"ఏడవకు అర్చనా! నీ మనసులో ఏం ఉందో నాకు చెప్పు. నేనొచ్చా కదా!"
అర్చన రుద్దమైన కంఠంతో అంది "నా మనసు విరిగిపోయింది. ఇంకా ఆ మనసులో ఏం ఉంటుంది మధూ!"
"మరి ఎందుకు ఏడుస్తున్నావు? అందర్నీ ఏడిపించడమే నీకు తెలుసనుకున్నా నీక్కూడా కన్నీళ్ళున్నాయా?" అర్చన అన్న మాటకి చిరాకొచ్చి కొంచెం వెటకారంగా అడిగింది మాధవి. అర్చన మాట్లాడలేదు.
"చెప్పు అర్చనా! ఎందుకిలా చేశావు?" అర్చనని రెట్టిస్తూ అడిగింది మాధవి.
'ఏం చెప్పను?" గాద్గదికంగా అడిగింది అర్చన.
"నీ మనసులో ఏం ఉందో చెప్పు!"
"చెపితే తట్టుకునే గుండె ధైర్యం నీకుందా?"
"హు.... కట్టుకున్నవాడిని, అందులోనూ నువ్వంటే ప్రాణం పెట్టే భర్తనీ, కన్న కొడుకునీ వదిలి వెళ్ళిపోయావని తెలిసి తట్టుకోగలిగినదాన్ని నువ్వు చెప్పే విషయం విని తట్టుకోలేనా? ఇంతకన్నా భయంకరమైన విషయం చెప్పవుగా!"
"ఆ మాట అంటేనే నాకు మండేది" ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఆవేశంగా అంది అర్చన.
"ఏ మాట?"
"ప్రాణం పెట్టే భర్త..... ప్రాణం పెట్టే భర్త....మీకు ఆ ఒక్కటే తెలుసు. కానీ, ఆ ప్రేమలో ఉన్న స్వార్ధం ఏంటో నాకు తెలుసు."
"స్వార్ధం లేని ప్రేమకి ప్రయోజనం ఉండదు. ఆ ప్రేమ ఫలించదు. ప్రేమ ఫలించాలంటే స్వార్ధం తప్పదు."
"ఓహో... వేణు కోసం మీరంతా అలా నిర్వచించుకున్నారా ప్రేమని!"
"కాదు... ఫెయిల్ అయిన నాటి ప్రేమకథల స్ఫూర్తిగా ఆధునిక యువత నిర్వచించుకుంది ఇలా."
"అంటే తన ప్రేమ ఫలించలేదని అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసే ప్రేమికుడిని కూడా నువ్వు సమర్ధిస్తావన్నమాట!"
"సమర్ధించను. మానసికంగా పరిణతిలేని ప్రేమికుడని జాలిపడతాను. ప్రేమించిన అమ్మాయి మనసు గెల్చుకోలేని అసమర్ధుడని అసహ్యించుకుంటాను."
"ఓ... అంటే వేణు చాలా సమర్ధుడని నీ నమ్మకం అన్నమాట!"
"నిజం అతను సమర్ధుడు. కానీ నువ్వే స్టుపిడ్ వి. నీకసలు ఏం కావాలో తెలియని చంచల మనస్కురాలివి. సున్నితమైన మనసున్న భర్తని అర్ధం చేసుకోలేని రాక్షసివి..."
"స్టాపిట్ మాధవీ! ఐ సే స్టాపిట్" ఆవేశంగా అరిచింది అర్చన.
మాధవి ఆమెవైపు చిత్రంగా చూసింది. కన్నీళ్ళ చారికలు కట్టిన చెంపల మీద కాటుక మరకలు, చెదిరిన ముంగురులు, నేరేడు పండు రంగు పచ్చని ఒంటి మీద మెరిసిపోతోంది. నల్లటి వంకీల జుట్టు చెంపలమీదుగా జారి వింతసోయగాన్నిస్తోంది. విచారంలో కూడా అపురూపమైన అందం. ఈ ఆందగత్తెకి కొంచెమన్నా మానవత్వం ఇవ్వలేదేంటి ఆ దేవుడు అనిపించింది ఆమెకి.
"మాధవీ! ఒక్కమాట అడుగుతాను చెప్పు."
"అడుగు."
"నిన్ను చక్రవర్తి జాలితో పెళ్ళిచేసుకున్నాడా? ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడా?"
"రెండూ కాదు. పెద్దవాళ్ళు చేశారు కాబట్టి చేసుకున్నాం. పెళ్ళయాక ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం."
"అంటే ప్రేమతో పాటు గౌరవం కూడా పరస్పరం ఉండాలని ఒప్పుకుంటున్నావు కదా!"
"అందులో సందేహం ఏం ఉంది?"
"అయితే వేణుకి నా మీద గౌరవం లేదు నీకా సంగతి తెలుసా?"
మాధవి విస్మయంగా చూసింది. "నీమీద గౌరవం లేదా? ఎలా అనుకున్నావు? అందుకు నిదర్శనం ఉందా?"
"ఉంది" స్థిరంగా అంది అర్చన. "ఉంది... అందుకే అందుకే నాకిష్టం లేకుండా, నా అంగీకారం లేకుండా నామీద అత్యాచారం చేశాడు" ఉద్రేకంగా అంది అర్చన.
"షటప్" తీవ్రంగా అరిచింది మాధవి.
"మొగుడు అతను, నీ మెళ్ళో తాళి కట్టిన మొగుడు. అతనికి నీమీద సర్వాధికారాలున్నాయి."
"మొగుడు" నిరసనగా నవ్వింది.
"మీ దృష్టిలో నాగరాజు నా మీద అత్యాచారం చేస్తే, లేదా రెండు రోజులు తన అధీనంలో నన్నుంచుకుని, ఈ సమాజానికి నేను చెడిపోయాననే భ్రమ కలిగించి, ఈ సమాజం నన్ను అసహ్యించుకునేలా చేసినా, నా మీద జాలితో తను నన్ను పెళ్ళిచేసుకోకపోతే నా బతుకు ఏమైపోతుందో అనే విచారంతో వేణు ఆదర్శంగా నన్ను వివాహం చేసుకుని నాకు జీవితం ప్రసాదించాడు. కాబట్టి, వేణులాంటి ఆదర్శమూర్తిని, ఎంతో భద్రత కలిగిన కుటుంబజీవితాన్ని వదిలేసి వచ్చి నేను ఇంకా చెడిపోయాను. అవునా?"
మాధవి సూటిగా చూస్తూ అంది "చెప్పు నీ వర్షన్ పూర్తికానీ మాట్లాడతాను."
"ఏం మాట్లాడతావు? ఆడదానికి పెళ్ళి లేకపోతే బతుకు లేదు. మొగుడనే వాడి నీడలో ఆడది ప్రశాంతంగా పిల్లల్ని కంటూ, వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ, తన ఆశల్ని కోరికల్ని తన యవ్వనాన్ని పిల్లలకోసం త్యాగం చేస్తూ నూరేళ్ళు లేదా అరవై ఏళ్ళు లేదా ఎనభై ఏళ్ళు బతికి భర్త చేతుల్లో పుణ్యస్త్రీగా కను మూసి జన్మ చరితార్ధం చేసుకోవాలి అవునా? అప్పుడే ఆడదాని జీవితానికి అర్ధం, పరమార్ధం. అంతేనా?"
"పోనీ మా అభిప్రాయం అదే! నీ అభిప్రాయం ఆడదాని జీవితం పట్ల నీ నిర్వచనం ఏంటో చెపుతావా?"
"చెపుతాను. అమ్మానాన్నల ప్రేమలో హాయిగా స్వేచ్చగా ఏ మాలిన్యం అంటకుండా పెరిగి, తనకంటూ కొన్ని ఆశయాలు, కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుని అవి నెరవేర్చుకునే దిశగా కృషిచేస్తూ, లక్ష్యాల్ని సాధించి, తనకు నచ్చిన, తనను మెచ్చిన వ్యక్తిని పెళ్ళాడి హాయిగా ఆనందంగా బతకడం."
"నిన్ను నీ లక్ష్యాలు సాధించవద్దని వేణు నిషేధించాడా?"
"వేణు, వేణు తప్ప నాకు మరో బతుకు లేదా? అతనితో తప్ప ఇంకెవరితో నేను బతక్కూడదా? అతడ్ని తప్ప ఇంకెవర్నీ ప్రేమించకూడదా?" ఆవేశంగా అరుస్తున్న అర్చనవైపు చిత్రంగా చూస్తూ అంది మాధవి.
"ఎందుకలా గొంతు చించుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు?"
