Previous Page Next Page 
అర్చన పేజి 59

    "ఆత్మవంచన" మాధవి అదోరకంగా నవ్వింది.
    "భారతదేశంలో నూటికి ఎనభైమంది స్త్రీలు ఈ ఆత్మవంచనతోటే బతుకుతున్నారు. ప్రతివాళ్ళూ నీలాగే ఆలోచిస్తే ఈ వివాహవ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేదా? భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టేది ఈ వివాహవ్యవస్థే. ఆ ఔన్నత్యాన్ని కాపాడడం స్త్రీలుగా మన కర్తవ్యం."
    "దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి నా ఆత్మాభిమానాన్ని, నా ఆశలను, నా కలలను, నేను పణంగా పెట్టాలా? ఈ దేశప్రతిష్ఠము కాపాడడానికి స్త్రీలంతా తమ పవిత్రతని, పాతివ్రత్యాన్ని పణంగా పెట్టి, ఆత్మను చంపుకుని, ఒద్దికగా అందరికీ తలవంచి బతకాలి అవునా? సారీ మిసెస్ మాధవీ! నాకంత సహనం, సమతాభావం, దేశభక్తి లేవు. నా కిష్టంలేని వ్యక్తికి ఈ శరీరాన్ని అప్పగించి, కళ్ళు మూసుకు పడుకునే శక్తి నాకు లేదు. నాకీ జీవితం వద్దు, నాకు ప్రేమించే అర్హత లేకున్నా, నేను ప్రేమించే పురుషుడు నాకు దక్కకున్నా ఫర్వాలేదు. కానీ, నేనీ ఆత్మవంచన చేసుకోలేను. నాకు స్వేచ్చ కావాలి. నాకు ఈ మానసిక వేదన నుంచి, ఈ నరకయాతననుంచి విముక్తి కావాలి. అవును విముక్తి కావాలి. అందుకే నేను వెళ్ళిపోయాను.
    "చాలా సంతోషం అర్చనా! నీ సుఖం, నీ సంతోషం, నీ స్వేచ్చ నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. మరి నీ పెగు తెంచుకుని పుట్టినవాడి సంగతేంటి? రేపు వాడూ ఇలాగే అడుగుతాడు. నాకూ ఈ సమాజంలో గౌరవం కావాలి. ఒక స్థానం కావాలి. ప్రశ్నలే లేని జీవితం కావాలి అని. మరి నీ తల్లి ఏదీ అనే పెద్ద ప్రశ్నకి వాడిని ఏం సమాధానం చెప్పమంటావు?" సూటిగా చూస్తూ అడిగింది మాధవి.
    అర్చన మాట్లాడలేదు. ఈ ప్రశ్నకి ఆమె దగ్గర ఇన్ స్టెంట్ గా సమాధానం లేదు. కానీ అంతరాంతరాల్లో ఖచ్చితమైన సమాధానం కోసం ఆమె నమ్మిన సిద్దాంతం అన్వేషిస్తోంది. ఆ అన్వేషణ ఫలించే లోపే మాధవి అంది.
    "నువ్వే కాదు. ఈ ప్రశ్నకి స్త్రీ స్వేచ్చ కోసం గొంతు చించుకుని అరిచిన ఆ చలం కూడా సమాధానం చెప్పలేదు. చెప్పలేడు కూడా. ఆయన తల్లి ఆయన్ని అలా వదిలేసి ఉంటే ఆయన నుంచి స్త్రీ స్వేచ్చాగానం వినిపించేది కాదు. ఏదైనా అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది అర్చనా! నీ సిద్దాంతాలు, నీ ఆశయాలు అర్ధరహితం అనీ, అందువలన నువ్వు కీర్తినీ, డబ్బునీ సంపాదించుకోగలవు కానీ, ప్రేమానురాగాలతో ముడిపడిన కుటుంబ కీవిథాన్ని మాత్రం సంపాదించుకోలేవని నేను బల్లగుద్ది చెప్పగలను."
    "అదే ఆ కుటుంబ జీవితం అంటూ కుటంబం చుట్టూ గిరిగీసి బతకమనే కదా స్త్రీలను నిర్భంధించారింతకాలం ఈ సంప్రదాయవాదులు. అయినా మధూ! పట్టుమని పాతికేళ్ళు లేని నీలో సంప్రదాయాల పట్ల ఇంత గౌరవం, నమ్మకం ఎలా వచ్చాయి?"
    మాధవి నవ్వింది. ఆ నవ్వులో అర్చనకి చాలా అర్ధాలు కనిపించాయి. చాలా వెటకారమూ ధ్వనించింది. ఆ నవ్వుకి అర్ధం ఏంటి అని అడగడానికి కొంచెం జంకూ కలిగింది.
    మాధవి అదే నవ్వుతో అంది "నువ్వు ఈ భావాలతో ఈ జీవితాన్ని గెలవాగలననుకుంటున్నావా?"
    "గెలుస్తానో లేదో చెప్పలేను కానీ, ఓడిపోను. ఎందుకంటే నేను ఎక్కిన మొదటి మెట్టు నన్ను విజయం వైపుకి నడిపిస్తుందో లేదో తెలియదు. కాకపోతే ఓటమిని మాత్రం దగ్గరకి రానివ్వను. అందుకోసం ఎంతైనా పోరాడతాను."    
    "ఓ.కె. గుడ్ లక్."
    మాధవి లేచింది. అర్చన మాధవి చేయి పట్టుకుని ఆపుతూ అంది "మాధవీ! నేను కలిసినట్టు దయచేసి ఎవరికీ చెప్పనని మాటివ్వు. ప్లీజ్."
    మాధవి ఒక్కసారి అర్చనవైపు సూటిగా చూసింది. "చెప్పినందువలన ఏదన్నా ప్రయోజనం ఉందంటావా?"
    అర్చన మాట్లాడలేదు.
    "కాబట్టి చెప్పను. సరేనా? బై."
    అర్చన చేయి విడిపించుకోబోతుంటే ఆమె చేయి వణకడం స్పష్టంగా కనిపించింది. ఆశ్చర్యంగా అర్చన మొహంలోకి చూసింది. రెండు కళ్ళూ నీటితో నిండాయి. వణుకుతున్న పెదాలతో అంది "ఎప్పుడన్నా నన్ను చూడ్డానికి వస్తావా?"
    "దేనికి?"
    "కనీసం ఒక్కళ్ళన్నా ఆత్మీయులు ఉన్నారన్న తృప్తి నాకు మిగల్చడానికి."
    "అదేంటి? బొత్తిగా సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నావు. నీలాంటి బోల్డ్ డైనమిక్ లేడీకి సెంటిమెంట్స్ తో పనుందా?"
    "సెంటి మెంట్స్ అనుబంధాలను, బంధాలను పెంచేవి. నాకూ స్నేహం కావాలి. ఆ స్నేహం నీనుంచి నేనాశిస్తున్నాను."    
    మాధవి ఇంకేదో అనబోయి ఆగిపోయింది. ఇప్పటికే చాలా కఠినంగా మాట్లాడింది. ఇంక ఆమెని బాధపెట్టడం వలన లాభం ఏంటి? అనిపించింది. తల పంకించి గుమ్మం వైపు నడిచింది.
    "మధూ" అర్చన గట్టిగా మాధవిని వాటేసుకుంది.
    "అర్చనా! నీకు తెలియని మనసు నీలో ఒకటుంది. అదేంటో అన్వేషించి, దానికేం కావాలో ఆలోచించి నాకు చెప్పు. బహుశా అప్పుడీ కన్నీళ్ళకి చోటు ఉండకపోవచ్చు నీ జీవితంలో" అంటూనే అర్చనని వదిలించుకుని, వచ్చే కన్నీళ్ళు ఆపుకుంటూ గబగబా బైటికి నడిచింది మాధవి.
    
                                                                    * * * * *
    మాధవి వెళ్ళిపోయాక అర్చనకి ఒక్కసారిగా భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. నరనరంలో నిస్సత్తువ ఆవహించి నిలువునా కూలిపోయింది. మాధవి మాటలు చెవుల్లో హోరెత్తిపోతున్నాయి. 'నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. నీకా అర్హత లేదు' అంటూ మాధవి గొంతెత్తి గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తోంది. 'నీ కొడుకు జీవితం ప్రశ్నార్ధకంగా చేస్తావా?' అని నిలదీస్తోంది. అర్చన కళ్ళముందు పెళ్ళలు పెళ్ళలుగా తను పేర్చుకుంటున్న భావిసౌధాలు కూలిపోతున్నాయి. ఒక్క మాధవి వేయి మాధవిలుగా మారి తనని 'వేణు దగ్గరకు వెళ్ళిపో! నీకు అది తప్ప వేరే జీవితం లేదు. నీ కొడుకుని చేరదీయి. ఓ తల్లిగా, ఓ భార్యగా, ఓ కోడలిగా, ఉత్తమురాలిగా బతుకు. అందులోనే నీ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. నీ జన్మ చరితార్ధం అవుతుంది. వెళ్ళు... వెళ్ళు నీకే చెప్పేది. వెళ్ళు' పదే పదే హోరెత్తిస్తోంది.
    'నో!' అర్చన రెండు చేతుల్తో చెవులు మూసుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.
    అప్పుడే తలుపు తోసుకుని లోపలికి వచ్చిన నీలిమ అర్చనని ఆ స్థితిలో చూసి స్థాణువైంది.
    గబగబా అర్చన దగ్గరికి నడిచి మోకాళ్ళ మీద కూర్చుని గాభరాగా పిలిచింది. "అర్చనా... అర్చనా! అర్చనా! నిన్నే ఏమైంది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS