"అబ్బే అదేం లేదండి" అంటూ వడివడిగా ఆవిడ దగ్గరకి నడిచి ఆమె పక్కనే నడవసాగింది.
వేణు, చక్రవర్తి ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. పెద్దవాళ్ళతో కలిసి, నీలవేణి పిల్లలిద్ధరినీ తీసుకుని బయట గచ్చుమీద చతికిలపడింది.
"నువ్వూ కూర్చోమ్మా" తాయారమ్మ అంది మాధవినుద్దేశించి.
"ఆ...ఆ కూర్చుంటానండి" మాధవి అలా అంటూనే నెమ్మదిగా ముందుకు నడిచి వైకుంఠ ద్వారం వైపు వెళ్ళాలనుకుంది. కానీ, లోపలికి వెళ్ళిన అర్చన అక్కడ కనిపిస్తుందా అనిపించి వెనక్కి తిరిగింది. అన్యమనస్కంగానే పిల్లలిద్దర్నీ ఆడిస్తున్న నీలవేణిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది.
వేణు, చక్రవర్తి లడ్డూల కవర్ తో వచ్చారు.
"పదండి. రూముకెళ్ళి కాస్సేపు పడుకుందాం" అన్నాడు వేణు.
కూర్చున్నవాళ్ళంతా లేచారు.
మాధవి అంది "నాకు ఈ వేళలో ఈ కొండమీద తిరగడం చాలా ఇష్టం. మనం కాస్సేపు ఇక్కడుందామా?" అంది చక్రవర్తితో.
"ఎందుకమ్మా! ఇప్పుడు చల్లగా ఉంది కూడాను" కాస్సేపు పడుకుని మళ్ళీ వద్దాంలే అన్నాడు కృష్ణస్వామి.
మాధవి నిస్సహాయంగా చక్రవర్తిని చూసింది.
"మేమిద్దరం ఓ అరగంటాగి వస్తాంలెండి. వేణూ! బాబుని రూముకి తీసుకెళతావా?" అడిగాడు చక్రవర్తి మాధవి మనసులో ఆలోచన అర్ధం చేసుకున్నవాడిలా.
"ఓకే... ఎంజాయ్ చేయండి. పదండి నాన్నా! మనం వెడదాం" అన్నాడు వేణు.
మాధవి కృతజ్ఞతగా చూసింది.
వాళ్ళు వెళుతుంటే మాధవి అంది "అర్చన వచ్చినా ఇదే దారిలో రావాలి కదా! ఇక్కడే ఉందాం!"
"అలాగే నాకేం అభ్యంతరం లేదు. కానీ, తను మనతో మాట్లాడుతుందా అనే డౌటు!"
"మాట్లాడక ఏం చేస్తుంది? నేను మాట్లాడిస్తాను. ఇక్కడే ఉంటాను. కలిసి తీరతాను" పంతంగా అంది మాధవి.
చక్రవర్తి మౌనం వహించాడు. తను చూసింది ఖచ్చితంగా అర్చననే. ఆ జుట్టు, అందమైన ముఖవర్చస్సు, అదే పర్సనాలిటీ! ఖచ్చితంగా అర్చనే!
"కాఫీ తాగుదామా?" అడిగాడు.
"ఊహూ... ముందు ఆమెని కలిశాడే" స్థిరంగా అంది మాధవి.
చక్రవర్తి ఇంకేం మాట్లాడలేదు. అటూ ఇటూ తిరుగుతున్న జనం వైపు చూస్తూ కూర్చున్నారిద్దరూ.
* * * * *
మాధవి నిరీక్షణ వృధా కాలేదు. దర్శనం ముగించి నీలిమ, అర్చనా పాపని తీసుకుని మాధవి వాళ్ళు కూర్చున్న దగ్గరకే వచ్చారు. వాళ్ళను చూడగానే మాధవి చక్రవర్తితో అంది.
"మీరు వెళ్ళిపొండి. మిమ్మల్ని చూస్తే ఆమె నాతో మాట్లాడకపోవచ్చు. నేను రూముకి వచ్చేస్తాను."
ఆమె అంది నిజమే అనిపించి చక్రవర్తి అర్చన దృష్టి తన మీద పడకముందే అక్కడినుంచి దూరంగా వచ్చి వెనక్కి తిరిగి చూశాడు.
మాధవి అర్చన భుజమ్మీద చెయ్యేసి ఏదో మాట్లాడుతోంది. చక్రవర్తి హమ్మయ్య అనుకుని వెళ్ళిపోయాడు.
మాధవిని చూసిన అర్చన షాక్ తగిలినట్టు నిలబడిపోయింది.
"బాగున్నావా అర్చనా?" నవ్వుతూ అడిగింది మాధవి.
"నువ్వు....మీరు.... నువ్వు ఇక్కడ?"
"స్వామి సన్నిధి. నేనూ దర్శనం కోసం వచ్చాను."
"కానీ...." అర్చన ఏం మాట్లాడలేకపోతోంది.
నీలిమ ఇద్దర్నీ విస్మయంగా చూస్తూ "ఎవరు అర్చనా?" అని అడిగింది.
మాధవే నవ్వుతూ చెప్పింది "అర్చన నా కజిన్."
"ఓ..." నీలిమ కొంచెం అయోమయంగా అంది. చిన్నప్పట్నించీ ఒకే దగ్గర కలిసి బతికిన తామిద్దరికీ తెలియని బంధువులెవరూ లేరే? ఎవరీ కజిన్? అనుకుంది.
మాధవి అంది మళ్ళీ "రా అర్చనా. నా రూముకి వెడదాం. ఆయన కూడా ఉన్నారు. కలుద్డురుగాని."
"వద్దొద్దు" కంగారుగా అంది అర్చన.
"పోనీ నీ రూముకి వెడదామా?" అర్చన చేయి వదలకుండా అంది. ఎట్టి పరిస్థితుల్లో అర్చనని వదిలే ప్రసక్తి లేదు అని నిర్ణయించేసుకుంది మాధవి. ఏది ఏమైనా సరే ఇవాళ ఆమెతో మాట్లాడాలి. వీలైతే తీసుకెళ్ళిపోవాలి. మాధవి ఆలోచనలు తెలియని అర్చానకి మాధవి అనుకోకుండా ఎదురుపడడం ఒక విధంగా ఆనందంగా ఉన్నా, ఈ పరిస్థ్తితిని ఎలా ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంతో అస్థిమితంగా అనిపిస్తోంది. ఏమిటీ పరీక్ష? నీలిమ, మాధవి, కొంపతీసి ఇక్కడే వేణు కూడా కలవడు కదా! దేవుడా ఒక దరికి చేరబోతున్న నా జీవితం మళ్ళీ చిందరవందర చేయకు.
"ఏంటి అర్చనా? ఏంటాలోచిస్తునావు? దర్శనం బాగా అయిందా?" మళ్ళీ అడిగింది మాధవి.
అర్చన సమాధానం చెప్పకుండా నీలిమతో అంది "నేను రూముకి వెడతాను నీలూ. మీరు వచ్చేస్తారుగా."
"అలాగే" వాళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ తలూపింది నీలిమ.
మాధవి చేయి అలాగే పట్టుకుని అర్చన ముందుకడుగేసి, ఒక్కసారి తూలినట్లైంది.
మాధవి గట్టిగా ఆమె భుజాలు పట్టుకుని నిలబెడుతూ "అనవసరంగా టెన్షన్ పడకు అర్చనా! పద కాస్సేపు నీ రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం. నిన్ను నేనేం ఎత్తుకుపోను సరేనా?"
అర్చన కళ్ళు మూసుకుంది.
రూముకొచ్చాక మంచం మీద బాసింపట్టు వేసుకుని కూర్చుంది మాధవి.
ఆమె ముందు అర్చన తలవంచుకుని మౌనంగా కూర్చుంది. ఆమె కళ్ళనుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇన్నాళ్ళుగా అణచుకున్న ఉద్వేగం మాధవి కనిపించడంతో ఎక్కువై దుఃఖం ఎగిసిపడుతోంది. మాధవికి ఆమె మానసికస్థితి అర్ధమైనట్టుగా కొన్ని నిముషాలు అలాగే మౌనంగా ఉండిపోయింది. ఏడవనీ, మనసులో ఉన్నదంతా కన్నీళ్ళలో కొట్టుకుపోనీ అనుకుంది. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నట్టుంది. ఇదే సమయం. ఇప్పుడే ఆమెని తాను వెళ్ళిన దారినుంచి మళ్ళించవచ్చు. కొన్ని నిమిషాల తరువాత నెమ్మదిగా అంది మాధవి.
