Previous Page Next Page 
అర్చన పేజి 58


    మాధవి ప్రశ్నకి అర్చన ఒక్కసారిగా తన ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ అంది.
    "మధూ! నాలాంటివాళ్ళు ప్రేమించకూడదా?"
    "అంటే నీలాంటి వాళ్ళంటే..."
    "అదే నేనేదో చెడిపోయాననుకుని మీరంతా భావించే..."
    "మేమలా భావించామని నీతో అన్నానా?"
    "నువ్వు కాదులే. పోనీ మిగతావాళ్ళు."
    "విషయం చెప్పు."
    "చెప్పే ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు. నేను ప్రేమించకూడదా?"
    "ఎవరిని?"
    "నా ఊహల్లో ఉన్న వ్యక్తిని తరచూ నా కలలో కనిపిస్తూ నాకు శాంతి లేకుండా చేస్తున్న వ్యక్తిని నేను జీవితంలో ఎన్నడూ చూస్తాను అనుకోని వ్యక్తిని."
    "ప్రేమించకూడదు. నీ భర్తని, నీ పిల్లలని తప్ప ఇంకెవరినీ ప్రేమించకూడదు."
    "ఎందుకని?"
    "ఒకసారి వివాహం అయిన స్త్రీ మనసు తెల్లకాగీతం కాదు ఎవరి పేరు పడితే అది రాసుకునే వ్యవస్థలో మనం బతకడం లేదు."
    "లెట్ ద వ్యవస్థ గో టు హెల్."
    "అలా అనే హక్కు నీకు లేదు అర్చనా! ఈ వ్యవస్థలో నువ్వూ భాగస్తురాలివి. ఈ వ్యవస్థ గౌరవం, ఈ వ్యవస్థని నిలబెట్టే బాధ్యత నీమీద కూడా ఉన్నాయి. వాటిని కాదని నువ్వు ఈ వ్యవస్థలో బతకలేవు."
    "కానీ నేను ప్రేమించిననాటికి నా మనసు ఒక తెల్లకాగితమే. పేరు రాసుకునే అవకాశం నాకు రాలేదు ఏం చేయను?"
    "అబ్బా! ఏంటో వివరంగా చెప్పు తల్లీ చంపకు" విసుగ్గా అంది మాధవి.
    అర్చన కొన్ని క్షణాల్లో తన మనసులో అజ్ఞాతంగా పూజలందుకుంటున్న వ్యక్తి గురించి చెప్పింది. తరువాత నెమ్మదిగా అయినా స్థిరంగా అంది. "మాధవీ! నాకు తెలియదు నేన్ చేస్ది మంచో, చెడో అసలు ఏది మంచో, ఏది చెడో కూడా నాకు తెలియదు. తోచింది ఆచరించడం, నమ్మింది అనుసరించడం నా తత్వం. నేను వేణుని ఎన్నడూ ప్రేమించలేదు. ఎన్నడూ నా భర్త స్థానంలో అతడిని ఊహించలేదు. ఊహించని వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తగా అంగీకరించే మనసు నాకు లేదు. అయినా నా నిస్సహాయతని, నా తల్లితండ్రుల వేదననీ తనకి అవకాశంగా తీసుకుని నన్ను స్వంతం చేసుకుందామనుకున్నాడు. తన స్వార్ధానికి, త్యాగం అని పేరు పెట్టుకుని, నన్ను తన భార్యగా అతను శాశ్వతంగా బంధించాడు. అతను నన్ను శారీరకంగా బంధించగలిగాడు కానీ. మానసికంగా నేనెంతో స్వేచ్చగా ఉన్నాను. నా మనసులో వేణుకి అసలు స్థానం లేదు. నేను ఇతడినే ప్రేమించాను. ఆ కళ నన్ను వెంటాడుతున్న రోజుల్లో అదొక పీడకల అనుకున్నాను. తల్చుకోడానికి భయం వేస్తుండేది. కానీ, ఎప్పుడైతే అతను నా కళ్ళముందు ప్రత్యక్షమై, తన చూపుల గాలంతో నన్ను తన వశం చేసుకున్నాడో అదొక మధురస్వప్నంగా, మరీ మరీ ఆ కల నాకు రావాలని కోరుకునేదాన్ని. కానీ, కానీ మా ఇద్దరి మధ్యా, మమ్మల్ని వేరుచేస్తూ ఎగిరివచ్చిన ఓ భయంకరమైన పక్షి వేణు అనీ, విరిగిపడిన నా మొండెం పగిలిపోబోతున్న నా కలలనీ నేనెన్నడూ అనుకోలేదు. మధూ! ఇప్పుడు చెప్పు. నా ప్రమేయం లేకుండా నేను పొందిన పరాభవాలకు, నేను శాశ్వతంగా ప్రేమించే అర్హతని కోల్పోయానా?"
    రెండు చేతుల్లో మొహం దాచుకుని హిస్టీరిక్ గా ఏడుస్తున్న అర్చనవైపు విచలితంగా చూసింది మాధవి. విస్మయంగా చూసింది. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్న, చేయకూడని పనులు చేస్తున్న ఒక అరాచక శక్తిని చూస్తున్నట్టుగా చూసింది. ఆ చూపులో అర్చన చూపు కలిసి ఉంటే అక్కడికక్కడే పొడుచుకుని ప్రాణం విడిచేది. కానీ కన్నీళ్ళతో నిండిన ఆ కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. ఒకే ఒక్కటి అది తన ప్రేమ, ప్రేమకి నోచుకోని మనసు. అదిప్పుడు దుఃఖంతో నిండిపోయి ఉంది.
    మాధవి స్వరం కరుకుగా వినిపించింది.
    "అందుక్కాదు అర్చనా! నువ్వు ప్రేమించే అర్హత కోల్పోయింది. వేణులాంటి భర్తని పొందినందుకు నీకసలు జీవితంలో మరొకరిని కన్నెత్తి చూసే అర్హత లేదు. ప్రేమించే అధికారం అసలే లేదు. ఏ పరిస్థితుల్లో నిన్ను వేణు పెళ్ళిచేసుకున్నాడో కొంచెం వివేకంతో ఆలోచిస్తూ అతనికి జీవితాంతం కృతజ్ఞతగా పడి ఉండాల్సినదానివి. నువ్వనుకున్నట్టు అతను నీ మీద జాలితో నిన్ను పెళ్ళి చేసుకుని ఉండచ్చు. ఏది ఏమైనా అతను చేసింది నీకు మేలు. అందుకు నువ్వతనికి ఋణపడి ఉండాల్సినధనివి. కానీ, ఏం చేశావ్? వేణు నువ్వేదో మానసికంగా దెబ్బతిన్నావని, అందుకే తనతో సఖ్యంగా లేవని, నిన్ను ఎలాగైనా అనురాగంతో తనదానిగా మార్చుకోవాలని ఎంతో సహనంతో ఎదురుచూశాడు. అలాంటివాడికి నువ్వు జీవితకాలానికి సరిపడే మనస్తాపం అందిస్తావా? నువ్విలా ఎవరో పేరూ, ఊరూ లేని వ్యక్తిని ప్రేమిస్తున్నావని వేణుకి తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది. అదలా ఉంచినా అతను నిన్నెంత అసహ్యించుకుంటాడో ఊహించగలవా? అతనే అసహ్యించుకున్న రోజున నిన్ను ప్రేమించేవాళ్ళు ఈ భూమ్మీద ఉంటారా? నువ్వు పరితపిస్తున్న అతను నీ గతం తెలుసుకుంటే నిన్ను ప్రేమిస్తాడా? చెప్పు. అర్చనా నీ చుట్టూ సమాజం, కట్టుబాట్లు ఉన్నాయి. అన్నిటికీ మించి ఒకరి భార్యగా, అతని పిల్లలకి తల్లిగా నీకు కొన్ని బాధ్యతలున్నాయి. నీ కుటుంబ గౌరవం నిలబెట్టాల్సిన కర్తవ్యం ఉంది. ఇన్నిటి మధ్య బందీవై జీవిస్తున్న నీకు స్త్రీగా కొన్ని సిద్దాంతాలకు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. తెలిసిందా?"
    అర్చన ఉక్రోషంగా చూసింది.
    "హు సంప్రదాయం... సంఘం కట్టుబాట్లు. వీటి మధ్య అనాదిగా స్త్రీ బంధించబడే ఉంటోంది. అందుకే ఇన్ని ఆత్మహత్యలు, ఈ బలిదానాలు, వరకట్న చావులు, హత్యలు. వీటినుంచి స్త్రీకి విముక్తి లేదా? ఉండకూడదా? నీలాంటి సంప్రదాయవాదులంతా స్త్రీలను ఇలాంటి దిక్కుమాలిన నినాదాలతో బంధిస్తున్నారు. సంకెళ్ళు వేసి ఎక్కడికీ పోనీకుండా సంసారం అనే సంప్రదాయపు చెరసాలల్లో మానసికంగా ఉరితీస్తున్నారు. ఈ సంకెళ్ళు శారీరకంగా మనిషిని కట్టేయగలవు కానీ, మనసుని కట్టేయగలవా? ఈ కట్టుబాట్లని దాటి వెళ్ళిపోవాలని, నేను కోరుకున్న జీవితంవైపు హాయిగా ఎగరాలని నా మనసు తహతహలాడుతోంది. జరిగిన సంఘటనలను ఎదుర్కొని, పోరాడి న్యాయం పొంది, నేను ఆశించినట్టుగా బాగా చదువుకుని, ఉన్నతస్థానంలో ఉండి, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని సంతోషంగా, సుఖంగా బతికే అవకాశం నాకెందుకు దూరం కావాలి? ఏమీ జరక్కపోయినా, ఏదో జరిగిందని, తద్వారా నేనింక ఆనందకరమైన జీవితానికి పనికిరానని, నా పెద్దలు, ఈ సంఘం నిర్దేశించిన మార్గంలో నా కిష్టం లేకుండా నడిచి వెళ్ళిపోయి, ఈ వ్యక్తి లేకపోతే నా బతుకేమయేదో అనే అభద్రతా భావంతో ఆత్మవంచన చేసుకుంటూ బతకాల్సిన అవసరం ఏంటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS