనేం ఇప్పుడు అతనెవరో వెతుక్కుమ్తూ వెళ్ళి, 'నన్ను ప్రేమించవయ్యా మహానుభావా! నన్ను పెళ్ళాడి ఉద్ధరించు' అని అడగబోవడం లేదే! తనది మూగప్రేమ. దీనివలన ఎవరు ఏం కోల్పోతున్నారు? ప్రేమించడం అంటే దానికి పరాకాష్ఠ పెళ్ళేనా? ప్రేమ మనసులో శాశ్వతంగా అలా పవిత్రంగా ఉండకూడదా? ప్రేమ ఉన్నచోట శారీరక సంబంధం ఉండాలా? అందుకు పెళ్ళి చేసుకోవాలా? తనేం అతనితో మానసికంగా కానీ, శారీరకంగా కానీ, కామకేళిలో తేలిపోవడం లేదే! అతనే లోకం అనుకుని పిచ్చిదై పనీ పాటా లేకుండా తిరగడం లేదే! మనసులో అతడిని పెట్టుకుని మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనంటోంది. అందుకు అందరూ సంతోషించాల్సింది పోయి తఃనని ఎందుకిలా విమర్శల తూటాలతో తూట్లు పొడుస్తున్నారు?
'ఓ అపరిచితుడా! నువ్వు నాకెందుకు కనిపించావు? కనిపించినవాడివి ఎందుకలా నన్ను ఆకర్షించావు? ఎందుకు నా మనసు దోచుకున్నావు? నేనివాళ ఎవరికీ ఏమీ కాకుండా మిగిలిపోయానంటే కారణం నువ్వు కూడా కదా! అయినా నా మీద నీకు ఏదో ఒక భావన కలిగి ఉండచ్చు కదా! అదేంటో ఎందుకు చెప్పలేకపోయావు? నేనంటే ఆడపిల్లను. ఎంత డైనమిక్ అయినా సహజంగా ఉండే సిగ్గు, బిడియం అనేవి నాకూ ఉంటాయి కదా! అంచేత నేను నిన్ను పలకరించలేకపోయాను. మరి నువ్వెందుకు పలకరించలేదు. కనీసం ఒక్క రోజు, ఒకే ఒక్క రోజుని సబార్డినేట్ గా నేను కనిపించినప్పుడైనా నేనెవరో, నా పేరేంటో అడగాలనిపించలేదా? చాలా దుర్మార్గుడివి..... చాలా దుర్మార్గుడివి....."
